30, ఏప్రిల్ 2014, బుధవారం

Sholingnur Temples

                            శ్రీ యోగాంజనేయ స్వామి ఆలయం 

శోలింగనూర్ లో శ్రీ యోగ నారసింహ స్వామి వెలసిన పెరియ మలకు ఎదురుగా చిన్న మల మీద  పడమర ముఖంగా ఉన్న ఆలయంలో  కొలువై ఉంటారు శ్రీ యోగాంజనేయ స్వామి.
రెండిటి మధ్య దూరం ఒక కిలోమీటరు ఉంటుంది. నడిచి వెళ్ళ వచ్చును. 
వాహనాల మీద కూడా పర్వత పాదాల వద్దకు చేరవచ్చును. 


ఈ క్షేత్రంలో అంజనా సుతుడు స్థిర నివాసం ఏర్పరచుకోడానికి సంబంధించిన పురాణ గాధ ఇలా ఉన్నది. 
లోకాలను తన పాలనలో ఉంచుకొని, సమస్త లోక జనులను హింసిస్తున్న "కుంభోదరుడు" అనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు సిద్దమయ్యాడట "ఇంద్రదుమ్యుడు" అనే రాజు.  
అతనికి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇతర దేవతలు కూడా తమ ఆయుధాలను, శక్తులను అందించారట. 
శ్రీ నారసింహుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు, స్వామి వారి శంఖు చక్రాలను ధరించి రాక్షస వధలో రాజుకి తమ వంతు సహాయం అందించారట. 
అసురుని అంతం చేసిన తరువాత కేసరీ నందనుడు తన స్వామికి ఎదురుగా యోగ ముద్రలో ఉండి పోయారని చెబుతారు. 

పెరియ మలై అంత ఎత్తులో ఉండకున్నా పై భాగానికి చేరుకోడానికి సోపాన మార్గం ఉన్నది. దారిలో పరమాత్మ మీద పూర్తి నమ్మకంతో ప్రజలు కట్టిన గుడ్డ ఉయ్యాలలు, ఇటుకలతో కట్టిన ఇళ్లులూ కనపడతాయి.కొండ ఎక్కే క్రమంలో పెరియ మల ఇలా కనిపిస్తుంది చిన్న మలై నుండి.


                                                             మొత్తం 406 మెట్లు. 


ఆలయ ప్రాంగణానికి తూర్పుదిశగా చిన్న మూడు అంతస్తుల గోపురం నిర్మించారు. 

ప్రాంగణం లోనికి ప్రవేశించిన ఎడమ వైపుగా ముందుకు వెళితే ఆంజనేయ పుష్కరణి, పక్కనే శ్రీ రామాలయం ఉంటాయి.
పుష్కరణికి కొత్త మెరుగులు దిద్దారు.
ఒక వైపున పురాతన మండపాలు, దక్షిణాన చిన్న గోపురం తో కూడిన ద్వారం ఉన్నది.
కోనేరు మధ్యలో నిర్మించిన చిన్న మండపంలో సుదర్శన చక్రాన్ని ఉంచటం విశేషం.

 
పుష్కరణి 2009 లో పై విధంగా ఉండేది. 


ప్రాంగణంలో ఉన్న వట వృక్షం క్రింద అనేక నాగ ప్రతిష్టలు ఉంటాయి.
గ్రహ దోషాలను తొలగించే వానిగా స్వామి ప్రసిద్ది.
అంటే కాదు మానసిక వాధ్యులతో, గాలి ధూళి సోకిందని భావించే వారిని తీసుకొని వచ్చి ఈ కోనేరులో స్నానం చేయించి నిత్యం నియమంగా స్వామి ని సేవించు కొంటె స్వస్థత చేకూరుతుందని అంటారు.
ఆ విశ్వాసంతో ఎందరో వచ్చి పదకొండు నుండి నలభై ఒక్క రోజుల వరకు ఇక్కడ ఉండిపోతారు.


దక్షిణాన ఉన్న వరుస మార్గంలో ముఖ మండపం చేరుకోవచ్చును.
గుహ లాగ ఉండే చిన్న గర్భాలయంలో శ్రీ ఆంజనేయుడు యోగ ముద్రలో శంఖు, చక్ర ధారిగా అభయ హస్తంతో దివ్యంగా దర్శన మిస్తారు.
అన్ని ఆరోగ్య సమస్యలకు అత్యంత శీఘ్రంగా పరిష్కారం చూపే అపర ధన్వంతరీ రూపుడీ సంజీవ రాయడు.

చిన్న మలై దగ్గర ఉన్న ఆర్య వైశ్య అన్నదాన భవనం దగ్గర మరో పుష్కరణి కలదు. 
జై ఆంజనేయ !!!

kappad Beach

                  పరాయి దేశస్తులు ప్రధమంగా పాదం మోపిన ప్రదేశం 


కోలికోడ్ లో నేను సందర్శించిన మరో సాగర తీరం "కపాడ్" (KAPPAD).
సహజంగా ఉన్న కుతూహలంతో నేను పాల్గొన్న సమావేశానికి వచ్చిన స్థానిక మిత్రులొకరిని చూడతగ్గ ప్రదేశాల గురించి అడిగితె చెప్పినదే "కపాడ్". 
సమావేశం ముగిసిన తరువాత బస్సు లో బయలుదేరాం.
ఈ బీచ్ కోలి కోడ్ కి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
నేరుగా వెళ్ళే బస్సులు చాలా తక్కువ. 
కన్నూర్ వెళ్ళే దారిలో "పూక్కాడ్"లో దిగి ఆటోలో (రెండు కిలోమీటర్లు ) చేరుకోవచ్చును.
ఈ దారిలో ప్రతి పది నిముషాలకు ఒక బస్సు కలదు. 
అలానే చేరాం. 
కాకపొతే భాషా సమస్య వలన ఆటో అతను బీచ్ వైపున కాకుండా రిసార్ట్ వైపున దించాడు.
అక్కడ దిగిన తరువాత కపాడ్ స్వరూపం కొంత వరకు అర్ధం అయ్యింది.
చాలా పొడవైన లోతైన కపాడ్ బీచ్  రిసార్ట్ కి,  పూర్తి స్థాయి బీచ్ కి  మధ్యన చిన్న కొండ ఉన్నది.
ఇటు వైపు నుండి అటు వైపుకు వెళ్ళాలంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చుట్టూతిరిగి వెళ్ళాలి
నడిచి గాని, వాహనాల మీద గాని వెళ్ళవచ్చును.
ఉత్సాహవంతులైతే గుట్ట మీదగా కొద్దిగా జాగ్రత్త  తీసుకొంటే దిగవచ్చును.
గుట్ట మీద శ్రీ దుర్గా దేవి, శ్రీ భద్ర కాళి అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి.
ఆగ్నేయంలో చిన్న మండపంలో శివుని మరో అవతారంగా భావించే "కుట్టి చేతన్ " చిన్న విగ్రహం పెట్టారు.                                    సముద్ర  తీరంలో కొండ మీద మహా వృక్షాలు, ఆలయాలు.
పైనుంచి చూస్తే బీచ్ వైపున ఇలా కనపడుతుంది.


                                              రిసార్ట్ వైపున ఇలా ఉంటుంది. ఆటో అతనికి సరిగ్గా చెప్పలేక పోవడం వలన రిసార్ట్ వైపున దిగిన మాకు అక్కడి రక్షణ నిమిత్తం నియమించబడిన  పోలీస్ చెప్పిన ప్రకారం రోడ్ మీద నడిచి వెళ్ళే ఓపిక లేక గుట్ట ఎక్కి అమ్మవారిని దర్శించుకొని  నెమ్మదిగా ఆపక్కకు దిగాం.
ఎండ కొద్దిగా ఎక్కువ గానే ఉన్నది. చెమటలు బాగా పట్టాయి.
దిగి తుడుచుకొంటూ ఆకస్మాత్తుగా చల్ల బడింది ఏమిటా అని చూస్తే తూర్పు నుండి నల్లని మబ్బులు ఏనుగుల మందలా మందగమనంతో రావడం కనపడినది.
కేరళా వాతావరణం గురించి కొంత అనుభవం ఉండటంతో వర్షానికి భయపడలేదు కానీ తడవ కుండా ఉండటానికి సరైన స్థలం లేదన్న భయం ఎక్కువగా కలిగింది.                 ముంచుకొస్తున్న మబ్బులను కెమేరాతో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక సందర్శకుడు.

                                 
                                    మేఘాలను చూసి పరవళ్ళు తొక్కుతున్న సముద్రుడు


                                 నిముషాల మీద మబ్బులు సముద్రాన్ని కూడా కమ్మేశాయి.


ఇంత హడావుడి చేసిన మేఘాలు నేల కూడా సాంతం తడపకుండా ముందుకి వెళ్లి పోయాయి.                                              నింగి, నీరు, నేల కలవడానికి ప్రయత్నం

బీచ్ వైపున చక్కగా సేదతీరడానికి చెట్ల నీడన చక్కని ఏర్పాట్లు చేసారు.
లోతు ఎక్కువగా ఉన్న నీటిలో సందర్శకులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా రాళ్ళతో సముద్రం లోపలి నాలుగు గట్లు నిర్మించారు.
యాత్రికుల సౌకర్యం కొరకు అన్ని రకాల ఆహార పదార్ధాలు, శీతల పానీయాలు, కాఫీ టీ లాంటి సదుపాయాలు లభిస్తాయి.


                                                             ప్రవేశ ద్వారం

పలహారశాల  


కపాడ్ బీచ్ కి రావడానికి ముఖ్య కారణం ఒక చారిత్రాత్మిక సంఘటనతో  ఈ ప్రదేశం ముడిపడి ఉండటం !
పోర్చుగీసు నావికుడైన "వాస్కో డ గామా" ఐరోపా నుండి భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించి పదునాలుగు వందల తొంభైఎనిమిది మే ఇరవై వ తారీకున భారత దేశ గడ్డ మీద తన తొలి అడుగు పెట్టిన ప్రదేశం ఇదే !
నాలుగు నౌకలలో నూట డెబ్బై మంది సహచరులతో అప్పట్లో "కప్పాడ్కావు"గా పిలవబడిన ఈ సముద్ర తీరానికి చేరుకొన్నాడు.
అప్పటి స్థానిక పాలకుడైన "జోమారిన్ రాజు" రాచ మర్యాదలతో అతనిని ఆహ్వానించారట.
నాటి సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేసారు.
అది ఎలా ఉంటుందో చూడాలన్న ఆశతో వచ్చిన నాకు బీచ్ అంతా తిరిగినా అది కనపడ లేదు.
భాష ఒక పెద్ద సమస్యగా మారింది.
హిందీ, ఇంగ్లీష్ అంతగా రాకపోవడం, మేము అడిగేది వారికి తెలియక (అర్ధం)కాక పోవడం ఏదో జరిగింది.
స్థానికునిగా కనపడిన ఒక పెద్దాయన కనపడితే అడిగా !
పాపం ఆయనకు కూడా భాషా సమస్యే !
కానీ ఆయన వెళ్లి మలయాళం లో మాట్లాడి ఇంగ్లీష్ తెలిసిన ఒకతన్ని పిలుచుకొని వచ్చారు.
ఆ యువకుడు స్థానికుడు కాదు.
పెద్దాయనకు స్మాకర చిహ్నం ఎక్కడ ఉన్నదో తెలీదు.
మాకు ఏం కావాలో తెలిసిన తరువాత ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న దుకాణాలలో విచారించి కనుక్కొని విజయవంతంగా మా వద్దకు వచ్చారు.
అప్పటికే నాకు అర్ధం అయ్యింది, నేను చూడదలుచుకొన్నస్థూపం ఏ స్థితిలో ఉంటుందో !
వారు చెప్పిన దాని ప్రకారం బీచ్ చివర కోలి కోడ్ నేరుగా చేరే మార్గంలో ఉన్నది.
వారికి కృతఙ్ఞతలు తెలుపుకొని ఆ దిశగా కదిలాము.
బీచ్ నుంచి నాలుగు అడుగుల లోపల ఉన్నది ఇదే !ఒక విధమైన విచారం కలిగింది.
వాస్కో డ గామా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఒక లక్ష్యం దిశగా చేసిన ప్రయత్నాల ఫలితమే అతను సాధించిన అద్భుత విజయం.
తదనంతర పరిణామాలను పక్కన పెడితే ఆ నావికుడు ఆ నాడు అందుకొన్నది సామాన్య లక్ష్యం కాదు.
అలాంటి చారిత్రాత్మక విషయాన్ని తెలిపే స్థూపాన్నిఅలా వదిలేయడం సరిగా అనిపించలేదు.

                                                              లుంగీ ఫుట్ బాల్


                                                  సాగర తీరాన సుందర గృహాలు 


స్థూపం ఉన్న స్తితి  కలిగించిన ఆవేదన, నిరాశ  నన్ను ఇక అక్కడ ఉండనీయ లేదు.
నచ్చిన వాటిని ఫోటోలు తీసుకొంటూ బస్సు స్టాప్ చేరుకొన్నాము.
ఈ సారి కోలి కోడ్ కి నేరుగా వెళ్ళే బస్సు దొరికింది.
సముద్ర తీరం నుండి తిరిగే మలుపులో ఉన్న ఆ స్థూపాన్నికనపడినంత వరకూ చూస్తూనే ఉన్నా !  

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...