15, మే 2023, సోమవారం

Thadalan Koil, Sirkazhi

                                    తాదళన్  కోవెల 

గతంలో మనం శిర్కాలి చుట్టుపక్కల ఉన్న పదకొండు తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల గురించి తెలుసుకున్నాము. 
శిర్కాలి లోనే మరికొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. కానీ అవి తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల క్రిందికి రావు. కానీ వాటిల్లో కూడా పాశుర గానం చేసింది తిరుమంగై ఆళ్వార్ మాత్రమే ! 
దివ్యదేశాలలో అధికశాతం శ్రీ మహా విష్ణువు ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో కొలువై దర్శనమిస్తారు. శ్రీ రామునిగా, శ్రీ కృష్ణునిగా, శ్రీ నారసింహునిగా దర్శనమిచ్చే క్షేత్రాలు కొద్ది. ఇక మిగిలిన దశావతారాల రూపాలలో కనపడేది ఇంకా స్వల్పం. చిత్రంగా మూడు దివ్యదేశాలలో స్వామి త్రివిక్రమునిగా కొలువై ఉంటారు. అవి శ్రీ ఉలగండ పెరుమాళ్ కోవెల, కాంచీపురం, శ్రీ ఉలగనాథ పెరుమాళ్ కోవెల, తిరుక్కోవిలూర్. మూడవది శిర్కాలి లోని శ్రీ కలి శీరం విన్నగరం. 
ఈ క్షేత్ర గాధ కూడా మిగిలిన రెండు దివ్య దేశాల పౌరాణిక గాధ కూడా !

పౌరాణిక గాధ 

ప్రహ్లాదుని మనుమడైన బలి  చక్రవర్తి మహావీరుడు. భూలోకంతో పాటు మిగిలిన లోకాలను జయించాడు. ఆయన పరాక్రమం ముందు ఇంద్రాది దేవతలు పలాయనం చిత్తగించి, శ్రీ హరి శరణు కోరారు. ఆయన వారికి అభయమిచ్చి తొందరలోనే బలి చక్రవర్తి పతనం తప్పదు అన్నారు. 
బలి ఎంతటి వీరుడో అంతకన్నా గొప్ప హరి భక్తుడు, దానశీలి. దేవేంద్ర పదవికి అర్హతను ఇచ్చే నూరవ అశ్వమేధ యాగానికి సిద్ధమయ్యారు బలి. మరింత ఆందోళనకు లోనైనా ఇంద్రుడు శ్రీమన్నారాయణుని పరిష్కారం చూపమని ప్రార్ధించారు. 
బలి చేసిన దానధర్మాలు వలన, చేస్తున్న అశ్వమేధ యాగాల కారణంగా ఇంద్ర పదవికి ఒకరకంగా అర్హుడే !కానీ రాక్షస వంశానికి చెందడం వలన అనర్హత చెందుతాడు. ఈ ఒక్క కారణంతో అతనిని శిక్షించదలచారు పరమాత్మ. 
బాల బ్రాహ్మణునిగా బలి యజ్ఞశాల వద్దకు చేరుకొన్నారు. అప్పటికి ఆ నాటి దాన ధర్మాలను ముగించి యాగానికి సిద్ధమవుతున్నారు చక్రవర్తి. ఆయన వద్దకు వెళ్లి దానం కోరారు వామనుడు. ముద్దుగా ఉన్న బాలుని కాదనలేక ఏమి కావాలి అని ప్రశ్నించారు. తలా దాచుకోడానికి మూడడుగుల నేల చాలన్న బాలుని చూసి అహంకారం తో నవ్విన బలి "సరే తీసుకో!"అన్నారు. 
ఆ తరువాత కధ మనకు తెలిసినదే ! వామనుడు "వటుడింతింతై..... " అన్నట్లుగా విరాట్రూపంతో ఒక అడుగుతో భూలోకాన్ని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో అడుగు బలి శిరస్సున ఉంచి పాతాళానికి పంపారు. 
పై రెండు క్షేత్రాలతో పాటు ఈ క్షేత్ర గాధ కూడా ఇదే !
కానీ ఈ క్షేత్రం ముఖ్యంగా శ్రీ రామచంద్రుడు కొలువైనదిగా చెబుతారు. పేరు కూడా ఉచ్చారణ దోషం కారణంగా కలి శీరం గా మారింది అంటారు. 
ఆ విషయాలను పక్కన బెట్టి ఆలయ విశేషాలు తెలుసుకొందాము. 

ఆలయ విశేషాలు 

విశాలమైన ప్రాంగణానికి తూర్పున మూడు అంతస్థుల రాజా గోపురం ఉంటుంది. ఎదురుగా బలిపీఠం, ధ్వజస్థంభం కనపడతాయి. ప్రధాన ఆలయం కొద్దిగా ఎత్తులో నిర్మించబడినది. ముఖ మండపం, అర్ధ మండపం, గర్భాలయంగా నిర్మించారు. 
గర్భాలయంలో ఎడమ కాలిని పైకెత్తి ఆకాశాన్ని కొలుస్తున్న భంగిమలో "శ్రీ లోకనాథన్ పెరుమాళ్" నేత్రపర్వమైన అలంకరణలో దర్శనమిస్తారు. 
స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ త్రివిక్రమ నారాయణ పెరుమాళ్ శ్రీ దేవి భూదేవి సమేతులై మూలవిరాట్టుకు ముందుగా కొలువై ఉంటారు. 
గమనించవలసిన విషయం ఏమిటంటే కాంచీపురం, తిరుక్కోవిలూర్ ఆలయాలలో శ్రీవారు విరాట్ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం సాధారణ రూపంలో కనపడతారు. కాకపోతే ఉలగండ అన్నా లోకనాథన్ అన్నా అర్ధం మాత్రం సమస్త లోకాలకు అధిపతి అని. 
క్షేత్రం నామమైన తాదళన్  అంటే మూడు అడుగుల మహావిష్ణువు అని అంటారు. ఈ ఆలయంలో కనిపించే మరో విశేషం ఏమిటంటే పైకి ఉన్న ఎడమ పాద దర్శనం నిత్యం భక్తులకు లభిస్తుంది. కానీ క్రింద ఉన్న కుడి పాద దర్శనం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే !
ఉపాలయాలలో శ్రీ లోకనాయకీ తాయారు, శ్రీ గోదా దేవి, శ్రీరామచంద్ర మూర్తి, గరుడాళ్వార్, శ్రీ మనవాళ్ మహర్షి  మరియు శ్రీ తిరుమంగై ఆళ్వార్ కొలువై ఉంటారు. అర్ధ మంటపంలో పన్నిద్దరు ఆళ్వారులు ఉపస్థితులై ఉంటారు. 

తిరుమంగై ఆళ్వార్ 

శ్రీ వైష్ణవుడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన "వేల్"  ధరించి కనపడటం. 
గతంలో ఒకే సమయంలో శైవ గాయక భక్తులలో అగ్రగణ్యులైన శ్రీ తిరుజ్ఞాన సంబందార్ మరియు తిరుమంగై ఆళ్వార్ శిర్కాలి విచ్చేసారట. వారిరువురిలో గొప్పవారు ఎవరు ? అన్న సందేశం కలిగిన భక్తులు వారి నడుమ ఒక పోటీలాంటిది నిర్వహించారట. తిరుమంగై ఆళ్వార్ తన ఇష్టదైవం, స్థానికంగా కొలువైన శ్రీ త్రివిక్రమ పెరుమాళ్ ని కొనియాడుతూ ఎవరికైన అర్ధమయ్యే లలితలలితమైన తమిళ పదాలతో పాశుర గానం చేశారట. పరవశించిపోయిన జ్ఞాన సంబందార్ ఆయనను ప్రశంసించి తన చేతిలో సదా ఉండే వేల్ ని మేడలో ధరించిన మాలను కానుకగా సమర్పించారట. 
నాటి నుండి తిరుమంగై ఆళ్వార్ వాటిని ధరించి కనపడేవారట. 

ఆలయ చరిత్ర 

తిరుమంగై ఆళ్వార్ మరియు తిరు జ్ఞాన సంబందార్ ఇరువురూ ఏడో శతాబ్దానికి చెందివారని చెబుతారు. వారివురు కలయిక జరిగిన ఆలయం కనుక ఏడో శతాబ్దానికి పూర్వమే నిర్మాణం జరిగి ఉండాలన్నది ఆధ్యాత్మిక వాదుల అంచనా !
ఆలయానికి చోళులు, విజయనగర రాజుల, స్థానిక పాలకులు తమ వంతు కైకర్యాలు సమర్పించారని, పునరుద్ధరణ , నిర్మాణ పనులు చేశారని తెలుస్తోంది. వివరాలను తెలిపే శిలాశాసనాలు పదో శతాబ్దం నాటి నుండి ఆలయంలో కనిపిస్తాయి. 

ఆలయ ఉత్సవాలు 

ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు నిర్వహించే ఆలయం ఉదయం ఏడున్నర గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది. 
వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహిస్తారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 
శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి, మత్స్య, కూర్మ, నరసింహ, వామన, పరశురామ, బలరామ జయంతులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్థానిక పర్వదినాలలో వేడుకలు జరుగుతాయి. తిరునాన్గూర్ ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. 
శిర్కాలి రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న ఈ దివ్య దేశాన్ని మిగిలిన వాటితో పాటు దర్శించుకోవచ్చును. స్థానిక ఆటో వారికి ఈ ఆలయాల సమయాల పాతాళ తగినంత అవగాహన ఉండటం వలన వారి సహాయం తీసుకొంటే అన్ని దేవాలయాలను ఒక రోజులు సందర్శించుకునే అవకాశం లభిస్తుంది. 

జై శ్రీమన్నారాయణ ! 


14, మే 2023, ఆదివారం

Singaraya Konda

                      సింగరాయ కొండ సింహాద్రి అప్పన్న


  


అత్యంత అరుదైన రూపంలో శ్రీహరి శ్రీ వరాహ, శ్రీ నరసింహ రూపాలను ఒకే రూపంలో ప్రదర్శిస్తూ కొలువైన క్షేత్రం సింహాచలం. 
సంవత్సరానికి ఒక్కరోజున (అక్షయ తృతీయ) స్వామివారిని నిరంతరం కప్పివుంచే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. తిరిగి అంచెలంచెలుగా చందనంతో స్వామిని కప్పుతారు. ఇలాంటి రూపాన్ని, ఇంతటి అరుదైన అలంకరణను శ్రీమన్నారాయణుడు మరెక్కడా కలిగి ఉండరు. 
అలా చందనంతో కప్పి ఉండక పోయినా, ఒకే మూర్తిలో రెండు రూపాలు లేకపోయినా  శ్రీ నారసింహ స్వామి కొలువైన మరో క్షేత్రాన్ని దక్షిణ సింహాచలంగా పిలుస్తారు. అదే ప్రకాశం జిల్లాలోని "సింగరాయ కొండ". 


ఎంతో విశేష పౌరాణిక గాధకు, చరిత్రకు నిలయం సింగరాయ కొండ. 
సింహాలకు, సకల ప్రాణకోటికి రాజైన శ్రీ నరసింహుడు కొలువైన కొండ తొలుత "సింగర కొండ" గా పిలువబడి అనంతర కాలంలో "సింగరాయ కొండ"గా పిలవబడుతోంది. 
ఈ క్షేత్రంలోని శ్రీ నారసింహస్వామి త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర మూర్తి ప్రతిష్టించారు అని అంటారు. 

క్షేత్ర గాధ 

బ్రహ్మ మానస పుత్రుడు, నిరంతర హరి నామ స్మరణ దీక్షాధారి, త్రిలోక సంచారి అయిన శ్రీ నారద మహర్షి ఈ క్షేత్రంలో హిరణ్యకశపుని సంహరించిన భీకర రూపంలో ఉన్న  శ్రీ నృసింహ  దర్శనాన్ని అపేక్షిస్తూ తపస్సు చేశారట. ఆయనకు దర్శనమిచ్చిన స్వామి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచు కొన్నారట. 
త్రేతాయుగంలో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. ఎందరో మహర్షులు, మునులు, ఋషులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ, యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ సతతం భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవారట. 
ఖరాసురుడు అనే రాక్షసుడు వారిని అనేక ఇక్కట్లకు గురి చేస్తుండే వాడట. చిత్రమైన విషయం ఏమిటంటే అతను శ్రీ నారసింహ భక్తుడు. స్వామివారి దర్శన భాగ్యాన్ని కోరాడట. స్వామి స్వప్నంలో "నేను నా మరో అవతారంలో నీకు దర్శనమిస్తాను. నీవు నా చేతిలో మరణిస్తావు" అని తెలిపారట. ఆగ్రహించిన అసురుడు ప్రజలను హింసించడం చెయ్యసాగాడట. 









మహర్షులు శ్రీ రామచంద్రుని వద్దకు వెళ్లి తమకు రాక్షస బాధను తొలగించమని ప్రార్ధించారట. 
అభయమిచ్చిన అయోధ్యాధిపతి నృసింహ క్షేత్రం చేరుకొని స్వామిని సందర్శించి తానూ ఇక్కడ శ్రీ వరాహ నారసింహుని ప్రతిష్టించదలచానని అనుజ్ఞ ఇవ్వమని ప్రార్ధించారట. 
సరేనన్న స్వామి తొలి పూజ, నైవేద్యాలు తనకు జరగాలని షరతు విధించారట. 
సమ్మతించిన రఘురాముడు పర్వత పైభాగాన శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని ప్రతిష్టించి, అనంతరం యుద్ధంలో ఖరాసురుని సంహరించారట.
నాటి నుండి దక్షిణ సింహాచలం గా పిలవబడుతోంది. శ్రీరాముడు చేసిన వాగ్దానం ప్రకారం నేటికీ తొలి పూజ, నివేదన శ్రీ యోగనారసింహ స్వామి వారికి చేసిన తరువాత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహునికి జరుపుతారు. ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులలో శ్రీ యోగ నారసింహునికి రాత్రి వేళా పూజలు జరపరు. అవి దేవతల సొంతం అన్న భావన ఉండటమే దీనికి కారణం. 

హనుమత్ క్షేత్రం 

నారద మహర్షి శ్రీ యాగ నారసింహుని ఇక్కడకు ఆహ్వానించడానికి ముందు నుండి ఈ ప్రాంతం వానర నివాసంగా ఉండేదట. 
నాలుగు దశాబ్దాల క్రిందట ఆలయ మర్మత్తుల సందర్బంగా జరిపిన త్రవ్వకాల్లో నిలువెత్తు శ్రీ ఆంజనేయ విగ్రహం బయల్పడినది. రామభక్తుని శ్రీ యోగ నారసింహుని సన్నిధి పక్కన ప్రత్యేక సన్నిధిలో ప్రతిష్టించారు. 












ఆలయ చరిత్ర 

తొలినాటి ఆలయ నిర్మాతలు ఎవరన్నది తెలియరాకున్నది. కానీ ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవులు, చోళులు, శాతవాహనులు, విజయనగర పాలకులు, తెలుగు చోడులు ఇతర స్థానిక పాలకులు ఆలయాభివృద్దికి అనేక విధాలుగా కైంకర్యాలు సమర్పించారు. 
విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు తమ దక్షిణ దేశ విజయ యాత్ర సందర్బంగా ఇక్కడికి వచ్చారట. శ్రీ వైష్ణవుడైన ఆయన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో పైకం. భూమి, శ్రీవారికి అనేక ఆభరణాలను సమర్పించుకొన్నారట. ఆలయ జీవోద్దరణ చేసి నూతన నిర్మాణాలను కూడా నిర్మించారట.  దీనికి సంబంధించిన వివరాలను తెలిపే శాసనం రాజగోపురం వద్ద కన్పడుతుంది. 
చిన్న పర్వతం పైన ఉన్న ఆలయానికి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. తూర్పు ముఖంగా రాజగోపురం ఉంటుంది. ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ధ్వజస్థంభం బలిపీఠాలు కనిపిస్తాయి. 
దక్షిణం పక్కన కూడా ఆలయానికి చేరుకోడానికి మార్గం ఉన్నది. 
గర్భాలయంలో శ్రీ లక్ష్మీ వరాహస్వామి స్థానిక భంగిమలో రమణీయ అలంకరణలో దర్శనమిస్తారు. 
ఉపాలయాలలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు, శ్రీ గోదాదేవి (ఆండాళ్), ఆళ్వార్లు కొలువై ఉంటారు. 
ప్రధాన ఆలయానికి కొద్దిగా క్రిందన శ్రీ యోగనారసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలుంటాయి. 








శ్రీ యోగనారసింహుని రూపం విస్మయపరిచే విధంగా\ఉంటుంది. నిలువెత్తు రూపం, విప్పార్చుకొన్న నేత్రాలు. యోగ బంధనం. శత్రు భయంకరంగా, భక్త ప్రియంగా కనపడుతుంది. 
గతంలో ఇదంతా అటవీ ప్రాంతం కావటాన అర్చకులు ఉదయం వచ్చి పూజాదికాలు నిర్వహించి చీకటి పడకుండానే తిరిగి వెళ్లిపోయేవారట. ఒకనాడు వారి చిన్న కుమారుడు కూడా వచ్చారట. 
తిరిగి వెళ్లేటప్పుడు కుమారుని విషయం మరిచిపోయారట. ఇంటికి వెళ్లిన తరువాత గుర్తుకొచ్చినా ఏమీ చేయలేక తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని చూడగా స్వామి పాదాల వద్ద నిద్రిస్తున్న బాలుడు కనపడ్డాడట. రాత్రి భయం వేయలేదా అని అడిగితే ఒక తాత వచ్చి పెరుగన్నం పెట్టి, కధలు చెప్పి నిద్రపుచ్చారు అని చెప్పాడట. 
నారా సంచారం ఉందని అరణ్యంలో స్వామి వారు కాక మరెవరు వస్తారు ?
అందుకే స్వామివారికి పెరుగన్నం పెడతారు.  












శ్రీ రాముని కోరికను మన్నించిన స్వామి విధించిన షరతు ప్రకారంప్రతి నిత్యం  ప్రాతః కాలంలో తొలి నివేదన మాత్రమే చేస్తారు. సాయంకాలం దేవతలు, మహర్షులు స్వామివారి సేవలో గడుపుతారన్నది తరతరాల నమ్మకం. 
వారంలో ఒక్క శనివారం మాత్రమే అర్చక స్వాములు సాయం సంధ్యా సమయంలో శ్రీ యోగ నారసింహునికి పూజాదికాలు నివేదనలు సమర్పిస్తారు. 
స్వామివారు కొలువైన గుహాలయం యొక్క ద్వారం నేరుగా ఉండక కొద్దిగా పక్కకు ఉంటుంది. అంటే ఆలయం ముందు నిలబడినా స్వామి వారి దర్శనం, చూపు ఎదురుగా ఉన్నవారి పడకుండా ఉంటుంది.






 
దీనికి సంబంధించిన ఒక విశేషం స్థానికంగా వినపడుతుంది. 
బంగాళాఖాతంలో దూర ప్రాంతాలకు వెళ్లే తెల్లవారి నౌకలు ఈమార్గం ద్వారానే సాగి పోయేవట. కానీ ఇక్కడకు చేరుకొన్న నౌకలు  హఠాత్తుగా కాలిపోయేవట. ఈవిధంగా నౌకలు ఎలాంటి కారణం లేకుండా దగ్ధం కావడం ఏమిటో వారికి తెలియలేదు. అన్వేషించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారట. 
అనేక రోజులు అన్వేషించిన తరువాత వారు కొండ మీద స్వామివారి విగ్రహం నేత్రాల నుండి వెలువడే తీవ్ర దృష్టి కారణం అని తేల్చారట. అవి సముద్రం మీద పడకుండా ఆలయ ద్వారాన్ని కొద్దిగా పక్కకు నిర్మించారట. అలా చేసినందుకు పరిహారంగా స్వామివారికి రోజుకు ఒక రూపాయి అపరాధ సుంకం క్రింద చెల్లించేవారట. 
ఈ విధమైన గాధలు ఎన్నో వినిపిస్తాయి. 

భావనాశి పుష్కరణి 

దేవేంద్రుడు ఒకనాడు ఆకాశమార్గాన పుష్పక విమానంలో వెళుతూ శ్రీవారి భీకర రూపాన్ని చూసి ఒక విధమైన గగుర్పాటుకు గురైనారట. ఆ సమయంలో చేతిలోని వజ్రాయుధం నేలను తాకిందట. అలా అక్కడ ఒక పెద్ద కోనేరు ఏర్పడినదట. అదే నేడు కొండ క్రింద కనిపించే "ముక్తి భవనాశి పుష్కరణి"  
గతంలో కణ్వ మహర్షి శ్రీ నారసింహ దర్శనాన్ని అపేక్షిస్తూ తపస్సు చేశారట. అప్పుడు ఏర్పాటు చేసిన యజ్ఞ గుండం అనంతర కాలంలో సరస్సుగా మారింది. అదే ఆలయ ఉత్తర దిక్కున కనిపించే "భావనాశి" కోనేరు. 
వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు భావనాశి కోనేటి నీటితో శ్రీ యోగనారసింహ స్వామికి అభిషేకం చేస్తారు. ఆ నీరు క్రిందకు ప్రవహించి ముక్తి భావనాశి పుష్కరణి కి చేరితే తప్పక వర్షాలు పడతాయని విశ్వసిస్తారు. 

ఆలయ ఉత్సవాలు 

ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నిత్య పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు జరుగుతాయి. 
వైకుంఠ ఏకాదశి, శ్రీ నారసింహ మరియు శ్రీ వరాహ జయంతి ఘనంగా జరుపుతారు. 
శ్రీ కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, ధనుర్మాస పూజలు, శరద్న్నవరాత్రి, చిన్న తిరునాళ్ళు సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
స్థానిక పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
జేష్ఠ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. 

మార్గం 

ఇంతటి విశేష క్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చును. ఒంగోలు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సింగరాయ కొండ. ఊరిలో రైల్వే స్టేషన్ ఉన్నది. చాలా రైళ్లు ఆగుతాయి. స్టేషన్ నుండి ఆలయం అయిదు కిలోమీటర్ల దూరం. ఆటోలు లభిస్తాయి. సొంత వాహనాలలో కూడా చేరుకోవచ్చును. 

ఓం నమో నారాయణాయ !!!!!

















Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...