30, ఏప్రిల్ 2015, గురువారం

Appikonda

                          అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం 

దక్షిణ భారత దేశంలో అత్యధిక శాతం శివాలయాలు అగస్థ్య మహర్షితో ముడిపడి ఉంటాయి.  
ఆయన తరువాత అంతే స్థాయిలో కపిల మహాముని కూడా ఎన్నో శివ లింగాలను ప్రతిష్టించారు అని ఆయా ప్రదేశాల పురాణ గాధలు విశదీకరిస్తున్నాయి. 
తిరుపతిలో ఏడుకొండల పాదాల వద్ద ఉన్న "కపిల తీర్థం" ఆయన పేరు మీదగా ఏర్పడినదే!
మహర్షి కొంతకాలం ఇక్కడి కొండ గుహలో తపమాచారించారని అంటారు.ఈయన గురించి నారద, భాగవత, బ్రహ్మాండ, విష్ణు, స్కాంద, పద్మ మరియు బ్రహ్మ పురాణాలలో అలానే వాల్మీకి మహర్షి తన రామాయణ మహా కావ్యంలో పేర్కొన్నారు. వేదవిద్యాకోవిదుడని, యోగ విద్యలో ప్రావీణ్యం ఉన్నవాడిని, అన్నింటికీ మించి పరమ శివ భక్తునిగా తెలిపారు. కపిల ముని భారత దేశ నలుచెరగులా సంచరించారు. ఆ సమయంలో నిత్య పూజ నిమిత్తం ఆయా ప్రదేశాలలో ఒక శివలింగం ప్రతిష్టించేవారట. 
కపిల తీర్ధం లోని శివలింగం తరువాత మహర్షి ప్రతిష్టించిన అంతే మహిమాన్విత లింగం మన రాష్ట్రంలోనే ఉన్నది. అదే "అప్పికొండ"దక్షిణ దేశం అంతా పర్యటిస్తూ మహర్షి ఆంధ్ర దేశ ఉత్తర భాగాన ఉన్న సముద్ర తీరం చేరారట.
సాగరం పక్కనే ఉన్న పర్వతాన్ని సాలగ్రామ శిలా రూపంగా గుర్తించిన కపిల మహర్షి అక్కడ ఒకే రాత్రిలో నూటొక్క లింగాలను ప్రతిష్టించాలని నిర్ణయించుకొన్నారట.
శుచిగా ఆసనం మీద కూర్చొని తదేక ధ్యానంలో ఉంది తన తపశక్తిని ధారపోయడం వలన లింగోద్భవ సమయం నుండి లింగాలు ఉద్భవించడం ఆరంభమైనదట.
నూరు లింగాలు ఉద్భవించే సమయానికి తెల్లవారి పోయినదట.అనుకొన్న నూట ఒక్క లింగాలను ప్రతిష్టించ లేక పోయారట.నిరాశ చెందిన కపిలుడు తన యాత్రను కొనసాగించారట. తాపసి ఈ క్షేత్రానికి ఒక లింగం అప్పుగా  ఉన్నందున నాటి నుండి "అప్పు కొండ" అని పిలవసాగారు. కాల క్రమంలో అప్పికొండగా మారింది.

కాలక్రమంలో  ఈ క్షేత్రం మరుగునపడి పోయినది. ప్రజలు చరిత్ర గురించి మరచిపోయారు. కపిల మహర్షి ప్రతిష్టించిన శత లింగాలు పూజాదికాలు లేక అలా భూమిలో కలిసి పోయాయి.
పదకొండవ శతాబ్దంలో ఒకటవ కుళోత్తుంగ చోళ మహారాజు కళింగ దేశం మీదకు సాగించిన దండ యాత్రలో విజయం సాధించారట.తిరుగు ప్రయాణంలో చోళ చక్రవర్తి ఈ క్షేత్ర పురాణ గాధ తెలుసుకొన్నారట. చోళులు శివ భక్తులు. తమ ఆరాధ్య దైవం యొక్క రూపమైన లింగాలను వెలికి తీయించాడట కుళోత్తుంగుడు.

శత శివ లింగాలలో కపిలుడు  ముందుగా ప్రతిష్టించిన  శ్రీ సోమేశ్వర స్వామి తో పాటు మిగిలిన లింగాలకు ఆలయాలు నిర్మించాడట చోళ చక్రవర్తి. ఆలయాల నిర్వహణకు ఎన్నో భూములను, ఎంతో ధనాన్నిసమర్పించుకొన్నాడట. నిత్య పూజలు జరపడానికి వేదకోవిదులైన బ్రాహ్మణులను నియమించాడట.
 కాలం ఎవరి కోసం ఆగదు కదా ! కుళోత్తుంగుడు లింగరాజుకు నిర్మించిన ఆలయాలన్నీ సాగర తీరంలో ఉన్నాయి.  సముద్రం పక్కన  ఉండటం వలన అద్భుతంగా నిర్మించబడిన ఆలయాలు కొంత కాలానికి ఉప్పుగాలికి కొంత మేర తమ రూపాలను కోల్పోవడమే కాకుండా నిరంతరం వీచే గాలికి ఎగసే ఇసుక క్రింద కప్పబడి పోయాయి. తమ ఉనికిని గుప్తంగా ఉంచుకొన్నాయి. తరాలు మారిపోవడం వలన కొత్త తరం వారికి ఈ ఆలయాల ప్రాశస్త్యం తెలియ లేదు అనేకంటే అవగాహన లేదు అనడం సమంజసం.

సుమారు పదహారో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో కొన్ని మత్స్యకారుల మరియు పశువుల కాపరుల గ్రామాలు ఏర్పడ్డాయి.
పశువుల కాపరులు తీరంలో ఇసుక దిబ్బల మీద ఏపుగా పెరిగే గడ్డి మొక్కలలో పశువులను మేపడానికి తీసుకొని వచ్చేవారు. ఒకసారి కొందరు  పశువుల కాపరులు మొక్కలు నాటడానికి ఎత్తుగా ఉన్న ఇసుక దిబ్బను తవ్వగా ఆలయ శిఖర భాగం కనపడినదట. గ్రామ పెద్దలు విషయం తెలిసి త్రవ్వించగా ఆలయం బయల్పడినదిట.
చాలాకాలం అలానే ఇసుకలో ఏర్పాటు చేసుకొన్న మార్గం ద్వారానే  స్థానికులు సదాశివుని దర్శించుకొనే వారట.

చోళ నిర్మాణ మరియు శిల్ప శైలిని ప్రస్ఫుటంగా ప్రదర్శించే ఈ నిర్మాణాల గురించి అధికారులకు తెలిసి, నిర్మాణాలను పూర్తిగా వెలుపలికి తీశారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపిన త్రవ్వకాలలో మొత్తం మూడు ఆలయాలు బయటపడినాయి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో స్థానిక భక్తులు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసారు.


రక్షిత నిర్మాణాలుగా పరిగణించి పాత కట్టడాన్ని ఏమాత్రం కూల్చకుండా, మార్చకుండా ప్రధాన ఆలయం మీద పై కప్పుగా మరో నూతన నిర్మాణాన్ని నిర్మించారు. క్రింద పాత నిర్మాణాలను అలానే ఉంచేశారు. రెండు పై కప్పులనుచూడవచ్చును. తవ్వకాలలో మొత్తం నాలుగు ప్రధాన లింగాలు, ఒక ఉపాలయం లోని లింగం బయల్పడినాయి.


ఈ కారణంగా అప్పికొండను పంచ లింగ క్షేత్రం అంటారు. అయిదు లింగాలు ఉండే క్షేత్రం గా ప్రసిద్ది.
కాక పోతే ప్రస్తుతం శ్రీ సోమేశ్వర స్వామి కొలువైన  ప్రధాన ఆలయంలోనే ఉన్న మరో ఉపాలయం, వెలుపల ఉన్న రెండు ఆలయాలతో కలిసి నాలుగే ఉంటాయి. అయిదో లింగాన్ని నిధుల మీద ఆశతో దుండగులు భిన్నం చేసారట.ఇక్కడ మొత్తం నాలుగు నందులు ఉంటాయి. నాలుగూ నాలుగు రకాలుగా ఉంటాయి. శ్రీ సోమేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న నంది అన్నిటికన్నా పెద్దగా, జీవకళ ఉట్టిపడుతుంటుంది. మెడలో గంటలు, ఇతర అలంకరణలు బహు చక్కగా చెక్కారు.ద్వారపాలకుల విగ్రహాలు , అర్ధ మండపంలో ఉన్న నటరాజ విగ్రహం ఎంతో  సుందరంగా ఉంటాయి.ముఖ్యంగా నటరాజ మూర్తికి అలంకరణగా చెక్కిన  నగల చెక్కడాల సుందరత   అబ్బురపరుస్తుంది.
గర్భాలయంలో నేల మీద ఉన్న పానువట్టం మధ్యలో స్పటికలింగ రూపంలో శ్రీ సోమేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకొంటారు.
అప్పికొండ లో ప్రతి ఒక్కరూ స్వయంగా అభిషేకాలు జరుపుకొనే అరుదైన అవకాశం లభిస్తుంది.


ప్రాంగణంలో గణపతి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు కలవు. అమ్మవారి సన్నిధి     మరియూ నవగ్రహ మండపం ఉండవు. 

నిత్య పూజలు, మాస శివరాత్రి, కార్తీక మాస పూజలు ఘనంగా చేస్తారు.
శివరాత్రికి వేలాదిగా భక్తులు శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకోడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వస్తారు.


చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపించే ఆలయాలు ఆధ్యాత్మికకు ప్రతీకలు కాగా చక్కని సముద్ర తీరం ప్రకృతి అందాలకు నిలయం.
అత్యంత ప్రశాంత వాతావరణం నెలకొని ఉండే అప్పికొండ కు స్టీల్ ప్లాంట్ నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. అదే విధంగా విశాఖపట్టణం బస్సు స్టాండ్ నుండి, ఆర్కే బీచ్ నుండి, గాజువాక నుండి అప్పికొండకు సిటీ బస్సులు లభిస్తాయి.
స్థానికంగా ఏమీ లభించవు. కనుక మంచి నీళ్ళు, తినడానికి కావలసినవి వెంట తీసుకొని వెళ్ళడం తప్పనిసరి.
పూజారి శ్రీ నాగరాజు ఉదయం పదకొండు గంటల వరకు ఆలయంలో ఉంటారు.


చరిత్రకు ప్రతి రూపమైన అప్పికొండను అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా కలదు.నమః శివాయః !!!!

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...