Sri Swayamvyaktha Parvati sameta sri moksha amaralingeswara swami temple, Edara(Eluru dist)

     భక్తులకు అపురూపం శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి 

నిరంతరం ఆలయ సందర్శన వ్యాపకంలో ఉండే నాకు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించినప్పుడు అనేక గొప్ప గొప్ప అనుభవాలు ఎదురైనాయి. 
కర్నూలు పట్టణానికి సమీపంలోని వామసముద్రం, కృష్ణా జిల్లా పెడన మండలంలోని చెన్నూరు, విజయవాడ నగరంలోని మొగల్రాజ పురం కొండ పైన ఉన్న శైవ క్షేత్రం మచ్చుకు కొన్ని!
అలంటి అనుభవమే ఈ మధ్య నూజువీడు వెళుతున్నప్పుడు ఎదురైనది. ఆఫీస్ పని మీద వరసగా రెండు రోజులు నూజువీడు వెళ్ళవలసి వచ్చింది. 









మొదటి రోజు ఆగిరిపల్లి గ్రామంలో ఉన్న విశేష శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళాను. తిరిగి విజయవాడ వెళ్ళేటప్పుడు నెక్కలం అడ్డరోడ్డు దగ్గర శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నూతన సుందర ఆలయం, గతంలో రోడ్డు మీదకు ఉండిన శ్రీ ఆంజనేయస్వామికి నిర్మించిన నూతన ఆలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ పెట్టిన బోర్డు దృష్టిని ఆకర్షించింది. 
స్వయంవ్యక్త శ్రీ పార్వతీ సమేత శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం, ఈదర గ్రామం ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అని రాసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో ఉన్న పురాతన ఆలయాలను సందర్శించి ఆయా క్షేత్రాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి వీడియోలు  యూట్యూబ్ లో పెడుతున్నందున మర్నాడు వచ్చేటప్పుడు ఈదర వెళదాము అని నిర్ణయం చేసుకొని, బోర్డు ని ఫోటో తీసుకొని వెళ్ళిపోయాను. 
మరునాడు ఉదయాన్నే బయలుదేరాను. నెక్కలం అడ్డరోడ్డు దగ్గర ఉన్న రెండు ఆలయాలను దర్శించుకొని ఈదర వైపుకు ప్రయాణం మొదలు పెట్టాను. 
బయలుదేరుతూ బోర్డు లో ఉన్న ఒక నెంబర్ కి కాల్ చేసాను. శ్రీ సాయి సుందర్ గారు ఆలయానికి ఎలా వెళ్లాలో అక్కడ ఎవరిని కలవాలి అన్న వివరాలు  ఇచ్చారు. 
సన్నటి తారురోడ్డు. చుట్టూ పచ్చని పొలాలు, మామిడి మరియు పామ్ ఆయిల్ తోటలు. చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నది శీతాకాలపు ఉదయం. నెమ్మదిగా ఈదర చేరుకొని శ్రీ బసవరాజు సుబ్బారావు గారి ఇంటికి చేరుకున్నాను. 
వారి కుటుంబం ఈ గ్రామానికి కరణాలుగా ఉండేవారట. నేటికీ వారి ఇంటిని కరణం గారిల్లు అనే పిలుస్తారు. సి సాయి సుందర్ గారు శ్రీ సుబ్బారావు గారి కుమారులే !
ఇంటికి కొద్ది దూరంలో పొలాల మధ్య ఉన్న ఆలయానికి ఇద్దరం బయలుదేరాము. 
ఒక పురాతన ఆలయాన్ని చూస్తాను అన్న ఆలోచనలో ఉన్న నేను పూర్తిగా నూతన కట్టడాన్ని చూసి కొద్దిగా తడబడ్డాను. పేరు వింటే ఎప్పటి దేవాలయమో అనిపిస్తుంది. కానీ చూస్తే పూర్తిగా నూతన కట్టడం. 
సరే వివరాలు శ్రీ సుబ్బారావు గారిని అడిగి తెలుసుకొందాము. తొందరపడటం ఎందుకు అనుకొన్నాను. 









ఆలయం చాలా సుందరంగా తూర్పుముఖంగా పూర్తిగా ఆలయానిర్మాణ పద్దతిలో కట్టబడింది. 
ఈ ఆలయం గతం బెట్టింది అని శ్రీ సుబ్బారావు గారిని అడిగాను. 
సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రిందట నుండి ప్రస్తుతం ఆలయంలో ఉన్న లింగం ఒక చెట్టు క్రింద పొలం గట్టున ఉండేదట. పక్కనే పెద్ద పాముపుట్ట కూడా ఉండేదట. గ్రామస్థులు నాగుల చవితికి. మహాశివరాత్రికి లింగానికి పూజలు చేసి పాముపుట్టలో పాలుపోసేవారట. కొందరు పురావస్తుశాఖ వారిని సంప్రదించగా వారు లింగాన్ని పరిశీలించి కాకతీయుల కాలం నాటి లింగంగా నిర్ధారించారట. 
అప్పటికి ఊరిలో రామాలయం తప్ప శివాలయం లేదు. గ్రామస్థులు ఎక్కువగా పావన కృష్ణానదీ తీరంలో పంచారామాలలో ఒకటి అయిన అమరావతి లోని శ్రీ అమరలింగేశ్వరస్వామి వారిని దర్శించుకోడానికి వెళుతుంటారు. ఆ స్వామి పేరే చెట్టు క్రింద లింగానికి పెట్టుకొని ప్రేమగా పిలుచుకొంటుండేవారు. 
ఎప్పుడైతే శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి లింగం కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఆలయంలో ఉండేదని తెలిసిందో కొందరు తిరిగి ఆలయం నిర్మించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. 
గ్రామస్థులు విరాళాలు సేకరించి నిర్మాణం ప్రారంభించారట. కొంత వరకు నిర్మించిన తరువాత నిధుల కొరత మరియు ఇతర కారణాలతో ఆలయ నిర్మాణం ఆగిపోయిందిట. చాలాకాలం అదేస్థితిలో ఉండిపోయిందట. 
అప్పుడే ఊరికి దూరంగా జంగారెడ్డి గూడెంలో రసాయనశాస్త్ర అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయిన  శ్రీ బసవరాజు సుబ్బారావుగారు గ్రామానికి వచ్చారు. 








ఆయన , వారి కుమారుడు శ్రీ సాయి సుందర్ ఇరువురికీ ఆలయ నిర్మాణం పూర్తిచేయాలన్న సంకల్పం కలిగింది. 
వారు తమ తరుఫు నుండి కొంత మొత్తం ఖర్చుపెట్టి ఒక తాత్కాలిక నిర్మాణం చేద్దామనుకున్నారు. కానీ ఈశ్వరేచ్చే మరో విధంగా ఉన్నది. వారే కాకుండా విదేశాలలో ఉన్న వారి తోడబుట్టిన వారు వారి మిత్రులు, మరికొందరు స్థానిక మిత్రుల సహకారంతో ఒక రమ్యమైన శివపరివార మరియు హరిహర  క్షేత్రం సుమారు 90 లక్షలతో రూపుదిద్దుకొన్నది.
తూర్పుదిక్కున ప్రధాన ద్వారం ఉన్నప్పటికీ ప్రాంగణంలోకి ఉత్తరం పక్క ఉన్న ద్వారం నుండి వెళ్ళాలి. ఇక్కడ పైన శివలింగాన్ని కౌగలించుకొన్న మార్కండేయుని విగ్రహాన్ని ఉంచారు. 
ప్రాంగణంలో నవగ్రహ మండపం మరియు శ్రీ ఆంజనేయుడు తప్ప మిగిలిన దేవీదేవతలు అందరూ జంటలుగా కనిపిస్తారు. 
శ్రీ సిద్ది బుద్ధి  సమేత శ్రీ వినాయకుడు, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీ దక్షిణాముఖ అభయ ఆంజనేయ స్వామి , నాగ ప్రతిష్టలు, శ్రీ విద్య సరస్వతి, శ్రీ సీతారామచంద్రులు దర్శనమిస్తారు.  ప్రధానాలయానికి వెలుపలి గోడలలో శ్రీ వెంకటేశ్వర, శ్రీ అర్ధనారీశ్వర మరియు శ్రీ మహాలక్ష్మి దేవి దర్శనమిస్తారు. 
మరో గమనించదగిన అంశం ఏమిటంటే ఆలయానికి అష్ట దిగ్బంధం ఏర్పాటు చేసి బలి పీఠాలు ఏర్పాటు చేశారు. 
ఎత్తైన ధ్వజస్థంభం, ముఖమండపం దానికి అనుబంధంగా రెండు సన్నిధులు మధ్యలో ధ్యానమహేశ్వరుడు, సన్నిధులకు ఎదురుగా సుందర నందీశ్వరుడు. 
గర్భాలయంలో శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి ఎత్తైన పానవట్టం మీద లింగరూపంలో విభూతి, చందన కుంకుమ మరియు నాగాభరణం ధరించి రమణీయ పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
స్వామివారి లింగం అరుదైన "తరంగిణి లింగం" అని పేరెన్నికగన్న శిల్పులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. 










తరంగిణి లింగం అంటే లింగం క్రింద నాలుగు ముఖాలు , మధ్యలో ఎనిమిది ముఖాలు ఉంటే క్రింది భాగాన్ని బ్రహ్మ రూపం  
పక్కన ఉన్న సన్నిధిలో శ్రీ పార్వతీదేవి స్థానక భంగిమలో చతుర్భుజాలతో అప్పన్నులకు అభయ వర ప్రదాయనిగా పూజలు అందుకొంటారు. 
నిర్ణయించిన విధానంలో నిత్య పూజలు నిర్వహణ జరుగుతోంది. పర్వదినాలలో, ప్రత్యేక మాసాలలో ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు. 
పొలం గట్టున ఉన్న పరమేశ్వరుడు కోవెలలో స్థిరపడటం ఒక గొప్ప విశేషం కాగా మరో విశేషం ఏమిటంటే శివపూజలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి  శివలింగం పూలు అని శివపురాణం తెలుపుతోంది. అరుదైన శివలింగం పూలు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక వంద దాక ఆలయానికి రావడం కూడా ఆ పరమేశ్వర లీల అని చెప్పాలి. 
ఎప్పటి శివలింగమో, ఆలనా పాలనా లేక చెట్టు క్రింద ఉండగా తిన్నడు చూసి సేవలు చేసినట్లుగా శ్రీ బసవరాజు సుబ్బారావు గారి కుటుంబం కూడా వందల సంవత్సరాలుగా నిత్య పూజలు లేకుండా ఉన్న లింగానికి ఆలయ నిర్మాణం చేసి నిత్యం పూజలు జరపడం వారి పట్ల కైలాసనాధునికి ఉన్న ఎనలేని ఆప్యాయతకు నిదర్శనంగా పేర్కొనాలి. 








వారి కుటుంబ ఆధ్వర్యంలో ఈదరలో కొలువైన శ్రీ స్వయంవ్యక్త పార్వతీ సమేత శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం గొప్ప క్షేత్రంగా మరియు సాధకులకు ఒక ఆధ్యాత్మిక గమ్యంగా నిలవాలని ఆశిద్దాము. 

నమః శివాయ !!!!

 
 
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore