Sri Tripura Tandaveshwara swamy Temple, Tadepalli, Guntur district
శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయం, తాడేపల్లి
అడుగడుగున గుడి ఉన్నది అని కవి అన్నట్లు ప్రతి ఊరిలో ఒకటి రెండు ఆలయాలు మన రాష్ట్రంలో కనిపిస్తాయి. వాటిలో అధికశాతం పురాతనమైనవే కావడం చెప్పుకోదగిన అంశం.
కృష్ణానదీ తీరంలో ముఖ్యంగా నేటి కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో కనిపించే పురాతన ఆలయాలలో అధిక శాతం వేంగి చాళుక్యుల కాలంలో నిర్మించబడినవి అని తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనంద గోత్రీకులు, కాకతీయులు, రెడ్డి రాజులు, రాష్ట్ర కూటులు, విష్ణుకుండినులు, స్థానిక పాలకులు, విజయనగర రాజులు, గజపతి రాజులు మరియు చివరగా అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించిన శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆలయాల పునః నిర్మాణం, నూతన మండపాలు నిర్మించి, అభివృద్ధి చేసి, ఆలయ నిర్వహణ నిమిత్తం భూరి విరాళాలు మరియు భూమి సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది.
చాళుక్యులు
కన్నడ ప్రాంతానికి చెందిన వేరు నేటి "బాదామి" న రాజధానిగా చేసుకొని ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి ఏడవ శతాబ్ద కాలంలో పరిపాలించారు. వంద సంవత్సరాల కాలంలో వీరు భారత దేశ దక్షిణ ప్రాంతాన్ని మరియు మధ్య భారతంలో కొంత ప్రాంతాన్ని పాలించారు.
తాము గెలిచిన ప్రాంతాలలో తమ వారిని పాలకులుగా నియమించడం వలన వారంతా వేంగి, వెలనాటి, తూర్పు, పశ్చిమ చాళుక్యులుగా చరిత్రలో స్థానం పొందారు.
వీరంతా తమిళనాడును పరిపాలించిన చోళ వంశంతో వివాహాది సత్సంబంధాలు కలిగి ఉండడం వలన వీరిని కూడా చోడులు లేక చోళులు అని పిలిచేవారు.
చాళుక్య వంశం వారు నిర్మించిన అనేక సుందర రమణీయ గుహాలయాలు,దేవాలయాలు నేటికీ కర్ణాటక లోని బాదామి, ఐహోల్, పట్టడక్కల్ ప్రాంతాలలో సందర్శించుకోవచ్చును.
మన రాష్ట్ర తీరప్రాంతాన్ని వెయ్యి సంవత్సరాలకు పూర్వం పాలించిన వెలనాటి మరియు వేంగి చాళుక్యులు నిర్మించిన ఆలయాలు అనేకం కనపడుతాయి. కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పులకు లోనైనా ఆలయ ప్రధాన నిర్మాణ శైలి లో మార్పు కనపడదు. ఇన్ని సంవత్సరాలుగా నిత్య పూజలు జరుగుతుండటం విశేషం.
శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయం
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయం రాజగోపురం, మండపాలు లేకుండా సాదాసీదాగా కనపడుతుంది. ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ కాలభైరవ స్వామి సన్నిధి. స్వామివారు విద్య మరియు ఉద్యోగప్రదాతగా ప్రసిద్ధి.
ధ్వజస్థంభం వద్దనే శ్రీ నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. ఆలయ ముఖమండపం పైన శ్రీ ధ్యానేశ్వరస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు.
ఆలయంలో కొన్ని విశేషాలు కనపడతాయి.
ఆలయం పూర్తిగా రాతి కట్టడం. శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో ఉండి అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధికెక్కిన ఎనిమిది కవి పండితులు ఉండేవారు. వారిలో వికటకవిగా పేరు గాంచిన తెనాలి రామకృష్ణుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
గతంలో ఈ ప్రాంతంలో తాటి చెట్లు అధికంగా ఉండేవట. అందువలన "తాటితోపు" గా పిలవబడిన ఈ ప్రాంతాన్ని రాయలవారు రామకృష్ణ కవికి ఇనాముగా ఇచ్చారట
అప్పటికే ఉన్న ఆలయాన్ని పునః నిర్మించారట వికటకవి. తరువాత అమరావతి పాలకుడు శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు మరమ్మత్తులు చేయించారని తెలుస్తోంది.
అభిషేక జలాలు వెలుపలికి పారే గోముఖి వద్ద శ్రీ చండికేశ్వర స్వామి వారి సన్నిధి తమిళనాడు లోని అన్ని ఆలయాలలో కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కూడా శివాలయాలలో శ్రీ చండికేశ్వర సన్నిధి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి చిత్రపటం గోముఖి వద్ద ఆలయ గోడ మీద చిత్రీకరించారు.
కృష్ణా తీరంలోని చాలా ఆలయాలలో కల్యాణ మండపం ప్రాంగణంలోనే ఈశాన్య, నైరుతి దిశలలో నిర్మించడం కనిపిస్తుంది. శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణానికి వెలుపల వాయువ్య దిశలో ఉండటం ప్రత్యేకం.
ఈశాన్యంలో నూతనంగా నవగ్రహ మండపం నిర్మించారు. నవగ్రహాలు సర్వాంగసుందరంగా , సర్వాభరణ భూషితులుగా దర్శనమివ్వడం మరింత ప్రత్యేకం.
కొత్తగా గ్రానైట్ రాళ్లతో ఆధునీకరించిన ముఖమండపంలో మరో నంది విగ్రహం ఉంటుంది. గతంలో ఈ నంది తిరిగే రాతి రాట మీద ఉండేదట. భక్తులు తమ కష్ట సమయంలో తిప్పి ప్రార్ధించేవారట. విగ్రహం భిన్నం అయ్యే ప్రమాదం ఉండటంతో పీఠం మీద ప్రతిష్టించారు.
మండపంలో రెండు ఆర్చీలు మాదిరి నిర్మించిన మకరతోరణాలు కనపడతాయి. ఆలయ ప్రధాన విశేషానికి ఈ ఆర్చీలకు సంబంధం ఉన్నది. మండపానికి అనుబంధంగా ఉన్న అర్ధమండపంలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి, శ్రీ గణపతి ఉపస్థితులై పూజలందుకొంటుంటారు. ఇక్కడ మొత్తం మూడు సన్నిధులు కనిపిస్తాయి.
రెండు శక్తి రూపాలు
శ్రీ మహావిష్ణు ఆలయంలో శ్రీదేవి మరియు భూదేవి లేక శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ గోదాదేవి దర్శనమిస్తారు. అంటే ఇద్దరు తాయారులు స్వామివారితో కొలువై ఉంటారు.
కానీ శివాలయాలలో ఒక్క అంబిక సన్నిధి మాత్రమే కనపడుతుంది.
శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయంలో మాత్రం శ్రీ రాజరాజేశ్వరీ దేవి మరియు శ్రీ గంగా బాల త్రిపుర సుందరి దేవి ఎదురు బొదురు సన్నిధులలో స్థానక భంగిమలో దర్శనం ఇవ్వడం మరెక్కడా కనిపించని ప్రత్యేకత.
రెండు శక్తి స్వరూపాలు ఒకే ఆలయంలో ఎదురెదురుగా ఉండటం గొప్ప విశేషంగా చెబుతారు.
రమణీయ పుష్ప, స్వర్ణాభరణ, పట్టు పీతాంబరాలు ధరించిన అంబికలిద్దరూ ప్రసన్నవదనాలతో
భక్తుల పాలిటి కల్పవృక్షాలు.
వివాహం సంతానం, ఉద్యోగం, ఆర్ధిక సమస్యలు ఏవైనా ఇక్కడ విన్నవించుకొంటే మండలం రోజులలో పరిష్కారం కావడం తధ్యం అన్నది స్థానిక విశ్వాసం.
శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి
చిన్న పానవట్టం మీద చిన్న లింగరూపంలో శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి వారు ప్రత్యేక దర్శనం అనుగ్రహిస్తారు. భక్తుల మానసిక స్థితి ని బట్టి లింగంలో ఒక రూపం కనిపిస్తుందని చెబుతారు. పడగెత్తిన నాగం, పరిగెత్తుతున్న వృషభం, మానవ వదనం, అగ్ని చిమ్మే త్రినేత్రం ఇలా కనిపిస్తాయి. వారి సమస్య తీరిన తరువాత ఆ రూపం కనిపించదని కూడా అంటారు.
నిత్యం విధివిధానాల ప్రకారం పూజలు జరిగే ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు, దసరా మహోత్సవాలు, కార్తీక మాస పూజలు, శ్రీ భద్రకాళీ వీరభద్ర కళ్యాణం, మహాశివరాత్రి రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
ఇన్ని విశేషాల నిలయమైన శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయం విజయవాడ నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లి లో ఉన్నది. విజయవాడ నుండి సొంత వాహనం, బస్సుల లో లేదా ఆటోలో కూడా వెళ్లవచ్చును. రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఆలయం.
తాడేపల్లిలో శ్రీ విశ్వేశ్వర (శ్రీ వీరభద్ర) ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ రామాలయం కూడా ఉన్నాయి. పక్కనే ఉన్న సీతానగరం లో కూడా చక్కని పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి