4, ఫిబ్రవరి 2015, బుధవారం

Sri Ranganayaka Sawamy Temple, Anupu




                    శ్రీ రంగనాధ స్వామి ఆలయం, అనుపు 



పచ్చదనం దుప్పటి కప్పుకొన్న పర్వతాలు. 
ఏపుగా పెరిగిన మిరప మరియు ప్రత్తి పొలాలు. 
స్వచమైన గాలి. పరవశింపచేసే పరిసరాలు. 
దూరంగా గలగలా పారే పవిత్ర కృష్ణా నది. 
ప్రశాంత ప్రకృతికి నిలయం ఈ ప్రాంతం. 
చరిత్రలో స్థిర స్థానం పొందిన ప్రదేశం. 
బౌద్ద మరియు హిందూ ఆరాధనా విధానాలకు పేరొందిన పవిత్ర స్థలం. 
 "అనుపు".
అందుకేనేమో కనపడని ఆధ్యాత్మిక పవనాలు చుట్టుముడతాయి. మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. యెనలేని శాంతిని ప్రసాదిస్తాయి.










క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల కాలంలో విజయపురిగా పేరొందిన ఈ ప్రాంతం బౌద్ద బిక్షువులకు నివాస స్థలం గా మరియు శిక్షణా కేంద్రంగా ప్రసిద్ది చెందినది. 
ఎన్నో అమూల్యమైన శిధిలాలు మరియు శాసనాలు తవ్వకాలలో లభించాయి. 
ఆంధ్ర ప్రదేశ్ ను అన్నపూర్ణ గా మార్చే దానికి నిర్మించినది నాగార్జున సాగర్ ఆనకట్ట. 
ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక చారిత్రాత్మకమైన ప్రదేశాలు నీటిలో మునిగి పోయాయి. 
భావి తరాలకు మన చరిత్రను అందించడానికి అలా మునిగిపోయే నిర్మాణాలను ఆకృతి చెదరకుండా తీసి వివిధ  సమీప ప్రాంతాలలో పునః నిర్మించారు. చూడటానికి ఇవి పునఃనిర్మాణాలుగా కనిపించకపోవడం వీటి ప్రత్యేకత.  
అలా "అనుపు" బౌద్ద మరియు హిందూ చారిత్రాత్మక విశేషాలకు నిలయంగా మారింది. 
 ఆంధ్ర చరిత్రలో చోటుచేసుకొన్న కొన్ని అరుదైన సంఘటనలకు అనుపు కేంద్రస్థానం.








 





 పదమూడవ శతాబ్ద కాలంలో ఉత్తర భారత దేశం పూర్తిగా ముస్లిం నవాబుల పాలన లోనికి వెళ్ళిపోగా దక్షిణాన నాటి ఓరుగల్లును పాలిస్తున్న "కాకతీయ రుద్రమ దేవుడు" తెలుగు ప్రాంతాలన్నింటి మీదా పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించి నవాబులకు తెలుగు గడ్డ అందని పండుగా పటిష్ట్టం చేసాడు. 
అప్పట్లో "విక్రమ సింహపురి" ( నేటి నెల్లూరు) ప్రాంతాన్ని "తెలుగు చోడుల" వంశానికి చెందిన "మనుమ సిద్ది" పాలించేవాడు. 
పెన్నా కృష్ణా నదుల తీరము లోని చాలా  ప్రాంతాలు అతని ఏలుబడిలో ఉండేవి. ఒక విషయంలో దాయాదులతో ఏర్పడిన విభేదాల వలన మనుమసిద్ది పదవిని కోల్పోయాడు. 
అత్యంత ప్రజారంజకంగా పాలిస్తున్న రాజు పదవీచ్యుతుడు కావడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు తమ రాజు తిరిగి సింహాసనం అధిష్టించడానికి  నెల్లూరులో పేరొందిన "శ్రీ రంగనాయక స్వామి"వారి రూపాన్ని తయారు చేసి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారని ఇక్కడి శాసనం తెలుపుతోంది. 
వారి పూజల ఫలితంగా మనుమ సిద్ది ప్రధాన మంత్రి,కవిత్రయంలో ఒకరైన  తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్లి రుద్రమ దేవునితో జరిపిన చర్చలు ఫలించి కాకతీయ సైనిక సహాయంతో మనుమసిద్ది  తిరిగి రాజ్యాధికారం పొందాడు. 
ఆనాడు (1250) ప్రజలు నిర్మించిన ఆలయాన్నిఇక్కడ  కృష్ణా నదీ తీరంలో పునః నిర్మించారు.




 






సువిశాల ప్రాంగణంలో ఎత్తుగా నిర్మించిన గద్దె మీద నిర్మించిన చిన్న ఆలయంలో పాత నిర్మాణం లోని స్తంభాలను ఉపయోగించారు. శ్రీ కృష్ణ లీలలను రమణీయంగా స్థంభాల మీద చెక్కారు. 







గర్భాలయంలో నల్ల రాతి మీద ఆదిశేషుని పడగల క్రింద శయన భంగిమలో మనోహరంగా మలచిన శ్రీ రంగనాయక స్వామి రూపం భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. సహజంగా పాదాల వద్ద  కనిపించే శ్రీ దేవి భూదేవి ఉండరిక్కడ. ద్వారం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కొలువై ఉంటారు.  


 
 





ప్రాంగణంలో ఆంజనేయ, పరమేశ్వర ఉపాలయాలు మరియు నవగ్రహ మండపంఉంటాయి .
ప్రతినిత్యం మూడు వేళలా పూజలు స్వామివారికి జరుగుతాయి. 


























శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, వినాయక చతుర్ధి నవరాత్రులు ఇలా అన్ని హిందూ పర్వదినాలలో భక్తులు విశేషంగా తరలి వస్తారు. 







సంవత్సరానికి ఒక సారి ఘనంగా స్వామి వారి కళ్యాణోత్సవాలు జరుపుతారు. 









పక్కనే ఉన్న నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో లభించిన అనేక బౌద్ద మత  నిర్మాణాలను  తీసుకొనివచ్చి ఇక్కడ పునర్నిర్మితం చేసారు. 



 




















బౌద్ధం ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదరణ  పొందుతున్న కాలంలో ఇదొక విశ్వ విద్యాలయంగా గుర్తింపబడినది. వేలాది మంది విద్యార్థులు విద్య అభ్యసించడానికి వచ్చేవారు. ఎందుకనంటే శిధిల పునః నిర్మాణాలలో అధిక శాతం పాఠశాలలవే ! ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ గురువులు ఇక్కడికి వచ్చేవారని శాస్త్రవేత్తల అంచనా !
చక్కని పచ్చిక బయళ్ళు, విశాలంగా పెరిగిన వృక్షాలు నిండిన ప్రాంగణం వారాంతపు శెలవలు ఆహ్లాదంగా గడపటానికి ఒక గమ్యంగా పేర్కొనవచ్చును. అంతే కాదు మన గత చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం కూడా పొందవచ్చును. ముఖ్యంగా విద్యార్థులకు అనుపు సందర్శన పురాతన చరిత్రతో పరిచయం కలిగిస్తుంది. 











      

     
             


















కార్తీక మాసంలో సమీపం లోని నాగార్జున సాగర్ మరియు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వన సమారాధన చేసుకొని ఆనందంగా బంధు మిత్రులుతో గడపటానికి వస్తుంటారు.మన గత చరిత్రను తెలిపే "అనుపు" నాగార్జున సాగర్ పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
కృష్ణా నది ఒడ్డున ఉన్న రహదారి గుండా సులభంగా చేరుకొనవచ్చును.



                           


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...