24, డిసెంబర్ 2018, సోమవారం

Mahadeva Mandir, Devabaloda


                      మహారాజులు కొలిచిన  మహాదేవుడు 



భారత దేశాన్ని సుదీర్ఘ కాలం ఎన్నో రాజ వంశాలు పాలించాయి. గుప్తులు, మౌర్యులు, చోళులు, పల్లవులు, చేర, పాండ్య,చాళుక్య, విజయనగర,రెడ్డి, కాకతీయ,శాతవాహనులు,నాయక,మరాఠా, గజపతులు  ఇలా ఎందరో !
వీరంతా హిందూ ధర్మ స్థాపనకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పెక్కు చర్యలు చేపట్టారు. వాటిల్లో ముఖ్యమైనది ఆలయ నిర్మాణాలు. వీరంతా అపురూపమైన దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. నాటి సమాజంలోని అన్ని వర్గాలవారు, పండిత పామరులు ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆరాధన విధానాలు, పురాణాల గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. దానివలననే నేటికీ మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి. 




    








అదే విధంగా ఈ పాలకులంతా వివిధ కాలాలకు చెందినవారు.  అయినా ప్రతి ఒక్క రాజ వంశం తమకంటూ ఒక రాజ చిహ్నాన్ని, ధ్వజాన్ని, కులదైవాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. తమ ఆరాధ్య దైవానికి నిర్మించిన ఆలయాలలో తమ రాజ చిహ్నానికి, ధ్వజానికి  తగిన ప్రాధాన్యతను శిలారూపాలలో కలిగించారు. తమ వంశ ప్రవరను, తమ బిరుదులను శిలాశాసనాలలో పొందు పరిచారు.
ఉత్తరభారత దేశ చరిత్ర పుటలలో ప్రముఖంగా పేర్కొనబడిన రాజవంశం "కాల చూరి". వీరినే "హేహేయులు" అని కూడా అంటారు. నేటి మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలోని అత్యధిక ప్రాంతాలను పాలించారు. వీరి రాజధాని నర్మదా నదీ తీరంలోని మాహీష్మతీ. వీరు కార్తవీర్యార్జనుని వారసులని అంటారు. ఈ వంశరాజుల ప్రస్థాపన రామాయణ, మహా భారతాలలో ఉన్నట్లుగా తెలియవస్తోంది. క్రీస్తుశకం ఆరు నుండి ఏడో శతాబ్ద కాలానికి చెందిన తొలినాటి కాలచూరి రాజులుగా ప్రసిద్ధి పొందినవారు "కృష్ణరాజు, శంకరగణ మరియు బుధరాజు". వీరు ముగ్గురూ తండ్రి, కుమారుడు మరియు మనుమడు. బుధరాజు కాలంలో చాళుక్య పాలకులైన మంగలేష మరియు రెండవ పులకేశి జరిపిన నిరంతర దాడులతో విచ్చిన్నమై పోయినది. తదనంతర కాలం లో  కాల చూరి రాజులు చిన్నచిన్న రాజ్యాలకు పరిమితమయ్యారు. కొందరు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ రాజ్యాలను స్థాపించుకొన్నట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారిలో నేటి కేరళ లోని కన్నూరు మరియు వేనాడ్ ప్రాంతాలను పాలించిన "మూషిక వంశీయులు " ఒకరు అని అంటారు. 















కాలచూరి వంశీయులు శివారాధకులు. వీరిలో అనేకులు "పరమ మహేశ్వర" అన్న బిరుదు కలిగి ఉన్నారు. వీరి పాలనాకాలంలో కైలాసనాధునికి పెక్కు విశిష్ట నిర్మాణాలను కట్టించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అజంతా మరియు ఎల్లోరా గుహలలో ఆలయాలు, నిర్మాణాలను కట్టించింది హేహేయులే. వాటిల్లో కూడా అధిక శాతం శివలీలా శిల్పాలు కనపడటం వీరి శివ భక్తికి నిదర్శనం. 
తొలినాటి కాలచూరి రాజైన కృష్ణరాజు కాలం( 6వ శతాబ్దం)లో నిర్మించబడి తదనంతరం వారి వారసుల కాలం (13వ శతాబ్దం)లో మరింత అభివృద్ధి చేయబడిన  ఒక శివాలయం నేటి ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ కు సమీపంలోని "దేవ బలోద" గ్రామంలో కనిపిస్తుంది.  
రాయపూర్ నుండి పారిశ్రామిక నగరంగా పేరొందిన భిలాయ్ కి వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ గ్రామం. చరోదా అన్న ఊరిలో దిగితే అక్కడికి దేవబలోద మూడు కిలోమీటర్ల దూరం. 
ప్రస్తుతం పురావస్తుశాఖవారి అధీనంలో ఉన్న ఆలయం నేటికీ చెక్కుచెదరక పోవడం ఒక విశేషం కాగా నిత్య పూజలు జరగడం ప్రజలకు మహారాజుల పూజలు అందుకొన్న మహాదేవుని పట్ల గల అపార భక్తిభావాలకు నిదర్శనం. 














రాజగోపురం, ప్రహరీ మరియు విమాన గోపురం లేకుండా  నగారా శైలిలో తూర్పు ముఖంగా నిర్మించిన  ఈ చిన్న ఆలయం నాలుగు మంచినీటి చెరువుల మధ్య ఉంటుంది. అన్నీ కూడా నేటికీ స్థానిక ప్రజల నీటి అవసరాలను తీరుస్తున్నాయి అంటే నాటి ప్రభువులు జీవాధారమైన జలానికి ఇచ్చిన ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చును. మరో విషయం ఏమిటంటే నగారా శైలిలో ధ్వజస్థంభం, బలిపీఠాలు ఉండవు. విమానశిఖరాన పెద్ద ధ్వజం ఏర్పాటుచేస్తారు. ఇక్కడ విమాన శిఖరం లేకపోవడాన ధ్వజం కనపడదు. 
ఆరు అడుగుల ఎత్తులో పూర్తిగా ఎఱ్ఱ ఇసుక రాతితో నిర్మించబడిన ప్రధాన ఆలయానికి ఎదురుగా పురాతన నంది మండపం ఉంటుంది. ఆలయ వెలుపలి గోడల మీద ఐదు వరుసలలో ఒక ప్రణాళిక ప్రకారం వివిధ శిల్పాలు చెక్కబడినాయి. అన్నిటికన్నా దిగువన గజాలు వరుస  నిర్మాణ భారాన్నిమొత్తం తామే భరిస్తున్నట్లుగా చెక్కబడినాయి. తరువాత వరుసలో అశ్వాలు, ఎలి, వరహాలు, జింకలు లాంటి జంతువులు, వాటి పైన వేట లేదా యుద్ధ  విన్యాసాలు, పోరాట దృశ్యాలు చెక్కబడినాయి. ఆపై వరుసలో నాట్యగత్తెలు, గాయకులూ మరియు వాయిద్య కారులు మరియు ఉత్సవ సన్నివేశాలు మలచబడినాయి. అన్నిటికన్నా పైన శ్రీ గణపతి, శివ, కాళి, విష్ణు, మహాలక్ష్మి, బ్రహ్మ, వామన, నృసింహ,రాధాకృష్ణ మొదలగు దేవతా రూపాలతో పాటు కొన్ని శృంగార శిల్పాలు కనపడతాయి. 

















ప్రధాన ఆలయానికి చేరుకోడానికి ఆరు మెట్లు కలిగిన మార్గం ఉంటుంది. పైన శోభాయమానంగా వినాయక, శివ, మహిషాసుర మర్దని, వేణుగోపాలస్వామి, త్రిపురాంతక శివరూపాలతో పాటు గాయక, నర్తక, వాయిద్యకారుల మరియు చక్కని లతలు, పుష్పాలను చెక్కిన నాలుగు ఏకరాతి స్తంభాల ఆధారంగా నిర్మించిన "నవరంగ మండపం" ఉంటుంది. లోతుగా ఉన్న గర్భాలయానికి రెండు పక్కలా తొలినాటి గణేష రూపాలుంటాయి. అవి నేటి విఘ్ననాయక రూపాలకు పూర్తిగా భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గర్భాలయ ద్వారానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన లతలు ఇతర చెక్కడాలతో పాటు  ద్వారపాలకులు మరియు వారి పరిచారికల శిల్పాలు కనపడతాయి. 
నాలుగు అడుగుల లోతులో ఉండే గర్భగృహంలో నాగాభరణుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. వెనుక ఉన్న గోడలలో శ్రీ పార్వతీ దేవి, శ్రీ ఆంజనేయుడు విగ్రహరూపంలో కనపడతారు. పూజారులు ఉండరు. భక్తులే నేరుగా అభిషేకాలు, అలంకరణలు ఆరగింపులు జరుపుకొనవచ్చును. 








































ప్రతి నిత్యం ఎందరో భక్తులు మహాదేవుని దర్శనార్ధం వస్తుంటారు. శ్రావణ, మార్గశిర మరియు కార్తీక మాసాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రికి మూడురోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆలయానికి ఉత్తరాన చిన్న పుష్కరణి ఉంటుంది. ప్రాంగణంలో ఉన్న పెద్ద వటవృక్షం క్రింద త్రవ్వకాలలో లభించిన మూర్తులను ఉంచారు. 
కాలప్రభావానికి నిలిచి నాటి విశేషాలను నేటి తరాలకు పరిచయం చేసే దేవబలోద మహాదేవ మందిరం చక్కని పచ్చని పరిశుభ్ర వాతావరణంతో ఒక శలవు రోజును కుటుంబ మరియు సన్నిహితులతో గడపడానికి అనువుగా ఉంటుంది.  

నమః శివాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...