Sri Muktheshwara Swamy Temple, Morthota

                  

                      మోక్షాన్ని ప్రసాదించే ముక్తేశ్వరుడు 






పావన కృష్ణవేణి తీరాలు ఎన్నో పవిత్ర పుణ్య తీర్ధ క్షేత్రాలకు నిలయాలు. ముఖ్యంగా మన రాష్ట్రంలో యుగాల నుండి నెలకొనివున్న పరంధాముని దివ్య ధామాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. 
సర్వాంతర్యామి స్వయంవ్యక్థగా, మహర్షుల పూజల నిమిత్తం ప్రతిష్టించుకొన్న అర్చారూపాలు, మహారాజులు క్షేత్ర ప్రాధాన్యతలను తెలుసుకొని నిర్మించిన ఆలయాలు ఇలా వివిధ రకాల క్షేత్రాలు మనకి కనిపిస్తాయి. ఈ తీర్ధ క్షేత్రాలతో ముడిపడి క్షేత్ర గాధలు కూడా యుగాల నాటివి కావడం, అవి వివిధ పురాణాలలో ప్రస్తావించబడి ఉండటం విశేషం. 
అలాంటి ఒక విశేష ఆలయం రేపల్లె పట్టణానికి సమీపంలో నెలకొని ఉన్నది. 
పరమేశ్వరుడు మానవరూపంలో అవతరించి దుష్ట శిక్షణ చేసి శ్రీ ముక్తేశ్వరునిగా కొలువు తీరిన దివ్య ధామం కృష్ణా నదీతీరంలో ఉన్న మోర్తోట గ్రామంలో నెలకొని ఉన్నది. 
స్వామి ఇక్కడ కొలువు తీరడం వెనుక ఉన్న గాధ ఏమిటో తెలుసుకొందాము. 
దానికన్నా ముందు ఈ విషయం కూడా మనంతెలుసుకోవాలి . 
ఏ క్షేత్రానికైనా నాలుగు విశేషాలు ఉంటాయి. 
తీర్థ విశేషం, క్షేత్ర విశేషం, క్షేత్ర గాథా విశేషం మరియు మూర్తి విశేషం. 





తీర్థ విశేషం 

క్షేత్రానికి సమీపంలోని జీవ నది లేదా నది యొక్క పవిత్రత తీర్థ విశేషంగా చెబుతారు. నది లేని పక్షంలో ఆలయ పుష్కరణి గొప్పదనం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పురాతన ఆలయాల పుష్కరుణలలో అధికశాతం  దేవతలు,మహర్షులు ఏర్పాటు చేసినవి కావడం చెప్పుకోవలసిన అంశం. పుష్కరణిలో స్నానం చేయడం భక్తుల శరీర అనారోగ్యం మరియు జన్మజన్మల పాప కర్మలను తొలిగించేదిగా చెబుతారు. 







క్షేత్ర విశేషం 

లోకాలను పాలిస్తూ రక్షించే దేవదేవుడు ఆ క్షేత్రంలో కొలువు తీరడానికి గల కారణం, క్షేత్రంలో నడయాడిన పుణ్య పురుషుల వివరాలు,క్షేత్రానికి గల ప్రాధాన్యత, ఆలయ ప్రత్యేకతలు, పరివార దేవతల సన్నిధులు ఇవన్నీ క్షేత్ర విశేషాల క్రిందకు వస్తాయి. 










 మూర్తి విశేషం 

క్షేత్రంలో కొలువు తీరిన అంతర్యామి రూప విశేషాలు విశేషంగా భక్తులను ఆకర్షిస్తాయి. అవి రకరకాలుగా ఉంటాయి. అవి భక్తులలో శాశ్విత ఆధ్యాత్మిక అనుభూతులను నెలకొల్పుతాయి. చెరగని సందర్శనానుభూతులను ప్రసాదిస్తాయి.   

క్షేత్ర గాథ

అన్నిటికన్నా క్షేత్ర గాధ ప్రధానమైనది. 
గతంలో నదీతీరాలు ముని ఆశ్రమాలుగా మరియు గురుకులాలుగా  ప్రసిద్ధి చెందినవి. కారణం వారి నిత్య అనుష్టానానికి , పూజలకు ఇతర కార్యక్రమాలకు జలం చాల అవసరం. ఈ కారణంగా వారు ఆశ్రమాలను నదీ తీరంలో నెలకొల్పుకొనేవారు. 
అలా పూర్వం అనేక మంది మునులు నివసించిన ప్రదేశంగా "మునుల తోట"గా పిలవబడిన ఈ ప్రదేశం కాలక్రమంలో "మోర్తోట"గా పిలవబడుతోంది.  
సీతాదేవిని అపహరించుకొని పోయి లంకకు చేటు తెచ్చిన రావణాదులు రామరావణ యుద్ధంలో అశువులు బాసారు. కానీ ఒకే ఒక్క రాక్షస యువతి ఎలాగో తప్పించుకొని దేవతల పట్ల విపరీతమైన పగ ప్రతీకారం పెంచుకొని మునివాటికల మీద దాడి చేస్తూ, యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించసాగినదట. జనావాసాల మీద కూడా దాడులు చేస్తూ ప్రజలను ఇక్కట్లకు గురి చేయసాగినదట. 
రాక్షసి అకృత్యాలను సహించలేక మహర్షులు మహేశ్వరుని తమను కాపాడమని ప్రార్ధించారట. 
అదే సమయంలో జ్ఞాన యోగి సుచరిత దంపతులు దత్తాత్రేయుని ప్రార్ధించేవారట. పరమేశ్వరుడు మహర్షులతో త్రిమూర్తి అంశతో జ్ఞానయోగి దంపతులకు జన్మించే కుమారుడు రక్కసిని సంహరించగలడని తెలిపారట. 
కొద్దికాలంలోనే యోగి దంపతులకు ఒక కుమారుడు జన్మించారట. త్రినాధుడు అన్న పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారట. చిన్న వయస్సులోనే సమస్త విద్యాలను అభ్యసించిన త్రినాధుని జన్మ రహస్యం తెలుసుకొన్న రక్కసి ఒకనాడు అతని మీదకు దాడి చేసినదట. 
లోకకంటకి అయిన రాక్షసితో భీకర పోరాటం జరిగినదిట. తనకు మరణం తప్పదని గ్రహించిన రక్కసి త్రినాధుని తన తప్పులను క్షమించి పుణ్యలోకాలకు ప్రసాదించమని ప్రార్ధించినదట. 
అనుగ్రహించారట త్రినాధుడు. 
అలా ఎన్నో పాపఖర్మలు చేసిన రాక్షసికి ముక్తిని ప్రసాదించిన త్రినాధుడు పావన కృష్ణా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న "మోర్తోట"లో శ్రీ ముక్తేశ్వర స్వామి అన్న పేరుతొ లింగరూపంలో కొలువు తీరారట. 
అలా కొలువు తీరిన స్వామిని అన్ని పాపాలను తొలగించి ముక్తిని ప్రసాదించేవానిగా శ్రీ ముక్తేశ్వరుని గా కొన్ని శతాబ్దాలుగా ప్రజలు కొలుస్తున్నారు. 
కాకతీయుల కాలంలో తోలి ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఎందరో పాలకులు స్వామివారిని సేవించుకొన్నారు. ప్రస్తుతం ఆలయానికి రాచూరు జమీందార్లు వంశ్యపరంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. 





ఆలయ విశేషాలు 

మన రాష్ట్రంలో ప్రవహించే జీవ నదులలో కృష్ణానది ఒకటి. 
భారత దేశంలోని మూడవ అతి పెద్ద నదిగా పేరొందిన కృష్ణ మహారాష్ట్ర రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వర్ వద్ద జన్మించి పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రవాహ మార్గంలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. కోట్లాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తుంది. చివరగా మన రాష్ట్రంలోని కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద సాగరునితో సంగమిస్తుంది. 
మరో విశేషం "కృష్ణవేణీ మహత్యం"లో కృష్ణా నది శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించినది అని పేర్కొనబడినది. ఈ గ్రంధంలో నదీ తీరంలో నెలకొని ఉన్న దివ్యధామాల గురించి కూడా ప్రస్తావించబడినది. 
 గంగ అనగా జలం. మానవ జీవితాలు సుఖవంతంగా సాగడానికి నీరు అత్యంత ఆవశ్యకం. అందువలన నదులను కన్న తల్లితో సమానంగా భావిస్తాము. నదీమ తల్లులు అని పిలుస్తాము. నేటి ప్రస్తుత పరిస్థితులలో నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం, కాలుష్యానికి దూరంగా ఉంచడం మనందరి బాధ్యత.  
మహాక్షేత్రం వారణాసి గంగానది ఉత్తర తీరాన నెలకొని ఉంటుంది. అపర కైలాసం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరియు సప్త ముక్తిక్షేత్రాలలో ఒకటి వారణాసి. సర్వేశ్వరుడు స్వయంగా నడయాడే పరమ పవిత్ర క్షేత్రం.  
ఈ కారణంగా ఏ నది కైనా ఉత్తర తీరాన నెలకొని ఉన్న శైవ క్షేత్రాల సందర్శన  కాశీ  సమాన ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. అందువలన ఆ క్షేత్రాలను అన్నింటినీ దక్షిణ కాశీ అని పిలుస్తారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అనేక క్షేత్రాలు ఇలాంటి గౌరవాన్ని పొందుతున్నాయి. 
మిగిలిన ఆలయాలకు మోర్తోట శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తేడా ఏమిటంటే మిగిలిన ఆలయాలు ఒడ్డున లేదా ప్రవాహానికి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ ఆలయం నది ప్రవాహంలో ఉండటం విశేషం. 
ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ తూర్పు నుండి ప్రవేశించలేము. ఎందుకంటే నదీప్రవాహం ఉంటుంది. పడమర,దక్షిణం మరియు ఉత్తరం పక్క నుండి ప్రాంగణం లోనికి వెళ్లవచ్చును. 
తూర్పువైపున ఉన్న మండపంలో ధ్వజస్థంభం, నవగ్రహ మండపం కనిపిస్తాయి. అక్కడ నిలబడి చూస్తే ఒక పక్క గలగలా పారే కృష్ణమ్మ మరో వైపున గర్భగృహంలో సర్వేశ్వరుడు ఏక కాలంలో దర్శనమిస్తారు. 
ముఖమండపానికి అనుబంధంగా మూడు సన్నిధులు కనిపిస్తాయి. దక్షిణం పక్క ఉన్న సన్నిధిలో శ్రీ వీరభద్రస్వామి  చక్కని అలంకరణలో రుద్రాక్షమాలలు ధరించి స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
ఉత్తరం పక్కన ఉన్న సన్నిధిలో శ్రీ పార్వతీదేవి సర్వాభూషిత అలంకారితగా నేత్రపర్వంగా ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. అమ్మవారి సన్నిధికి వెలుపల రామదూత, రుద్రావతారమైన శ్రీ ఆంజనేయస్వామి కొలువై కనపడతారు. 
మధ్యలో ఉన్న గర్భాలయంలో శ్రీ ముక్తేశ్వర స్వామి స్వర్ణ మండపంలో చిన్న పానువట్టం మీద చిన్న లింగరూపంలో చందన, కుంకుమ, విభూతి లేపనాల మధ్య సుందర వర్ణ పుష్ప అలంకరణ తో నయనానందకరంగా దర్శనం ప్రసాదిస్తారు. 
ఆలయానికి వెలుపల కొద్దీ దూరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి కనపడుతుంది. పక్కనే అపరకర్మల భవనం కూడా ఉంటుంది. ఇన్ని సారూప్యాలు ఉండటం వలన శ్రీ ముక్తేశ్వర స్వామి  కొలువు తీరిన మోర్తోటను "దక్షిణ కాశీ" అని పిలుస్తారు. 
స్వామి వారిని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు. కృష్ణ మరియు గోదావరి తీరాలలో నెలకొని ఉన్న ఆలయాలను ఇదే విధంగా సంభోదిస్తారు. దీనికి ముఖ్యకారణం క్షేత్రాల పక్కన జీవనదులు ప్రవహించడం ! జలం అంటే గంగ కదా ! ఎదురుగా ప్రవహిస్తోంది.  ప్రత్యేకంగా గంగాదేవి సన్నిధిఉండదు.అందుకే ఈ క్షేత్రాలను పుణ్య తీర్థ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ నదులలో స్నానం చేసి చేసుకొనే దైవదర్శనం అత్యంత పుణ్య ప్రదం అని పురాణాలు తెలుపుతున్నాయి. 
ఈ భాగ్యం పొందడానికి మహర్షులు తన ఆశ్రమాలను నదీతీరాలలో నెలకొల్పుకొనేవారు.   
కృష్ణానదీ జలాల మీద నుండి వీచే చల్లని గాలులు ఒక వైపు, మరో వైపు ఆలయం నుండి  వినిపించే వేదమంత్రాల ధ్వని తరంగాలు భక్తులకు మరువలేని మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. 
విద్వాంసులైన వేదపండితుల ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, హారతులు మరియు ఆరగింపులు జరుగుతాయి. 
శ్రీ వినాయక చతుర్థి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ దేవీ నవరాత్రులు, ,అష్టమి నాడు శ్రీ వీరభద్ర స్వామి పూజలు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా విశేషంగా నిర్వహిస్తారు. 
నిజభక్తులకు అమితమైన ఆధ్యాత్మిక అనునుభూతిని అనుగ్రహించే శ్రీ ముక్తేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం రేపల్లె పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో నెలకొని ఉన్నది. 
బస్సు సౌకర్యం లేదు కానీ ఆటోలు దొరుకుతాయి. సొంతవాహంలో కూడా రేపల్లె, గుంటూరు, విజయవాడ మరియు మచిలీపట్టణం నుండి సులభంగా చేరుకోవచ్చును. 
వసతి భోజన సౌకర్యాలు రేపల్లెలో లభిస్తాయి. 







వెళ్లే  దారిలో వచ్చే "నల్లూరు" గ్రామంలో కూడా ఒక పురాతన శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం మరొక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఉన్నాయి. దర్శనీయ ఆలయాలు.  
మోర్తోట ఆలయ సమీపంలో ఆట విడుపుగా నదిలో ప్రయాణించడానికి సమీప లంక గ్రామాలను చూడటానికి పడవ సౌకర్యం కూడా లభిస్తుంది. 
మన రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ఉన్న ఆలయాలను సందర్శిద్దాము. మన ఆలయాల గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాము. 

నమః శివాయ !!!!






 

   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore