18, డిసెంబర్ 2016, ఆదివారం

Tiruttani


            శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తణి 

తమిళనాడులో ఆదిదంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధికం. ప్రతి శివ, శక్తి, గణపతి ఉప దేవతగా మరియు మరెన్నో ఆలయాలలో ప్రధాన అర్చా మూర్తిగా సేవలందుకొంటున్నారు షణ్ముఖుడు. 
అలాంటి వాటిల్లో ఆరు పాడై వీడు ఆలయాలు ముఖ్యమైనవి. అవి పళని, స్వామిమలై,  తిరుప్పరం కుండ్రం, పళముదిర్చోళై, తిరుత్తణి మరియు తిరుచ్చెందూర్.
గమనించదగిన అంశం ఏమిటంటే మొదటి అయిదు ఆలయాలు పర్వతాల మీద నెలకొని ఉండగా, ఆఖరిదైన తిరుచ్చెందూర్ మాత్రం సముద్ర తీరాన ఉండటం. ఒకప్పుడు ఇక్కడ కూడా పర్వతం ఉండేదట. సముద్ర అలల తాకిడికి కరిగిపోయింది అని చెబుతారు. ఆలయ అంతర్భాగంలో ఆ కొండా తాలూకు చిన్న భాగాన్ని చూడవచ్చును.  
సుబ్రహ్మణ్య షష్టి లాంటి విశేష పర్వదినాలలోనే కాకుండా  ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు ఈ ఆలయాలకు తరలి వస్తుంటారు.
ఈ ఆరు ఆలయాలు  తమవైన పురాణ, చారిత్రక నేపధ్యం కలిగి ఉంటాయి. 







ఆరు పాడై వీడు ఆలయాల వరుసలో ఐదవది అయిన తిరుత్తణి ఆలయానికి సంబంధించిన పురాణగాథ తొలి యుగానికి చెందినది. ఈ వివరాలు  సంగమ కాలానికి చెందిన తమిళ గ్రంధాలైన  " తిరుమురుగ తిరుప్పాది"  మరియు "తణికై పురాణం"లలో సవివరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే కాలానికి చెందిన ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు అయిన శ్రీ అరుణగిరినాథర్ తన  ఆరాధ్య దైవాన్ని కీర్తిస్తూ ఎన్నో  గీతాలను గానం చేశారు. అసురుని సంహరించిన సమయంలో కలిగిన ఆగ్రహాన్ని శ్రీ కుమారస్వామి ఇక్కడ వదిలేశారట. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని తొలుత "తిరుతణికై"
అని పిలిచేవారట. కాలక్రమంలో అది "తిరుత్తణి" గా మారింది అంటారు. 
తిరుచెందూర్ లో అసురుడైన సూరపద్ముని సంహరించిన తరువాత షణ్ముఖుడు ఈ ప్రాంతానికి వచ్చి సేదతీరారట.కురువ వంశానికి చెందిన గిరిజనుల నాయకుడు నంబిరాజన్. అతనికి అడవిలో లభించిన వల్లీ దేవిని ఇక్కడే శ్రీ సుబ్రమణ్య స్వామి వివాహ మాడారు అని చెబుతారు.
కళ్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి. అవివాహితులు వివాహం కావలెనని, సంతానం లేని వారు సత్సంతానం కోరుకుంటారు ఇక్కడ.






తారకాసురునితో జరిగిన యుద్ధంలో కుమారుని ఛాతి భాగంలో లోతైన గాయం అయ్యినదట. స్వామి వారి పెద్ద భార్య దేవసేన తండ్రి దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు ఒక గంధపు చెట్టు తాలూకు భాగాన్ని అరగదీయడానికి కావలసిన రాతిని ఇచ్చి గంధం తీసి గాయం మీద రాయమన్నారట. నేటికీ కోవెలలో గంధం తీసే రాయి ఇంద్రుడు ఇచ్చినదిగా పరిగణిస్తారు.
అదే విధంగా మూలవిరాట్టుకు అలంకరించే చందనంలో అద్భుత ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. దానినే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. 
ఇలా ఎన్నో గాధలు ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి.





చిన్న కొండ మీద ఈ ఆలయాన్ని తొలుత ఎవరు నిర్మించారో తెలియదు గానీ ప్రస్తుత నిర్మాణాలను తొమ్మిదో శతాబ్దాల ప్రాంతాలలో పల్లవ రాజులు నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలియ వస్తోంది. వారి తరువాత చోళులు, విజయనగర మరియు ఇతర రాజ వంశాలు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది.




ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత గమనించవలసి ఉన్నది. సహజంగా వాహన మూర్తులు మూలవిరాట్టుకు అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామి వారి వాహనాలైన మయూరం మరియు ఐరావతము రెండూ వ్యతిరేక దిశగా అంటే తూర్పు ముఖం వైపు తిరిగి ఉంటాయి.
దీని గురించి ఒక గాథ స్థానికంగా ప్రచారంలో ఉన్నది.
అల్లుడికి వివాహ కానుకగా లెక్కలేనన్ని కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా ఇచ్చేశాడట దేవేంద్రుడు. ఆయన వైభవానికి కారణమైన తెల్ల ఏనుగు దేవలోకాన్ని వదిలి వెళ్లడంతో ఇంద్రుడు తన సంపదలను కోల్పోవడం ప్రారంభమైనది. మామగారి పరిస్థితి తెలుసుకొన్న షణ్ముఖుడు ఐరావతాన్ని అమరావతి వైపుకు తిరిగి ఉండమన్నారట. దానితో స్వర్గాధిపతి పరిస్థితి స్థిరపడింది.





ప్రతి నిత్యం ఎన్నో పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు అర్చనలు స్వామికి జరుగుతున్నా అన్నిటిలోనికి ముఖ్యమైనది ఆడి కృతిక. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్వయంగా  దేవేంద్రుడు ఆరంభరించినట్లుగా చెబుతారు. ఐరావతాన్ని తన లోకం వైపు చూసేలా చేసి తనకు పూర్వస్థితి దక్కేలా చేశారు అన్నకృతజ్ఞతతో ఇంద్రుడు కలువ పూలతో అర్చించారట.అందుకే ఈ ఉత్సవాల సందర్భంగా  ఈ పూలతో అర్చన, అలంకరణ చేస్తారు. కావడి ధరించి భక్తులు వేలాదిగా తరలివస్తారు. పర్వత పాదాల వద్ద ఉన్న శరవణ పుష్కరణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.







ఎన్నో ఉపాలయాలతో అలరారే ఈ ఆలయంలో ప్రధాన అర్చనా మూర్తికి ఇరువైపులా దేవేరులైన శ్రీ వల్లీ మరియు దేవసేన కొలువుతీరి ఉంటారు. రాత్రి పూట  చేసే పల్లకీ సేవలో ఒకరోజు శ్రీ వల్లీ దేవితో మరో రోజు దేవసేన దేవితో స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
అదేవిధంగా చైత్ర మాసంలో దేవసేనతో , మాఘ మాసంలో శ్రీ వల్లీతో స్వామి వారి  వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.







పర్వత పైభాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. మెట్ల మార్గంలో సంవత్సరం లోని రోజులకు నిదర్శనంగా మూడువందల అరవై అయిదు మెట్లు ఉండటం విశేషం. ప్రతి ఆంగ్ల సంవత్సరాది అయిన జనవరి ఒకటో తారీఖున అన్నిమెట్లను కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వేలాదిగా స్త్రీలు ఈ పడి పూజలో పాల్గొంటారు.











ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు గంటలవరకూ తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుందీ ఆలయం !
దేవస్థానము ఆధ్వర్యంలో వసతి సౌకర్యం మరియు ఉచిత అన్నదాన సదుపాయం భక్తులకు లభిస్తాయి.














పర్వతం పైనుండి చూస్తే చక్కని ప్రకృతి కనిపిస్తుంది. చల్లని గాలి ఆధ్యాత్మిక సౌరభాన్ని తీసుకొని వస్తుంది. ఇవన్నీ మనస్సును ఆహ్లాదపరుస్తాయి. చంచలమైన మదిని అదుపుచేస్తాయి.
తిరుపతికి అరవై ఆరు కిలోమీటర్ల దూరం, చెన్నై నుండి అరక్కోణం నుండి, కాట్పాడి నుండి కూడా బస్సు రైలు మార్గాలలో సులభంగా తిరుత్తణి చేరుకోవచ్చును. వేలాదిగా తెలుగు భక్తులు వస్తుండటం, మన రాష్ట్ర సరిహద్దులలో ఉండటం వలన తెలుగు భాష మాట్లాడేవారు అధికంగా కనపడతారు. అదే విధంగా దేవాలయంలో అన్ని చోట్ల తెలుగులో భక్తులకు సూచనలు రాసి ఉంచడం ఆనందదాయకం. 

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...