13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Sri Veerabhadra Swamy Temple, Macherla

                              శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, మాచర్ల 

 

మాచర్ల పట్టణంలో ఉన్న మరో పురాతన ఆలయం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీర భద్ర స్వామి మరియు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆలయం. 
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం. వెయ్యి సంవత్సరాల క్రిందట చోళ రాజులు ప్రతిష్టించిన శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట గ్రామ కారణం తమ ఇలవేల్పు అయిన శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించి రాజ సహకారంతో ఆలయం నిర్మించారట.పురాతన గాలి గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది.
పక్కనే శ్రీ నాగేంద్ర సన్నిధి.
చుట్టలు చుట్టలుగా ఉండే ఆరు అడుగుల నాగేంద్ర పడగలో సూక్ష్మ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని బహు చతురతతో చెక్కారు.
ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి.
ఆలయాన్ని నిర్మించిన శిల్పుల నాయకుని మూర కొలత ఆలయం లోని ఒక శాసనం వెనుక కనపడుతుంది.


ఒకపక్కన నవగ్రహ మండపం ఏర్పాటు చేసారు
ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ ఇష్టకామేశ్వర స్వామి సతీ సుతుల సమేతులై భక్తుల నీరాజనాలు అందుకొంటుటారు
 
 

ఉత్తర ముఖంగా శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది.
లోపల నిలువెత్తు రూపంలో శ్రీ వీరభద్ర స్వామి భక్తులకు అభయ ప్రదాతగా దర్శనమిస్తారు.
ఈ ఆలయంలో సర్ప దోష, రాహు కేతు శాంతి పూజలకు ప్రసిద్ది.
ముఖ్యంగా వివాహం కాని వారు, వివాహం అయినా సంతానం లేని వారు ఎక్కువగా ఈ పూజలలో పాల్గొంటారు.
వివిధ భయాలను  ఆందోళనలను శ్రీ వీరభద్ర స్వామి దర్శనంతో దూరం చేసుకొని జీవితంలో శాంతిని పొందటానికి , జాతక రీత్యా గ్రహ శాంతులు చేయించుకోడానికి ఎందరో దూర ప్రాంతాల నుండి వస్తుంటారు.
ఉదయం నుండి సాయంత్రం వరకూ తెరచి ఉంటుందీ ఆలయం.
మాచర్ల పట్టణానికి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు.
చక్కని వసతి భోజన వసతులు అందుబాటు ధరలో లభిస్తాయి.
ఓం నమః శివాయ !!!!


Sri Lakshmi Chennakeshava Swamy Temple, Macherla

                         శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం, మాచర్ల 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన విశిష్ట నేపద్యం గల ప్రాంతం పల్నాడు. 
నాటికి నేటికీ పల్నాడు ప్రాంతానికి కేంద్ర బిందువు మాచర్ల.
త్రేతాయుగంలో మారీచుడు అనే రాక్షసుడు పాలించిన ప్రాంతం గా ఈ పెరోచినది అన్న ఒక కధనం స్థానికంగా వినిపిస్తుంది.
గత రెండు వేల సంవత్సరాలుగా అనేక రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి.
మహాభారతాన్ని పోలిన పల్నాటి యుద్ధం చోటుచేసుకోన్నదిక్కడే !!
కాల గతిలో విభిన్న అంశాలలో అభివృద్ధి చెందినా ఈ ప్రాంతం నేటికీ చరిత్ర ప్రసిద్ది చెందిన అనేక స్థలాలను, కట్టడాలను మఱియు ఆలయాలను సగర్వంగా ప్రపంచానికి చూపుతోంది. 
అలాంటి వాటిల్లో శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం ప్రధమ స్థానంలో ఉన్నది.


నగర నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పై చిలుకు చరిత్రకు ప్రత్యక్ష సాక్షి.
పన్నెండో శతాబ్దంలో ( 1113 వ సంవత్సరం) ఈ ప్రాంతాన్ని పాలించిన హైహేయ వంశ రాజు "కార్తవీర్యార్జనుడు" శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి మూర్తిని ప్రతిష్టించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి.
హైహేయ వంశం వారి స్వస్థలం నేటి ఛత్తీస్ ఘర్ రాష్ట్రం లోని జబల్ పూర్ గా చెబుతారు.
కొన్ని రాజకీయ కారణాల వలన అక్కడ నుండి వారు ఇక్కడికి వలస వచ్చి రాజ్య స్థాపన చేసారని చరిత్ర కారుల అభిప్రాయం.

అప్పట్లో ఇక్కడ చాళుక్య దండ నాయకుడు నిర్మించిన శ్రీ ఆదిత్యేశ్వర స్వామి ఆలయం ఉండేదని, ఆ స్థానంలో హైహేయ రాజులు తమ కుల దైవం అయిన శ్రీ చెన్నకేశవ స్వామిని ప్రతిష్టించారు అని అంటారు.
పల్నాటిని పాలించిన దాదాపుగా అన్ని రాజ వంశాల కుల మఱియు ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామే !!
వారి ఏలుబడిలో ఉన్న నేటి గుంటూరు, ప్రకాశం ప్రాంతాలలో అనేక సుందర చెన్న కేశవ ఆలయాలు ఉండటానికి కారణం ఇదే !!
 హైహేయ రాజు "నలగాము"ని మంత్రి అయిన "బ్రహ్మనాయుడు" వైష్ణవమతాభిమాని.
అందుకని శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించి స్వామి వారిని కూడా పునః ప్రతిష్టించి వైఖానస ఆగమ విధాన పూజా కార్యక్రమాలను ఆరంభింప చేసారు. 

 
సువిశాల ప్రదేశంలో చంద్ర వంక నదీ తీరంలో ఉంటుందీ ఆలయం.
వెళ్ళే దారిలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మఱియు శ్రీ భక్తాంజనేయ ఆలయాలను సందర్శించుకోనవచ్చును.


ఎత్తైన రాజ గోపుర ద్వారానికి ఎదురుగా, పెద్ద రాతి స్థంభం, కళ్యాణ మండపం, ద్వారానికి ఇరుపక్కలా ద్వార పాలకులు ఉంటారు.
ఆలయ చరిత్రను తెలిపే "పురాతన" బోర్డు చరిత్రను సంక్షిప్తంగా తెలుపుతుంది.
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా బలి పీఠం ధ్వజస్తంభం ఉంటాయి.
ధ్వజస్తంభానికి ఇరుపక్కలా రెండు రాతి స్తంభాల మీద నిర్మించిన చిన్న గూడు లాంటి వాటిల్లో శ్రీ గరుత్మంతుడు శ్రీ ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో స్వామి వారి ఆనతి కొరకు ఎదురు చూస్తుంటారు.
ధ్వజస్తంభం మూలంలో మరో వినతా సుతుని విగ్రహం కనపడుతుంది.


ముఖ మండప పై భాగాన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ మరియు దశావతార రూపాలను నిలిపారు.
ఆగ్నేయంలో వంటశాల,ఈశాన్యంలో ఆలయ నీటి అవసరాల నిమిత్తం తవ్విన నూతి ఉంటుంది.
ప్రదక్షిణా ప్రాంగణంలో మాచర్ల ప్రాశస్త్యం తెలిపే పెద్ద నాగ శాసనం ఉంటుంది.
ఇక్కడే శ్రీ గిరీశ్వర స్వామి ఆలయం ఉంటుంది.
శ్రీ గీరీశ్వర స్వామి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ పార్వతీ దేవి కొలువై ఉంటారు.
అమ్మవారికి ఎదురుగా సింహ వాహనానికి బదులుగా నంది ఉండటం అర్ధనారీశ్వర తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
ఎత్తైన పానవట్టం మీద చిన్న లింగ రూపంలో శ్రీ గీరీశ్వర స్వామి భక్తుల నీరాజనాలు అందుకొంటూ ఉంటారు.శ్రీ గీరీశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకంగా బలి పీఠం మఱియు ధ్వజస్తంభం ఉంటాయి.
ఇక్కడ ఒక తెలుగు శాసనం కనపడుతుంది.


ప్రాంగణంలో ఎన్నో సుందర శిల్పాలు ఉన్నా అవన్నీ సంవత్సరాల తరబడి వేస్తున్న రంగుల మూలంగా సుందరత్వం కోల్పోయి నామ మాత్రంగా కనపడుతాయి.ప్రదక్షణ పూర్తి చేసుకొని ప్రధాన ఆలయం లోనికి ప్రవేశిస్తే అన్ని పక్కలా అనేక వాహనాలు కనపడతాయి. 
మధ్యలో ఉన్న నల్ల రాతి మండపానికి ఉన్న నాలుగు స్తంభాల మీద ఒక దాని మీద రామాయణ, మరో దాని మీద మహా భారత, మూడో దాని మీద మహా భాగవత ఘట్టాలను రమణీయంగా చెక్కగా, నాలుగో దాని మీద దశావతార రూపాలను మలచారు.
మిగిలిన స్థంభాల మీద లిఖించిన శాసనాలు దాదాపుగా కనుమరుగయ్యే స్థితిలో కనిపిస్తాయి.
కుడి వైపున రాజేశ్వరీ అమ్మవారి సన్నిధి, ద్వారానికి ఇరుపక్కలా గరుడుడు, హనుమంతుడు ఉంటారు.
పక్కనే ఆళ్వార్ సన్నిధి.
గర్భాలయ ద్వారానికి రెండుపక్కలా జయ విజయులు.
లోపల చతుర్భుజాలతో స్థానక భంగిమలో శ్రీ చెన్న కేశవ స్వామి భక్తులకు నయన మనోహర అలంకరణలో దర్శన మిస్తారు.


ప్రతి నిత్యం భక్తుల స్తోత్ర పాఠాలతో సందడిగా ఉండే ఆలయంలో పర్వదినాలలో మరింత కోలాహలం వాతావరం నెలకొంటుంది.
అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు.
సంవత్సరానికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆఖరి రోజున రధోత్సవం ప్రత్యేక ఆకర్షణ.
ధనుర్మాసంలో తిరుప్పావై గానం , భోగినాడు గోదా కల్యాణం రంగరంగ వైభవంగా చేస్తారు.
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు దాకా తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకూ ఆలయం భక్తుల కొరకు తెరచి ఉంటుంది.
 


కవి సార్వభౌముడు శ్రీ నాధుడు ఇక్కడ తన జీవితంలో కొన్ని రోజులు గడిపి "పల్నాటి చరిత్ర" రచించారని తెలుస్తోంది.
వెయ్యి సంవత్సరాల చరిత్రకు సజీవ రూపం అయిన శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం తప్పక సందర్శించవలసిన పవిత్ర క్షేత్రం.

నమో చెన్న కేశవాయ నమః !!!!

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...