30, సెప్టెంబర్ 2013, సోమవారం

Tiruvannamalai

                                          శ్రీ అరుణాచలేశ్వర 

పంచ భూత క్షేత్రాలలో ఒకటి తిరువన్నామలై. 
సదా శివుడు పంచ భూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశాలకు అధిపతిగా అయిదు క్షేత్రాలలో లింగ రూపంలో కొలువై ఉన్నారు. 
అవి కాంచీపురం ( పృథ్వి ), జంబుకేశ్వరం ( నీరు), శ్రీ కాళహస్తి ( వాయువు), చిదంబరం ( ఆకాశం) కాగా తిరువన్నామలై లో ఉన్నది అగ్ని లింగం. 
స్వామి వారిని శ్రీ అరునాచలేశ్వరుడు అని పిలుస్తారు. 
అన్నామలై పర్వత పాదాల వద్ద ఉన్న ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు.
ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ వట్టి కాళ్ళతో ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధిస్తారు. ఈ ప్రదక్షిణ  14 కి.మీ. ఉంటుంది. ప్రతి ఏడాది, తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర పౌర్ణమి రాత్రి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తారు.
ఈ ఆలయాన్ని చోళ రాజులు తొమ్మిది, పది శతాబ్దాల మద్య కాలంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. 
పెద్ద కోట లాగా ఉండే ఈ దేవాలయం ఉన్నత శిల్పాలను ప్రదర్శిస్తున్నది. ఈ ఆలయ సముదాయంలో ఎన్నో ఆలయాలున్నాయి. 
ప్రతినిత్యం వేల సంఖ్యలో దేశం నలుమూలల నుండే గాక విదేశాల నుండి కూడా వస్తుంటారు. 
తిరువన్నామలై ఎందరికో భక్తి వేదాంత మార్గాన్ని చూపించిన క్షేత్రం. 
వారిలో ముఖ్యులు 
శ్రీ శేషాద్రి స్వామి 

శ్రీ రమణ మహర్షి 
వీరే కాదు ఎందరో సాధువులు, సత్యాన్వేషకులు, సాధకులు, యోగులు నేటికి తిరువన్నామలైని తమకు సరియైన గమ్యంగా భావించుతారు. 
చెన్నైకి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరువన్నామలై. ఓం అరుణా చల శివ అరుణా చల శివ అరుణాచలా !!! 29, సెప్టెంబర్ 2013, ఆదివారం

ARDHAGIRI SRI VEERANJANEYA SWAMY TEMPLE.

                   శ్రీ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం 
చిత్త్తూర్ జిల్లాలో ఉన్న అర్ధగిరి శ్రీ వీరాంజనేయ ఆలయం త్రేతా యుగానికి సంభందించిన సంజీవని పర్వత గాధతో ముడిపడి ఉన్నది. ఇంద్రజిత్ అస్త్రానికి మూర్చ్చిల్లిన లక్ష్మణుని తిరిగి సృహ లోనికి తీవడానికి వానర వైద్యుడు సుషేణుడు చెప్పిన ప్రకారం సంజీవని పర్వతం తేవడానికి వెళ్ళాడు ఆంజనేయుడు. 
సరైన మూలికను గుర్తించలేక పర్వతాన్నే ఎత్తుకొని తెచ్చే క్రమంలో కొంత భాగం ఇక్కడ పడినది. అందుకే అర్ధగిరి / అరకొండ అన్నపేర్లు వచ్చాయని తెలుస్తోంది. 
ఇక్కడి పుష్కరనిలోని నీరు సుద్దమైనది. ఎంతకాలమైనా వాసనరాదు, పాచి పట్టదు. అన్నిటికి మించి సర్వ రోగ నివారణి. ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు రోగ నివారనార్ద్దం ఈ నీటిని తీసుకొని వెళ్ళుతుంటారు. 


సుందర ప్రకృతిలో ఛిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం సందర్శకులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది. 
తిరుపతి, చిత్తూరు, కానిపాకంల నుండి రోడ్ మార్గంలో సులభంగా అర్ధగిరి  చేరుకోవచ్చును. 

హనుమత్ జయంతి, శ్రీ రామ నవమి పెద్ద ఎత్తున జరుపుతారు. 
18, సెప్టెంబర్ 2013, బుధవారం

Ashta Dharmasastha Temples

                                  అష్ట అయ్యప్ప అవతారాలు 

                                                                                                              
స్వామి అయ్యప్ప అనగానే మనందరికీ కనుల ముందు కదలాడే దివ్య రూపం ఒక్కటే !
శబరి మలలో పదునెనిమిది సోపానాదిపతిగా వీర పద్మాసనం, యోగ బంధనంతో చిన్ముద్ర , అభయ హస్తాలతో భక్తులను కటాక్షించే కమనీయ రూపం.
కానీ అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మ శాస్త యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ది చెందారు. శ్రీ హరి ఆరో అవతార రూపమైన శ్రీ పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయనే నెలకొల్పిన నూట ఎనిమిది ఆలయాలలో అనేక భంగిమలలో దర్శనమిస్తారు శ్రీ ధర్మ శాస్త. 
అందరికి సుపరిచితమైన ఎరుమేలి శ్రీ ధర్మశాస్త గా స్తానక ( నిలుచున్న ) భంగిమలో ధనుర్భాన ధారిగా, అదే విధంగా కులత్తపుళ  లోను, శ్రీ పూర్ణ పుష్కల నాధునిగా అచ్చన్ కోయిల్ లోను, అశ్వా రూడునిగా  కుథిరన్  ( త్రిస్సూర్ - పాలఘాట్ మధ్యలో ), శ్రీ ధన్వంతరి శాస్తాగా తిరువనంత పురం, కొచ్చి లలో, భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్ తో కలిసి  శాస్తంకొట్ట ( కొల్లం దగ్గర ) స్వామి దివ్య స్వరూపాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.

ఎన్నో సంవత్సరాలుగా శబరి యాత్ర చేస్తూ వస్తున్న గురు స్వాములు, శ్రీ అయ్యప్పను కుల దైవంగా భావించి కొలిచే భక్తులు ఎందరో ఉన్నారు. వారంతా కలిసి స్కాంద, శివ పురాణాలను, రామాయణ, మహా భారతాలను, గుహ్య రత్న చింతామణి, శ్రీ భూత నాధ చరితం లాంటి పురాతన మలయాళ గ్రంధాలను  ఆమూలాగ్రం శోధించి వెలికి తీసిన అమూల్య విషయం "శ్రీ అయ్యప్ప అష్ట అవతారాలు". ఆ స్వాములు  భక్తుల  సౌలభ్యం కొరకు, వారి ఇహ పర కోరికలు తీరి, పరమ పదం చేరే మార్గంలో ప్రయాణించడానికి సిద్దమవ్వడానికి  వెలుగు లోనికి తెచ్చారు. 
 అంతే కాకుండా ఈ పుణ్య పురుషులు తమ పరిశోధనలలో శ్రీ ధర్మ శాస్త మూల రూపంతో కలిపి మొత్తం తొమ్మిది రూపాలను మానవ జీవితాల మీద ప్రభావం చూపే నవ గ్రహాలకు సరి సమానమైనవిగా గుర్తించారు.
 అంటే ఈ నవ అయ్యప్ప రూపాలను సేవిస్తే నవ గ్రహాలను సేవించిన ఫలితం దక్కుతుందన్నమాట !
సత్య యుగం నుండి పూజలందుకొంటున్న ఆ అవతార రూపాలు యివే.
శ్రీ ఆది భూత నాధ శాస్త, శ్రీ ధర్మ శాస్త, శ్రీ జ్ఞాన శాస్త, శ్రీ కళ్యాణ వరద శాస్త, శ్రీ మహా శాస్త, శ్రీ సమ్మోహన శాస్త, శ్రీ సంతాన ప్రపత్తి శాస్త, శ్రీ వేద శాస్త, మరియు శ్రీ వీర శాస్త. 

శ్రీ ఆది భూత నాధ శాస్త :స్తితి లయ కారకులైన హరిహరుల అంశతో ఉద్భవించిన వాడే ఈ స్వామి. నేపాళ రాజు పాలింజ వర్మ కుమార్తె పూర్ణా దేవిని, కేరళ రాజ పుత్రిక అయిన పుష్కలా దేవిని దేవేరీలుగా చేసుకొని పొన్నాంబల మేడులో ( కాంతి మలై ) కాపురం ఉంటున్నారని అంటారు.
 శ్రీ ఆది భూత నాధ శాస్త ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానునికి ప్రతీక. దివాకర ఆరాధనతో ఏవైతే మానవాళికి లభ్యమవుతాయో అవన్నీ ప్రసాదించేవాడు శ్రీ ఆధి భూతుడు. 
పుడమిలో ప్రజల ఆకలి దప్పికలు తీరేందుకు సకాలంలో వర్షాలు, సంవృద్దిగా పాడి పంటలు, ఆరోగ్యకరమైన వాతావరణం, సమకూర్చేవాడు ఈ స్వామి. అంతే కాదు శత్రువుల నుండి, క్రూర మృగాల దాడుల నుండి, విష సర్పాల బారి నుండి కాపాడే రక్షకుడు కూడా ! నియమంగా భక్తి శ్రద్దలతో పూజిస్తే శ్రీ ఆది భూత నాధ శాస్త రాజ యోగం ప్రసాదించేవాని గా ప్రసిద్ది. 

ఈయనకొక ఆలయం తమిళ నాడు లోని తిరునెల్వేలి జిల్లా పాపనాశనం దగ్గరలోని కరైయర్ డాం కు సమీపంలోని అగస్త్య జలపాతం వద్ద ఉన్నది.  శ్రీ ధర్మ శాస్త మహర్షికి తొలిసారిగా దర్శనమిచ్చి శబరి మలకు రాదలచిన భక్తులు పాటించవలసిన నియమాలను తెలిపారన్నది పురాణ గాధ. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ అగస్త్య మహర్షి ఆలయం కూడా ఉన్నది. సుందర ప్రకృతి ఈ ప్రాంత సొంతం. 

శ్రీ ధర్మ శాస్త :
శబరిమలలో కొలువు తీరినది ఈ స్వామే !
ముక్తి ప్రదాత.
కుల మత భావాలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే వాడు శ్రీ ధర్మ శాస్త.
పరి పూర్ణ శరణాగతిని కోరే భక్తుల వెన్నంటి ఉండి కాపాడే తోడూ నీడ.
శని గ్రహ ప్రభావాన్ని దూరం చేస్తారు.
ఎలాంటి తప్పునైనా సరిదిద్ది సక్రమ మార్గంలో నడిపించే మార్గ దర్శి శ్రీ ధర్మ శాస్త.

జ్ఞాన శాస్త :
అపర సరస్వతి దేవి రూపం . మాణిక్య వీణ ధరించి వట వృక్షం క్రింద ఉపస్థిత భంగిమలో కొలువు తీరి వుంటారు. సకల విద్యా ప్రదాత. ఈ స్వామిని బృహస్పతి ( గురువు )గా, శ్రీ దక్షిణా మూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఇదే రూపంలో స్వామి వారి ఆలయలైతే లేవు. 
 త్రిస్సూర్ జిల్లాలోని తిరువుల్లక్కావు లో వెలసిన శ్రీ స్వామిని విద్యా శాస్తగా భావించుతారు. 
నవరాత్రులలో, ఓనం, ఇతర స్థానిక పర్వ దినాలలో ఎందరో భక్తులు తరలివచ్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాట వేసే అక్షరాభ్యాసం చేయించుకొంటారు. భక్తుల సౌలభ్యం కొరకు ఫిబ్రవరి రెండో వారంలో ఏడు రోజులపాటు విద్యా సరస్వతి అర్చన జరుపుతారు.
చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే  ఈ క్షేత్రంలోని మూల విరాట్టు ధనుర్భానాలు ధరించి స్థానక భంగిమలో ఉండటం !

కళ్యాణ వరద శాస్త :
పురాతన గ్రంధాలైన గుహ్య రత్న చింతామణి, భూతనాధ చరితం లలో శ్రీ కళ్యాణ వరద శాస్త గురించి విపులంగా వివరించబడి ఉన్నట్లుగా తెలియవస్తోంది. దశ భుజాలతో శంఖు చక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి, అభయ వరద హస్తాలతో, ఇరు వైపులా పూర్ణ పుష్కలా దేవేరిలతో కొలువు తీరివుంటారు. పేరుకు తగినట్లుగానే కళ్యాణ కారకుడు. కుజ గ్రహ ప్రభావంతో వివాహం కాని వారు ఈయనను సేవిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. నిండు భక్తితో కొలిచిన వారి జీవితాలలో అన్ని శుభాలను ప్రసాదించి వరదుడు. శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ ధర్మ శాస్తా ఆలయాలు చాల ఉన్నా అచ్చన్ కోవిల్ లోనిదే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.

స్వామికి ఇక్కడ దశ భుజాలుండవు కాని చిత్రమైన భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ కళ్యాణ వరద శాస్తా విగ్రహ రూపంలో కాకుండా చిత్రపట రూపంలో పూజలందుకొంటున్న క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది. అదే అయిదు వందల సంవత్సరాల క్రిందట విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా స్థాపించిన తుమ్మగుంట. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో నాటి నుండి నేటి వరకు ద్రావిడ బ్రాహణులచే కొలవబడుతున్న శ్రీ వృక్ష అయ్యప్ప సకల విద్యలను, శుభాలను ప్రసాదించే శ్రీ గురునాథ స్వామిగా పిలవబడుతున్నారు. 
అరుదయిన వృక్ష రూప అయ్యప్పతో పాటు ఎన్నో చిత్ర పటాలున్నాయిక్కడ. 


శ్రీ మహా శాస్త :గజ వాహనారూఢ శ్రీ మహా శాస్త ని అప మృత్యు భయాన్ని తొలగించే మహా కాల శాస్త గా ఆరాధిస్తారు. అనుకోని ప్రమాదాల బారినుండి, ఆకస్మిక ఇక్కట్ల నుండి, తలా తోక లేని విషమ పరిస్థితుల నుండి కాపాడి విజయం వైపు నడిపించేవాడు  శ్రీ మహా శాస్త అన్నది సేవించేవారి నమ్మకం. తమిళ నాడులోని ఆలయాల నగరం కుంభకోణంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో సేన్గాలిపురం దగ్గరలో ఉన్న త్రియంబకాపురం లో కరి వాహన మహా కాల శాస్తా ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

శ్రీ సమ్మోహన శాస్త :చతుర్భుజాలతో కుడి కాలు క్రిందకి పెట్టి, ఎడమ కాలుని పైకి మడిచి అరుదైన భంగిమలో దర్శనమిస్తారు  పూర్ణ పుష్కలా సమేత శ్రీ సమ్మోహన శాస్త. వెన్నెలంత చల్లని అభిమానాన్ని భక్తుల మీద చూపేవానిగా ప్రసిద్ది. నమ్మిన వారికి అడుగడుగునా అండగా నిలిచి కాపాడుతారు  శ్రీ సమ్మోహన శాస్త. నిండైన ప్రేమకు ప్రతి రూపం. 
శ్రీ సమ్మోహన శాస్తకు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రం నాగాపట్టినం జిల్లా లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం సిర్కాలికి సమీపంలోని కైవిలంచ్చేరి లో ఉన్నది. స్వామిని "కై విడే అప్పార్" అని పిలుస్తారు. 

శ్రీ సంతాన ప్రపత్తి శాస్త :

పదిహేనో శతాబ్దంలో రచింపబడిన తంత్ర సముచయం అనే గ్రంధం ప్రకారం త్రేతా యుగంలో సంతానాపేక్షతో పుత్రకామేష్టి యజ్ఞం చేసిన దశరధ మహారాజుకి యజ్ఞ ఫలం అందించిన యజ్ఞ పురుషుడు శ్రీ సంతాన ప్రపత్తి శాస్తానేఅని తెలుస్తోంది. శిల్పారాధానం అనే మరో పురాతన గ్రంధంలో కూడా ఈ విషయం వివరించబడినది.ఈ కారణంగా ఈయనను బ్రహ్మ శాస్త అని కూడా పిలుస్తారు. ఆదాయం, అబివృద్ది, కీర్తి, సత్సంతానం ఇలా అన్నింటా శుక్ర మహర్దశ ప్రసాదించేవాడీ స్వామి. అభయ హస్తంతో విలాసంగా భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్తో కలిసి దర్శనమిస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్నో శ్రీ ధర్మశాస్త ఆలయాలలో కొల్లం జిల్లా ఆదూర్ కి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న శాస్తంకొట్ట లోని శ్రీ ప్రభా సత్యకన్ సమేత ధర్మ శాస్త ఆలయం ప్రసిద్ది చెందినది. ఎన్నో ప్రత్యేకతలుగల క్షేత్రమిది. శ్రీ రామ పాద స్పర్శ తాకిన దివ్య క్షేత్రం  శాస్తంకొట్ట. 


 

శ్రీ వేద శాస్త :

శివ పురాణంలో పూర్ణ పుష్కలా సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేద శాస్త ప్రస్తావన ఉన్నది. బుద్దిని వికసింపచేసి, గ్రహణ శక్తిని పెంపొందించి, విషయ జ్ఞానాన్ని మెరుగుపరచేవాడు.  మానవాళికి మేలు చేసేవాడు శ్రీ విద్యా శాస్త. వేద రూపుడైన స్వామికి సేలం జిల్లాలో ఒక ఆలయం ఉన్నట్లుగా చెబుతారు. 

శ్రీ వీర శాస్త :
జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు రచించిన ఆదిశంకర విచరితమ్ లో శ్రీ వీర శాస్త ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. 
జగద్గురువులు వర్ణించినట్లుగా స్వామి ఖడ్గం ధరించి ఆశ్వ వాహనం మీద దర్శన మిస్తారు.
యోధుని మాదిరి కనిపించే స్వామి దుర్మార్గులను దండించేవాడు, అధర్మాన్ని అణిచేవాడు.
ఆపన్నులను గాచేవాడు.
శ్రీ వీర శాస్తకు త్రిస్సూర్ కు  పాలఘాట్ కు మధ్యలో వచ్చే కుథిరన్ అనే ఊరిలో ఏంతో పురాణ ప్రసిద్ది చెందిన ఆలయం ఉన్నది. శ్రీ ఆది శంకరులు ఈ స్వామిని కొలిచినట్లుగా స్థానిక కధనాలు తెలుపుతాయి.
ఇవే కాకుండా శ్రీ శాస్త ధన్వంతరిగా, యోగ మూర్తిగా, ధ్యాన రూపునిగా కొలువు తీరిన ఆలయాలు కేరళాలో ఉన్నాయి.
శరణ ఘోషతో పిలిచే వారిని చేరదీసి చింతలు బాపేవాడు శ్రీ ధర్మ శాస్త.
స్వామియే శరణం అయ్యప్పా !

 

   
Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...