1, మే 2024, బుధవారం

Narmada Pushkaraalu

 

                                     నర్మదా పుష్కరాలు 




సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావించడం జరుగుతోంది. మన పురాణాలు కూడా అదే విషయాన్ని విపులంగా తెలిపాయి.  
నింగి, నేల, నీరు, గాలి మరియు నిప్పు అన్నీ దైవస్వరూపాలే !
అలా భావించడానికి తగిన కారణాలను మన పురాణాలు సోదాహరంగా వివరించాయి. 
పంచ భూతాలు ప్రతి ఒక్కటీ మానవ జీవితాలకు తప్పనిసరి. జీవనాధారం. ఒకటి ఉండి మరొకటి లేకపోతే జీవనయానం ఆగిపోతుంది. అంతటి విలువైనవి కనుకనే ప్రతి ఒక్కదానిని గౌరవించడం,  పూజించడం, కృతజ్ఞతా భావంతో ఉండటం అవసరమని పెద్దలు తెలిపారు. అలా జరగడం వలననే ఇన్ని యుగాలు, తరాల తరువాత కూడా మనందరం కొంతవరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. 
ఈ పంచ భూతాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి. 
ఆకాశంలోని మేఘాల వలన కురిసిన వానలతో భూమి పులకించి చక్కని పంటలు అందిస్తుంది. పచ్చని చేల మీదగా, చెట్ల మీదగా వీచే గాలి ప్రాణవాయువు ఆహ్లదకరం. జీవనావసరం. పండిన పంటలను రుచికరమైన వంటకాలుగా అందిస్తుంది అగ్ని. 
ముఖ్యంగా జలం జీవం ! సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీటి తరువాతనే పుడమిని జీవరాశి ఆవిర్భవించింది. జలప్రవాహాల పక్కన జీవనం సాగించడం మొదలైనది. మానవ జీవితాలలో ప్రతి ఒక్కటీ నీటితో ముడి పడి ఉన్నాయి. అందుకే నదీమతల్లులు అని గౌరవిస్తూ వాటిల్లో చేసే తీర్ధ స్నానాలు, మంగళ స్నానాలు పుణ్యప్రదమని భావిస్తుంది హిందూ సమాజం.  
ఇంతటి ప్రాముఖ్యం కలిగిన నీరు మనకు ఎలా లభిస్తోంది ?
నదుల ద్వారా ! అందుకే వాటిని నదీమతల్లులు అని పిలుస్తాము. నది అనగా సహజమైన జల ప్రవాహం. హిమాలయాలలో పుట్టినవి కొన్ని అయితే , మరికొన్ని ఎత్తైన పర్వతాలలో జన్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. 
మన దేశంలో వేల నదులు ఉన్నాయి. వీటిలొ నిరంతరం నీటిని అందించేవాటిని జీవ నదులు అన్నాము. అవి గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమ, తపతి, తుంగభద్ర సింధు మరియు ప్రాణహిత.  
 నదులను గౌరవించడానికి హిందువులు ఎంచుకొన్న మరో గొప్ప విధానం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో నదికి గౌరవసూచకంగా పుష్కరాలను జరపడం. బృహస్పతి  సంవత్సరానికి ఒక రాశిలోనికి ప్రవేశించినప్పుడు  ఒక్కో నదికి ఆ సంవత్సరం పుష్కరంగా నిర్ణయిస్తారు. దీని వెనుక ఒక పురాణ గాథ వినపడుతుంది. 

పుష్కరుడు 

ప్రజలు పుణ్య స్నానాలు, తీర్ధ స్నానాల పేరిట పవిత్ర నదులలో స్నానం చేసి  పాపాలను వదిలించుకోవడం వలన అవి ఆ పావన నదీమ తల్లులకు సంక్రమించి ఇబ్బందులు పెడుతున్నాయట. వారి ఇక్కట్లను గమనించిన "తుందిలుడు" అనే ఈశ్వర భక్తుడు స్వామిని గూర్చి తీవ్ర తపమాచరించాడట. భక్త సులభుడైన పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు ఈశ్వరునిలో శాశ్విత స్థానం అనుగ్రహించామన్నాడట. అలా ఈశ్వర అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్విత్త్వం పొందాడట. ఆకారణంగా అతను పుడమిలోని కోట్లాది పుణ్యతీర్ధాలకు అధిపతిగా మారి సకల జీవరాశిని పోషించే శక్తి లభించినది. 






సంస్కృతంలో "పుష్కర" అంటే "పోషించే శక్తి" అని అర్ధం చెబుతారు. అలా తుందిలుడు పుష్కరునిగా పిలబడుతున్నాడు. బృహస్పతి ఒక్కో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో పుష్కరుడు కూడా ఒక  నదిలో ప్రవేశిస్తాడు అని వాయు పురాణం చెబుతోంది. 
పుష్కరకాలం ప్రతి నదికి ఒక సంవత్సరం ఉంటుంది. పుష్కరుడు నదిలో ప్రవేశించే సమయాన్ని ఆది పుష్కారాలు అని, పుష్కరుడు నది నుంచి నిష్క్రమించే సమయాన్ని అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. 
నదులకు కాకుండా పుష్కరణులకు కూడా పుష్కరాలు జరుగుతాయి. అలాంటి కోనేరులు భరత దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ లోని పుష్కర సరస్సు. ఈ సరస్సు ఒడ్డున ప్రఖ్యాతమైన శ్రీ బ్రహ్మ ఆలయం ఉన్నది. రెండవ కోనేరు ఆలయాల నగరంగా కీర్తించబడే కుంభకోణం లోని "మహామహం". తమిళనాడులోని కుంబకోణంలోనూ చుట్టుపక్కలా అనేక పురాతన ఆలయాలు కలవు. 
గత సంవత్సరం పుష్కరుడు బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగానదిలో ప్రవేశించాడు. ఈ సంవత్సరం వృషభరాశిలోనికి బృహస్పతి మారుతున్న సమయంలో పుష్కరుడు నర్మదా నదిలో ప్రవేశిస్తాడు.ఇలా ప్రతిసంవత్సరం ఉన్న పన్నెండు జీవ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. 




నర్మదా నది 

నర్మద అనగా ఆహ్లాదం కలిగించేది అని అర్ధం. మన భారతదేశంలోని అతి పెద్ద నదులలో అయిదవ స్థానంలో ఉన్న నర్మద నిజంగా పేరుకు తగినట్లుగా ఆహ్లాదాన్నిఅందించేదే !
మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ వద్ద మూడువేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఆరంభమయ్యే నర్మదా నది ప్రవాహ ప్రస్తానం కొండలు, లోయలు, అడవులు, జన పదాల గుండా సుమారు పదమూడు వందల కిలోమీటర్ల దూరం సాగి చివరకు గుజరాత్ రాష్ట్రం బారూచ్ జిల్లాలోని  "గల్ఫ్ ఆఫ్ ఖంబట్" వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. 
ఎన్నో ప్రత్యేకతలు నర్మద సొంతం. నదీ తీరంలో లభించిన అనేక జీవుల శిలాజాల వలన ఇక్కడ వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే జీవులు నివశించేవని తెలుస్తోంది. నర్మదా నాగరికత ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కినది.  
అమర్ కంటక్ పర్వతాలలో నర్మద పుట్టిన ప్రదేశంలో జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య స్వయంగా  నర్మదా కుండాన్ని నిర్మింపచేశారని చెప్తారు. అసలు నర్మదను పరమేశ్వర పుత్రిక   ఆయన స్వేదం నుండి  ఉద్భవించినది అని పురాణాలు తెలుపుతున్నాయి. నర్మదా నదిలో లభించే "బాణ లింగాలు" పరమ పవిత్రమైనవిగాను, పూజనీయమైనవిగాను భావిస్తారు. 

పురాణగాథ  

 చంద్ర వంశ రాజైన పురూరవుడు తెలియక చేసిన పాపం వెంటాడసాగిందట. దాని బారి నుండి ఎలా బయటపడాలి అని పండితులను అర్ధించారట. వారి సలహా మేరకు గంగాధరుని గురించి తపస్సు చేసి సాక్షాత్కారం పొందారట. దివిన ఉన్న నర్మదను భువికి పంపితే పావన ప్రవాహంలో  పాపపంకిలమైన దేహాన్ని, మనస్సును శుద్ధి చేసుకొని పుణ్యలోకాలకు వెళ్లే అవకాశాన్ని పొందగలను అని సెలవిచ్చారట పురూరవుడు. 
అంగీకరించిన పరమేశ్వరుడు కానీ ప్రవాహ వేగాన్ని నిలువరించేది ఎవరు ? అని ప్రశ్నించారట. అప్పుడు పురూరవుడు తన మిత్రుడైన వింధ్యుని సంప్రదించగా పర్వతరాజు తన కుమారుడైన అమర్ కంటక్ దివి నుంచి భువికి తరలివచ్చే నర్మద వేగాన్ని నిలువరించగలడని హామీ ఇచ్చారట. 
ఆ ప్రకారం నేలకు వచ్చిన నర్మద కొన్ని లక్షల ఎకరాల భూమిని సాగుయోగ్యం చేస్తూ, కొన్ని కోట్ల మంది దాహార్తిని తీరుస్తోంది.




 

నర్మద ప్రవాహమార్గం 

భారతదేశంలో చాలా మటుకు నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ మూడు నదులు మాత్రమే తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తాయి. అవి నర్మద, తపతి మరియు మహి నదులు. వీటిల్లో అతి పవిత్రమైనది నర్మద. 
నర్మద తన ప్రవాహమార్గంలో తొలి భాగాన్ని పూర్తిగా సాత్పురా శ్రేణులలో మాండ్ల పర్వతాల మీద ప్రవహిస్తుంది. జబల్పూర్ దగ్గర పాలరాతి పర్వతాల మధ్య తన మలి ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 
అక్కడ నుండి సాగుతూ నర్మదలోయ నుండి మైదాన ప్రాంతాలకు చేరుకొంటుంది. ఈ గమనంలో సుమారు నలభై రెండు ఉపనదులు నర్మదలో కలుస్తాయి. 
మానవ అవసరాల నిమిత్తం ఎన్నో నీటి పారుదల నియంత్రణ నిర్మాణాలు నర్మద మీద నిర్మించడం జరిగింది. ముఖ్యమైనవి మహేశ్వర్ ఆనకట్ట, ఇందిరాసాగర్ ఆనకట్ట మరియు సర్దార్ సరోవర్ ఆనకట్ట. 

నర్మదా పరిక్రమ 

పరిక్రమ అనగా ప్రదక్షిణ. సహజంగా ప్రదక్షిణ ఆలయాలలో, గోవులకు, దేవతా వృక్షాలకు మరియు అరుణాచలం లాంటి పవిత్ర పర్వతాలకు చేస్తుంటారు. కానీ ఒక నదికి చేయడం అన్నది ఒక్క నర్మద విషయంలోనే వింటాము. 
కొన్ని వందల పవిత్ర నదులున్న మన దేశంలో ఒక్క నర్మద గురించి స్కాంద పురాణం ప్రత్యేకంగా "రేవా కాండం" లో సంపూర్ణంగా వివరిస్తుంది. నర్మదకు ఉన్న మరో పేరు "రేవా". 
నర్మద ఉత్తర మరియు దక్షిణ తీరాలను కలిపితే రెండు వేల ఆరువందల  కిలోమీటర్ల పైచిలుకు మార్గం. నది సముద్రంలో కలిసే బారూచ్ నుండి ప్రారంభించి ఉత్తర తీరంగా ప్రయాణించి నది ఉద్భవించిన అమర్ కంటక్ చేరుకొని తిరిగి దక్షిణ తీరంగా సాగి బారూచ్ చేరుకోవడంతో నర్మదా పరిక్రమ పూర్తి అవుతుంది. ఇదే విధంగా అమర్ కంటక్ నుంచి కూడా ప్రారంభిచవచ్చును. ఎటు నుంచి ప్రదక్షిణ చేసినా కుడి వైపున నది ఉండేలా చూసుకోవాలి. నర్మద పూర్తి పరిక్రమ చెయ్యడానికి మూడు సంవత్సరాల, మూడు నెలల పదమూడు రోజులు పడుతుంది. ఈ ఈ పరిక్రమను "ముండమల్ పరిక్రమ" అని పిలుస్తారు. పూర్తి నర్మద పరిక్రమ నదీమతల్లికి వేసే పూలహారంలాంటిది. సహజంగా చాతుర్మాసంలో పరిక్రమ చేసే సాధుసంతులు  ఒక చోట ఉండిపోతారు. 
ఈ పరిక్రమ సరదాకోసమో లేక సాహసయాత్ర గా భావించి చేయరు. నర్మద పరమ పవిత్రమైనది. ప్రత్యక్ష దేవత నర్మద. నది నీరు పరిక్రమవాసి శరీరాన్ని మరియు మనస్సును శుభ్రం చేస్తుంది. ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తుంది. అహాన్ని తొలగిస్తుంది. నిరాపేక్ష జీవితం జీవించేలా చేస్తుంది. ఎందుకంటే పరిక్రమవాసులు ధనాన్ని తీసుకొని వెళ్ళరాదు. అదే విధంగా ఈ రోజు నిత్యజీవన అవసరాలైన మొబైల్ ఫోన్స్ లాంటివి ఉపయోగించకూడదు. ఎక్కడ ఎవరు బిక్ష ఇస్తే దానిని స్వీకరించాలి. లభించక పోతే నిరాహారంగా ఉండాలి. ప్రతి నిత్యం నర్మద లో రెండు పూటలా సంధ్యా సమయంలో స్నానమాచరించి నదికి పూజచేయాలి. ఒకవేళ మార్గంలో నదికి దూరంగా వెళ్ళవలసి వస్తే ఒక సీసాలో నీటిని దగ్గర ఉంచుకొని ఆ నీటికి పూజ చేయాలి. పరిక్రమ కాలంలో పరిక్రమవాసి పూర్తిగా సన్యాస లేదా వానప్రస్థ జీవితం గడపాలి. 
అమర్ కంటక్ లేదా బారూచ్ దగ్గర కానీ ప్రారంభించాలి. నర్మదా నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ పూజలలో "మాకి కడాయి" అంటే అమ్మవారి పెనం అని అర్ధం. దీనిలో తీపి హల్వా వండి నదికి నివేదన చేసి ప్రసాదాన్ని తానూ తీసుకొని తోటివారికి పెట్టాలి. 
పరిపూర్ణ విశ్వాసంతో భక్తి భావంతో నర్మద పరిక్రమ చేసినవారు నిత్య జీవితంలో మరియు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుత విజయాలను సొంతం చేసుకొన్నారు అని తెలుస్తోంది. 
గతంలో పూర్తి నర్మదా పరిక్రమ మాత్రమే చేసేవారు. ప్రస్తుతం వివిధ కారణాల వలన నర్మదా ఉత్తర వాహిని పరిక్రమ, నర్మదా పంచక్రోశి పరిక్రమ కూడా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా రెండు రకాల పరాక్రమ నిర్వహిస్తున్నారు. ఒకటి జబల్పూర్ నుండి ప్రారంభం అవుతుంది. ఈ పరిక్రమ  ముందుగా అమర్ కంటక్ వెళ్లి అక్కడి ఆలయాలను సందర్శించుకొని ఉజ్జయిని మీదగా ఓంకారేశ్వర మరియు మహేశ్వర్ సందర్శించుకొని తిరిగి జబల్పూర్. రెండవది ఇండోర్ లేదా భోపాల్ నుండి పార్రంభం అవుతుంది. ఈ పరిక్రమలో ఓంకారేశ్వర్ , మహేశ్వర్, ఉజ్జయిని మీదుగా అమర్ కంటక్  చేరి తిరిగి ఓంకారేశ్వర్ వరకు వెళ్లి ముగిస్తారు. ఈ పరిక్రమ చెయ్యడానికి పదిహేను రోజులు పడుతుంది. పంచక్రోశి యాత్ర సుమారు అయిదు రోజులలో పూర్తి అవుతుంది. ఇంకా కొన్ని రకాల పరిక్రమల గురించి కూడా పెద్దలు తెలుపుతున్నారు.  
ఆ విషయాలు తెలుసుకొందాము. 
నర్మదా పరిక్రమ మార్గంలో అడవులు,గుట్టలు,కొండలు,పల్లెలు, సరస్సులు, ఆలయాలు ఇలా ఎన్నోవస్తాయి. మార్గంలో ఎందరో సాధుసంతులను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. 
జలహారి పరిక్రమలో పరిక్రమవాసి ఎట్టి పరిస్థితులలో నదిని దాటరు. ఒక తీరంలోనే రెండుసార్లు నడుస్తారు. అంటే మాములుగా నడిచే దూరానికి రెండింతలు. 
దండావత్ పరిక్రమ మనము అడుగు దండాలు అని అంటూ ఉంటాము కదా ! అలాంటిదే ఈ పరిక్రమ. దీనిలో రోజుకు వెయ్యి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. దీనిని ఎక్కువగా సాధువులు చేస్తుంటారు. పూర్తి చేయడానికి నిర్ణయించిన కాలం కన్నా ఎక్కువపడుతుంది. 
మార్కండేయ పరిక్రమ అని మరొక పరిక్రమ కూడా సాధుసంతులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ పరిక్రమలో నర్మద ఉపనదుల చుట్టూ కూడా చేస్తారు. ఈ పరిక్రమ కూడా ఎక్కువకాలం తీసుకొంటుంది. 
పర్యాటకులు ఎక్కువగా చేసే వాటిలో హనుమాన్ పరిక్రమ అనగా నడిచినంత దూరం నడిచి ఎక్కడ కావాలంటే అక్కడ నదిని దాటి ముగించడం. కొన్ని సంవత్సరాల క్రిందట నర్మదా వాయు పరిక్రమ మరియు జల పరిక్రమ గురించి కొందరు ప్రయోగాలు చేశారు. రానున్న కాలంలో అవి కూడా రావచ్చేమో !



ఆలయాలు 

పరిక్రమ మార్గంలో అనేక పుణ్యక్షేత్రాలు వస్తాయి. సుమారు నాలుగు వందల పైచిలుకు శివాలయాలే ఉన్నాయి అంటే మిగిలిన దేవీ దేవతల ఆలయాలు ఉంటాయో ! వీటిలో ముఖ్యమైన ఆలయాల వివరాలు కూడా తెలుసుకొందాము. 








అమర్ కంటక్ 

 అమర్ కంటక్. తీర్ధ రాజ్ గా ప్రసిద్ధి. నర్మద పుడమిని తాకిన పవిత్ర ప్రదేశం. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం. సమీప "పండ్ర" వరకు రైలు మరియు బస్సు సౌకర్యాలు లభిస్తాయి. వసతి సౌకర్యాలు కూడా ! అమర్ కంటక్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.  వాటిల్లో పురాతనమైనవి కాల్చురీ రాజవంశం వారు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన నర్మదా ఉద్గమన మందిరం, శ్రీ నర్మదేశ్వర్ ఆలయం, త్రిమూర్తి ఆలయం, మహామేరు శ్రీ చక్ర (యంత్ర)మందిరం,జోషిల మందిర్, పంచ మఠ్ (అయిదు ఆలయాల సమాహారం), శ్రీ మచేంద్రనాథ్ ఆలయం, శ్రీ కేశవ్ నారాయణ ఆలయం వీటిల్లో కొన్ని. 
మరో విశేష శివ మందిరం శ్రీ పాతాళేశ్వర స్వామి వారిది. 
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు నర్మదా కుండ్ నిర్మించిన తరువాత క్రింద ఒక శివ లింగాన్ని ప్రతిష్టించారట. కాల్చురీ రాజులు పదకొండవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. చక్కని ఆలయంగా ప్రసిద్ధి. వీటిల్లో చాలామటుకు నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.   




ఓంకారేశ్వర్ 

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ప్రసిద్ధ పుణ్యతీర్థ క్షేత్రం. 
నది మధ్యలో ఓం ఆకారంలో ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం నర్మద దక్షిణ తీరంలో ఉన్న శ్రీ మామలేశ్వర్ స్వామి ఆలయం ఉంటాయి. 
కొందరు పూర్తి పరిక్రమ ఇక్కడ నుండి ప్రారంభిస్తారు. మిగిలిన చిన్న చిన్న, అర్ధ, పంచ క్రోశి చేసే చాలా మంది కూడా ఇక్కడి నుండి ప్రారంభం చేస్తారు. వీటిల్లో సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి (అవంతిక) ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన ఉజ్జయిని కూడా వెళతారు. శ్రీ మహాకాళేశ్వర్ కొలువైన ఈ క్షేత్రంలో స్వామికి సమర్పించే భస్మ హారతి మహా ప్రసిద్ధి. 
ఇలా మార్గంలో వచ్చే జబల్పూర్ లాంటి ప్రదేశాలలో కూడా విశేష ఆలయాలు ఉన్నాయి. 
పరిక్రమవాసులకు స్థానికులు అమిత గౌరవం ఇస్తారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మర్యాద పూర్వక ఆహ్వానం పలుకుతారు. 



 

పుష్కర విధులు మరియు దానధర్మాలు 


హిందువులు పుష్కరాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. పుష్కర సమయంలో సమస్త దేవతలు నదిలో ఉంటారు అన్న విశ్వాసంతో పుష్కర స్నానం చేయడం పవిత్రమైనదిగా తలుస్తారు. పుష్కర స్నానం చేయడం వలన ఒకేసారి పన్నెండు పుణ్య నదులలో చేసిన ఫలితం లభిస్తుంది అని స్కాంద పురాణం తెలుపుతోంది. 
బ్రాహ్మణులకు అనేక దానాలు సమర్పించుకొంటారు. స్వర్ణం, రజతం, దానం, ధాన్యం, గోవులు ఇలా ఎన్నో రకాల దానాలు నదీతీరంలో చేస్తారు. 
గతించిన తమ పెద్దలకు, ఆత్మీయులకు పిండ ప్రధానం చేయడం పుష్కర సమయంలో విధాయకంగా భావిస్తారు. 
సుమంగళిగా ఉండాలి అని అనేక మంది పుణ్యస్త్రీలు నదికి వాయినాలు కూడా సమర్పించుకొంటారు. 

పుష్కర స్నానం ఏమిటి ?

నీరు నారాయణ స్వరూపం . పుణ్యనదులలో చేసే స్నానం జన్మజన్మల పాపాన్ని ప్రక్షాళన చేస్తుంది అన్నది పురాణ వాక్యం. 
నీరు మహా శక్తివంతమైనది. ఆ శక్తులు "మేధ్యం మరియు మార్జనం" అని వేదం  తెలుపుతోంది. 
నదిలో స్నానం చేసి మూడు మునకలు వేయడం వలన తెలిసీ తెలియక చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి అన్నది "మేధ్యం".ద్రవ్య శుద్ధికి నీటిని సంప్రోక్షణ చేయడాన్ని"మార్జనం" అంటారు.
అడవులు గుండా ప్రవహించే జీవనది అనేక ఔషధీయ గుణాలు కలిగి ఉంటుంది. నదీస్నానం వలన అనేక  శరీర రుగ్మతలు తొలగిపోతాయని చెబుతారు.  
పుష్కర నదీ జలాన్ని స్వీకరించడం, పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణం తెలుపుతోంది. 
కానీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందించే నదిని కలుషితం చేయకుండా ఉండటం అన్నింటికన్నా గొప్ప విషయం. పుష్కరాల సమయంలో నదీతీరాలలో వదిలిపెట్టే పూజా ద్రవ్యాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, విడిచిపెట్టే బట్టలు తీరాన్ని నదిని ఎంత కలుషితం చేస్తాయో ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొని వాటిని తగ్గించే విధంగా నడుచుకొంటే నదులు, పరిసరాలు మరియు  మనం అందరం కాలుష్యరహిత పుష్కరం చేసుకొన్నవారము అవుతాము. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని, పరిసరాలను అందించేవారం అవుతాము. 
నర్మదా పుష్కరాలు మే నెల ఒకటవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు. 
పుష్కరస్నానాలకు అనువైన ప్రదేశాలు మహేశ్వరం, ఓంకారేశ్వర్ , అమర్ కంటక్, నెంవార్ శ్రీ సిద్దేశ్వర మహాదేవ్ మందిర్, శ్రీ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, భోజపూర్. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.  







నమః శివాయ !!!!



 

 
























 



Penchelakona Temple

          శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పెంచెలకోన 

శ్రీ నృసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువ. 
అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం. తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో చాలా విశేష నృసింహ ఆలయాలు ఉన్నాయి. 
మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక పురాతన శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి.  






ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో స్వామి నడయాడిన క్షేత్రాలుగా పేర్కొనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి అహోబిళం, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అంతర్వేది, మాలకొండ(మాల్యాద్రి), పెంచెలకోన,యాదాద్రి మరియు ధర్మపురి. 
 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన సింహాచలం మరియు స్వామి లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశముగా ప్రఖ్యాతి గాంచిన అహోబిళం వీటిలో మొదటి వరసలో ఉంటాయి. 
ప్రతిఒక్క క్షేత్రం తమవైన పురాణ గాధలు కలిగి ఉండటం విశేషం. 
నారసింహ అవతారంలో స్వామి చెంచు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకొన్న స్థలంగా నెల్లూరు జిల్లాలోని పెంచెలకోన (పెనుశిల) ప్రఖ్యాతి గాంచినది. 







క్షేత్ర గాథ 

చుట్టూ పర్వతాలు. వాటి నుంచి జాలువారే జలపాతాలు. నగర జీవితానికి భిన్నంగా ప్రశాంత వాతావరణం. గతంలో ఈ ప్రదేశం ఋషి వాటిక.  శ్రీ కణ్వ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఈయన ప్రస్తావన అనేక పురాణాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో !  
మేనకా విశ్వమిత్రుల పుత్రిక అయిన శకుంతలను పెంచిన తండ్రిగా కణ్వ మహర్షి ప్రసిద్ధి. శకుంతల కుమారుడైన భరతుని వలననే కదా మన  దేశాన్ని భరతభూమి అన్న పేరు వచ్చిన విషయం మనందరికీ తెలుసు ! కణ్వ మహర్షి శ్రీ నరసింహుని గురించి తపస్సుచేసి స్వామివారి దర్శనాన్ని పొందిన స్థలం ఇదే అని అంటారు. 
ఆలయ ప్రాంగణంలో శ్రీ కణ్వ మహర్షి సన్నిధి కనపడుతుంది. 
అహోబిళంలో అసురరాజు హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత కూడా నారసింహుని నెలకొన్న ఆవేశం తగ్గలేదు. భీకరంగా గర్జిస్తూ నేటి నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఇక్కడికి చేరుకొన్నారట. ఆ సమయంలో అక్కడ స్నేహితురాళ్ళతో కండలేరు తీరాన ఆటలాడుకొంటున్న చెంచుల ఇంటి ఆడపడచు చెంచు లక్ష్మి స్వామి భీకర రూపం చేసి బెదరకుండా సమీపించి శాంతింపచేయడానికి కౌగలించుకొన్నదట. కౌగలించుకోవడానికే ఉన్న మరో పర్యాయ పదం "పెనవేసుకోవడం". ఆ పదం నుండి పుట్టినదే ఈ పెనుశిల. రాయి కన్నా కఠినంగా కనిపించే స్వామిని ఆదరంతో ఆప్యాయంగా హత్తుకొన్న ప్రదేశంగా ఈ పేరు. కాలక్రమంలో పెంచెలకోన గా మారింది. పర్వతాల నడుమ కోన లో ఉన్నందున, చెంచుల రాజ్యం వారి కన్యను అవతార పురుషుడు వారి కట్టుబాట్ల ప్రకారం వివాహం చేసుకున్నందున ఈ పేరు కూడా సమంజసంగానే  కనిపిస్తోంది. 
 కొండల మీద ప్రవహించే కండలేరు ఆలయ వెనుక భాగాన పెద్ద జలపాతంగా మారి నేలకు జాలువారుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా సుందరంగా ఉంటుందా దృశ్హ్యం. 
శాంతించి చెంచు లక్ష్మిని వివాహం చేసుకొని అక్కడ నివసిస్తున్న స్వామివారి వద్దకు మహర్షులు వచ్చి తమకు సమీపంలోని భైరవ కోన లోని అసురులతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపి వారి బాధను తొలగించమని ప్రార్ధించారట. 
భైరవ కోన వెళ్లి స్వామి రాక్షసులను అంతమొందించి వచ్చి ఈ జలపాతంలో స్నానం   ఆచరించారని, తన నరసింహ అవతారాన్ని చాలించారని చెబుతారు.ఈ కారణంగా  భక్తులు ఇక్కడ కండలేరులో స్నానం చేయడం విధాయకంగా భావిస్తారు. తమలోని అసుర గుణాలు, చేసిన పాపాలు  తొలగిపోతాయన్న భావం దీనిలో కనపడుతుంది. 








ఆలయ విశేషాలు 

అనేక ఆలయాల మాదిరి పెనుశిల ఆలయాన్ని కూడా అనేక రాజ వంశాల వారు దర్శించి, అనేక కైకర్యాలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాభిముఖంగా ఉన్న అయిదు అంతస్థుల రాజగోపురం విజయనగర రాజుల నిర్మాణ శైలిలో కనపడుతుంది .కానీ కాలగమనంలో ఆలయం శిథిలావస్థకు చేరుకొన్నది. చుట్టూ చెట్టూ చేమ పెరిగిపోయాయట. 
నిత్యం పశువులను తోలుకొని ఆ ప్రాంతానికి వచ్చే బోయ యువకునికి ఒక వృద్ధుడు కనిపించాడట. నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో ఈయనను ఎప్పుడూ చూడలేదు. ఎవరీ ముసలివాడు ? ఎందుకు ఒంటరిగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడు ? అన్న ఆలోచనతో యువకుడు ఆయన వద్దకు వెళ్లారట. ఆయన ఇక్కడ వెలసిన శ్రీ నృసింహుని సేవించుకోడానికి వచ్చానని తెలిపారట.  అతనికి ఈ  శ్రీ నృసింహ క్షేత్రగాధ తెలిపి గ్రామస్థులకు కూడా తెలియచేయమని చెప్పారట. ఆనందంతో అంగీకరించిన బోయ యువకుడు తిరిగి వెళుతూ వెనక్కి తిరిగి చూడగా ఆ వృద్ధుడు పెద్ద శిలగా మారిపోతూ కనిపించారట. 
అలా తెలియకుండానే స్వామివారిని సందర్శించుకొని మిగిలిన వారికి క్షేత్రం గురించి తెలియచేసిన ఆ గొల్ల బోయ యువకుని శిలా విగ్రహం నేటికీ పెంచెలకోనకు సమీపంలో ఉన్నదని చెబుతారు. 
సముద్ర మట్టానికి మూడువేల అడుగుల ఎత్తులో తూర్పు కనుమలలో ఉన్న ఈ ఆలయం విశాల లోయ నిర్మించబడినది. 
ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవారి సమేతంగా ఏకశిలా రూపంలో రమణీయ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 

ఛాత్రవట  నరసింహుడు 

పెనుశిల నారసింహునికి మరో పేరు ఛాత్రవట నారసింహుడు. స్వామివారి ఆలయం వెనుక కొండలు గొడుగు రూపంలో ఉంటాయి. అదే విధంగా స్వామి భైరవ కోనలో అసురులను సంహరించి తిరిగి వస్తుంటే ఋషులు ఆనందంతో గౌరవసూచకంగా స్వామికి ఛత్రం పట్టారట. ఈ కారణంగా ఈ పేరు వచ్చింది. నేటికీ భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా వెండి మరియు బంగారు గొడుగులు సంవర్పించుకొంటుంటారు. 














క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు 

గమనిస్తే అనేక నరసింహ క్షేత్రాలకు వాయునందనుడు క్షేత్రపాలకునిగా దర్శనమిస్తారు. అదే విధంగా పెనుశిలలో కూడా శ్రీ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. స్వామి వారివి రెండు సన్నిధులు కనిపిస్తుంది. 
ఒకటి స్వయంవ్యక్త మూర్తి. పెద్ద రాతి మీద స్వామి ఒక పక్కకు తిరిగిన రూపంలో సింధూర వర్ణనలో శోభిల్లుతూ దర్శనమిస్తారు. రెండవది ప్రధాన ఆలయ ద్వారానికి ఎదురుగా రామదూత ప్రతిష్టించిన మూర్తి కొలువై ఉంటారు. 
హనుమంత సన్నిధి వెనుక ఆలయ పుష్కరణి కండలేరు పవిత్ర జలంతో నింపబడి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ పావన కోనేరులో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అడవుల గుండా ప్రవహిస్తూ వనమూలికల సారం ఈ నీటిలో ఉంటుంది అంటారు. 
ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకమైన విశ్వాసం కనిపిస్తుంది. పిల్లలు లేని వారు ఆలయానికి ఎదురుగా నేల మీద కొంతసేపు పడుకుంటే పిల్లలు పుడతారు అని చెబుతారు. దీనిని "వరపడి సేవ"గా పిలుస్తారు. అనేక మంది సంతానం లేని దంపతులు అలా చేసి సంతానాన్ని పొందారని, పొందుతున్నారు అని, అలా జన్మించిన పిల్లల బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ ఇక్కడే జరిపించుకొంటారని తెలుస్తోంది. . 







మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధి 

ప్రాంగణంలో కండలేరు ప్రవాహం పక్కన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామి సన్నిధికి దూరంగా కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో నెలకొన్న సన్నిధిలో దర్శనమిస్తారు. 
దీని వెనుక ఒక కథ వినిపిస్తుంది. 
స్వామి ఈ క్షేత్రములో నరసింహ అవతారాన్ని విడిచి చెంచు లక్ష్మిని వివాహం చేసుకొని ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు అన్న విషయం వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ దేవికి చేరినదట. 
దేవేరి భూలోకానికి వచ్చి శ్రీవారు చెంచు లక్ష్మీ దేవితో వనాలలో విహరించడం కనులారా చూసి 
కినుక వహించి కండలేరు ఒడ్డున శిలారూపం దాల్చారట. ప్రతి నిత్యం అమ్మవారికి పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
పక్కన శ్రీ కణ్వ మహర్షి సన్నిధి కూడా ఉంటుంది. 
ఇతర ఉపాలయాలలో శ్రీ కాళియ మర్దన కృష్ణుడు మరియు శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉంటారు. 















ఆలయ పూజలు మరియు ఉత్సవాలు

పెనుశిల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. ఉత్సవాలలో ప్రత్యేక పర్వ దినాలలో భక్తుల రద్దీ ఆధారంగా దర్శన వేళలు మారుతాయి. 
నిత్యం నియమంగా అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు నిర్ణయించిన ప్రకారం జరుపుతారు. శనివారాలు, పర్వ దినాలు మరియు శలవు దినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 
స్వామి వారి జన్మదిన సందర్బంగా వైశాఖ మాసంలో అయిదు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుండే కాదు తమిళనాడు, పాండిచ్చేరి మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన వసతి గృహాలు అద్దెకు లభిస్తాయి. భక్తులకు నిత్యం ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 
పెంచెలకోన అభయారణ్యంతో కూడిన శేషాచలం కొండలలో అద్భుతమైన ప్రకృతికి, ఆధ్యాత్మిక పరిమళాలకు నిలయమై శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి కొలువైన పెనుశిల దివ్య క్షేత్రం నెల్లూరు పట్టణానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చక్కని చిక్కని అడవుల గుండా సాగే మార్గం యాత్రీకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. 

ఓం నమో నారాయణాయ నమః 

 





20, మార్చి 2024, బుధవారం

Sri Bala Koteswara Swami Tempe, Govada,

 

               శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ 


చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలిగించే వాతావరణం. 
అలాంటి ప్రశాంత పరిసరాల మధ్యలో దర్శనమిస్తుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కొలువైన గోవాడ దివ్య క్షేత్రం.  
మహేశ్వరుడు కొలువైన అనేక దివ్యధామాలు మనకు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినా శివలింగాలు వెలుగు చూస్తాయి. అంతగా విశ్వేశ్వరుని పట్ల అచంచల భక్తి భావాలు కలిగిన పవిత్ర భూమి మన భారత భూమి. 
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరిన గాథ యుగాల క్రిందటిదిగా పేర్కొనాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడానికి గల చారిత్రక ఆధారాలను చూద్దాము. 







చారిత్రక నిదర్శనాలు 

గతంలో ఈ ప్రాంతాన్ని చోళుల వంశం లో నుండి విడివడి ఇక్కడ స్థిరపడిన వారు అంటారు. అదే చరిత్రకారులు వీరు కన్నడ ప్రాంతానికి చెందిన పాలకవంశం అయిన చాళుక్య వారసులు అని పేర్కొంటారు. మరికొందరు వీరిని "వెలనాటి చోడులు" అని కూడా పిలుస్తారు. 
చారిత్రక సత్యం ఏది ఏమైనా చందోలు ను రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించిన వీరు విశాల ప్రాంతాన్ని పాలించారు. తంజావూరు చోళరాజులతో మైత్రి మరియు బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. తమ కీర్తిని శాశ్వతంగా నిలిపే ఎన్నో ఆలయాలను ఈ ప్రాంతంలో నిర్మించారు. వాటిల్లో తమ ఆరాధ్య దైవమైన కైలాసనాథుని ఆలయాలు అధికం అని చెప్పాలి. అలాగని వారు ఇతర దేవతారాధనలను అడ్డగించలేదు. అనేక విష్ణు ఆలయాలను, నిర్మించారు. పునరుద్ధరించారు. 
వీరి పాలనలో ఈ ప్రాంతం ఎంత గొప్పగా ఉన్నది అన్న విషయాన్ని ఆ నాటి కావ్యకర్త శ్రీ పాల్కురీ సోమనాధుడు: తన "బసవపురాణం" కావ్యంలో వివరిస్తారు. ఈ ద్విపద కావ్యం లింగాయత్ వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త , కవి మరియు తత్వవేత్త అయిన "శ్రీ బసవేశ్వర" జీవిత గాథను తెలియజేస్తుంది. 
















శ్రీ బసవేశ్వర పరమేశ్వరుని పట్ల తనకు గల భక్తి భావాన్ని "వచన " అనే విధానంలో ప్రజల లోనికి తీసుకొని వెళ్లారు. శివ గాయక భక్తులైన నయనారుల మాదిరి ఈయన కూడా నాటి కన్నడ ప్రాంతంలో ప్రజలను ప్రభావితులను చేయగలిగారు. 
ఇక అసలు విషయానికి వస్తే ఇంతటి ప్రభావాల వలన వెలనాటి చోడులు నిర్మించిన అనేక ఆలయాలు కాలప్రభావంతో మరుగున పడిపోయాయి. భూమిలో కలిసి పోయాయి. 
అలాంటి ఒక ఆలయంలోని లయకారుని లింగమే నేడు గత శతాబ్ద కాలంగా గోవాడలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాల కోటేశ్వర స్వామిగా పూజలు అందుకొంటున్నది. 
సుమారు వంద సంవత్సరాలకు పూర్వం కీర్తిశేషులు శ్రీ కూచిపూడి తిరుపతి రాయుడు పేరుమోసిన మోతుబరి. అనేక ప్రజల ఉపయోగార్థం మరియు సంక్షేమార్థం అనేక పనులను చేయించేవారు. అలాంటి ఒక కార్యక్రమం చేపట్టారు. నేటి గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న బుడంపాడు గ్రామంలో ఒక మంచినీటి చెఱువును తవ్వించడానికి నిర్ణయించారు. తవ్వుతున్నప్పుడు పానువట్టంతో పాటు బ్రహ్మ సూత్రంతో దివ్యకాంతులు వెదజల్లుతూ లింగరాజు లభ్యమయ్యారు. ఏనాటి లింగమో ! చెక్కుచెదరకుండా శోభాయమానంగా దర్శనమివ్వడంతో రాయుడు గారు తమ గ్రామానికి తీసుకొనివచ్చారు. ఆ కాలంలో గోవాడ ఒక బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలను అభ్యసించిన బ్రాహ్మణోత్తములు నివసించేవారు. వారిని సంప్రదించి 1907 వ సంవత్సరంలో లభించిన ఉత్తమ లింగాన్ని శ్రీ బాల కోటేశ్వర స్వామి పేరిట ప్రతిష్టించారు. క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి చెందసాగింది. అనేక నూతన నిర్మాణాలు జరిగాయి. 
1930 వ సంవత్సరం నుండి భక్తులకు లభించిన దివ్యానుభావాల కారణంగా ప్రభలతో అయిదు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నేటికీ కోటప్పకొండలో సమానమైన ప్రభలు గోవాడలో కనపడతాయి అంటే ఈ ఉత్సవాల వెనుక భక్తుల పాత్రను శ్రీ బాల కోటేశ్వర స్వామి పట్ల వారి భక్తి విశ్వాసాలను అర్ధం చేసుకోవచ్చును. 







 ఆలయ విశేషాలు 

తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయానికి పడమర వైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. పచ్చని పొలాల మధ్య సువిశాల ప్రాంగణంలో అనేక దేవతా మూర్తులు దర్శనమిస్తారు. తూర్పున అయిదు అంతస్థుల రాజ గోపురం నిర్మించారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే శ్రీ వినాయకుడు, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, గౌతమ బుద్ధుడు, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి ఉపాలయాలు కనిపిస్తాయి. 
తూర్పువైపున వటవృక్షం క్రింద అనేక నాగ ప్రతిష్టలు ఉంటాయి. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయం. మరో పక్కన పద్మాసన భంగిమలో శ్రీ గంగాధరుడు. 
అక్కడే నింగిని తాకేలా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభం, బలిపీఠాలు ఉంటాయి. 
విశాల ఆస్థానమండపం పూజాదులు, హోమాలు నిర్వహించడానికి అనువుగా నిర్మించబడినది. నందీశ్వరుడు గర్భాలయంలో లింగరూపంలో ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామివారి ఆజ్ఞకు ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తారు. విశేషం ఏమిటంటే చక్కని చందాన, విభూతి, కుంకుమ, పుష్ప అలంకరణలో శ్రీ బాల కోటేశ్వర స్వామి బ్రహ్మ సూత్రం కలిగిన లింగ రూపంలో దర్శనమిస్తారు. 
ఇరుపక్కలా ఉన్నరెండు సన్నిధులలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుడు, శ్రీ  పార్వతీదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తారు. 
శ్రీ బాల కోటేశ్వరస్వామి వారి ఆలయంలో మరో విశేషం కనపడుతుంది.








 
సహజంగా ప్రతి శివాలయంలో నవగ్రహ మండపం ఉండటం విధాయకం. ఇక్కడ కూడా. కాకపోతే మొదటి నుండి లేదు. భక్తులు, ఆలయ పెద్దలు కలిసి 1988లో అష్టకోణ మండపాన్ని నిర్మించి, అందులో నవగ్రహాలను పీఠ, వాహన మరియు సతీ సమేతంగా ప్రతిష్టించారు. ఆ విధంగా  చూస్తే గోవాడలోని నవగ్రహ మండపం ప్రత్యేకమైనది. మండప వెలుపల ప్రత్యేక అద్దాల సన్నిధిలో  వాయస వాహనంతో కలిసి శ్రీ శనేశ్వరుడు దర్శనమిస్తారు. ఏలినాటి, అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. 

ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

ప్రతినిత్యం నాలుగు పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. 
శ్రీ వినాయక చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి, ఉగాది ఆదిగాగల పర్వదినాలలో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. 
ముఖ్యంగా అయిదు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ళు గోవాడ ను జనసముద్రంగా మార్చివేస్తాయి. దూరప్రాంతంలో స్థిరపడిన గ్రామస్థులు శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తారు. చుట్టుపక్కల గ్రామాలూ, పట్టణాల నుంచి కూడా భక్తులు తిరునాళ్లను చూడటానికి వస్తారు. 
చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం మధ్యన దేవతా వృక్షాలుగా కీర్తించబడే మారేడు, జమ్మి, తెల్ల జిల్లేడు, గన్నేరులతో   నిండిన ప్రాంగణం, అనేక దేవీదేవతల స్థిరనివాసం, మహేశ్వరుడు అమ్మవారితో కలిసి కొలువైన దివ్య క్షేత్రం గోవాడ నిరంతరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతుంది. 
గోవాడ కు తెనాలి, గుంటూరు, పొన్నూరు నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. వసతి సౌకర్యాల కొరకు తెనాలి లేదా గుంటూరు పట్టణాల మీద ఆధారపడాలి. గోవధకు సమీపంలోని చందోలు లో శ్రీ బగళాముఖీ అమ్మవారి ఆలయం, పొన్నూరులో శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయం  ఎత్తైన శ్రీ ఆంజనేయ మరియు శ్రీ గరుత్మంతుని ఆలయాలతో పాటు మరికొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. గుంటూరు నుండి పొన్నూరు వెళ్లే దారిలో వచ్చే చేబ్రోలు దేవాలయాల గని. శ్రీ పంచ ముఖ బ్రహ్మ ఆలయంతో సహా అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. 
ఒక ప్రణాళికతో ప్రయాణం చేసినట్లయితే వీటన్నింటినీ ఒక రోజులో దర్శించుకోవచ్చును. 

నమః శివాయ !!!! 














Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...