శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, మాచర్ల
మాచర్ల పట్టణంలో ఉన్న మరో పురాతన ఆలయం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీర భద్ర స్వామి మరియు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆలయం.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం.
వెయ్యి సంవత్సరాల క్రిందట చోళ రాజులు ప్రతిష్టించిన శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట గ్రామ కరణం తమ ఇలవేల్పు అయిన శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించి రాజ సహకారంతో ఆలయం నిర్మించారట.
పక్కనే శ్రీ నాగేంద్ర సన్నిధి.
చుట్టలు చుట్టలుగా ఉండే ఆరు అడుగుల నాగేంద్ర పడగలో సూక్ష్మ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని బహు చతురతతో చెక్కారు.
ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి.
ఒకపక్కన నవగ్రహ మండపం ఏర్పాటు చేసారు.
ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ ఇష్టకామేశ్వర స్వామి సతీ సుతుల సమేతులై భక్తుల నీరాజనాలు అందుకొంటుటారు.
లోపల నిలువెత్తు రూపంలో శ్రీ వీరభద్ర స్వామి భక్తులకు అభయ ప్రదాతగా దర్శనమిస్తారు.
ఈ ఆలయంలో సర్ప దోష, రాహు కేతు శాంతి పూజలకు ప్రసిద్ది.
ముఖ్యంగా వివాహం కాని వారు, వివాహం అయినా సంతానం లేని వారు ఎక్కువగా ఈ పూజలలో పాల్గొంటారు.
వివిధ భయాలను ఆందోళనలను శ్రీ వీరభద్ర స్వామి దర్శనంతో దూరం చేసుకొని జీవితంలో శాంతిని పొందటానికి , జాతక రీత్యా గ్రహ శాంతులు చేయించుకోడానికి ఎందరో దూర ప్రాంతాల నుండి వస్తుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి