11, డిసెంబర్ 2014, గురువారం

Sugavaneswara Temple, Salem

                                 శ్రీ సుగవనేశ్వర స్వామి, సేలం


                   శుకుడు ప్రతిష్టించిన సుకవనేశ్వరుడు 



శివ లింగాన్ని ప్రతిష్టించితే జన్మ జన్మల కర్మ తొలగి అన్నింటా జయం లభిస్తుంది అన్న విశ్వాసం యుగయుగాలుగా భారత భూమిలో నెలకొని ఉన్నది. 
ద్వాపర యుగంలో పాండవులు స్థాపించినవిగా తెలియ చెప్పే ఎన్నో శివ, విష్ణు ఆలయాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో కలవు. తమిళ నాడులోని సేలం పట్టణ పరిసరాలలో ఉన్న అయిదు శైవ క్షేత్రాలు అమిత బలశాలి భీమ సేనునితో ముడిపడి ఉన్నాయి. 
ఆ కాలంలో ఈ ప్రాంతాలలో పరమ పవిత్రమైన నదులెన్నొ ప్రవహించేవి. "మణి ముత్తార్ నది"వాటిల్లో ఒకటి.  కావేరి నదికి ఉపనది. సేలం మరియు'నామక్కల్ జిల్లాలలోని భూములను సారవంతం చేస్తుంది. 
రాబోయే కాలంలో విజయ సిద్ది కొరకు ఆయన ఇచ్చిన సలహా మేరకు భీముడు వచ్చి "మణిముత్తార్" తీరంలో ఏనాడో ప్రతిష్టించి నాటికి శిధిలావస్థలో ఉన్న పంచ లింగాలకు ఆలయాలు నిర్మించారని స్థానిక గాధలు తెలుపుతున్నాయి.













అవి శ్రీ సుగవనేశ్వర స్వామి, సేలం, శ్రీ కరపుర నాథర్, ఉత్తమ చోళ పురం, శ్రీ వీరట్టేశ్వర స్వామి, పిల్లూరు, శ్రీ భీమేశ్వర స్వామి, పరమతి, శ్రీ ఎలి నాథర్ ఆలయం, నాన్ సై ఇదయారు.
ఈ పంచలింగాలు స్వయంభూ ! ఎంతో పురాణ ప్రాముఖ్యం కలవి. కుంతీ నందనులకు గురువు, దైవం, భంధువు, స్నేహితుడు సర్వం శ్రీ కృష్ణుడే!! భీమసేనునికి తాను గొప్ప బలవంతునినని మహా గర్వం. బలవంతుణ్ణి  అన్న అహం తగ్గించుకోమని ఎన్నో సార్లు చెప్పినా లాభం లేకపోయింది. అతనికి తగిన విధంగా పాఠం చెప్పాలని భావించిన గోపాలుడు నందివాహనుడు సృష్టించిన "పురుష మృగం" (మానవ శరీరం, జంతువు తల)తో పోరాడి గెలిస్తే పృధ్వీ మండలంలో అతనొక్కడే వీరుడు అని ఒప్పుకొంటానన్నారు. బల గర్వంతో యుద్దానికి సిద్దమయ్యాడు భీముడు.








కానీ పోరు ప్రారంభం అయ్యిన కొద్దిసేపటికే దాని ధాటికి తట్టుకోలేక నందనందనుని శరణు కోరాడు.కానీ గోవిందుడు "అది శివ సృష్టి. ఆయనే నిన్ను కాపాడ గలడు" అన్నారు.దీన దయాళువు ను ప్రార్ధించి ఆ పురుష మృగం బారి నుండి బయట పడ్డాడు వాయునందనుడు.
అప్పుడు ద్వారకానాధుడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ అయిదు ఆలయాలను పునః నిర్మించాడు భీమసేనుడు. అలా ద్వాపరయుగంలో పాండు నందనునిచే పురుర్ధరించబడిన పంచ లింగాలలో ఒకటైన శ్రీ సుగవనేశ్వర స్వామి ఆలయం సేలం పట్టణ నది బొడ్డున ఉంటుంది.








చిన్న ఆలయం. తూర్పు పడమరాలలో ప్రవేశ ద్వారాలుంటాయి.వ్యాస మహర్షి కుమారుడైన శుక ముని, తెలియక చేసిన తప్పుకు బ్రహ్మ దేవుని శాపానికి గురియ్యారు.తండ్రి సూచన మేరకు మణి మత్తూర్ నదీ తీరాన శివలింగం ప్రతిష్టించి సృష్టి కర్త శాపం నుండి విముక్తుడయ్యాడు. చిలక ముఖం కలిగిన శుక మహర్షి స్థాపించి పూజించిన లింగం కావడాన సుగవనేశ్వర స్వామి అన్న పేరోచ్చినది. శుక ముని ప్రతిష్ట, భీమసేనుని పునరుద్దరణతో కలియుగంలో ప్రజలకు అందుబాటు లోనికి వచ్చినదీ ఆలయం. కలియుగంలో చోళ, చేర, పాండ్య రాజులు, విజయనగర చక్రవర్తులు, వారి సామంతులైన నాయక రాజులు ఆలయాభివృద్దికి ఏంటో కృషి చేసారని ఇక్కడ లభించిన శాసనాలు తెలియచేస్తున్నాయి.
మహాద్భుత శిల్పాలతో కూడిన ఎన్నో ఆలయాలు నిర్మించిన ఈ రాజ వంశాలు శ్రీ సుగవనేశ్వర స్వామి ఆలయాన్ని అంతగా తీర్చిదిద్ద లేదనే అనుకోవాలి. మూడంతస్తుల రాజ గోపురానికి అనుబంధంగా వెలుపల ముఖ మండపం.










పక్కనే శ్రీ గణపతి చిన్న సన్నిధిలో దర్శనమిస్తారు.
ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా బలి పీఠం, ధ్వజస్తంభం. తరువాత నందీశ్వరుడు ఉన్న నంది మండపం. త్రయోదశి నాటి ప్రదోష పూజలు ఈ నందికే చేస్తారు.ఇక్కడే అమ్మవారు "స్వర్నాంబిక" దక్షిణ ముఖంగా ఉపాలయంలో భక్తులకు అభయం ప్రసాదిస్తారు.ప్రదక్షణా పదంలో ఉపాలయాలలొ శ్రీ వలంపురి వినాయకుడు, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ కుమార స్వామి, శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ చెండికేశ్వర, శ్రీ మహాలక్ష్మి ఉండగా,  శ్రీ కాశీ విశ్వనాధ లింగం,పంచ భూత లింగాలు,సప్త మాతృకలు, గాయక భక్తులైన అరవై మూడు మంది నాయన్మారులు  గర్భాలయ వెలుపలి గోడలలో దుర్గ, లింగోద్భవ మూర్తి, ఆలయ గోడలలో శ్రీ ధర్మశాస్త, శ్రీ సరస్వతి, శ్రీ జేష్టాదేవి, దర్శనమిస్తారు.











భక్తి శ్రద్దలతో సేవిస్తే వలంపురి వినాయకుడు తీర్చలేని కోరిక లేదంటారు. ప్రసిద్ద శివ భక్తురాలు అవ్వయ్యారు ఈ మూషిక వాహనుని అనుగ్రహంతోనే బొందితో కైలాసం వెళ్లారట.శ్రీ కుమార స్వామి ఆలయం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది.
సుబ్రహ్మణ్య స్వామి భక్తునిగా ప్రసిద్దుడైన అరుణగిరి నాథర్ ఈ స్వామిని కీర్తిస్తూ "తిరుప్పుగల్" గానంచేసారని అంటారు. నవగ్రహ మండపంలో రాహు స్థానంలో కేతువు, కేతువు స్థానంలో రాహువు ఉంటారు. ఈ కారణంగా వివాహంలో చిక్కులు, ఉద్యోగ ప్రయత్నాలలో భంగపాటు పొందుతున్నవారు ఇక్కడ రాహు కేతువుల పూజ చేస్తే శీఘ్ర ఫలితాలుంటాయి అంటారు.
 నందిమండపం దాటిన తరువాత నటరాజ సన్నిధి ఉంటుంది. ద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకులు ఉంటారు.













అర్ధ మండపం నుండే చందన విభూది లెపనాలతొ, కుంకుమ పుష్ప అలంకరణతో సుందరంగా దర్శనమిస్తారు శ్రీ సుగవనేశ్వర స్వామి.  పక్కనే శుక మహర్షి ఉంటారు. లింగం కొద్దిగా ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. దీనిని గురించిన గాధ ఇలా ఉన్నది. ఒకనాడు ప్రధాన అర్చకులు బయటికి వెళుతూ తాను  వచ్చే లింగాన్ని అలంకరించమని తన కుమారుని ఆదేశించి వెళ్ళాడట. బాలుడు, ఎత్తు తక్కువ వాడు. లింగానికి పుష్పమాల వేయలేకపోయాడట. అతని మీద అభిమానంతో లింగరాజే ఒకపక్కకు ఒరిగారట.  
ఉదయం ఆరు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నిత్యం అయిదు పూజలు జరుగుతాయి.
ప్రతి నెలా రెండుసార్లు త్రయోదశి నాడు ప్రదోష పూజలు, వినాయక చవితి, నవ రాత్రులు, శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి, తమిళ ఉగాది, ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉంటాయి.










ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఏడు రోజుల ఉత్సవం నిర్వహిస్తారు.కార్తీక మాసంలో అన్ని రోజులు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ పౌరాణిక చారిత్రిక ప్రసిద్ద శ్రీ సుగ వనేశ్వర స్వామి ఆలయానికి రైల్వే స్టేషన్ నుండి నేరుగా సిటీ బస్సు (నెంబర్ 7)లో చేరుకోవచ్చును. లేదా పాత బస్ స్టాండ్ నుండి నడిచి కూడా వెళ్ళవచ్చును. పాత బస్సు స్టాండ్ కు రైల్వే స్టేషన్ నుండి నేరుగా (నెంబర్ 13) చేరుకొనవచ్చును.
తమిళనాడులోని ముఖ్య నగరాలలో ఒకటైన సేలం చేరుకోడానికి అన్ని ప్రధాన నగరాల నుండి రైలు సౌకర్యం కలదు. స్థానికంగా వసతి మరియు  సదుపాయాలు అందుబాటు ధరలలో లభిస్తాయి.

నమః శివాయ !!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...