Tuesday, July 30, 2013

Singarakonda sri Prasannajaneya swamy Temple.

ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిచెందిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో సింగర కొండ లో ఉన్న శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఒకటి .
సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం సింగర కొండ.
పదునాలుగవ శతాబ్దంలో  ప్రక్కనే ఉన్న గ్రామానికి చెందిన సింగన్న అనే స్వామి భక్తుడు తన కుమార్తెతో కలసి ఆవులను మేపడానికి ఈ కొండ వద్దకు వచ్చేవాడు. 
మందలోని ఒక గోవు పాలు ఇవ్వక పోవడాన్ని గమనించిన సింగన్న దానిని అనుసరించి పోగా ఆ ఆవు కొండ మీద ఒక చోట ఆగగా అక్కడి గుహ నుండి బాలుడు ఒకరు బయటికి వచ్చి పాలు తాగడం చూశాడు. 
అది తన ఆరాధ్య దైవమైన శ్రీ నరసింహ స్వామి వారే నని తెలుసుకొన్న సింగన్న అక్కడ శ్రీ స్వామి వారి ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్మించాడు. 



తదనంతర కాలంలో దేవ రాయలు అనే స్థానిక పాలకుడు పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. కాల గమనంలో  భక్తుల సహకారంతో అనేక మార్పులు చోటు చేసుకొని ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 
ప్రశాంత ప్రకృతికి చిరునామా అయిన చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం ఉత్తర దిశగా ఉంటుంది. 
పర్వత పై భాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలున్నాయి. 
గర్భాలయంలో ప్రతిష్టా మూర్తి అయిన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి తన ఎడమ భాగాన అమ్మవారిని కూర్చోపెట్టుకొని రమణీయ పుష్పాలంకరణ తో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. ముఖ మండపంలో గాయక భక్తులైన పన్నెండు మంది ఆళ్వారుల విగ్రహాలనుంచారు. వైకుంట ఏకాదశి, నృసింహ జయంతి, ధనుర్మాస పూజలు, ప్రతి ఏడాది హోలీ పండుగ నాడు పెద్ద ఎత్తున జరిపే  తిరునాళ్ళు ఇక్కడి ముఖ్య ఉత్సవాలు. 
రెండు శతాబ్దాల క్రిందట కొండ మీద ధ్వజస్థంభ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వేలాది భక్తులు చూస్తుండగా కొండ క్రింద ఒక యోగీశ్వరుడు వచ్చి దక్షిణా ముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భవనాశి సరోవర తీరంలో ఉంచి అదృశ్య మైనాడట. 
అలా యోగి స్వామిని ఇక్కడే ఉంచడానికి సంభందించి స్థానికంగా ఒక కధ ప్రచారంలో ఉన్నది. 
సీతాన్వేషణకు బయలుదేరిన వానరుల బృందాలలో దక్షిణ దిశగా వెడలిన దానిలో ఆంజనేయుడు ఉన్నాడు. రావణ లంక ఉన్నది ఆ దిశ లోనే కదా!
అందుకే స్వామి వారు ఆ విధంగా కొలువు తీరారు. దక్షిణా ముఖ హనుమంతుడు అపమృత్యువును నివారిస్తాడు. 


కొండ మీద ఉత్తర దిశగా కొలువైన శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి సేవ నిమిత్తం భ్రుత్యుడు సిద్ధంగా ఉంటూ ఇలా వెలిశారని కూడా అనుకొంటారు. 
ఏది ఏమైనా తొలుత నృసింహ క్షేత్రమైన సింగర కొండ మారుతి నిలయంగా మారింది. 
ప్రధాన ఆలయం దక్షిణ దిశలో ఉండగా ప్రాంగణంలో మరో వాయునందనుని సన్నిధి పడమర దిశలో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. 

భవనాశి సరోవర తీరాన కొలువైన అంజనాసుతునికి ప్రతినిత్యం పర్వదినమే !
ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడుగంటల దాకా తెరిచిఉండే ఆలయంలో అభిషేకం నుండి ప్రదోషకాల పూజ దాకా ఎన్నో సేవలు నిత్యం స్వామి వారికి జరుపుతారు. అన్ని పండుగలు ఘనంగా, సమిస్థిగా జరుపుకొంటారు. 
శ్రీరామ నవమి, హనుమత్జయంతి అట్టహాసంగా నిర్వహిస్తారు. 
ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తిరునాళ్ళలో జిల్లానుండే కాదు రాష్ట్ర మంతటినుండి భక్తులు వచ్చి పాల్గొంటారు. 
గ్రామంలో శ్రీ రామాలయం, శివాలయం, షిర్డీ సాయి మందిరము ఉన్నాయి. 
సింగరకొండ గ్రామం ప్రకాశం జిల్లా అద్దంకి కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒంగోలు నుండి సులభంగా చేరుకోవచ్చును. 

ప్రశాంత ప్రకృతికి, ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరైన సింగరకొండ దేవతల నిలయంగా పేర్కొనదగ్గది. 

జై శ్రీ లక్ష్మి నరసింహ !
జై శ్రీ రామ్!