లేపాక్షి బసవయ్యా ......... లేచి రావయ్యా .........
మన రాష్ట్రం లో ఉన్న ఆపూర్వ ఆలయాలలో లేపాక్షీది ప్రముఖ స్థానం.
విజయ నగర పాలకులే కాదు వారి వద్ద పనిచేసిన అధికారులు కూడా అమిత దైవ భక్తి మరియు కళాభిమానం ఉన్నవారన్న సత్యాన్ని తెలుపుతుంది.
అయిదు వందల సంవత్సరాల నాటి చరిత్రకే కాదు యుగ యుగాల నాటి పౌరాణిక గాధలకు ప్రత్యక్ష సాక్షి లేపాక్షి.
ప్రస్తుతం పురావస్తు శాఖ వారి నిర్వహణలో ఉన్న ఈ ఆలయ విశేషాల సమాహారం.
శివపార్వతుల వివాహానికి భూమండలం లోని ప్రజలందరూ ఉత్తరాపధానికి తరలి వెళ్ళడంతో అటు పక్కన భూ భారం పెరిగిందట.
అప్పుడు సర్వేశ్వరుడు అసంఖ్యాక శిష్య ప్రశిష్యులు గల అగస్థ్య మహర్షిని దక్షిణానికి తరలి వెళ్ళమని ఆజ్ఞాపించారు.
ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే తమ కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే వరాన్ని ప్రసాదించడంతో మహర్షి వింధ్య పర్వతాన్ని దాటారు.
తన దక్షిణ దేశ పర్యటనలో మహాముని ఎన్నో క్షేత్రాలలో నివసించి అక్కడ నిత్య పూజ నిమిత్తం లింగాలను ప్రతిష్టించారు.
ఆ క్షేత్రాలు స్వయం దేవతా నివాస క్షేత్రాలుగా ప్రసిద్ది చెందాయి.
అలాంటి వాటిల్లో లేపాక్షీ ఒకటి.
అగస్థ్య మహర్షి తపమాచరించిన గుహ ఆలయ రెండో ప్రాకారంలో నేటికీ చూడవచ్చును.
ఆయన ప్రతిష్టించిన శ్రీ గణపతి శ్రీ పాపనాశేశ్వర స్వ్వామి గర్భాలయంలో నేటికీ పూజలందుకొంటున్నారు.
స్కాంద పురాణంలో శ్రీ పాపనాశేశ్వర స్వామి ఆలయాన్ని నూట ఎనిమిది పవిత్ర ప్రసిద్ద శివాలయాలలో ఒకటిగా కీర్తించబడినది.
కలియుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ రాజు శ్రీ పాపనాశేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించి, శ్రీ తాండవేశ్వర స్వామి లింగాన్ని రెండో ప్రాకారంలో ప్రతిష్టించారని తెలుస్తోంది.
నాలుగు కాళ్ళ మండపంలో ఉన్న శ్రీ తాండవేశ్వరస్వామి లింగాన్నినేటికీ దర్శించుకొనవచ్చును.
దానికి నిదర్శనంగా రెక్కలు తెగి భాద పడుతున్న జటాయువు దాహం తీర్చడానికి భూదేవి గారల బిడ్డ కొండ రాతి మీద తన పాదం మోపి నీటిని రప్పించినదట.
నేటికీ ఆ పాద ముద్రను రెండో ప్రకారం లోని ఊయల మండపం దగ్గర చూడవచ్చును. ఎండాకాలంలో కూడా ఈ పాదంలో తడి కనపడటం చెప్పుకోదగిన విషయం.
సొమ్మసిల్లి పడివున్న పక్షిని రాముడు ప్రేమగా తట్టి "లే పక్షీ !" అన్నారట. దాని నుండే లేపాక్షి పుట్టినది అంటారు.
సీతా దేవిని రావణుడు తీసుకొని దక్షిణ దిశగా వెళ్ళాడు అన్న విషయం తెలిపి మరణించాడు జటాయువు.
శ్రీ రాముడు పక్షి రాజుకు అంత్య క్రియలు నిర్వహించినట్లుగా పేర్కొనే స్థలం ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది.
శ్రీ రాముడు ఆయన అనుంగు అనుచరుడు శ్రీ హనుమ ప్రతిష్టించిన "శ్రీ రామ మరియు శ్రీ హనుమ" లింగాలను గర్భాలయంలో సందర్శించుకొనవచ్చును. శిల్ప చిత్ర కళా భాండారంగా పేర్కొనదగిన ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో నిర్మించబడినది.
శ్రీ కృష్ణ దేవరాయల సోదరుడైన అచ్చుత రాయల కాలంలో సమీపంలోని పెనుగొండ ఉపరాజధాని.
దానికి కోశాధికారి "నంది వీరన్న".
శ్రీ వీరభద్ర స్వామి భక్తుడు.
కూర్మ గిరి మీద తన ఆరాధ్య దైవానికి అప్పటికే అక్క ఉన్న దేవతా మూర్తులకు ఆలయం నిర్మించాలన్నది ఆయన సంకల్పం.
రాజానుమతి కొరకు విజ్ఞప్తి పంపి బేలూరు ఆలయాన్ని నిర్మించిన శిల్పుల సలహా మేరకు నిపుణులైన "జక్కన్న మరియు హంపన్న"లను ప్రధాన శిల్పులుగా నియమించారు.
చిత్ర లేఖనాల కొరకు విజయవాడ సమీపంలోని కొండవీదుకు మరియు ఉత్తరాంద్రాలోని విజయనగరానికి చెందిన చిత్రకారులను పిలిపించారు.
కూర్మ గిరి (తాబేలు ఆకారం లో ఉండే కొండ) మీద మూడు ప్రాకారాలుగా నిర్మించారీ ఆలయాన్ని.
ఎత్తులో ఉత్తర దిశగా ఉండే ప్రాంగణం లోనికి సోపాన మార్గంలో చేరుకోవాలి.
ఆలయానికి వెలుపల నలుదిక్కులా చక్కని ఉద్యాన వనాలను యాత్రీకులు సేదతీరడానికి ఏర్పాటు చేసారు.
ఇక్కడే పెద్ద రాతి దీప స్థంభం ఉంటుంది.
తొలి ప్రాకారం లోనికి ప్రవేశించగానే బలి పీఠం కనిపిస్తుంది.
కుడి ఎడమలలో విశాలమైన మండపాలు యాత్రీకుల కొరకు నిర్మించారు.
తొలి ప్రాకారంలో గోడల పైన పురాతన కన్నడ లిపిలో ఉన్న శాసనాలు కనిపిస్తాయి.
ఒకచోట నమస్కార భంగిమలో ఉన్న ఆలయ రూపకర్త విరూపన్న రూపం చెక్కి ఉంటుంది.
నైరుతీ మూలలో సోమవార మండపం ఉంటుంది.
గతంలో గ్రామస్తులంతా ప్రతి సోమవారం ఇక్కడ సమావేశం అయ్యేవారట. అందుకని ఆ పేరు వచ్చినది.
దీనికి ఎదురుగా ప్రసిద్ది చెందిన సప్త ఫణి నాగేంద్ర విగ్రహం ఉంటుంది.
ఒకనాడు శిల్పులు భోజన సమయానికి వంట శాలకు రాగా వారి తల్లి వంట పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని తెలిపిందట.
ఖాళీగా ఉండటమెందుకని ఒక్కడ ఉన్న భారీ శిలలో ఈ శిల్పాన్ని అల్ప సమయంలో చెక్కారట.
వంట పూర్తీ చేసుకొని బయటికి వచ్చిన వారి తల్లి దానిని చూసి ఇంత తక్కువ సమయంలో చేక్కారా ? అని అబ్బుర పోగా నరుని కంటికి నల్ల రాయైనా పగులుతుంది అన్న సామెత లోలా పడగ భాగంలో పగులు వచ్చినదట.
నేటికీ ఆ పగులును చూడవచ్చును.
ఈ ఉదంతం పని యందు నాటి శిల్పులకు ఉన్న శ్రద్దకు నిదర్శనంగా పేర్కొనవచ్చును.
తరువాత ఇక్కడికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రసిద్ద లేపాక్షి నందిని సప్త ఫణి నాగేంద్రునిలో ఉంచిన శివలింగాన్ని చూస్తున్నట్లుగా చెక్కారు.
ఈ సప్త ఫణి నాగేంద్రుని క్రింద సప్త మాతృకలు వెనుక బండ మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ ఉదంతాన్ని చక్కగా చెక్కారు.
కొద్దిగా ముందుకు వెళితే అదే కొండ రాయిలో "శ్రీ మూషిక వినాయక" రూపాన్ని చెక్కారు.
చవితి నాడు కడుపు నిండా ఉండ్రాళ్ళు తిని నడవలేక నడుస్తున్న గణపతిని చూసి చంద్రుడు నవ్యాడట.
ఆగ్రహించిన మూషిక వాహనుడు అతనిని కొట్టడానికి అన్నట్లుగా తన దంతాన్ని విరిచి కుడి చేతిలో పట్టుకొని కనిపిస్తారు.
అందుకే ఈయనను "చవితి వినాయకుడు"అంటారు.
విఘ్న నాయకునికి మొక్కి ముందుకు కదిలితే అసంపూర్ణ కళ్యాణ మండపం మరియు ఒక ద్వారం ఉంటాయి.
ద్వారం తాలూకు గోడపైన ఎఱ్ఱని రంగులో ఉన్న రెండు చిన్న గుంటలు కనపడతాయి.
వీటి వెనుక ఒక విషాద గాధ ఉన్నట్లుగా తెలుస్తోంది.
వీరపన్న అంటే గిట్టని వారు రాజు అచ్యుత రాయలకు అతను రాజు గారి ఖాజానాకు చెందవలసిన ధనాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా ఖర్ఛు పెడుతున్నాడని చాడీలు చెప్పారట.
ఆగ్రహించిన రాయలు వీరపన్న నేత్రాలను తొలగించ వలసినదిగా ఆదేశించారట.
ఆ విషయం ముందుగానే తెలిసి ఆత్మాభిమానం గల వీరపన్నభాద పడి తన కన్నులను తానే పెరికి వేసుకొని గోడ మీదకు విసిరివేసాడట.
1902 వ సంవత్సరంలో ఆంగ్లేయ పరిశోధకులు ఎఱ్ఱగా కనిపిస్తోంది మానవ రక్తమే అని కనిపెట్టడం ఈ ఘటన సత్యం అని తెలుపుతోంది.
తానూ నమ్మిన దైవానికి ఆలయం నిర్మించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వీరపన్న కాంస్య విగ్రహాన్ని ఆలయానికి వెలుపల మూడు సంవత్సరాల క్రిందట నెలకొల్పారు.
వీరపన్న తన కన్నులను కోల్పోవడంతో ఆలయ నిర్మాణం నిలిచి పోయింది.
ముఖ్యంగా కళ్యాణ మండపం.
ఆకాశమే పై కప్పుగా కలిగిన ఈ కళ్యాణ మండపం సర్వేశ్వరుని కల్యాణానికి సమస్త దేవతలు ఎంతటి ఆదరాభి మానాలతో భక్తీ శ్రద్దలతో పాల్గొన్నారో తెలుపుతుంది.
వరుని పాదాలు కడగటానికి హిమవంతుడు భార్య మైనా దేవి తో కలిసి అర్ఘ్యం పట్టుకొన్న పాత్రతో సుందరంగా మలచబడ్డారు.
మరో స్థంభం పైన వధువు హస్తాన్ని పట్టుకొన్న మహేశ్వరుడు. వధూవరులిద్దారూ రమణీయం అలంకరణలో ఉంటారు.
తూర్పున ఇంద్రుడు ఐరావతం మీద, ఆగ్నేయంలో అగ్ని దేవుడు రెండు తలల గొర్రె మీద, దక్షిణాన మహిషి వాహనం మీద యమధర్మ రాజు, పడమరలో వరుణుడు మొసలి వాహనునిగా, వాయువ్యంలో జింక మీద వాయువు, నైరుతిలో అశ్వ వాహనునిగా కుబేరుడు ఉంటారు.
వివాహ క్రతువు నిర్వహించడానికి వశిష్ట విశ్వామిత్రులు ఎదురెదురు స్తంభాల మీద చెక్కబడినారు.
మహావిష్ణువు, దత్తాత్రేయుడు, బృహస్పతి ఉచితాసనాలమీద, అతిధులకు స్వాగతం పలుకుతూ పంచ ముఖ బ్రహ్మ, గణపతి మరియు సప్త మహర్షులు కనిపిస్తారు.
కొన్ని స్తంభాల పైన ఒకే రూపంలో వివిధ భంగిమలలో చూస్తే రకరకాలుగా కనిపించే ఆవు, కోతులు, నాటి ప్రజలకు వినోద కార్యక్రమాలైన వీధి లో ఆడే ఆటలను, నాటి స్త్రీ అలంకరణా విశేషాలను చెక్కారు.
కళ్యాణ మండపం పక్కనే ముఫై ఆరు స్తంభాలతో కూడిన లతా మండపం ఉంటుంది.
ఒక్కో స్థంభం పైన ఒక్కో రకమైన పుష్పాలతో కూడిన లతలను సుందరగా మలచారు.
నేడు వాటినే లేపాక్షీ చీరల అంచుల మీద ముద్రిస్తున్నారు.
ఇలాటి సూక్ష్మ చెక్కడాలు ఆలయం లోని అనేక స్తంభాలపైన కూడా చెక్కబడినాయి.
ఇలా మొదటి ప్రాకారం నుండి రెండో ప్రాకారం చూసి తిరిగి మొదటి ప్రకారం లోనికి వెళ్ళే చోట శ్రీ తాండవేశ్వర స్వామి లింగాన్ని, ఊయల మండపాన్ని సీతా దేవి పాదాన్ని చూడ వచ్చును.
ఊయల మండపంలో శ్రీ ఆంజనేయ స్వామి రూపం చెక్కిన శిలా ఫలకాన్ని ఉంచారు.
ఇక్కడ గోడమీద స్థానిక సామంతుల చిహ్నమైన చేపను, క్రింద నాటి శిల్పులు మధ్యలో రాగి సంకటి చుట్టూ ఆధరవులు పెట్టుకొని సులువుగా భోజనం చేయడానికి వీలుగా రాతి కంచాలను చెక్కారు.
సువిశాల ప్రకారం చుట్టూ యాత్రీకుల సౌలభ్యం కొరకు ఎన్నో మండపాలను నిర్మించారు.
ఇక్కడే ఒక మూల రాకులు, సజ్జలు, జొన్నలు పిండి చేయడానికి వాడిన పెద్ద రాతి తిరగలి కనపడుతుంది.
తిరిగి ధ్వజస్థంభం దగ్గర నుండి గర్భాలయం వెళ్ళే మార్గం లో వచ్చే నాట్య మండపం దగ్గరకు వెళ్ళేటప్పుడు ద్వారానికి ఇరుపక్కలా నాలుగు సుందర స్త్రీ మూర్తుల రూపాలను చెక్కారు.
వారిని పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి మరియు నర్మదలకు ప్రతి రూపాలుగా పేర్కొంటారు.
ఈ నాట్య మండపం నేడు వివాహ సందర్భంగా జరిగే సంగీత నాట్య విభావరులకు మూలంగా చెప్పవచ్చును.
వధూవరులిద్దరూ ఉచితాసనాల మీద కూర్చొని వుండగా వారి ఎదురుగా అప్సరస రంభ నాట్యం,
ఆమె నాట్యానికి తాళం వేస్తూ దత్తాత్రేయుడు, ఆదిత్యుడు మేళం, తుంబురుడు వీణ, నంది మరియు బ్రహ్మ మృదంగం వాయిస్తుండగా అప్సరసల నాట్య గురువైన "భ్రుంగీశ్వరుడు" రంభ నాట్యానికి మెరుగులు దిద్దుతూ కనపడతారు.
ఈయనకు మూడు కాళ్ళు ఉంటాయి.
ఒక స్థంభం పైన అత్యంత సుందర సహజ "భిక్షాంధారుడు" రూపం ఆకట్టుకొంటుంది.
మండప పైకప్పున అనేక పురాణ ఘట్టాలను సహజ వర్ణాలతో చిత్రీకరించారు.
వీటిని చిత్రించినది విజియనగరం మరియు కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వారు.
ఒక చిత్రంలో ఆలయ నిర్మాత వీరపన్న శిల్పులతో ఆలయ నిర్మాణం గురించి చర్చిస్తున్నట్లుగా ఉంటుంది.
కొన్ని స్తంభాల మీద ఆ కాలంలో మీద నాడు పర్షియా మరియు అరేబియా నుండి వచ్చిన అశ్వ వ్యాపారుల రూపాలను కూడా చెక్కారు.
గోడల పైన భక్త శిరియాళ, కిరాతకార్జునీయం ఉదంతాల శిల్పాలను చక్కగా చెక్కారు.
ఈ మండప ఈశాన్య భాగంలో ఒక అద్భుతం కనపడుతుంది.
అదే వేళ్ళాడే స్థంభం ( హంగింగ్ పిల్లర్).
వంద సంవత్సరాల క్రిందట ఆంగ్లేయ పరిశోధకుల పరీక్షలో మండపం మొత్తం ఈ స్థంభం మీదనే ఆధారపడి ఉన్నట్లుగా వెల్లడైనది.
వారు ఈ స్థంభాన్ని కదిలించాలని ప్రయత్నించగా మిగిలిన స్థంభాలన్నీ కదిలాయట.
అలా పక్కకు కదిల స్థంభాన్ని కూడా చూడవచ్చును.
నాటి శిల్పుల మేదను ఎంత పొగడినా తక్కువే !
ఈ నాట్య మండపా పన్నెండు స్తంభాలను కలుపుతూ పైన ఒక శతపత్ర కమలాన్ని అత్యంత సహజంగా ఏర్పరచారు.
కాల ప్రభావం మూలంగా కొంత శిధిలమైన నేటికీ సుందరంగా ఉండి ఆకర్షిస్తుంది.
వాయువ్య దిశలో రెండు స్థంభాల మధ్య అత్యంత ఆకర్షణీయమైన శ్రీ దుర్గాదేవి స్వయంభూ మూర్తిని అద్దంలో చూడాలి.
ఇక్కడ కొన్ని అద్భత శిల్పాలు కనిపిస్తాయి.
మహా మృత్యుంజయ మూర్తి, నాట్య గణపతి, అప మృత్యుపరిహారక మూర్తి, గజ సంహార మూర్తి, అర్ధనారీశ్వర మూర్తి, వాస్తు పురుష మూర్తి వీటిల్లో కొన్ని.
పైకప్పున ఇరవై నాలుగు అడుగుల పొడవు, పదునాలుగు అడుగుల వెడల్పు గల సహజ వర్ణాలతో చిత్రించిన శ్రీ వీర భద్ర స్వామి చిత్రం ఉంటుంది.
ఆసియాలో ఇదే అతి పెద్ద వర్ణ చిత్రంగా పేర్కొంటారు.
దేవీ దేవతలకు మొక్కి పూజలు చేయించుకొన్న తరువాత ప్రధాన ఆలయానికి అరా కిలోమీటరు దూరంలో ఉన్న లేపాక్షీ బసవయ్య యాత్రీకుల తదుపరి గమ్యం.
ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహంగా పరిగానిమ్పబడిన ఈ నంది వెనక ఒక తమాషా గాధ ఉన్నట్లుగా చెబుతారు.
ఆలయనిర్మాణం చేస్తున్న శిల్పులు తమ జీత భత్యాలు పెంచాలని సమర్పించుకొన్న వినతిని అధికారులు పట్టించుకోనందున నిరసనగా ఈ విగ్రహాన్ని చెక్కారట.
పదిహేను అడుగుల ఎత్తు ఇరవై ఏడుఅడుగుల పొడుగు, ముప్పై మీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది.
మేడలో గంటలు, రుద్రాక్షలు, కలిగిన గొలుసులతో బహు సుందరంగా మలచారు.
మిగిలిన ఆలయాలలోని నదికి లేపాక్షీ నందికి రూపంలోనే కాదు భంగిమలో కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
యవ్వనంలో ఉన్న కోడె గిత్త లా కనపడుతూ మోర పైకెత్తి నాగ ఫణి నాగేంద్రుని చూస్తూ ఒక కాలు మడిచి రెండో కాలి మీద స్వామి ఆజ్ఞ ప్రకారం లేవడానికి సిద్దంగా ఉన్నట్లుగా కనపడుతుంది.
అతి త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కడాని లేపాక్షి బసవయ్య ఎంపిక చేయబడ్డాడు.
ఆలయాన్ని నిర్మించిన విరూపన్న ఇంటి పేరు నంది కావడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.
కాల జ్ఞానాన్ని రాసిన శ్రీ పోతులూరి వీరభద్ర స్వామి యుగాంతానికి లేపాక్షి బసవయ్య లేచి రంకె వేస్తారని తెలిపారు.
చాలా కాలం నిర్లక్ష్యం నీడలో ఉన్న లేపాక్షి ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధ్వర్యంలో గత వైభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది.
అనంత పురం జిల్లా లోని హిందు పురం పట్టణానికి దగ్గరలో ఉన్న ( పదిహేను కిలో మీటర్లు) లేపాక్షికి బస్సు మార్గంలో సులభంగా
ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిధి గృహంలో ఉండటానికి తగిన సదుపాయాలూ అందుబాటు ధరలో లభిస్తాయి.
లేకపోతే హిందుపూర్ లో ఉండవచ్చును.
ప్రతి ఒక్క తెలుగు వారు తప్పక సందర్శించ వలసినది లేపాక్షి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి