7, ఫిబ్రవరి 2015, శనివారం

Kadiri Sri Narasimha Swamy Temple

                 కాటమరాయుడా............. కదరీ నరసింహుడా ...... 

మన రాష్ట్రం మరియు తెలంగాణా రాష్ట్రం నారసింహ ఆలయాలకు ప్రసిద్ది.
ఎన్నో అద్భుత, విశేష క్షేత్రాలు నెలకొని ఉన్నాయి.
అలాంటి వాటిల్లో అనంత పురం జిల్లాలో ఉన్న "కదిరి " మరింత విశేషమైనది.
నేటి అహోబిల ప్రాంతంలో లోకకంటకుడైన "హిరణ్య కశపు"ని సంహరించిన తరువాత ఆవేశంతో ఇక్కడికి వచ్చిన స్వామి రమణీయ వాతావరణం వలన, మునుల సపర్యల వలన శాంతించారట. 
మహార్హుల ప్రార్ధనలకు సంతుష్టుడైన శ్రీ నారసింహ స్వామి ఇక్కటే స్వయం ప్రకటిత మూర్తిగా వెలసారట.

 వేదాలను మానవాళికి అందించిన "వేదవ్యాస మహర్షి "కొంత ఆలం సంచరించిన ప్రాంతం కావడాన "వేదారణ్యం" అని పిలిచేవారట. 
అర్జున నది ( మద్దిలేరు) తీరంలోని దట్టమైన ఈ అటవీ ప్రాంతం ఒకప్పుడు ఎందరో మునులకు, మహర్షులకు, సాధకులకు నివాసంగా పేరొందినది. 
అలా ఇక్కడ చాలాకాలం నివసించిన వారిలో "శ్రీ భ్రుగు మహర్షి"ఒకరు. 
ఆయన నిత్యం సామి వారిని భక్తిశ్రద్దలతో సేవించేవారట.
అలా ఇక్కడికి వచ్చే క్రమంలో స్వామి దగ్గరలోని కొండ మీద పాదం బలంగా మోపడం వలన ముద్ర పడిపోయింది.
"ఖా" అంటే "పాదం" , "ఆద్రి" అనగా కొండ. స్వామివారి పాదముద్ర ఉన్న కొండగా "ఖాద్రి" అని తొలినాళ్ళలో పిలవబడి క్రమంగా "కదిరి"గా మారింది అని అంటారు.  
ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమీద నేటికీ స్వామివారి పాద ముద్రను సందర్శించుకోనవచ్చును.
కాలక్రమంలో మహర్షులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోగా స్వామివారి రూపం చుట్టూ వాల్మీకాలు ఏర్పడి పోయాయి.
కలియుగంలో శ్రీశైలానికి చెందినా మాధవ నంబి మరియు కేశవనంబి అనే బలిజ కులస్థులైన సోదరులు వ్యాపార నిమిత్తం ఊరూరా తిరుగుతూ ఉండేవారట.
ఒకనాటి రాత్రి ఈ క్షేత్ర ప్రాంతంలో విశ్రమించిన వారికి స్వప్నంలో శ్రీ నారసింహుడు కనపడి "తాను సమీపంలోని "ఖాద్రి (చండ్ర ) వృక్ష" మూలం లోని పుట్టలో ఉన్నా"నని తెలిపారట.
అంతట వారు ఆ సూచనల ప్రకారం దివ్యమంగళ కాంతితో వెలిగిపోతున్న స్వామివారిని కనుగొన్నారట.
అలాశ్రీ స్వామివారు ఖాద్రి వృక్షం క్రింద లభించినందున ఈ క్షేత్రానికి ఖాద్రి అన్న పెరోచ్చినది అని కూడా అంటారు.
స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించిన నంబి సోదరులు తొలుత వారే పూజాదికాలు నిర్వహించేవారు.
ఆకారణంగా వర్ణ కుల వివక్ష అధికంగా ఉన్న ఆ రోజులలో అలాంటివి లేకుండా అందరికీ ఆలయ ప్రవేశ భాగ్యం లభించిన పవిత్ర స్థలం కదిరి.
తదనంతర కాలంలో విజయనగర పాలకులు వైఖానస విధానాన్ని ప్రవేశపెట్టి అందులో నిష్ణాతులైన బ్రాహ్మణులకు స్వామి వారి పూజల భాద్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది.

విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తొలినాళ్ళలో హరిహర రాయలవారి స్థానిక పాలెగాడు అయిన "శ్రీ రంగ నాయుడు" అరణ్యాన్ని తొలగించి గ్రామాన్ని స్వామివారికి ఒక సుందర ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలియజేస్తున్నాయి.
తరువాత శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో కొన్ని నిర్మాణాలు, స్థానిక భక్తుల ఆధ్వర్యం లో మరికొన్ని నిర్మాణాలు జరిగి ఆలయం ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.
పదకవితా పితామహుడు మరియు ప్రముఖ సంకీర్తనా కారుడు అయిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు కదిరి క్షేత్ర అభివృద్దికి ఎంతో కృషిచేసారు.
సుమారు వెయ్యి సంవత్సరాలుగా భక్తుల పూజలందుకొంటున్న ఖాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయం మూడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నాలుగువైపులా సుందర గోపురాలతో ఎత్తైన ప్రహారితో ఉంటుంది.
తూర్పు గోపురం దగ్గరలో శ్రీ వినాయక, శ్రీ కృష్ణ, శ్రీ ద్వార ఆంజనేయ ఆలయాలు, గోపురానికి ఎదురుగా రాతి దీప స్తంభము, శ్రీ గరుడాల్వార్ సన్నిధి ఉంటాయి.

ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఎదురుగా బలి పీఠం, ధ్వజస్తంభం, కుడివైపున వంటశాల, భాష్యకారుల, శ్రీ గోవిందరాజ, శ్రీ క్షెత్రపాలక, సన్నిదులుంటాయి.
చక్కని కళ్యాణ మండపం దక్షిణం పక్కన నిర్మించారు.


ఆలయం మండపాల పైన దశావతార మరియు శ్రీ మహావిష్ణు సుందర రూపాలను అమర్చారు.
ఉత్తరాన ఊయల మండపం, వెయ్యికాళ్ల మండపం, పుష్కరణి, వాహనశాల, కళ్యాణ కట్ట, అశ్వద్ద వృక్షం క్రింద నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి.

ఇక్కడ చిన్న మందిరంలో భారత లక్ష్మణ శత్రుఘ్నహనుమలతో కలిసి కొలువైన శ్రీ సీతా రామచంద్రుల చక్కని శిల్పం ఆకట్టుకొంటుంది.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని రంగ మండపం లోనికి ప్రవేశిస్తే ఎడమ వైపున శ్రీ గోదాదేవి (ఆండాళ్), కుడి వైపున శ్రీ అమృత వల్లీ తాయారు సన్నిధి, పక్కనే శ్రీ వేదాంత దేశిక, ఆళ్వార్ సన్నిధి ఉంటాయి.

రంగమండప పైకప్పుకు సహజ వర్ణాలతో చిత్రించిన మనోహర పురాణ ఘట్టాల చిత్రాలు కనివిందు చేస్తాయి.
మండపా స్తంభాల పైన అనేక దేవతా మూర్తుల శ్రీ యోగ నారసింహ, శ్రీ ఆంజనేయ, శ్రీ చతుర్భుజ వేణుగోపాల, శ్రీ నవనీత శ్రీ కృష్ణ, నాట్య గత్తెల, వాద్య కారుల, వివిధ జంతువుల రూపాలను జీవం ఉట్టి పడేలా మలచారు.
లతల పుష్పాల సూక్ష్మ చెక్కడాలు అబ్బుర పరుస్తాయి.

అమ్మవారాలను దర్శించుకొని అర్ధ మండపం గుండా గర్భాలయాన్ని చేరితే అష్ట భుజాలతో ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు శ్రీ నారా సింహ స్వామి.
రెండు చేతులతో హిరణ్య కశపుని శిరస్సు పాదాలను పట్టుకొని, రెండు చేతులతో అసురుని ఉదరం చీలిస్తూ, రెండు చేతులతో ఖడ్గం, ఖేటకం, మిగిలన రెండు చేతులలో శంఖు చక్రాలను ధరించిన అరుదైన అపురాప రూపంలో స్వామి కొలువై ఉంటారు. ఇలాంటి రూపం మరెక్కాడా కానరాదు.
ఎదురుగా ముకుళిత హస్తాలతో ప్రహ్లాదుడు ఉండటం కూడా ఇక్కడే చూస్తాము.

ఉదయం అయిదు గంటల నుండి మద్యాహ్నం పన్నెండు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకూ భక్తుల కొరకు తెరచి ఉండే ఈ ఆలయంలో ఆచార విధివిధానాల ప్రకారం ఎన్నో పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు ప్రతినిత్యం మూలవరులకు జరుపుతారు.
ప్రతి'శుక్ర వారం శ్రీ అమృతవల్లి తాయారుకు ప్రత్యేక కుంకుమ పూజలు చేసి ప్రత్యేక ఆస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. \ప్రతి శనివారం స్వామి వారిని తిరువీధులలో ఊరేగిస్తారు.
ప్రతి నెలా స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి రోజున ప్రత్యేక పూజలు, వైశాఖ మాసంలో శ్రీ నృసింహ జయంతి ఘనంగా నిర్వహిస్తారు.
ప్రతినెలా ఒక రోజున విశిష్ట సేవలు పూజలు స్వామివారికి జరుగుతాయి.


ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు నిర్వహిస్తారు.
ఫాల్గుణ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ప్రతి రోజు ఆంధ్ర, కర్నాటక ప్రాంతాల నుండి తరలి వచ్చే వేలాది భక్తులతో ఆలయం నిత్య కల్యాణం పచ్చ తోరణంగా సంపూర్ణంగా అద్భుత ఆధ్యాత్మిక వాతావరణం నింపుకొని దర్శనమిస్తుంది.


ఈ నిత్య, వార, పక్ష, మాస, సంవత్సర పూజలే కాకుండా భక్తుల సౌలభ్యం కొరకు ఎన్నో ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి.



మహిమాన్వితమైన పుణ్య క్షేత్రం కదిరి పట్టణాన్ని రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా బస్సుల మరియు రైలు మార్గంలో చేరవచ్చును.
తగిన సౌకర్యాలు లభిస్తాయి.
కదిరి పట్టణానికి సమీపంలో చూడ దగ్గ విశేషాలలో ఒకటి తిమ్మమ్మ మఱ్ఱి మాను.

జై శ్రీ లక్ష్మీ నారసింహ !!!!!












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...