28, మే 2018, సోమవారం

Mulakaluru Temples


                                                శివాలయం 

మా అమ్మగారి కోరిక మీదకు విజయవాడ నుండి చిలకలూరి పేట మీదుగా కోటప్పకొండ చేరుకొని శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొన్నాము. తిరుగు ప్రయాణం నరసరావుపేట మీదగా వచ్చాము. నరసరావుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి మార్గంలో ఉన్న ములకలూరులో మత్శ్యవతార ఆలయం ఉందని చెప్పారు ఎవరో  చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ అలాంటి ఆలయం ఏదీ లేదని తెలిసింది. కానీ ఈ క్రమంలో ఒక పురాతన శివాలయం సందర్శించే అవకాశం లభించినది. 
ఏకాలం నాటిదో ? ఎవరు నిర్మించారో? స్వామి వారి పేరు ఏమిటో ? ఈ వివారాలేవీ తెలియ రాలేదు. ఊరికి దూరంగా మారేడు, గన్నేరు, రావి  చెట్ల మధ్య రాతితో నిర్మించబడినదీ ఆలయం. ఆలయం వెలుపల పెద్ద రాతి ధ్వజస్థంభం, నంది, శ్రీ  అష్టభుజ కాలభైరవుని విగ్రహం ఉంటాయి. గర్భాలయంలో ఎత్తైన రాతి పానువట్టం మీద ధవళవర్ణ లింగ రూపంలో పరమేశ్వరుడు భక్తుల అభిషేకాలు స్వీకరిస్తుంటారు. పక్కనే దక్షిణ ముఖంగా శ్రీ పార్వతీ అమ్మవారు కొలువై ఉంటారు. ఆనందం కలిగించిన మరో సంగతి ఏమిటంటే ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుండటం !
ఆలయ నైరుతి భాగంలో వట వృక్షం క్రింద నాగ ప్రతిష్టలు కనపడతాయి. మాంచి ఎండలో వెళ్ళామేమో కారు ఏసీ ని తలదన్నే చల్లదనం ఆ చెట్ల నీడన లభించినది. ప్రకృతి లేక పరమేశ్వరుని మహత్యమో ఉన్నది కొద్ది సమయమైనా యెనలేని ప్రశాంతతను పొందడం జరిగింది. 
























నమః శివాయ !!!!

Vedadri

                      శ్రీ యోగానంద నరసింహ ఆలయం, వేదాద్రి 




పావన కృష్ణానదీ తీరంలో వెలసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది వేదాద్రి. అరుదుగా కనిపించే ఒక గొప్పదనం ఈ పవిత్ర క్షేత్రంలో కనిపిస్తుంది. అదేమిటంటే అవతారస్వరూపుడు ఒకటి కన్నాఎక్కువ రూపాలలో కొలువైన అతి తక్కువ ప్రదేశాలలో ఒకటిగా ఖ్యాతి గడించినది వేదాద్రి. 
శ్రీ నారసింహుడు జ్వాలా, సాలగ్రామ, యోగానంద, శ్రీ లక్ష్మీ నరసింహ మరియు శ్రీ వీర నారసింహ మూర్తిగా వేదాద్రిలో పూజలందుకొంటున్నారు. ఇలా ఒకటికన్నా ఎక్కువ రూపాలలో శ్రీ నరసింహుడు కొలువైన  మరో క్షేత్రం మన రాష్ట్రం లోని అహోబిలం. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహ రూపంతో కలిపి అక్కడ మొత్తం పది ఆలయాలు ఉంటాయి.కొండలలో,అడవులలో కాలినడకన ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.  ప్రహ్లాద వరద, క్రోడా, జ్వాలా, మాళోల, పావన, కారంజ, యోగానంద, చాత్రవట, భార్గవ నరసింహునిగా కొలువుతీరి దర్శనమిస్తారు స్వామి అహోబిలంలో !
శ్రీ వైష్ణవులకు పవిత్ర దర్శనీయ క్షేత్రాలైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి అహోబిలం. 
ఇక వేదాద్రి లో స్వామి ఈ ప్రకారం అయిదు రూపాలలో కొలువు తీరడానికి సంబంధించిన పురాణ గాధ తొలి యుగం నాటిది. 





       







శ్రీ హరి లోక సంరక్షణార్ధం ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. విధాత వద్ద ఉన్న వేదాలను అపహరించుకొని పోయాడు సోమకాసురుడు. సృష్టి కొనసాగడానికి వేదాలు తప్పనిసరి ! బ్రహ్మ దారి తోచక శ్రీ మహావిష్ణువును శరణు కోరాడు. ఆయనకు అభయమిచ్చి సముద్రంలో దాగి ఉన్న అసురుని మత్స్య రూపంలో వెళ్లి హతమార్చారు శ్రీమన్నారాయణుడు. ఆయన స్పర్శతో పురుషాకృతిని పొందిన వేదాలు, తమను శాశ్వితంగా తరింప చేయమని అర్ధించాయి. దానికి వైకుంఠుడు మీరు సాలగ్రామాల రూపంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో ఉండండి. నేను భవిష్యతులో అక్కడ వెలసి మీకు శాశ్వితత్వాన్ని ప్రసాదిస్తాను అని అనుగ్రహించారు. అలా వేదాలు శిలల రూపాలను దాల్చి ఇక్కడ ఉండిపోయారు. నదీమ తల్లి నిత్యం తన నీటిలో స్నానమాడి తనను మానవులు పాపపంకిలం చేస్తున్నారు. దాని నుండి తప్పించుకొనే మార్గం అనుగ్రహించమని పరంధాముని కోరింది. తప్పక ఆమె కోరిక తీరుస్తానని అభయమిచ్చారు. 
తదనంతర కాలంలో హిరణ్యకశ్యపుని నారసింహ అవతారంలో సంహరించిన తరువాత స్వామి ఇక్కడ పర్వతం మీద జ్వాలా నారసింహునిగాను, నదీ గర్భంలో సాలగ్రామ నారసింహునిగాను, ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాచలం పైన శ్రీ వీర నారసింహునిగా ప్రకటనమైనారు. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి కొంతకాలం తపస్సు చేశారు. ఆ సమయంలో ఆయన శ్రీ యోగానంద నారసింహ మూర్తిని, పీఠం పైన శ్రీ లక్ష్మీ నారసింహ ముద్రను ప్రతిష్టించారు. ఈ దివ్య క్షేత్రంలో వేదవ్యాసుని ఆదేశం ప్రకారం మహర్షులు తపస్సు చేసి ముక్తి పొందారు. వేదాలు పర్వతాలుగా వెలసి పరమాత్ముని శిరస్సున ధరించిన ప్రదేశంగా వేదాద్రి అన్న పేరు పొందినది. 
















తొలుత కొండవీడును పాలించిన రెడ్డి రాజులు స్వామివారి ఆలయాన్నినిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. తదనంతర కాలంలో మరెందరో రాజుల, స్థానిక సామంతరాజులు, ,జమీందారులు ఆలయాభివృధికి తమ వంతు కృషి చేశారు. 
కొండవీటి రాజుల వద్ద ఆస్థాన కవులుగా ఉన్న ఎర్రాప్రగడ , శ్రీ నాధ కవిసార్వభౌముడు ఇరువురూ శ్రీ యోగానంద నారసింహుని సేవించుకొన్నారని తెలుస్తోంది. ఎఱ్ఱనామాత్యుడు స్వామి వారి గురించి దండకం రచించారట. శ్రీనాధుని కాశీ ఖండంలో వేదాద్రి క్షేత్ర ప్రస్తాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. మరెందరో కవులు స్వామివారి మహిమల గురించి కృతులు, కీర్తనలు, రచనలు చేశారు. 
సువిశాల ప్రాంగణంలో పడమర ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ యోగానంద నారసింహ స్వామి సర్వాభరణ అలంకృతులై నయనమనోహరంగా కొలువై ఉంటారు. పీఠం పైన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించు కొనవచ్చును. శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు, శ్రీ చెంచులక్ష్మీ ప్రత్యేక సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. క్షేత్రపాలకుడు కైలాసనాధుడు. శ్రీ విశ్వేశ్వర స్వామి, దేవేరి పార్వతీ దేవి మరో ఆలయంలో తూర్పు ముఖంగా కొలువై ఉంటారు. పక్కనే ఉన్న పర్వతం పైన శ్రీ జ్వాలా నారసింహ స్వామి సన్నిధి కలదు. పైకి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. కృష్ణవేణి మధ్యలో పెద్ద సాలగ్రామ రూపంలో శ్రీ సాలగ్రామ నారసింహ స్వామి కనిపిస్తుంటారు. ఈ సాలగ్రామ రూప దర్శనం నదీ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడే లభిస్తుంది. 




















చుట్టుపక్కల గ్రామాల, పట్టణాల నుండి ప్రతి నిత్యం భక్తులు స్వామివారి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ముఖ్యంగా శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు కొంత కాలం ఇక్కడే ఉండి నిత్యం కృష్ణానదిలో స్నానమాచరించి,  నియమంగా స్వామివారిని సేవించుకొంటుంటారు. దాని వలన ఆరోగ్యం పొందుతారన్నది తరతరాల విశ్వాసం. 
తూర్పు మరియు పడమరలలో నిర్మించిన రాజగోపురాలు శోభాయ మానంగా ఉంటాయి. 
ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత ఉన్నది. గర్భాలయం వెనుక గుండ్రటి శిలలు మూడు ఉంటాయి. వీటిని దిక్పాలక శిలలు అంటారు. తమ సమస్యకు లేదా కోరుకొంటున్న పని సానుకూలంగా నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలకు ఈ శిలల ద్వారా జవాబు పొందవచ్చు అని స్థానికులు నమ్ముతారు. ఆ రాతి మీద రెండు చేతులను ఆనించి, బొటన వేళ్ళను ఆనించి ఉంచాలి. కొద్దిసేపటికే చేతులు తమంతట తామే శిల చుట్టూ తిరుగుతాయట. అలా జరిగితే ఫలితం అనుకూలం. లేకపోతే పని కాదు, అని అంటారు. రోజూ ఎందరో ఆ శిలల వద్ద కూర్చొని కనిపిస్తారు. 












ఇన్ని ప్రత్యేకతల నిలయమైన వేదాద్రి ఆలయం ఉదయం ఏడు నుండి మధ్యాన్నం ఒంటి గంట వరకు, తిరిగి మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. 
వేదాద్రి, విజయవాడ నుండి హైద్రాబాద్ వెళ్లే ప్రధాన రహదారి లోనే ఉంటుంది. జగ్గయ్య పేటకు సమీపంలోని చిల్లకల్లు కూడలి నుండి పది కిలో మీటర్లు దక్షిణంగా వెళ్ళాలి.   చిల్లకల్లు దాకా విజయవాడ నుండి అపరిమిత బస్సు సౌకర్యం లభిస్తుంది. అక్కడ నుండి ఆలయానికి ఆటోలలో చేరుకోవచ్చును. యాత్రీకుల సౌకర్యార్ధం గదులు అద్దెకు లభిస్తాయి. అన్నప్రసాదం దేవస్థానం వారు అందిస్తారు. 
ఓం నమో నారాయణాయ !!!!     

19, మే 2018, శనివారం

The Bird

                                         పక్షి "ప్రపంచం"


                                                                                                   






సాయం సంధ్యా సమయం.చల్లని గాలి తెమ్మెరలు మందంగా వీస్తున్నాయి. నలు దిశలా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ప్రేరణ పొందిన మయూరం వర్ణభరితమైన పురి విప్పి తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించడం చూస్తే ఎవరి హృదయమైనా స్పందిస్తుంది. 
కళ్ళ ముందు కువకువలాడుతూ ముద్దులు పెట్టుకొంటున్న పావురాల జంట ఎంతటి జడుడుల  మదిలోనైనా  ప్రేమానురాగ భావాలను రేకిస్తుంది అంటే అబద్దం ఏమీ లేదు. మిగుల పండిన జామ పండును కొమ్మ మీద వ్రాలి అలవోకగా వంగి ఎఱ్ఱని ముక్కుతో గబగబా కొరికి తినే  రామచిలుక ఆత్రం ముచ్చట గొలుపుతుంది. ఆ చిరు జీవి పట్ల అప్యాయత కలుగుతుంది ఎవరికైనా !   
దట్టంగా పెరిగిన గడ్డి పొదలలో చడీ చప్పుడు లేకుండా కదులుతున్నఎలుకను ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూనే గమనించి రెప్పపాటులో పట్టుకున్న డేగ సునిశిత దృష్టి, ఒడుపు,నేర్పు మరియు వేగం సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది చూపరులను. 
ప్రధాన రహదారి మీద వాహనంలో వెళుతూ పరిసరాలను చూస్తూ సేద తీరుతున్న సమయంలో గుప్పున వచ్చిన కుళ్ళిన వాసన కలవరపెడుతుంది. చూస్తే పశు కళేబరాన్నివిందు భోజనంగా కేరింతలు కొడుతూ స్వీకరింస్తున్న రాబందుల గుంపు. మృత కళేబరాల మీద బ్రతికే   అందవిహీనమైన  రాబందులను చూడటానికి ఇష్టపడతారా ఎవరైనా ? కానీ శుభ్రత పరిశుభ్రత   సేవా విషయంలో తొలి సన్మానం వాటికే చేయాలి.

















దృశ్యాన్నిచూడటం వేరు  అనుభవించడం వేరు, వీక్షణం మూలంగా  భావావేశం కలుగుతుంది. అనుభవిస్తే అందులో మమేకమై పోతాము. అందుకే దృశ్యాన్ని,శబ్దాన్ని హృదయం నిండా నింపుకొన్నప్పుడే  తాదాప్యం చెందడం అన్నది జరుగుతుంది.అదే విధంగా  ఇవన్నీ వీక్షకునిలోని భావావేశం కారణంగా తాత్కాలిక సానుకూల స్పందన కలిగిస్తాయి తప్పశాశ్విత ముద్రను వేయవు.ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఉదహరించడానికి  గుర్తుకొస్తాయి అంతే ! 
చాలా విచారకరం ! కానీ పైన పేర్కొన్నసంఘటనలు మానవులు తమకు తెలియకుండానే  పక్షుల మీద ఎంతగా ఆధారపడుతున్నారో తెలియచెప్పేవే!
నేటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం పుడమిలో పదివేలకు పైగా పలురకాల పక్షులు ఎగురుతున్నాయి.ప్రతి సంవత్సరం కొత్త జాతులు పుడుతున్నాయి. కొన్ని అంతరించి పోతున్నాయి. మరి కొన్ని పరిరక్షించవలసిన జాబితాలో చేరిపోతున్నాయి.ఇన్ని జరుగుతున్నాఈ చిన్న జీవులు తమకు చాతనైనంతలో ఎవ్వరూ చేయలేని సేవను భూమాతకి తద్వారా మానవజాతికి చేస్తున్నాయి. కిచకిచ ధ్వనులు చేయడం మాత్రమే తెలిసిన పక్షులకు  పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న అవగాహన విపరీతంగా మాట్లాడే మనకు నేటికీ సంపూర్ణంగా తెలియదు అంటే అది విమర్శ కాదు. పరమ సత్యం.  
పండ్లను తినే పక్షులు తమ రెట్టల ద్వారా గింజలను తాము తిరిగే ప్రాంతంలో విసర్జించి మొక్కల సంఖ్య పెరిగేందుకు తోడ్పడతాయి. వృక్ష సంపద పెరగడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. వృక్షాల వలన స్వచ్ఛమైన గాలి,చల్లని పరిసరాలు, సకాలంలో వానలు పడతాయి. అడవుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా ! పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. పిచ్చికలు, హమ్మింగ్ బర్డ్ లాంటి చిన్నపిట్టలు పూల రంగులకు ఆకర్షించబడి తమ పాదాలు, ముక్కుల ద్వారా పుప్పొడి రవాణా చేసి వృక్ష సంతతి అభివృద్ధికి తోడ్పడతాయి. గద్దలు, గుడ్లగూబలు, కొంగలు లాంటివి పొలాలలో పంటలకు నష్టం     కలిగించే ఎలుకలు, కప్పలు లాంటి జీవులను, దోమలు, ఈగలు, మిడతలు లాంటి పురుగులను స్వాహా చేసి రైతులు నష్టపోకుండా సహాయపడతాయి. దీని వలన హానికారక క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరము తగ్గుతుంది. పిచ్చికలు, గోరింకలు, పావురాలు పొలాలలో పడిన కలుపు మొక్కల గింజలు తింటాయి. అలా కలుపు శాతాన్ని తగ్గిస్తాయి. రైతుకు ఖర్చు తగ్గుతుంది.పంట దిగుబడి పెరుగుతుంది.మనం ప్రమాదకరం అని భావించి కనపడగానే చంపేసే పాముల ద్వారా కూడా కర్షకులకు మేలు జరుగుతుంది. ఎలుకలను, కప్పలను పాములు తింటాయి కదా !












కాకులు,రాబందులు లాంటి పక్షులు ప్రకృతి తనకు తాను ఏర్పాటు చేసుకొన్న పాశుధ్య పనివారు. మరణించిన జంతువుల కళేబరాల మీద బ్రతుకుతాయి. దానితో వాటికి సంవృద్ధిగా ఆహరం, పరిసరాల శుభ్రత రెండూ జరుగుతాయి.
నాట్య మయూరిని, వర్ణమయ విహంగాలను, అరుదైన వలస పక్షులను చూస్తుంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. దృష్టిని ఇట్టే ఆకర్షించే వాటి సౌందర్యం,చిత్ర విచిత్రమైన వాటి  విన్యాసాలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. ఇది నిత్య జీవితంలో ఎదుర్కొనే మానసిక మరియు శారీరక సమస్యల నుండి  స్వస్థత కలిగించే అద్భుతమైన ప్రకృతి వైద్యం. అనుభవజ్ఞులైన మానసిక వైద్యులకు కూడా సాధ్యం కానిదిగా చెప్పవచ్చును. పక్షులు మన కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నాయి కూడా ! కోడి,పావురం,కణుజు పిట్టల మాంసంతో చేసే పదార్ధాలన్నీ మాంసాహార ప్రియులకు నోరూరించేవే ! జిహ్వను పెంచేవే !
ఇవే కాకుండా పైకి కనపడని ఆర్ధిక అంశం ఏమిటంటే పర్యాటకం ! పక్షుల కేంద్రాలకు ఎక్కువగా విదేశీ యాత్రీకులు వరస కడుతుంటారు. దీని వలన ఆర్ధిక అభివృద్ధి మరియు విదేశీ మారక ద్రవ్యం లభిస్తాయి. అంతర్జాతీయంగా గుర్తింపు అదనం !
శుక పికాలు ప్రత్యక్షంగా భూమాతకు పరోక్షంగా మానవ జాతికి ఇతర జీవులకు చేస్తున్న సేవను గుర్తించిన మన పూర్వీకులు వాటిని దేవతా స్వరూపాలుగా, మహనీయులుగా, మహర్షులుగా, దేవీ దేవతల వాహనాలుగా ప్రత్యేకమైన వివిధ హోదాలను ఇచ్చి గౌరవించారు. ఈ విషయంలో విదేశీయులు తమదైన మార్గాన్ని ఎంచుకొన్నారు. అదే సంవత్సరంలో ఒక రోజును పక్షులకు  కేటాయించడం ద్వారా !








ప్రపంచ పక్షుల దినోత్సవాన్ని తొలిసారిగా 1894వ సంవత్సరం మే అయిదో తారీఖున అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాలలో జరుపుకొన్నట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇదొక సంప్రాదాయంగా మారింది. కాకపోతే ఈ విషయంలో దేశాల మధ్య వత్యాసం ఉన్నది. కొన్ని దేశాలు మే అయిదుకు బదులు అక్టోబర్ రెండో శనివారం నాడు జరుపుకొంటాయి.ఏది ఏమైనా అన్ని దేశాలు విహంగాల అవసరాన్ని గుర్తించి వాటి పట్ల తమ అభిమానాన్ని చాటుకొంటున్నాయి. ప్రతి దేశానికీ ఒక జెండా, గీతం ఉన్నట్లే ఒక పక్షి కూడా ఉన్నది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తమ జాతీయ పక్షి పట్ల గౌరవాన్ని నూతన సంవత్సరం తొలి నెల అంటే జనవరి అయిదున వ్యక్తం చేస్తాయి.
పక్షులు ఎగురుతాయి కదా ! అంటే ఒక చోట స్థిరంగా ఉండవు. తాము నివసిస్తున్న ప్రదేశంలో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవి అనుకూల వాతావరణం ఉండే ప్రాంతాలకు తరలి వెళతాయి. అవే వలస పక్షులు. తమ బ్రతువు తెరువుకు పుట్టిన గడ్డను వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్లి అతిధులుగా కూడా అక్కడ అలరించే వీటి సేవను గుర్తించి గత పుష్కరకాలంగా మే పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
వలస పక్షులకున్నట్లుగా మన కంటి ముందర ఎగురుతూ మనకెంతో మేలు చేసే పిచ్చికలు, కాకులు, పావురాలు, చిలకలు, గద్దలు, బాతులు, నెమళ్ళు, కోళ్లు, కొంగలు, రాబందులు , పెంగ్విన్స్, గుడ్లగూబలు, గబ్బిలాలు, కోయిలలు, చివరికి సీతాకోక చిలుకలు ( ఇవి కూడా ఎగురుతాయి మరి)
ఇలా ఇవన్నీ కూడా విడివిడిగా తమ పుట్టిన రోజులను సంవత్సరంలో ఒక రోజున జరుపుతుంటాయి. మనం నాగుల చవితి జరుపుకుంటాము కదా ! అదే విధంగా పాములకు కూడా ఒక రోజు నిర్ణయించబడినది. అది పదహారు జులై . గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ  దినోత్సవాలన్నీ అధిక శాతం శనివారాలు కావడం ! పాశ్చాత్య దేశాలలో శనివారం శలవు దినం కదా ! ఎక్కువ మంది హాజరవుతారు. సందేశం అందుకొంటారు అన్నదే దీని వెనుక ఉన్న ముఖ్యోద్దేశ్యం. క్షీణించి పోతున్న విహంగాల సంతతి గురించి, ధరణికి, మానవాళికి వాటి వలన కలిగే లాభాలను గురించి తెలియ చెప్పడానికి సంవత్సరంలో కొన్ని రోజులను అవగాహనా దినాత్సవాలను జరపడానికి కూడా నిర్ణయం చేశారు.








మనకు ఇంత మేలు చేస్తున్నఈ చిన్ని ప్రాణులు మన నుంచి ఏమి ఆశిస్తున్నాయి ? నివాసము ఏర్పాటు చేసుకోడానికి కొన్ని చెట్లు. త్రాగడానికి కొంచెం నీరు. ఆహరం ఖర్చు మనకు లేదు. అవే వెతుక్కుంటాయి. అవన్నీ తినేవి మనకు హాని చేసే పురుగులూ, క్రిములు, కీటకాలు, గింజలు. అందుకని విహంగాలు కోరుకొంటున్న నాలుగు చెట్లను ఏర్పాటు చేద్దాం. ఇవ్వకపోతే మనకి మనమే అన్యాయం చేసుకొన్నట్లే ! నష్టం మనకే కదా ! ఇచ్చేద్దాం ! ఏమంటారు ?
 



Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...