27, ఫిబ్రవరి 2017, సోమవారం

Sri Kailasanadar Temple, Kanchipuram

                           శ్రీ కైలాస నాథర్ ఆలయం , కాంచీపురం 

సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పౌరాణిక ప్రసిద్ధి చెంది, మహత్తర చరిత్రకు మరోపేరుగా గుర్తింపబడిన ఊరు కాంచీపురం. 
ఆలయాల నగరంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకొన్న ఈ ఊరిలో రెండు భాగాలు కలవు. 
విష్ణు మరియు శివ కంచి. 
శివ కంచిలో ముఖ్య ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర స్వామిది. 
విష్ణు కంచిలో ప్రధాన కోవిల శ్రీ వరద రాజ పెరుమాళ్ ది. 
చిత్రమైన విషయం ఏమిటంటే విష్ణుకంచిలో శివాలయాలు, విష్ణు కంచిలో శివుని కోవెలలు ఉండటం !
ఒకప్పుడు ఇక్కడ వెయ్యికి పైగా ఆలయాలు ఉండేవని చెబుతారు. చాలా వరకు పల్లవ రాజుల కాలంలో నిర్మించినవే! ( క్రీస్తు శకం 3 నుండి 9వ శతాబ్ద మధ్య కాలం)
పురాణ, చారిత్రక, నిర్మాణ విశేషాలతో వేటికవే అపూర్వంగా దర్శనమిస్తాయి. 
అలాంటి వాటిల్లో శివ కంచిలోని పురాతన ఆలయమే శ్రీ కైలాస నాథర్ గురించిన విశేషాలు తెలుపుతున్నాను. 


సుమారు ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రాజసింహ (రెండో నరసింహ వర్మ)ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎన్నో అపురూప శిల్పాలకు పెట్టింది పేరు.
వేదావతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్సు స్టాండు కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం  ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది.
ఆరు వందల పరిపాలనా కాలంలో ఎందరో పల్లవ రాజులు నిర్మింప చేసిన అనేకానేక ఆలయాల్లో ప్రస్తుతం నిలిచి ఉన్న కొద్దీ పురాతన ఆలయాల్లో ఇదొకటి.


 చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే !
మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతి తో కాకుండా ఇసుక రాతి మీద నాటి శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం!
అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలయాలే!!
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది.
ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.


సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం  మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా  ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది.
ప్రాకారానికి  లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు. ధ్యాన, నర్తన, అసుర సంహార,త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర  ఇలా ఎన్నో !
అదే విధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి.గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ (?) రూపాలు అబ్బుర పరుస్తాయి. ఇక్కడే చిన్న చిన్న ఉపాలయాలను నిర్మించారు. వీటిల్లో ఉమామహేశ్వర, లింగోద్భవ, శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మన్నారాయణ,  బ్రహ్మ,  శ్రీ దుర్గ, శ్రీ దక్షిణా మూర్తి,  ఆదిగా గల దేవీశ్రీ నారసింహ   దేవతలు కొలువుతీరి ఉంటారు. గోడల పైన చెక్కిన  శివ పురాణ ఘట్టాలు, భూతగణాల శిలాపాలు చూపరుల దృష్టిని ఆకట్టుకొంటాయి.
అన్ని దిక్కులా చెక్కిన శివ తాండవ శిల్పాలు అద్భుతక్మ్. ఇవి మొత్తం నూట ఏమిది అని చెబుతారు.
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు. నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత ఇతర దేవతలు, సోమస్కంద మూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి.
అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు.
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది.
నేటికీ నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
మండపం లోను, మండప స్తంభాల  పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలావరకు పల్లవ రాజులు శ్రీ కైలాస నాథర్ స్వామికి సమర్పించు కొన్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే !
ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయ సందర్శనతో మాత్రమే ఒకరి కంచి యాత్ర సంపూర్ణం అవుతుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
అంతటి విశిష్ట ఆలయం శ్రీ కైలాస నాథర్ స్వామిది !!


కాంచీపురానికి చెన్నై నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. ఈ ఆలయం చేరుకోడానికి బస్సు స్టాండ్ నుండి ఆటో లు దొరుకుతాయి. చక్కని భోజన మరియు వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 

నమః శివాయ !!!!

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...