30, మే 2014, శుక్రవారం

Vellamassery Garudan Kavu

                                     గరుడన్ కావు ( గరుత్మంతుని ఆలయం )

 ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ  గరుడన్ కావు". 
శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా  సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి ( గద ), ఆదిశేషువు మరియు గరుత్మంతుడు ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి. 
శంఖం మరియు గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ది. 
 స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది. 
ఎన్నో ఆలయాలలో సుదర్శన సన్నిధి ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడినది. 
ఇక ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడే !
సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ది గరుత్మంతుడు. 
ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతా సుతుని మనందరం చూస్తూనే ఉంటాం. 
కాని అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం "గరుదన్ కావు"లో ఉన్నదే. 
బహుశా భారత దేశం మొత్తం మీద పక్షి రాజుకు ఉన్న ఆలయమిదోక్కటే అని కూడా తెలుస్తోంది.  










ఎన్నో యుగాలకు పూర్వం ఒక మహా మునికి మానవ జీవిత అర్ధం మరియు పరమార్ధం గురించి
స్వయంగా వైకుంఠ నాధుడే తెలిపే సమయంలో వాహనమైన గరుడుడు పక్కనే ఉన్న కోనేరు వద్ద వేచి ఉన్నాడట.
అలా పరమాత్మ సంచరించిన స్థలంగా ప్రసిద్ది కెక్కిన ఇక్కడ కొన్ని కుటుంబాలు జగన్నాధుని ఆలయం నిర్మించుకొని ఆరాధించుకోనేవట!
ఆ కాలంలో పేరొందిన శిల్పి "పేరున్ థాచన్" ( కేరళ లోని ప్రముఖ ఆలయాల నిర్మాణాల వెనుక ఉన్నది ఈయనే అన్న ఒక బలమైన విశ్వాసం ప్రజలలో ఉన్నది) స్థానిక "వేట్టాతు నాడు" పాలకుని వద్దకు వచ్చాడట.
మహా శిల్పిని సాదరంగా ఆహ్వానించిన రాజు ఆయన చేతిలో సహజత్వాన్ని కలిగి ఉన్న గరుడ బొమ్మను చూసి శిల్పి నేర్పరితనాన్నికొనియాడారట.
దానికి  పేరున్ థాచన్ పతివ్రత అయిన స్త్రీ గనుక తాకితే ప్రాణం పోసుకొని ఎగురుతుంది అన్నారట.
ఆ మాటకు ఆగ్రహించిన రాజు శిల్పి భార్యను రప్పించి తాకించారట.
ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చెక్క శిల్పం ప్ర్రాణం పోసుకొని గాలిలోనికి ఎగిరినదట.
 వెంటాడిన భటులు ఇక్కడి కోనేరులోని తెల్ల తాబేళ్ల మీద వాలి ఉన్నపక్షిని కనుగొన్నారట.
తరలి వచ్చిన రాజు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం తెలుసుకొని శిల్పాచార్యుని చేతనే ఇక్కడ ఒక నూతన ఆలయం శ్రీ మహా విష్ణువుకు, గరుత్మంతునికి కట్టించారట.
తదనంతర కాలంలో మైసూరును పాలించిన "టిప్పు సుల్తాన్" కేరళ ప్రాంతం మీద జరిపిన దాడులలో తొలుత నిర్మించిన ఆలయం పూర్తిగా ధ్వంసం అయినదిట.
మూల విరాట్టులు  సుమారు 1800 సంవత్సరాలుగా  పూజలందుకొంటున్నా ప్రస్తుత ఆలయం మాత్రం రెండువందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది.







ప్రశాంత వాతావరణంలో గుబురుగా పెరిగిన వృక్షాల మధ్య తూర్పు మరియు పడమర ద్వారాలు కలిగిన ఈ ఆలయం ఉంటుంది. పురుష భక్తులు తప్పని సరిగా పంచె ధరించాలి.
ధ్వజస్తంభం మరియు బలి పీఠాలు లేని ప్రాంగణంలో ఒక పక్క అంబల కార్యాలయము మరో పక్క ప్రసాద విక్రయ శాల ఉంటాయి.
ధ్వజస్తంభ  స్థానంలో నిలువెత్తు రాతి దీప స్థంభం ఉంచబడినది.
చిన్న ద్వారం గుండా లోనికి వెళితే లోపల మూడు చతురస్రాకార శ్రీ కోవెలలు, రెండు నమస్కార మండపాలు కనపడతాయి.
ఎదురుగా రెండంచెల గోపురాలున్నప్రధాన గర్భాలయంలో శ్రీ మహా విష్ణువు చతుర్భుజుడై స్థానక భంగిమలో దర్శనమిస్తారు. లోపల తాబేలు రూపంలో శ్రీ కూర్మనాథ స్వామికూడా దర్శనమిస్తారు. పక్కనే చిన్న ఉపాలయంలో   శ్రీ వినాయకుడు వెలసి ఉంటారు.









ఈ ప్రధాన శ్రీ కోవెల వెనుకే  శ్రీ గరుత్మంతుని సన్నిధి.
చందన పుష్పాలంకార శోభితుడైన గరుడుడు ఎగరడానికి సిద్దంగా రెక్కలు విప్పుకొన్న భంగిమలో దర్శనమిస్తాడు.
గరుడునికి ఇరుపక్కలా సదాశివుని మరో రూపమైన "వేట్టక్కారాన్" మరియు "కార్త వీర్యార్జున్" వెలసి ఉంటారు.
మరో  ఆలయంలో శ్రీ శంకర నారాయణ స్వామి, చివర ఉన్న దానిలో కైలాస వాసుడు కొలువుతీరి ఉంటారు.
 ప్రధాన గర్భాలయం తప్ప మిగిలినవన్నీ నూతనంగా నిర్మించబడినవి. 





 





కేరళ రాష్ట్రంలో విశేష ఆదరణ కలిగిన గరుడన్ కావు ఆలయంలో నిత్య పూజలు నియమంగా జరుగుతాయి.
ఉదయం నాలుగు నుండి పదిన్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది.
ఆదివారాలు, పర్వదినాలలో వేళలను మారుస్తారు.
భక్తులు ముఖ్యంగా అనారోగ్య పీడితులు, సర్ప (నాగ) దోషం లేదా కుజ దోషం కలిగి ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు.
మూడు ఆది వారాలు వచ్చి స్వామిని ఆరాధిస్తే సమస్త చర్మ, శ్వాస కోశ వ్యాధులు తొలగిపోతాయని తరతరాల నమ్మకం.
వ్యాధి గ్రస్తులు కంద దుంపను, నాగ రూపాన్ని  తమచుట్టూ తిప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్ధిస్తారు.
తెలియక తేకపోతే అక్కడ ఉన్న దుంపను ఉపయోగించుకొని దానికి బదులుగా  శక్తి కొద్ది పైకాన్ని హుండిలో వెయ్య వచ్చును.
అదే విధంగా రాహు లేదా కుజ దోషం వున్నవారు ఇక్కడ నాగ ప్రతిష్ట జరిపిస్తారు.
ప్రాంగణమంతా ఎన్నో నాగ శిలలు లెక్కకు మిక్కిలిగా కనపడతాయి.









కొల్ల వర్షం (మలయాళీ పంచాంగం) ప్రకారం నవంబర్ - డిసెంబర్ మధ్య వచ్చే వృక్చిక మాసంలో జరిపే మండల పూజలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
పొంగలి, పళ్ళు గరుత్మంతునికి సమర్పించు కొంటారు.
నాగ  దోషం ఉన్న భక్తులు కొందరు బ్రతికి ఉన్న సర్పాన్ని మట్టి కుండలో బంధించి తెచ్చి మూలవిరాట్టు ముందు కుండను పగలకొడతారు.
బుసలు కొడుతూ బయటికి వచ్చిన పామును ఆలయ పూజారి గరుడ పంచాక్షరి మంత్రంతో శాంతింప చేస్తారట.
శాంతించిన పాము ఆలయ బయటికి వెళ్లి పోతుందట.
గరుడుని మహత్యమో మరొకటో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరూ పాము కాటుకు గురికాలేదని తెలుస్తోంది.










అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు.
ఎన్నో ఆర్జిత సేవలు భక్తుల కొరకు అందుబాటులో ఉన్నాయి.
ఆలయ వెలుపలి ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త, భద్రకాళి సన్నిదులుంటాయి.
గరుడన్ కావు  కేరళ రాష్ట్రం లోని మలప్పురం జిల్లాలో ఉన్నది.
షోరనూర్ లేదా గురువాయూరు నుండి "తిరూర్" మీదగా ఇక్కడికి చేరుకొనవచ్చును.
తిరూర్ నుండి పది కిలోమీటర్లు.
ఎలాంటి వసతులు లభించవు.
కనుక ఉదయం వెళ్లి తిరిగి రావడం ఉత్తమం.


24, మే 2014, శనివారం

Sri Chitraputhira yama dharmaRaja Temple, Coimbatore

                      చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం 

మన పురాణాల ప్రకారం మనకున్నది ముక్కోటి దేవీ దేవతలు. 
వీరిలోని ప్రతి ఒక్కరు జీవుల నిత్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేవారే !
అందుకే అందరికీ ఆలయాలు లేకున్నా మన పూజా విధానం లో అందరిని సంతృప్తి పరచే మంత్రాలు ఉన్నాయి. 
అలా మానవ జీవితాలు ప్రశాంతంగా గడిచి పోతాయన్నది ఒక విశ్వాసం. 
అదే విధంగా ఎన్నో భాషల సంస్కృతుల నిలయమైన మన దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన ఆరాధన విధానాలు, నమ్మకాల ప్రకారం ఆలయ నిర్మాణాలు జరిగాయని ఆ యా క్షేత్ర గాధలను చదివినప్పుడు తెలుస్తోంది. 
అలాంటి దానికి సాక్ష్యం గా కనపడేదే "చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం". 
తమిళ నాడు లోని ముఖ్య నగరాలలో ఒకటైన కోయంబత్తూర్ కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లలూరు గ్రామ శివారులలో ఉన్నదీ ఆలయం. 
 సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఈ ఆలయం కొన్ని కుటుంబాల అధీనంలో ఉండి, వారే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. 
కాలక్రమంలో మిగిలిన వారు కూడా సందర్శించడం ఆరంభమైనది. 
ఎంతైనా యమధర్మ రాజ స్వామి కదా !
తమిళ నాడు లోని ఆలయాల నగరం కుంభ కోణం సమీపంలో ఉన్న "వంచియూరు" లోనూ, తంజావూరు జిల్లా తిరు చిత్రాంబలం లోను శ్రీ యమధర్మరాజ ఆలయాలు ఉన్నాయి. 
ఆయనకు నీడలా ఉండే శ్రీ చిత్ర గుప్తునికి మరో ఆలయాల పట్టణం కంచి లోని బస్టాండ్ దగ్గర ఒక ఆలయం ఉన్నది. 
కానీ ఇద్దరూ కలిసి ఒకే గర్భాలయంలో ఉన్నది బహుశా ఇక్కడే కాబోలు.   



ఈ విశేష ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా పేర్కొనవచ్చును. 




నిత్యం సాధారణంగా ఉండే ఆలయ పరిసరాలు ఆదివారాలు సందడిని సంతరించుకొంటాయి. 
స్థానికులు, దూర ప్రాంతాల వారు ఎందరో తరలి వస్తారు. 
వెల్లలూరు కు చివర సింగనల్లూర్ వెళ్ళే దారిలో  అభివృద్ధి చెందుతున్న కాలనీ లో (అశోకన్ వీధి, IOB పక్క వీధి)
 ఎలాంటి ఆర్భాటము లేకుండా ఉంటుందీ ఆలయం. 



ముఖ్యంగా చైత్ర మాసం ( ఏప్రిల్ 17 నుండి  మే 16 ) దాక భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.




చైత్ర పూర్ణిమ చిత్ర గుప్తుని జన్మ దినం అంటారు.
ఆ రోజున ఆయన జీవుల పాప పుణ్యాల లెక్కలు రాసేందుకు ఆ సంవత్సరానికి కొత్త పుస్తకం మొదలు పెడతారట.
అందుకని ఆయనను ఆయన ఏలిక అయిన యమధర్మ రాజుని సంతృప్తి పరచడానికి నూట ఒక్క నైవేద్యాలతో పౌర్ణమి నాటి ఉదయం అయిదు గంటలకు ప్రత్యేక ఆరగింపు సేవ జరుపుతారు.
ఆ నెలంతా భక్తులు లెక్కకు మిక్కిలిగా వస్తుంటారు.




కొట్టని కొబ్బరికాయతో పాటు తమ కోరికను కాగితం మీద రాసి యమధర్మ రాజ స్వామి చేతిలో పెట్టిస్తారు. 
కోరిక నెరవేరిన తరువాత అనుకున్న వస్తువు ( బెల్లం, పంచదార, అరటి పళ్ళు లాంటివి )ను తమ బరువుకు తగినట్లుగా తూచి సమర్పించుకొంటారు. 
అక్కడే వంటలు చేసుకొని నివేదన చేసి స్వీకరిస్తారు కొందరు. 



ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయానికి ముందు రేకులతో కప్పిన విశాలమైన మండపం ఉంటుంది. 



ఇక్కడ చిన్న మందిరంలో "రాజ గణపతి " కొలువై వుంటారు.
గోడలకు యమ లోకంలో పాపులకు విధించే శిక్షల వివరాలు, ఆర్జిత సేవల వివరాలు రాసిన పటాలు పెట్టారు.
అక్కడే ఉన్న చిన్న ద్వారం గుండా లోపలి వెళితే మధ్యస్తంగా ఉండే మండపం అందులో శ్రీ యమ ధర్మరాజ చిత్రపటాలు వివిధ అలంకరణలలో ఉన్నవి కనపడతాయి.
ఎదురుగా ఉన్న గర్భాలయంలో ప్రధాన అర్చనా మూర్తి శ్రీ యమధర్మ రాజు మహిష  వాహనం మీద ఒక చేతిలో పాశం మరో చేతిలో అంకుశం ధరించి చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు.
ఆయనకు కుడి పక్కన శ్రీ చిత్ర గుప్తుల వారు ఘంటం మరియు తాళ పత్రాలను పట్టుకొని ఉండగా, ఎడమ పక్కన వేల్ నిలబెట్టి ఉంటుంది.











గర్భాలయం పక్కనే మరో చిన్న గదిలో కొన్ని శివలింగాలు, సప్త మాతృకలను స్థిరపరచారు.



C

ఈ ఆలయం లో భక్తులకు ఇచ్చే ప్రసాదం విభూతి.
నిత్యం ధరిస్తే అకాల మృత్యువు దరి చేరదని అంటారు.
ఆలయానికి నల్ల వస్త్రాలు ధరించి వెళ్ళ కూడదని, శ్రీ యమధర్మ రాజు చిత్రాన్ని పూజా మందిరంలో ఉంచకూడదని చెబుతారు.
మూడు శతాబ్దాల క్రిందట ఈ ఆలయం నిర్మించడానికి, వివిధ పూజా విధానాలను రూపొందించడానికి తగిన కారణాలు మాత్రం అందుబాటులో లేవు.
కానీ చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం మాత్రం తప్పనిసరిగా సందర్శించవలసిన ఆలయం.
కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 55 B మరియు C లేకపోతే S19 సిటీ బస్సులు నేరుగా వెల్లలూరు వెళతాయి. 

Chennai Temples




                   శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం 

తమిళ నాడు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఆలయాలకు ప్రసిద్ది. 
అందులో శ్రీ పార్ధ సారధి స్వామి ఆలయం ఉన్న త్రిప్లికేనే ప్రాంతం ఎన్నో చిన్నా పెద్ద ఆలయాలకు నిలయం. 
ఏంతో పౌరాణిక చారిత్రాత్మిక విశేషాల సమాహారమైన శ్రీ పార్ధసారధి స్వామి ఆలయ పుష్కరణి కి దక్షిణాన ఉన్న హనుమంత రాయ కోవిల్ వీధిలో ఒక విశేష ఆంజనేయ ఆలయం ఉన్నది. 
అదే శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం. 



గృహ సముదాయాల మధ్యన ఉన్న ఈ మందిరం లోని ఆంజనేయుని 1794వ సంవత్సరంలో అప్పటి ఉత్తరాది మఠం పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సత్య సందారు స్వామి ప్రతిష్టించారు. 






కాలక్రమంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత రూపం సంతరించుకొన్నది. 


గర్భాలయంలో ఎత్తైన గట్టు మీద సుమారు పది అంగుళాల శ్రీ భక్త ఆంజనేయ స్వామి విగ్రహం కుడి కాలుని కొద్దిగా వంచి ఉత్తరాభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తుంది.  
 సన్నటి ప్రదక్షిణా పదంలో అష్ట దిక్కులా నాగ రూపాలను ఉంచారు.
ఇక్కడ  ఒక విశేష ప్రత్యేకత ఉన్నది.
ధ్యానం అంటే శ్వాసను క్రమబద్ధీకరించడం!
ప్రాణానికి ముఖ్యం శ్వాస.
ఎంతటి చెంచల మనస్కులకైనా ఈ మందిరంలో ధ్యానం మీద అమితమైన ఏకాగ్రత కుదురుతుంది.
ప్రతి నిత్యం ఉదయం మరియు సాయంత్రం  నియమంగా పుజాలు జరిగే ఇక్కడికి ఎందరో వచ్చికొద్ది సేపు ధ్యానం చేసుకొని ఆ తరువాతే  తమ దైనందిన కార్యక్రమాలో పాల్గొంటారు.
ఈ కారణంగా శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయంగా పెరోచ్చినది.
హనుమత్ జయంతి మరియు శ్రీ రామ నవమి విశేషంగా జరుపుతారు.
పుష్కరానికి నాలుగు వైపులా ఎన్నో హనుమత్ మందిరాలను సందర్శించుకొనవచ్చును.
శ్రీ ఆంజనేయం !!!




Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...