24, డిసెంబర్ 2018, సోమవారం

Pancha Aranya Temples

                   


                    పుణ్యప్రదం పంచవనేశ్వర దర్శనం                                                                                          


గంగాధరునికి ఉన్నన్ని గొలుసు కట్టు ఆలయాలకు లెక్క లేదు. పంచారామ క్షేత్రాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు, పంచ బ్రహ్మ ఆలయాలు, పంచ క్రోశ ఆలయాలు, సప్త విదంగ క్షేత్రాలు, సప్త స్దాన క్షేత్రాలు, సప్త మాంగై స్థానాలు, అష్ట వీరట్ట స్థలాలు, నవ నందులు, నవ కైలాసాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా ఎన్నో ఉన్నాయి.
వీటిల్లో చాలా వరకు తమిళనాడులోనే నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా పంచ వనేశ్వర  ఆలయాలు అని కూడా ఉన్నాయి. వీటిని పంచ అరణ్య ఆలయాలు అని కూడా అంటారు.ఆలయాలున్న ప్రాంతాలు ఒకప్పుడు రకరకాల వనాలు. అందువలన ఈ అయిదు ఆలయాలను కలిపి చేసే యాత్రను పంచ వనేశ్వర దర్శనం అన్నారు. ఇవి కుంభకోణం నుండి తంజావూరు వెళ్లే దారిలో ఉన్నాయి.కుంభకోణం నుండి మొదలు పెట్టి అయిదు క్షేత్రాలను దర్శించుకొని తంజావూరు వెళ్ళచ్చు లేదా తిరిగి కుంభకోణం రావచ్చు. రాను పోను నూట ఇరవై కిలోమీటర్ల దూరం.  కుంభకోణం నుండి ప్రారంభించడం ఉత్తమం. ఎందుకంటే ఈ అయిదు ఆలయాలను దర్శించుకోడానికి ఒక పద్ధతి నిర్దేశించబడినది. దాని ప్రకారం ఉదయం అయిదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపల ఒక్కో ఆలయంలో ఒక్కో సమయంలో అంటే   ఉదయ, మధ్యాహాన్న, అపరాహ్ణ, సాయం సంధ్య మరియు అర్ధజాము పూజల సమయాలలో ఆయా ఆలయాలలోని దేవీదేవతలు సందర్శించుకోవాలి. వీటిల్లో తొలి ఆలయం కుంభకోణానికి సమీపంలోనే ఉన్నది. 
అయిదు ఆలయాలు విశేషమైనవే. నయమ్మార్లు తేవరాలు గానం చేయడం వలన పడాల్ పెట్ర స్థలాలలో స్థానం సంపాదించుకొన్నవే. శైవాగమనం ప్రకారం పూజాదికాలు  నిర్వహిస్తారు. కార్తీక మాస పూజలు, శివరాత్రి, గణేష చతుర్థి, సుబ్రమణ్య షష్టి, త్రయోదశి ప్రదోషకాల పూజలు, నవరాత్రులు, ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా జరుపుతారు.కాకపోతే    అన్నింటికీ కలిపి ఒకే క్షేత్ర గాధ లేదు. మరే పోలిక లేదు. ఇవన్నీ కావేరి తీరంలో ఉండటం శతాబ్దాల క్రిందట అయిదు రకాల వనాలలో ఉండటమే వీటి మధ్య ఉన్న బంధం.
నిర్ణయించిన సమయాలలో పంచ అరణ్య క్షేత్రాలను సందర్శించుకొంటే సత్సంతానం కలుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గ్రహ భాధలు తొలగిపోతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది అని విశ్వసిస్తారు.  అయిదు ఆలయాల విశేషాలు తెలుసుకొందాము. 

తిరుక్కరుగవూర్ 

సంతానం కోరుతూ, సుఖప్రసవం ఆశిస్తూ  మరియు గర్భాశయ వ్యాధుల నుండి కాపాడమని ప్రార్ధించే మహిళలతో సంవత్సరమంతా రద్దీగా ఉండే ఈ ఆలయంలో శ్రీ గర్భరక్షంబికై సమేత శ్రీ ముల్లైవననాథర్ కొలువై ఉంటారు. కానీ భక్తులు అధికంగా ఆరాధించేది అమ్మవారినే !  సంతానం లేనివారికి సంతానాన్నిఅనుగ్రహించే కల్పవల్లి, గర్భవతులకు సుఖ సురక్షిత ప్రసవాన్నిప్రసాదించే దేవి, గర్భాశయ వ్యాధుల నుండి రక్షించే అమ్మ పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు మహిళా భక్తులు. దీని వెనుక ఒక గాధ ఉన్నది. 
చాలా కాలం క్రిందట ఈ ప్రాంతమంతా మల్లె చెట్లతో నిండిపోయి ఉండేది. వనంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారు శివ భక్తులు. లయకారుని అర్చించకుండా పచ్చి గంగ కూడా స్వీకరించేవారు కాదు. ఒకసారి బ్రాహ్మణుని మనస్సులో తీర్ధయాత్రలు  చెయ్యాలన్నసంకల్పం కలిగింది. అంతే గర్భవతిగా ఉన్న భార్యను వదిలి బయలుదేరారు. సంతోషంగా భర్తను పంపి తాను నిత్య పూజలు చేస్తూ ఆశ్రమంలో ఉండి పోయింది. గర్భవతి కావడాన తొందరగా అలసి పోయేది. ఒకనాడు అలానే అలసటతో వాళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. ఆ దారిన పోతున్న మహర్షి ఒకరు ఆశ్రమం ముందు ఆగి దాహానికి మంచినీరు ఇమ్మని అర్ధించారు. కానీ గాఢ నిద్రలో ఉన్న ఆమె స్పందించలేదు. ఆగ్రహించిన మహర్షి అతిధిని ఆదరించని ఆమె బయటికి చెప్పుకోలేని వ్యాధితో క్రుంగి కృశించి పోవాలని శపించి వెళ్లిపోయారు. 
శాప కారణంగా సోకిన వ్యాధి వలన ఆమెతో పాటు గర్భస్థ శిశువు కూడా ఇబ్బంది పడుతుండటం చూసిన లోకనాయకి తట్టుకోలేక ఆమె గర్భంలోని పిండాన్ని ఒక మట్టి కుండలో కామధేను పాలల్లో ఉంచి సంరక్షించసాగింది. సరిగ్గా తొమ్మిది నెలలు నిండే సమయానికి బ్రాహ్మణుడు యాత్రలు  పూర్తి చేసుకొని ఇంటికి చేరుకొన్నారు.వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసి విలపించి, ఆదిదంపతులు ప్రార్ధించారు. సాక్షాత్కరించినవారు ఆమెను రోగవిముక్తురాలిని చేసి, కాపాడిన శిశువును దంపతులకు అందించారు. సంతోషంతో బ్రాహ్మణ దంపతులు అమ్మవారిని ఇక్కడే కొలువుతీరి భక్తులను ఆదుకోమని  అర్ధించారు. నిజ భక్తుల విజ్ఞప్తిని కాదనలేక స్థిరపడి పోయారు. గర్భాన్ని రక్షించిన అమ్మవారిని శ్రీ గర్భరక్షంబికై అని, మల్లె చెట్ల వనంలో కొలువైనందున శ్రీముల్లైవననాథర్ స్వామి అని పిలుస్తారు.  గర్భాలయంలోని లింగం మీద మల్లె తీగలు పాకితే ఏర్పడే గుర్తులను స్ఫష్టంగా చూడవచ్చును. గమనించవలసిన అంశం ఏమిటంటే శ్రీ ముల్లైవననాథర్ స్వామి లింగం బంక మట్టితో చేసినది. అందువలన అభిషేకాలు ఉండవు. పునుగు పిల్లి తైలం జల్లుతారు. ఆరోగ్యం కొరకు దీనినే భక్తులు స్వీకరిస్తారు.
సంతానం లేనివారి కొరకు పూజలు చేస్తారు. నెయ్యి ప్రసాదంగా ఇస్తారు. నియమంగా భార్యాభర్తలు మండలం రోజులు సేవిస్తే గర్భం ధరిస్తారన్నది భక్తుల విశ్వాసం. అదే విధంగా సుఖ ప్రసవానికి ఆముదం నూనె ప్రసాదంగా ఇస్తారు. గర్భం మీద రాసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం కొరకు భక్తులు ప్రత్యేక పునుగు సత్తం పూజ చేయించుకొంటుంటారు. స్వయంగా వెళ్లలేనివారు నిర్ణయించిన పైకం చెల్లించి తమ వివరాలను పంపి ప్రసాదాలను తెప్పించుకోవచ్చును. పూజలు చేయించుకోవచ్చును. 
నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. కానీ పంచ వనేశ్వర క్షేత్రాలను దర్శించాలి సత్ఫలితాలను పొందాలి అనుకునేవారు ఈ క్షేత్రంలో తొలిపూజ అంటే ఉదయం అయిదున్నర నుండి ఆరు లోపల చేయించుకోవాలి.  తిరుక్కరుగవూర్ కుంభకోణానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అవలియనల్లూరు 

స్థానికంగా పత్రి వనం గా పిలిచే ఈ ప్రాంతం ఒకప్పుడు ఉమ్మెత్త మొక్కలతో నిండి ఉండేదట. . గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ సాక్షినాథర్ అన్న పేరు ధరించి కొలువై ఉంటారు కైలాసనాథుడు. అమ్మవారు శ్రీ సౌందర్య నాయకి విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.స్వామి వారికి సాక్షినాథర్ అన్న పేరు రావడానికి సంబంధించి ఒక కధ వినిపిస్తుంది. 
స్థానికంగా నివాసముంటున్న బ్రాహ్మణుడు భార్యను పుట్టింట వదలి తాను కాశీ యత్రకు వెళ్ళాడు. చాలాకాలం గడిచిపోయింది. బ్రాహ్మణుని భార్య అనారోగ్యంతో చిక్కి శల్యమై పోయింది. బాధపడుతున్నఅక్కకు చెల్లెలు సేవ చేయసాగింది. చాలాకాలానికి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు మంచంపట్టిన ఆమె తన భార్య కాదని, అదే పోలికలతో ఉన్న మరదలే భార్య అని అనసాగాడు. పెద్దలకు ఏమి చేయాలో పాలుపోలేదు. అందరూ కులదైవమైన పార్వతీ పతిని శరణు కోరారు. వారికి తనపైన గల విశ్వాసానికి ఆనందించిన భోళాశంకరుడు ప్రత్యక్షమై బ్రాహ్మణునికి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అతని భార్య అని సాక్ష్యం చెప్పారట. అంతే కాకుండా
ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేసి అతనికి అప్పగించారు.బ్రాహ్మణ కుటుంబమంతా ఆనందంతో స్వామికి స్తోత్రం చేసి అక్కడే కొలువుండమని ప్రార్ధించారు. అలా భక్తవత్సలుడు సాక్షినాథర్ గా ఇక్కడ కొలువయ్యారు. స్వామివారిని అగస్త్య, కశ్యప, కణ్వ మహర్షులు, సూర్యుడు, చంద్రుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి సేవించారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఇక్కడ స్వామిని ప్రార్ధించారట.
ప్రాంగణంలో వినాయక, కుమారస్వామి, కణ్వ ముని, వీరభద్ర, సప్త మాతృకలు, అరవై మూడు మంది నయమ్మార్లు, దక్షిణామూర్తి, భైరవ, నటరాజు, సూర్య, చండికేశ్వర మరియు బ్రాహ్మణుడు, అతని భార్య మరియు మరదలు ఉంటారు.
ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో ఒక విశేషం కనపడుతుంది. సహజంగా వివిధ దిశల వైపు తిరిగి ఉండే గ్రహాలన్నీ ఇక్కడ కేంద్రంలో ఉన్న సూర్యభగవానుని వైపు తిరిగి ఉంటాయి. అరుదైన దృశ్యం.
శ్రీ సౌందర్యనాయకీ సమేత శ్రీ సాక్షినాథర్ స్వామిని ఉదయం తొమ్మిదిన్నర నుండి పది గంటల మధ్య కాలంలో సందర్శించుకోవడం అభిలషణీయం. ఈ క్షేత్రం తిరుక్కరుగవూర్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హరిద్వార మంగళం 

పంచ వనేశ్వర ఆలయాలలో మూడవది. అవలియనల్లూరు కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు ఒకప్పుడు జమ్మి చెట్లతో నిండి ఉండేదట. ప్రస్తుతం ఆలయ వృక్షం జమ్మి చెట్టే. 
 బ్రహ్మకు తనకు మధ్య మొదలైన వివాదాన్ని పరిష్కరించడానికి అగ్నిరూపంలో సాక్షాత్కరించిన త్రినేత్రుని మూలం కనిపెట్టడానికి శ్రీహరి భూవరాహ రూపంలో పాతాళానికి వెళ్ళినది ఇక్కడ నుండే అని చెబుతారు. ఒకప్పుడు ఆలయంలో సొరంగం ఉండేదట. ప్రస్తుతం మూసివేశారు. ఈ కారణంగానే హరి ద్వార మంగళం అన్న పేరొచ్చినట్లుగా చెబుతారు.
పాతాళం దాకా ఉన్న లింగరాజుగా స్వామివారిని శ్రీ పాతాళేశ్వర స్వామి అని పిలుస్తారు. అమ్మవారు అలంకార వల్లి. విడిగా సన్నిధిలో కొలువై ఉంటారు.
శ్రీ పాతాళేశ్వరస్వామి భక్తుల ఋణ బాధలను, అమ్మవారు గ్రహ దోషాలను, మానసిక అశాంతిని తొలగిస్తారన్నది  భక్తుల నమ్మకం. రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయ ప్రాంగణంలో ఏడుగురు వినాయకులు వివిధ సన్నిధులలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తారు. ఉపాలయాలలో నటరాజ స్వామి, వ్యాఘ్రపాద మహర్షి, కాశి విశ్వనాధ లింగం, భైరవ, సూర్య, చంద్ర, శని, సప్త మాతృకలు మరియు జ్ఞాన సంబందార్ ఉపస్థితులై ఉంటారు. ఆలయానికి ఎదురుగానే పుష్కరణి  బ్రహ్మ తీర్థం ఉంటుంది.
పంచ అరణ్య క్షేత్ర ఫలితం దక్కాలంటే శ్రీ పాతాళేశ్వర స్వామిని మధ్యాహన్నం పదకొండు నుండి ఒంటి గంట లోపల సేవించుకోవాలని అంటారు.

ఆలంగుడి  

కుంభకోణం చుట్టుపక్కల నెలకొన్న నవగ్రహ స్థలాలలో గురు క్షేత్రం.  త్రిభువననాయకి సమేత శ్రీఆపత్సహాయేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం. ఒకప్పుడు ఈ ప్రాంతం బూరుగ చెట్ల వనం. 
ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి విద్య, ఆరోగ్యం, నిర్ణయ సామర్ధ్యం, ఆధ్యాత్మికత, జ్ఞాన వైరాగ్యా భావనలను అనుగ్రహించేవాడిగా ప్రసిద్ధి. గురువారాలు, గురువు ఒక రాశి నుండి మరో రాశికి మారే రోజులలో విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ రోజున శ్రీ దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుపుతారు.
అరవై మూడు మంది నయమ్మారులలో ప్రసిద్ధుడైన తిరుజ్ఞాన సంబందర్ శ్రీఆపత్సహాయేశ్వర స్వామి వారి మీద గానం చేసిన పాటికాల వలన ఈ క్షేత్రం పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు పొందినది.
క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని స్వీకరించి సమస్త లోకాలను కాపాడిన స్వామి కనుక ఈ పేరుతొ పిలుస్తారు. స్వామి దక్షిణామూర్తి రూపంలో మునులకు సకల వేదసారం బోధించిన స్థలం కూడా ఇదే.
ఉపాలయాలలో వినాయక, సుబ్రహ్మణ్య, సూర్య, చంద్ర, శనీశ్వర, భైరవ, సప్త లింగాలు, శ్రీ దేవి భూదేవి సమేత వరదరాజ పెరుమాళ్, అగస్త్య, విశ్వమిత్ర   నయమ్మార్లు, నవగ్రహ మండపం ఉంటాయి. దక్షుడు మేక మొహంతో ఒక సన్నిధిలో కొలువై ఉండటం విశేషం. ఆ క్షేత్రంతో ముడిపడి ఉన్న ఎన్నో గాధలు స్థానికంగా వినిపిస్తుంటాయి. పంచ వన యాత్ర చేయువారు సాయంత్రం అయిదున్నర నుండి ఆరు గంటల మధ్యకాలంలో శ్రీ ఆపత్సహాయేశ్వర స్వామిని, శ్రీ దక్షిణా మూర్తిని, అమ్మవారిని సందర్శించుకోవాలి. హరిద్వార మంగళం నుండి ఆలంగుడి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తిరుక్కోళ్ళంపుథూర్ 

పంచ అరణ్య దర్శన యాత్రలో ఆఖరి ఆలయం. ఆలంగుడి కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు బిల్వ వృక్షాలతో నిండి ఉండేదట. ప్రస్తుతం ఆలయ వృక్షం బిల్వమే. 
శ్రీ సౌందర్య నాయకి సమేత శ్రీ విల్వారణ్యేశ్వర స్వామి కొలువు తీరి ఉంటారు. బ్రహ్మ ఈ క్షేత్రంలో పరమేశ్వరుని సేవించి బ్రహ్మ హత్య దోషం నుండి విముక్తులు అయ్యారని క్షేత్రగాధ. 
బ్రహ్మ పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారికి అభిషేకం చేయిస్తే సకల జన్మల పాపం తొలగిపోయి ఇహపర సుఖాలు లభ్యమౌతాయి అంటారు. 
పరివార దేవతలుగా గణపతి, మురుగన్, పంచలింగాలు, శ్రీ గజలక్ష్మి కొలువు తీరి దర్శనమిస్తారు.  గర్భాలయానికి ఎదురుగా ఆలయాన్ని నిర్మించడానికి ధనాన్ని ఇచ్చిన చెట్టియార్, ఆయన భార్య, తమ్ముల నిలువెత్తు విగ్రహాలు జీవం ఉట్టి పడుతూ ఉంటాయి. 
పంచ వన ఆలయ సందర్శనలో ఈ ఆలయాన్ని రాత్రి ఎనిమిది నుండి ఎనిమిదిన్నర లోపల దర్శించుకోవాలి. 

అరుదైన మరియు పుణ్యప్రదమైన పంచ వన / అరణ్య ఆలయ సందర్శనం పూర్తిచేసుకొని తిరిగి కుంభకోణం చేరుకోవచ్చును. లేదా తంజావూర్ వెళ్లవచ్చును.  

నమః శివాయ !!!!
  

Singa perumal koil

                                 త్రినేత్రుడీ నరసింహుడు 

లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం శ్రీ నృసింహ స్వామి 32 క్షేత్రాలలో వివిధ రూపాలలో పలు కారణాల మూలంగా కొలువుదీరి కొలిచిన వారిని కాపాడుతున్నారు. దీనికి ఆధారం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ నృసింహ గాథా లహరి.
ఈ ముప్పై రెండు క్షేత్రాలలో మొదటిదిగా అహోబిలం కాగా చివరిది విశాఖ జిల్లాలోని సాగరతీరా పట్టణం భీమిలిలో సౌమ్య గిరి మీద ఉన్న ఆలయం. మిగిలిన వాటిలో అధిక శాతం మనరాష్ట్రంతో పాటు తమిళనాడు లో ఉన్నాయి.
వాటిల్లో ఒకటి చెంగల్పట్టు కు చేరువలో ఉన్న సింగ పెరుమాళ్ కోయిల్. గతంలో పాదాలాద్రి పురం, ఆళ్వార్ నరసింగ దేవర, నరసింగ విన్నగర్ ఆళ్వార్, పాదాలాద్రి నరసింగ పెరుమాళ్ కోయిల్ గా పిలువబడి చివరికి సింగపెరుమాళ్ కోయిల్ గా స్థిరపడింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ నృసింహ స్వామి వారి మూలంగానే ఈ ఊరికి ఇన్ని పేర్లు వచ్చాయి.

ప్రళయ భీకర రూపంలో అసురుని సంహరించిన శ్రీహరి అవతార రూపం గురించి విన్న జాపాలి మహర్షిలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక సారి దర్శించుకోవాలి అన్న కోరిక తలెత్తినది. దట్టమైన అటవీ ప్రాంతమైన ఈ క్షేత్రానికి చేరుకొని ఇక్కడి శుద్ధ పుష్కరణి ఒడ్డున తీవ్ర తపస్సు చేశారు. సంతుష్టులైన వైకుంఠ వాసుడు మహర్షికి తన నృసింహ రూపంలో సాక్షాత్కారం ప్రసాదించారు. కానీ స్వామివారి భీకర రూపాన్ని చూడలేక శాంతించమని స్తోత్రపాఠాలు చేశారు జాపాలి మహర్షి. భక్తుని కోరికను మన్నించిన స్వామి రాక్షస రక్తంతో తడిసిన తన హస్తాలను పుష్కరణిలో శుభ్రం చేసుకొని పక్కనే ఉన్న కొండా గుహలో స్థిర పడ్డారు. ఈ కారణంగా కోనేరులో నీరు నేటికీ రక్తవర్ణంలో కనపడతాయి.

క్షేత్ర ప్రాముఖ్యాన్ని తెలుసుకొన్న పల్లవరాజులు ఆరవ శతాబ్దంలో ఇక్కడ గుహాలయాన్ని నిర్మించారు. తొలినాళ్లలో పల్లవ రాజులు ఎక్కువగా గుహాలయాలను నిర్మించారు. కాంచీపురం చుట్టుపక్కల ఆ కాలం నాడటి  గుహాలయాలు ఎన్నోకనపడతాయి. పల్లవులు నాటి బాష అయిన గ్రంథ లిపిలో వేసిన శాసనం ఈ ఆలయ నిర్మాణ విధానాన్ని తెలుపుతోంది. తదనంతర కాలంలో చోళులు మరియు విజయనగర రాజులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారని వారు వేసిన తమిళ మరియు తెలుగు శాసనాల ద్వారా అవగతమౌతుంది.


మూలవిరాట్టు కొలువు తీరిన కొండా గుహ చుట్టూ రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందీ ఆలయం. ధ్వజస్థంభం, బలిపీఠాలు, గరుడ, ఆంజనేయ సన్నిధులతో పాటు మహా మండపం, కళ్యాణ మండపం, అర్ధ మండపం మరియు ఉపాలయాలు ఉంటాయి ప్రాంగణంలో. మండపాల పైన దశావతార మరియు భిన్న నృసింహ రూపాలను ఏర్పాటు చేశారు.
గర్భాలయంలో శ్రీ ఉగ్రనారసింహ స్వామి ఉపస్థితులై శంఖు చక్రాలను ధరించి, అభయ మరియు ఉరు (తొడ మీద చెయ్యి వేసుకోవడం) హస్త భంగిమలలో స్వర్ణ పుష్పాలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. మారె నృసింహ లేదా శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో కనపడని విశేషము ఇక్కడి మూలవిరాట్టులో కనపడుతుంది. అది స్వామి మూడో నేత్రం. ఫాలభాగాన ఉన్న కంటిని పాపటి బిళ్ళ లాంటి ఆభరణంతో కప్పి ఉంచుతారు. హారతి సమయంలో అర్చకస్వామి ఆభరణాన్ని తొలగించి నేత్రదర్శనం కలిగిస్తారు. భక్తులు మహదానందంతో హరిహర రూపాన్ని దర్శించుకొంటారు.మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రదక్షణ అంటే గిరి ప్రదక్షిణే. కొండా చుట్టూ తిరగాల్సిందే. మరో ప్రదక్షిణా మార్గం లేదు. తమ కోర్కెలు తీరిన తరువాత భక్తులు తక్కువలో తక్కువగా నలభయ్ ఒక్క ప్రదక్షణలు చేసి నేతి దీపాలను వెలిగిస్తారు. ప్రదక్షిణా పధంలో కొండా వెనక పక్కన అనేక ఆయుర్వేద సుగుణాలు కలిగిన అంకోల వృక్షం కనిపిస్తుంది. ఈ
వృక్షం తాలూకు బెరడు, ఆకులు, కాయలు, గింజలు, వేరు అన్నీ ఆరోగ్యప్రదాయనులే. ముఖ్యంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, జంతువుల కాటు, కుష్టు వ్యాధి నివారణలో ఈ వృక్షం అపార సంజీవని అని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటుంటారు.
వివాహం లేదా సత్సంతానం కొరకు భక్తులు నూతన వస్త్రాలతో బంధాలను ఈ చెట్టుకు కడుతుంటారు. ఈ వృక్షం గురించి గోదాదేవి (ఆండాళ్) తన
నాంచారీ తిరుమొళి లో వర్ణించినట్లుగా తెలుస్తోంది.
స్వామివారు అలంకార ప్రియులు. ముఖ్యంగా పారిజాత పుష్పాల అర్చన లేదా మాలలు అంటే ప్రీతి. వాటిని సమర్పించిన భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు. ఆలయ వృక్షం పారిజాతమే !


అమ్మవారు శ్రీ అహోబిల వల్లి ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి ఉంటారు. ఉపాలయాలలో శ్రీ గోదాదేవి, శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్, శ్రీ హరి ప్రియా భక్తులైన శ్రీ రామానుజ, శ్రీ మానవళ మహామునితో పాటు వైకుంఠునుని సేనాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు కొలువై ఉంటారు.


ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉండే ఆలయంలో ఉష పూజ, కలశ శాంతి, సాయరక్ష, అర్ధజాము పూజ అనే నాలుగు పూజలు నియమంగా జరుపుతారు. ప్రతి పూజానంతరం అలంకరణ, నైవేద్యం మరియు హారతి తప్పనిసరి.
నృసింహ, వామన, పరుశురామ జయంతులు , స్వాతి నక్షత్ర పూజలు, శ్రీరామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర మాసంలోలో బ్రహ్మోత్సవాలను, ఆని మాసంలో పవిత్రోత్సవాలు, మాసి మాసంలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడు నుండే కాక కర్ణాటక మరియు ఆంధ్రా ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు.
మరెక్కడా కానరాని విశేష రూపంలో శ్రీ నరసింహ స్వామి కొలువు తీరిన సింగ పెరుమాళ్ కోయిల్ చెన్నై నుండి చెంగల్పట్టు వెళ్లే మార్గంలో ఉంటుంది. అన్ని లోకల్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలయం. నడిచి వెళ్లవచ్చును. చుట్టుపక్కల , చెంగల్పట్టు పరిసర ప్రాంతాలలో ఎన్నో అపురూప ఆలయాలు నెలకొని ఉన్నాయి.

నమో నారాయణాయ !!!!  

Mahadeva Mandir, Devabaloda


                      మహారాజులు కొలిచిన  మహాదేవుడు భారత దేశాన్ని సుదీర్ఘ కాలం ఎన్నో రాజ వంశాలు పాలించాయి. గుప్తులు, మౌర్యులు, చోళులు, పల్లవులు, చేర, పాండ్య,చాళుక్య, విజయనగర,రెడ్డి, కాకతీయ,శాతవాహనులు,నాయక,మరాఠా, గజపతులు  ఇలా ఎందరో !
వీరంతా హిందూ ధర్మ స్థాపనకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పెక్కు చర్యలు చేపట్టారు. వాటిల్లో ముఖ్యమైనది ఆలయ నిర్మాణాలు. వీరంతా అపురూపమైన దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. నాటి సమాజంలోని అన్ని వర్గాలవారు, పండిత పామరులు ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆరాధన విధానాలు, పురాణాల గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. దానివలననే నేటికీ మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి. 
    
అదే విధంగా ఈ పాలకులంతా వివిధ కాలాలకు చెందినవారు.  అయినా ప్రతి ఒక్క రాజ వంశం తమకంటూ ఒక రాజ చిహ్నాన్ని, ధ్వజాన్ని, కులదైవాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. తమ ఆరాధ్య దైవానికి నిర్మించిన ఆలయాలలో తమ రాజ చిహ్నానికి, ధ్వజానికి  తగిన ప్రాధాన్యతను శిలారూపాలలో కలిగించారు. తమ వంశ ప్రవరను, తమ బిరుదులను శిలాశాసనాలలో పొందు పరిచారు.
ఉత్తరభారత దేశ చరిత్ర పుటలలో ప్రముఖంగా పేర్కొనబడిన రాజవంశం "కాల చూరి". వీరినే "హేహేయులు" అని కూడా అంటారు. నేటి మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలోని అత్యధిక ప్రాంతాలను పాలించారు. వీరి రాజధాని నర్మదా నదీ తీరంలోని మాహీష్మతీ. వీరు కార్తవీర్యార్జనుని వారసులని అంటారు. ఈ వంశరాజుల ప్రస్థాపన రామాయణ, మహా భారతాలలో ఉన్నట్లుగా తెలియవస్తోంది. క్రీస్తుశకం ఆరు నుండి ఏడో శతాబ్ద కాలానికి చెందిన తొలినాటి కాలచూరి రాజులుగా ప్రసిద్ధి పొందినవారు "కృష్ణరాజు, శంకరగణ మరియు బుధరాజు". వీరు ముగ్గురూ తండ్రి, కుమారుడు మరియు మనుమడు. బుధరాజు కాలంలో చాళుక్య పాలకులైన మంగలేష మరియు రెండవ పులకేశి జరిపిన నిరంతర దాడులతో విచ్చిన్నమై పోయినది. తదనంతర కాలం లో  కాల చూరి రాజులు చిన్నచిన్న రాజ్యాలకు పరిమితమయ్యారు. కొందరు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ రాజ్యాలను స్థాపించుకొన్నట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారిలో నేటి కేరళ లోని కన్నూరు మరియు వేనాడ్ ప్రాంతాలను పాలించిన "మూషిక వంశీయులు " ఒకరు అని అంటారు. కాలచూరి వంశీయులు శివారాధకులు. వీరిలో అనేకులు "పరమ మహేశ్వర" అన్న బిరుదు కలిగి ఉన్నారు. వీరి పాలనాకాలంలో కైలాసనాధునికి పెక్కు విశిష్ట నిర్మాణాలను కట్టించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అజంతా మరియు ఎల్లోరా గుహలలో ఆలయాలు, నిర్మాణాలను కట్టించింది హేహేయులే. వాటిల్లో కూడా అధిక శాతం శివలీలా శిల్పాలు కనపడటం వీరి శివ భక్తికి నిదర్శనం. 
తొలినాటి కాలచూరి రాజైన కృష్ణరాజు కాలం( 6వ శతాబ్దం)లో నిర్మించబడి తదనంతరం వారి వారసుల కాలం (13వ శతాబ్దం)లో మరింత అభివృద్ధి చేయబడిన  ఒక శివాలయం నేటి ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ కు సమీపంలోని "దేవ బలోద" గ్రామంలో కనిపిస్తుంది.  
రాయపూర్ నుండి పారిశ్రామిక నగరంగా పేరొందిన భిలాయ్ కి వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ గ్రామం. చరోదా అన్న ఊరిలో దిగితే అక్కడికి దేవబలోద మూడు కిలోమీటర్ల దూరం. 
ప్రస్తుతం పురావస్తుశాఖవారి అధీనంలో ఉన్న ఆలయం నేటికీ చెక్కుచెదరక పోవడం ఒక విశేషం కాగా నిత్య పూజలు జరగడం ప్రజలకు మహారాజుల పూజలు అందుకొన్న మహాదేవుని పట్ల గల అపార భక్తిభావాలకు నిదర్శనం. 


రాజగోపురం, ప్రహరీ మరియు విమాన గోపురం లేకుండా  నగారా శైలిలో తూర్పు ముఖంగా నిర్మించిన  ఈ చిన్న ఆలయం నాలుగు మంచినీటి చెరువుల మధ్య ఉంటుంది. అన్నీ కూడా నేటికీ స్థానిక ప్రజల నీటి అవసరాలను తీరుస్తున్నాయి అంటే నాటి ప్రభువులు జీవాధారమైన జలానికి ఇచ్చిన ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చును. మరో విషయం ఏమిటంటే నగారా శైలిలో ధ్వజస్థంభం, బలిపీఠాలు ఉండవు. విమానశిఖరాన పెద్ద ధ్వజం ఏర్పాటుచేస్తారు. ఇక్కడ విమాన శిఖరం లేకపోవడాన ధ్వజం కనపడదు. 
ఆరు అడుగుల ఎత్తులో పూర్తిగా ఎఱ్ఱ ఇసుక రాతితో నిర్మించబడిన ప్రధాన ఆలయానికి ఎదురుగా పురాతన నంది మండపం ఉంటుంది. ఆలయ వెలుపలి గోడల మీద ఐదు వరుసలలో ఒక ప్రణాళిక ప్రకారం వివిధ శిల్పాలు చెక్కబడినాయి. అన్నిటికన్నా దిగువన గజాలు వరుస  నిర్మాణ భారాన్నిమొత్తం తామే భరిస్తున్నట్లుగా చెక్కబడినాయి. తరువాత వరుసలో అశ్వాలు, ఎలి, వరహాలు, జింకలు లాంటి జంతువులు, వాటి పైన వేట లేదా యుద్ధ  విన్యాసాలు, పోరాట దృశ్యాలు చెక్కబడినాయి. ఆపై వరుసలో నాట్యగత్తెలు, గాయకులూ మరియు వాయిద్య కారులు మరియు ఉత్సవ సన్నివేశాలు మలచబడినాయి. అన్నిటికన్నా పైన శ్రీ గణపతి, శివ, కాళి, విష్ణు, మహాలక్ష్మి, బ్రహ్మ, వామన, నృసింహ,రాధాకృష్ణ మొదలగు దేవతా రూపాలతో పాటు కొన్ని శృంగార శిల్పాలు కనపడతాయి. 

ప్రధాన ఆలయానికి చేరుకోడానికి ఆరు మెట్లు కలిగిన మార్గం ఉంటుంది. పైన శోభాయమానంగా వినాయక, శివ, మహిషాసుర మర్దని, వేణుగోపాలస్వామి, త్రిపురాంతక శివరూపాలతో పాటు గాయక, నర్తక, వాయిద్యకారుల మరియు చక్కని లతలు, పుష్పాలను చెక్కిన నాలుగు ఏకరాతి స్తంభాల ఆధారంగా నిర్మించిన "నవరంగ మండపం" ఉంటుంది. లోతుగా ఉన్న గర్భాలయానికి రెండు పక్కలా తొలినాటి గణేష రూపాలుంటాయి. అవి నేటి విఘ్ననాయక రూపాలకు పూర్తిగా భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గర్భాలయ ద్వారానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన లతలు ఇతర చెక్కడాలతో పాటు  ద్వారపాలకులు మరియు వారి పరిచారికల శిల్పాలు కనపడతాయి. 
నాలుగు అడుగుల లోతులో ఉండే గర్భగృహంలో నాగాభరణుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. వెనుక ఉన్న గోడలలో శ్రీ పార్వతీ దేవి, శ్రీ ఆంజనేయుడు విగ్రహరూపంలో కనపడతారు. పూజారులు ఉండరు. భక్తులే నేరుగా అభిషేకాలు, అలంకరణలు ఆరగింపులు జరుపుకొనవచ్చును. 
ప్రతి నిత్యం ఎందరో భక్తులు మహాదేవుని దర్శనార్ధం వస్తుంటారు. శ్రావణ, మార్గశిర మరియు కార్తీక మాసాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రికి మూడురోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆలయానికి ఉత్తరాన చిన్న పుష్కరణి ఉంటుంది. ప్రాంగణంలో ఉన్న పెద్ద వటవృక్షం క్రింద త్రవ్వకాలలో లభించిన మూర్తులను ఉంచారు. 
కాలప్రభావానికి నిలిచి నాటి విశేషాలను నేటి తరాలకు పరిచయం చేసే దేవబలోద మహాదేవ మందిరం చక్కని పచ్చని పరిశుభ్ర వాతావరణంతో ఒక శలవు రోజును కుటుంబ మరియు సన్నిహితులతో గడపడానికి అనువుగా ఉంటుంది.  

నమః శివాయ !!!!

Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...