16, జనవరి 2024, మంగళవారం

Avanigadda Temples

 

                                   అవనిగడ్డ ఆలయాలు 


ఆలయ సందర్శనం అనగానే మనందరి దృష్టి తమిళనాడు, కేరళ లేకపోతే కర్ణాటక వైపు మళ్లుతుంది. కానీ మన రాష్ట్రంలో గ్రామగ్రామాన ఒక చక్కని పురాతన ఆలయం కనపడుతుంది. 
సుందర శిల్పకళ , కొలువైన అర్చామూర్తి, గొలుసుకట్టు ఆలయాలలో భాగం ఇలా ఎన్నో విశేషాలు ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ఆలయాలలో కనిపిస్తుంది. 
లేపాక్షి, గుంటూరు సమీపంలోని చేబ్రోలు ఆలయాలు, చందోలు, మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, చెరుకూరు, దుగ్గిరాల, నందివెలుగు, కొలకలూరు, శ్రీ వల్లభస్వామి ఆలయం, వంగిపురం, శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు పొన్నూరు, బాపట్ల,  మరియు చినగంజాం. మరో గమనించదగిన అంశం ఏమిటంటే ప్రతి చోట ఒక శివాలయం మరియు ఒక విష్ణాలయం పక్కపక్కన ఉండటం నాటి పాలకుల ముందు చూపు తెలుపుతుంది. 
ప్రతిఒక్క ఆలయం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒకదానిని మరో దానితో పోల్చలేము. అంతటి గొప్ప ఆలయాలు. ఆ కోవకు చెందినవే పవిత్ర కృష్ణానదీతీరంలోని అవనిగడ్డ పట్టణంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మరియు శ్రీ రాజశేఖర స్వామి ఆలయం.
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం నేటికీ తన ప్రత్యేకతలను నిలుపుకొని చరిత్రకు సాక్షిగా నిలిచి ఉన్నది. 
పక్కనే ఉన్న శ్రీ రాజశేఖర స్వామి ఆలయం(శివాలయం) అనేక మార్పులు చేర్పులకు గురి అయినప్పటికీ తన పురాతన చిహ్నాలను ప్రదర్శిస్తుంది. 

శ్రీ రాజశేఖర స్వామి ఆలయం 

చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అనేక ప్రత్యేకతలతో నిండి ఉన్నది.  అసలు ఈ ఆలయం ప్రధాన ఆలయం అయిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంకి ఉపాలయంగా ఉండేది. అనంతర కాలంలో శివాలయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొన్నది.
సువిశాల ప్రాంగణంలోనికి తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తే ఎదురుగా పద్మాసన భంగిమలో ఉపస్థితులైన మహేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది. ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. 
ముఖమండపం చేరుకొని లోనికి వెళితే వరుసగా మూడు సన్నిధులు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న గర్భాలయంలో శ్రీ రాజశేఖర స్వామి లింగ రూపంలో చక్కని చందన విభూతి లేపనాలతో కుంకుమ అలంకరణలో దివ్యంగా దర్శనమిస్తారు. మరో సన్నిధిలో అమ్మవారు, మూడో సన్నిధిలో విఘ్ననాయకుడు శ్రీ వినాయకుడు కొలువై ఉంటారు. 
ఒకపక్కన శ్రీ కాలభైరవ స్వామి ఉంటారు. 
ఈ ఆలయంలో మూడు విశేషాలు కనిపిస్తాయి. ప్రధాన ద్వారా తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ గర్భాలయం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. చాలా అరుదుగా పడమర ముఖంగా ఉండే  శివాలయం కనిపిస్తుంది.  శ్రీ రాజశేఖర స్వామి లింగం విశేషమైన బ్రహ్మ సూత్రం ఉంటుంది. మూడో విశేషం ఏమిటంటే మన రాష్ట్రంలో అరుదుగా కనిపించే శ్రీ చెండికేశ్వర సన్నిధి ఈ ఆలయంలో ఉత్తరం వైపున సరిగ్గా గోముఖి క్రింద ఉంటుంది. ఇలాంటి శ్రీ చెండికేశ్వర సన్నిధి మరెక్కడా కనిపించదు. 
చోళ రాజుల కాలంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయ ప్రధాన రూపం అలానే ఉంచి అభివృద్ధి చేయడం అభినందనీయం !!
శ్రీ వినాయక చవితి, దసరా నవరాత్రులు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. 
నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే శ్రీ రాజశేఖర స్వామి ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉంటుంది.   











శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం 

అవనిగడ్డలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంటే తెలియక పోవచ్చును కానీ గాలిగోపుర ఆలయం అంటే ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. 
ఏడు అంతస్థుల తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైన ఈ రాజ గోపురం పట్టణంలోని ఏ మూల నుంచి అయినా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో మంగళగిరి ఆలయ రాజగోపురం అత్యంత ఎత్తైనదిగా ప్రసిద్ధి. రెండవ స్థానం మాత్రం అవనిగడ్డ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానిదే !!

 



రాజగోపుర ప్రవేశ మార్గానికి ఒక పక్కన వినుతా సుతుడు మరో పక్క అంజనా తనయుడు ప్రభు సేవకు సదా సిద్ధం అన్నట్లుగా నమస్కారభంగిమలో ఉంటారు. 
విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన రాతి పీఠం మీద రధం ఆకారంలో చెక్కిన ఆలయం చూపరుల దృష్టిని యిట్టె ఆకర్షిస్తుంది. 
నిజానికి కృష్ణాతీరంలో అయిదు లక్ష్మీ నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి అవని గడ్డ, నల్లూరు, రాచూరు, పెదముత్తేవి మరియు నడకుదురు. ఈ అయిదు క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకొంటే మనోభీష్టాలు నెరవేరతాయి అంటారు. 





ఎలాంటి రాతి మీద అయినా రమ్యమైన శిల్పాలు చెక్కే సామర్ధ్యం కలిగిన శిల్పులు చోళ రాజుల కాలంలో ఉన్నారు అనడానికి అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మరో ఉదాహరణ. 
ఎఱ్ఱ ఇసుక రాతిని రమణీయమైన శిల్పాలుగా మలిచారు. 
శ్రీ రామ పట్టాభిషేకం, శివతాండవం లాంటి శిల్పాల నుండి సన్నని సూక్ష్మ శిల్పాల వరకు గొప్పగా చెక్కారు. 
ముగ్గురు స్త్రీలు ఒకరి చేతులను మరొకరు వారి పాదాలను ఇంకొకరు పట్టుకొని ఒక వృత్తాకారంలో ఉన్నట్లుగా చెక్కిన "కంకణ బంధ" శిల్పం నేటి జిమ్నాస్టిక్ విన్యాసాలు నాటికే  ప్రజలకు పరిచయం ఉన్నట్లుగా చెబుతున్నాయి. 
ముఖం మండపంలోని ముప్పై రెండు స్తంభాలు చక్కని శిల్పాలను ప్రదర్శిస్తాయి. 
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్మాణం రెండవ కుళోత్తుంగుని కాలంలో జరిగినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. అందువలననే స్వామిని "చోళ నారాయణ దేవర" అని కూడా పిలుస్తారు.

 














ఆలయం మొత్తాన్ని ఎత్తైన గద్దె మీద రథాకారంలో నిర్మించి క్రిందచక్రాలు,
 అశ్వాలు, రథసారధులను చెక్కిన విధానం అద్భుతంగా ఉంటుంది. కోణార్క సూర్య దేవాలయం కన్నా ముందు చెక్కిన నిర్మాణం నాటి శిల్పుల నేర్పరితనాన్ని స్పష్టం చేస్తుంది. 

  







పురాణ గాథ 

త్రేతాయుగంలో అవనిగడ్డ ప్రాంతాన్ని శ్రీ రామచంద్రుని కులగురువైన శ్రీ వశిష్ట మహర్షి తన ఆశ్రమంగా చేసుకొని ఉన్నారట. ఆ సమయంలో జానకీ దేవి ధర్మశాస్త్రాల గురించి వశిష్టుని వద్ద అభ్యాసం చేశారట. అందువలన ఈ ప్రాంతాన్ని "అవనిజపురం" అని పిలిచేవారట. కాలక్రమంలో అదే అవనిగడ్డగా మారింది అని అంటారు. 
ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్టును శ్రీ రామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్టించారని కూడా చెబుతారు. 
దక్షిణ భారత దేశాన్ని తమ అధీనం లోనికి తెచ్చుకోవాలన్న సంకల్పంతో దండయాత్రకు వచ్చిన చోళ రాజులు ఇక్కడి ప్రాంతాలని గెలవడమే కాకుండా తమ రాకను మరియు విజయాన్ని  తెలిపే చిహ్నాలను ఆలయాల రూపంలో భావితరాలకు తెలియచేసే ప్రయత్నం చేసారు. 
గతంలో ఈ క్షేత్రం ఒక నృత్య శిక్షణా కేంద్రంగా మరియు ఆయుర్వేద వైద్యశాలగా ఉండినది అని శాసనాధారాలు తెలియచేస్తున్నాయి. 





ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

గర్భాలయంలో అమ్మవారు శ్రీ లక్ష్మీ దేవిని తన వామాంకం పైన కూర్చోపెట్టుకొని, చుట్టూ తమ ఎడమచేతిని ఉంచి, మగతనాన్ని తెలిపే మీసకట్టుతో ప్రత్యేకంగా దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి.
స్వామి వారు ఇక్కడ భూ నీలా రాజ్యలక్ష్మీ సమేత నారాయణ మూర్తిగా కొలవబడతారు. 
ఉత్సవిగ్రహాలలో మిగిలిన ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. 
ఉపాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి కొలువై దర్శనమిస్తారు. వాయునందనుడు భక్తసులభుడు. 
స్వామిని ఆశ్రయించి తమ కష్టం చెప్పుకొని నియమంగా ప్రదక్షిణాలు చేస్తే కోరిక సిద్ధిస్తుందని, కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. 
నిత్యం ఉదయం ఆరుగంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుచి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి. 
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉగాది ఆస్థానం, దీపావళి మరియు ఇతర పర్వదినాలను జరుపుతారు. 
వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ లక్ష్మీ నారాయణనుల తిరుకళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు పాల్గొంటారు.   
చక్కని శిల్పకళకు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం అవనిగడ్డ. తప్పక సందర్శించవలసిన క్షేత్రం. 







మరో  విశేషం 

శ్రీ రాజశేఖర స్వామి మరియు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాల మధ్య రుక్మిణీ సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కొలువైన గీతామందిరం నిర్మించారు. తమ మనోభీష్టాలను నెరవేరాలని కోరుకొంటూ భక్తులు మందిరానికి నియమంగా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి.        " ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం క్లిమ్ కృష్ణాయ గోవిందాయ, గోపీజన వల్లభాయ నమః ఓం నమో నారాయణాయ శ్రీ కృష్ణాయ నమః" అని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేస్తే మనోభీష్టం తొందరగా నెరవేరుతుంది అని అంటారు. 
 



విశిష్ట చరిత్రకు నిలయమైన అవనిగడ్డ చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు, విశేషాలు కలవు. విజయవాడ, మచిలీపట్నం మరియు రేపల్లె నుండి రహదారి మార్గం లో సులభంగా అవనిగడ్డ చేరుకోవచ్చును. వసతి సౌకర్యాలు తగు మాత్రంగా లభిస్తాయి. 

 ఓం నమో నారాయణాయ !!!!





15, జనవరి 2024, సోమవారం

Sri Subrahmanya Swamy Temple, Mopidevi



                      శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - మోపిదేవి 


ఆది దంపతులైన శివ పార్వతుల ప్రియా పుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన భారతదేశంలోనే కాదు పొరుగు దేశాలైన శ్రీలంక, మలేషియా, సింగపూర్, మారిషస్ మరియు మలేషియాలతో పాటు తమిళ ప్రజలు ఎక్కడ అధిక సంఖ్యలో ఉంటారో అక్కడ తప్పకుండా శ్రీ షణ్ముఖునికి ఒక ఆలయం తప్పకుండా ఉంటుంది.  
శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనకు తమిళనాడులో  ప్రాధాన్యత కలిగి ఉన్నది. కారణం ఏమిటీ అంటే పురాతన తమిళ గ్రంధాలు తగిన వివరణ ఇస్తున్నాయి. 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని వారు "మురుగ(క)" అని సంభోదిస్తారు.ఈ మూడు అక్షరాలు త్రిమూర్తులకు సంకేతం. "ము" అనగా శ్రీ మహావిష్ణువు మరో పేరైన ముకుందుడు అన్నదానికి, "రు" అంటే రుద్రుడు, "క "అంటే కమలాసనుడు బ్రహ్మకు సంకేతాలని పురాతన తమిళ గ్రంధాలు తెలుపుతున్నాయి. మురుగ అంటే స్ఫురద్రూపి, దైవత్వం, యువకుడు, మూర్తీభవించిన మగతనానికి నిదర్శనం అన్న అర్ధాలు ఉన్నాయి అని అంటారు. 
స్వామి మరో పేరు షణ్ముఖ లేక ఆర్ముగం అనగా ఆరు ముఖాలు కలిగిన వాడు అని అర్ధం. ఈ ఆరు ముఖాలు పంచేద్రియాలకు మరియు మనస్సుకు సంకేతాలు. వాటి మధ్య ఉండే సత్సంబంధం జ్ఞానసముపార్జనకు మార్గం సుగమం చేస్తుంది. వేలాయుధన్ అనగా వెల్ ని ఆయుధంగా ధరించినవాడు మరియు అజ్ఞానాన్ని తొలగించేవాడు అని కూడా చెబుతారు.  
ఇలా స్వామి వారి నామాలకు అనేక ప్రత్యేకతలు మరియు విశేష అర్ధాలు ఉన్నాయి.    
అంతే కాకుండా శ్రీ షణ్ముఖుని ఆదేశం మేరకు అగస్త్య మహర్షి పొదిగై పర్వత గుహలో ఉండి  సంస్కృతంతో పాటు తమిళ భాషకు అంకురార్పణ చేశారని కూడా ఆ గ్రంధాలు పేర్కొంటున్నాయి. 
ఆరుపాడై వీడులుగా ప్రసిద్ధికెక్కిన ఆరు ముఖ్య ఆలయాలతో పాటు మరెన్నో విశేష ఆలయాలు కార్తికేయునికి తమిళనాట ఉన్నాయి.  
 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన  రాష్ట్రంలో కూడా తగు మాత్రంగా ఉన్నది. జిల్లాకొక ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉండటం దానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. వీటిల్లో కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రం అగ్రస్థానంలో ఉన్నది అంటే ఎలాంటి సందేహం లేదు. 
స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించారు అని క్షేత్ర గాథ తెలియచేస్తోంది. 








క్షేత్ర గాథ 

ఒకసారి మహర్షులు పార్వతీపరమేశ్వరుల దర్శనార్ధం కైలాసానికి వెళ్లారట. ఆ సమయంలో అక్కడ అమ్మ వడిలో కూర్చున్న బాల మురుగన్ మునుల గడ్డలు, మీసాలు, సంస్కారంలేని జడలు కట్టిన జుట్టు, వారి వస్త్రధారణ చూసి అపహాస్యం చేస్తూ నవ్వారట. 
అమ్మవారు బాలుని వారించి మహర్షుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మహా అపరాధం అన్నారట. తాను చేసినది ఎంతటి తప్పదనమో అర్ధం చేసుకొన్నా పరిహారార్ధం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారట. తల్లితండ్రుల అనుమతితో కృష్ణాతీరంలో కుమార క్షేత్రం అనువైనదిగా భావించి అక్కడికి వెళ్లి ఒక వాల్మీకంలో కూర్చొని నిరంతర ధ్యానంలో మునిగిపోయారట. 
సంవత్సరాలు గడిచిపోయాయి. 
మహర్షి అగస్త్యుడు సతీమణి లోపాముద్ర మరియు శిష్యప్రశిష్యులతో అక్కడికి వచ్చారట. ఆయన క్కడికి రావడం వెనుక లోకకల్యాణం కొరకు త్రిమూర్తులు ఆయనను ఆదేశించడం !
ఎందుకంటే ఆయన శిష్యుడైన వింధ్య పర్వత రాజు మిగిలిన పర్వతాలపై ఆధిపత్యం చూపించుకోడానికి తన ఆకారాన్ని విపరీతంగా పెంచేసాడట. 
దాని వలన గ్రహ మరియు నక్షత్ర సంచారానికి ఆటంకం ఏర్పడినదట. ముఖ్యంగా లోకానికి వెలుగు చూపే సూర్యచంద్రుల సంచారానికి పూర్తి స్థాయిలో అవరోధం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారట. 
ఏర్పడిన పరిస్థితిని సరిదిద్దగలవాడు వింధ్యుని గురువైన అగస్త్య మహర్షి అని నిర్ణయించారట త్రిమూర్తులు. ఆయనను పిలిచి పరమేశ్వరుడు తన శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ దేశానికి తరలి వెళ్ళమని ఆదేశించారట. అదే సమయంలో ఆయనకు రెండు వరాలను ఇచ్చారట. పార్వతీ దేవితో తనకు జరిగే కల్యాణాన్ని ఆయన ఎన్నడ నుండైనా వీక్షించే అవకాశం తో పాటు ఆయన ప్రతిష్టించే లింగాలకు చిరస్థాయిగా ప్రజల ఆదరణ ఉండేలాగా వరాలను ప్రసాదించారట. 
తరలి వచ్చిన గురువుకు వంగి వినమ్రంగా నమస్కరించిన వైద్యుని ఆశీర్వదించి తానూ తిరిగి వచ్చేవరకు ఇదే విధంగా ఉండమని ఆదేశించారట మహర్షి. 
అడ్డంకి తొలగిపోవడంతో లోకానికి ఏర్పడిన ఇబ్బంది కూడా తొలగి పోయింది. 
అలా దక్షిణ భారత దేశానికి తరలి వచ్చిన మహర్షి తన నిత్య పూజల నిమిత్తం ఎన్నో శివ లింగాలను అనేక ప్రాంతాలలో ప్రతిష్టించారు. అందుకే దక్షిణ భారత దేశంలో అధిక శాతం   ఆలయాలలో శ్రీ అగస్తేశ్వర స్వామిగా మహేశ్వరుడు దర్శనమిస్తారు.  
ఒకనాడు పవన కృష్ణా తీరానికి విచ్చేసిన మహర్షికి ఈ క్షేత్రంలో అనేక పాము పుట్టలు కనిపించాయట. అందులో ఒకటి దివ్య కాటులతో వెలిగిపోతూ సమీపంలోనికి వెళ్లి వింటే "నమః శివాయ అన్న పంచాక్షరీ మంత్రం వినిపించిందట. అంతే కాకుండా జాతి వైరం లేకుండా పాము ముంగీసలు, మయూరాలు మరియు సర్పాలు స్నేహంగా మెలగడం కనిపించిందట. 
దివ్యదృష్టితో వీక్షించిన మహర్షికి జరిగిన సంఘటన తెలిసిపోయింది. కైలాసనాధుని ప్రార్ధించి ఆ  వాల్మీకం నుండి వేయి పడగలతో కూడిన శివ లింగాన్ని వెలికి తీసి ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి కుమార క్షేత్రం అని పేరు పెట్టారట. 
నాటి నుండి స్వయంవ్యక్తగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వెలసిన కుమార క్షేత్రం భక్తుల ఆదరణతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది నేటి రూపును సంతరించుకొన్నది. 





ఆలయ విశేషాలు 

మోపిదేవి గ్రామా నడి బొడ్డున ప్రధాన రహదారి మీద ఉండే ఆలయం ప్రస్తుతం సుందరరూపుతో భక్తులకు సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందినది. మూడంతస్థుల రాజగోపురం అనుసంధానిస్తూ ప్రహరీ గోడ ఉంటాయి. అక్కడ శ్రీ వల్లీ  దేవసేన సమెత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఉంచారు. 
నూతనంగా నిర్మించిన ముఖమండపం వర్ణమయ శిల్పాలతో అలరారుతూ దర్శనమిస్తుంది. గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, ఇరుపక్కలా ప్రత్యేక సన్నిధులలో దేవేరులైన శ్రీ వల్లే మరియు శ్రీ దేవసేనలతో దర్శనం అనుగ్రహిస్తారు. 
ఆలయ వెలుపల పెద్ద వృక్షం క్రింద భక్తులు తమకు ఏర్పడని సర్ప దోషం తొలగించుకోడానికి ప్రతిష్టించిన నాగ శిలలు కనిపిస్తాయి. సర్ప దోష నివారణ పూజ కూడా చేయించుకొని అవకాశం భక్తులకు లభిస్తుంది. 












ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నిత్యపూజలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం పంచహారతులు,చతుర్వేద స్వస్తి జరుపుతారు. 
 ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున అష్తోత్తర శత కలశ అభిషేక పూర్వక కళ్యాణ మాల (ఆర్జిత సేవ) నిర్వహిస్తారు. 
మహా శివరాత్రి, ఉగాది, వినాయక చవితి, దసరా నవ రాత్రులు, నాగుల చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి , స్వామి జన్మ నక్షత్రం ఐన ఆషాడ మాస కృత్తికా నక్షత్రం రోజున పవిత్రోత్సవాలు ఏర్పాటు చేస్తారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘ మాసం చవితి నుండి అష్టమి వరకు ఘనంగా నిర్వహిస్తారు. 
స్వర్ణ బిల్వపత్ర అర్చన, నాగ ప్రతిష్టలాంటి ప్రత్యేక ఆర్జిత సేవలు కూడా ఉన్నాయి. 
మంగళవారం, ఆదివారం, అమావాస్య, షష్టి రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.


 




















శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సమీపంలో పురాతన ఈశ్వరాలయం కలదు. 
కైలాస నాథుడు అక్కడ శ్రీ సకలేశ్వర స్వామి గా పూజింపబడుతున్నారు.  శ్రీ వినాయక, శ్రీ పార్వతీ దేవి, శ్రీ ఆంజనేయ స్వామి ఆదిగా గల దేవీ దేవతలు ఉపాలయాలలో కొలువై ఉంటారు. ప్రత్యేక నవగ్రహ మండపం కూడా కలదు. 
రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాలలో కూడా ప్రసిద్ధికెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చేరుకోడానికి అనువైన రహదారి మార్గం విజయవాడ నుండి కలదు. ఫ్రీ పదిహేను నిముషాలకు ఒక బస్సు లభిస్తుంది. 
మోపిదేవిలో తగుమాత్రపు  సాధారణ వసతి సౌకర్యాలు లభిస్తాయి. సౌకర్యంవంతమైన వసతి విజయవాడ లేక మచిలీపట్నం లలో దొరుకుతుంది. 
దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతుంది. 

ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః !!!!   






13, జనవరి 2024, శనివారం

kalva bugga Sri Ramalingeswara Swami Temple, Kalvabugga, Kurnool district

         పరశురామ ప్రతిష్ఠిత లింగం -శ్రీ రామలింగేశ్వరుడు 


లయకారకుడైన పరమేశ్వరుని లింగాలను భారత దేశంలోని నలుమూలలా ప్రతిష్టించిన వారిలో లోక రక్షకుడైన శ్రీ మన్నారాయణుని అవతారలైన శ్రీ పరశురాముడు, శ్రీ దశరధ రాములదే అగ్రస్థానంగా పేర్కొనాలి. 
వివిధ సందర్భాలలో వీరిరువురూ అనేక ప్రాంతాలలో ప్రతిష్టించిన లింగాలు నేటికీ కనపడుతుంటాయి. భక్తులను ఆకర్షిస్తున్నాయి. 














పరశురాముడు 

శ్రీ మహావిష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేక అవతారాలలో ఆరవ అవతారం శ్రీ పరశురాముడు. 
తండ్రి  మీద తల్లిని హతమార్చిన పాపనివృత్తి కొరకు అనేక పుణ్య తీర్ధాలను సందర్శిస్తూ కొన్ని చోట్ల లింగాలను ప్రతిష్టించారు. ఇరవై ఒక్కసార్లు నెల నలుచెరుగులా దండయాత్ర చేసి పాలకులను చంపి కూడగట్టుకున్న పాపానికి మరి కొన్ని పుణ్య ప్రదేశాలలో స్థాపించారు.  ,సముద్రుని నుండి తాను పొందిన భూమికి పాలకునిగా పరమేశ్వరుని నియమిస్తూ పరశురామ భూమిగా పిలిచే నేటి కేరళలో నూట ఎనిమిది లింగాలను ప్రతిష్టించారని మన పురాణాలు తెలుపుతున్నాయి. 
ఈ విధంగా ఆయన తన ఆరాధ్య దైవాన్ని ప్రతిష్టించిన అనేక ప్రాంతాలు నేటి కేరళలో అధికంగాను, మిగిలిన దేశంలో తగుమాత్రంగాను నేటికీ కనిపిస్తాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తాయి. 
అలాంటి వాటిల్లో ఒకటి కర్నూల్ జిల్లాలోని కాల్వ బుగ్గ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. 















ఆలయ పురాణ గాథ 

పద్మ పురాణం ప్రకారం తన తండ్రి జమదగ్ని మహర్షిని అకారణంగా సంహరించారన్న ఆగ్రహంతో అవతార పురుషుడైన పరశురాముడు ఆ ఘాతుకానికి తలపడిన రాజు కార్తవీర్యార్జునునితో పాటు భూమండలంలో ఉన్న రాజులనందరినీ ఇరవై ఒక్కమార్లు దండయాత్ర చేసి సంహరించారు. 
తద్వారా సంక్రమించిన భూభాగానికి  యోగులైన వారిని పాలకులుగా నియమించారు. దానం ఇచ్చిన భూమిలో ఉండకూడదు కనుక సముద్రుని తనకు కొంత భూమి ఇమ్మని కోరారట. 
సాగర రాజు అనుమతితో తన గొడ్డలిని నీటిలోకి విసిరారట. అది ఎక్కడ పడిందో అక్కడ దాకా భూమిని పొందారు. అవే నేటి కేరళ, గోవా, మహారాష్ట్ర ప్రాంతాలు. 
ఆయన సముద్రం లోనికి గొడ్డలి విసిరిన ప్రదేశంగా మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా, బగ్లాన్ తాలూకాలో  ఉన్న పర్వత శిఖరం మీద నుండి అని చెబుతారు. నేడు అక్కడ ఒక పురాతన కోట ఉన్నది. అందులో శ్రీ పరశురాముని ఆలయం ఉన్నది. పర్వత పాదాల వద్ద ఆయన తల్లి  శ్రీ రేణుకా దేవి ఆలయం ఉండటం విశేషం. 
 కానీ ఒకరు చేసిన తప్పుకు మొత్తం రాజులందరినీ అకారణ ఆగ్రహ కారణంతో హతమార్చడం వలన అంటిన పాపాన్ని తొలగించుకోడానికి భార్గవ రాముడు భూమండలం అంతా ప్రయాణించారు. 
ఆ సమయంలో ఎక్కడ నీటి వసతి ఉంటుందో ఎక్కడ తన నిత్య అనుష్టానానికి అనువుగా ఉంటుందో అక్కడ తన గురువైన మహేశ్వరుని లింగాలను ప్రతిష్టించారు అని తెలుస్తోంది. 
అలా ప్రతిష్టించిన వాటిల్లో ఒకటి కాల్వ బుగ్గ ఆలయంలోని లింగం.
అందుకే ఆయన పేరున శ్రీ రామలింగేశ్వరునిగా స్వామి పిలవబడుతున్నారు. ఆలయానికి వెలుపల వాయువ్యం లో ఒక సహజసిద్ధ జల ఉన్నది. ఈ కోనేరు మధ్యలో ఉన్న శివలింగం పై భాగం నుండి అన్ని కాలాలలో నీరు వస్తుంది. ఆ జల కోరు నుండి కాల్వల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలోని పంట పొలాలను సస్యశ్యామలంగా మారుస్తుంది. 
అందువలన ఈ ఊరికి కాల్వ బుగ్గ అని స్వామిని బుగ్గ రామలింగడు అని పిలుస్తారు. 
కానీ ప్రస్తుతం నీరు లేకపోవడం విచారకరం. 








ఆలయ విశేషాలు 

ఆలయాలు సహజంగా తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ కాల్వబుగ్గ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. చాలా అరుదైన విశేషం. 
ఇలా పడమర ముఖంగా కొలువైన స్వామి అత్యంత భక్త సులభుడు అని విశ్వసిస్తారు. 
ప్రధార రహదారి వైపుకి అంటే తూర్పు వైపున మూడు అంతస్థుల చిన్న రాజగోపురం నూతనంగా నిర్మించారు. గోపురానికి ఎదురుగా ఉన్న  మండపంలో శ్రీ ఉమామహేశ్వరులు కొలువై ఉంటారు.  
సువిశాల ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వరునితో పాటు శ్రీ భవానీ మాత,శ్రీ గణపతి దర్శనమిస్తారు. . శ్రీ రామలింగేశ్వరస్వామి లింగం పైన బ్రహ్మ సూత్రం ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. బ్రహ్మ సూత్రం కలిగిన లింగాలు ఉన్న ఆలయాలు కర్నూలు చుట్టుపక్కల చాలా కనిపిస్తాయి. 
ఉపాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ పంచ ముఖ లింగేశ్వర స్వామి కొలువై ఉంటారు. 
ప్రస్తుత ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించారని తెలుస్తోంది. 
ప్రాంగణం లోని ఆలయాలు అన్ని వర్ణమయ అలంకరణతో నేత్రపర్వంగా కనిపిస్తాయి. 

ఆలయ పూజలు మరియు పర్వదినాలు 

ప్రతి నిత్యం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వారు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉండే నియమంగా  నిర్ణయించిన ప్రకారం 
అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు మరియు ఆరగింపులు జరుగుతాయి. 
శ్రీ వినాయక చవితి, ఉగాది, దసరా నవరాత్రులు ఇతర హిందూ పర్వదినాలను ఘనంగా జరుపుతారు. 
రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మరియు కార్తీక మాసాలలో అధిక సంఖ్యలో భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి కర్ణాటక నుండి కూడా వస్తుంటారు. 
మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిభావాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు. 
స్థానిక భక్తులు తమ పిల్లల నామకరణం, బారసాల, అక్షరాభ్యాసం ఇక్కడే జరుపుకొంటారు. 
ప్రశాంత ప్రకృతిలో చక్కని ఆహ్లాదకరవాతావరణంలో ఉన్న బుగ్గ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం మరిచిపోలేని అనుభూతి. 
సమీపంలోని కొమ్ము శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా విశేష క్షేత్రంగా ప్రసిద్ధి. 
కాల్వ బుగ్గ కర్నూలుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో నంద్యాల వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి మీద  ఉన్నది. ఆలయంలో అన్నప్రసాద వితరణ కలదు. వసతి సౌకర్యాలకు కర్నూలు లేదా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల మీద ఆధారపడాలి. 
నంద్యాల చుట్టుపక్కల నవ నంది క్షేత్రాలు మరియు ఓంకారం తప్పక సందర్శించవలసిన క్షేత్రాలు. నంద్యాల నుండి అహోబిలం కూడా దగ్గరే !










నమః శివాయ !!!!

 


  

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...