13, జనవరి 2024, శనివారం

kalva bugga Sri Ramalingeswara Swami Temple, Kalvabugga, Kurnool district

         పరశురామ ప్రతిష్ఠిత లింగం -శ్రీ రామలింగేశ్వరుడు 


లయకారకుడైన పరమేశ్వరుని లింగాలను భారత దేశంలోని నలుమూలలా ప్రతిష్టించిన వారిలో లోక రక్షకుడైన శ్రీ మన్నారాయణుని అవతారలైన శ్రీ పరశురాముడు, శ్రీ దశరధ రాములదే అగ్రస్థానంగా పేర్కొనాలి. 
వివిధ సందర్భాలలో వీరిరువురూ అనేక ప్రాంతాలలో ప్రతిష్టించిన లింగాలు నేటికీ కనపడుతుంటాయి. భక్తులను ఆకర్షిస్తున్నాయి. 














పరశురాముడు 

శ్రీ మహావిష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేక అవతారాలలో ఆరవ అవతారం శ్రీ పరశురాముడు. 
తండ్రి  మీద తల్లిని హతమార్చిన పాపనివృత్తి కొరకు అనేక పుణ్య తీర్ధాలను సందర్శిస్తూ కొన్ని చోట్ల లింగాలను ప్రతిష్టించారు. ఇరవై ఒక్కసార్లు నెల నలుచెరుగులా దండయాత్ర చేసి పాలకులను చంపి కూడగట్టుకున్న పాపానికి మరి కొన్ని పుణ్య ప్రదేశాలలో స్థాపించారు.  ,సముద్రుని నుండి తాను పొందిన భూమికి పాలకునిగా పరమేశ్వరుని నియమిస్తూ పరశురామ భూమిగా పిలిచే నేటి కేరళలో నూట ఎనిమిది లింగాలను ప్రతిష్టించారని మన పురాణాలు తెలుపుతున్నాయి. 
ఈ విధంగా ఆయన తన ఆరాధ్య దైవాన్ని ప్రతిష్టించిన అనేక ప్రాంతాలు నేటి కేరళలో అధికంగాను, మిగిలిన దేశంలో తగుమాత్రంగాను నేటికీ కనిపిస్తాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తాయి. 
అలాంటి వాటిల్లో ఒకటి కర్నూల్ జిల్లాలోని కాల్వ బుగ్గ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. 















ఆలయ పురాణ గాథ 

పద్మ పురాణం ప్రకారం తన తండ్రి జమదగ్ని మహర్షిని అకారణంగా సంహరించారన్న ఆగ్రహంతో అవతార పురుషుడైన పరశురాముడు ఆ ఘాతుకానికి తలపడిన రాజు కార్తవీర్యార్జునునితో పాటు భూమండలంలో ఉన్న రాజులనందరినీ ఇరవై ఒక్కమార్లు దండయాత్ర చేసి సంహరించారు. 
తద్వారా సంక్రమించిన భూభాగానికి  యోగులైన వారిని పాలకులుగా నియమించారు. దానం ఇచ్చిన భూమిలో ఉండకూడదు కనుక సముద్రుని తనకు కొంత భూమి ఇమ్మని కోరారట. 
సాగర రాజు అనుమతితో తన గొడ్డలిని నీటిలోకి విసిరారట. అది ఎక్కడ పడిందో అక్కడ దాకా భూమిని పొందారు. అవే నేటి కేరళ, గోవా, మహారాష్ట్ర ప్రాంతాలు. 
ఆయన సముద్రం లోనికి గొడ్డలి విసిరిన ప్రదేశంగా మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా, బగ్లాన్ తాలూకాలో  ఉన్న పర్వత శిఖరం మీద నుండి అని చెబుతారు. నేడు అక్కడ ఒక పురాతన కోట ఉన్నది. అందులో శ్రీ పరశురాముని ఆలయం ఉన్నది. పర్వత పాదాల వద్ద ఆయన తల్లి  శ్రీ రేణుకా దేవి ఆలయం ఉండటం విశేషం. 
 కానీ ఒకరు చేసిన తప్పుకు మొత్తం రాజులందరినీ అకారణ ఆగ్రహ కారణంతో హతమార్చడం వలన అంటిన పాపాన్ని తొలగించుకోడానికి భార్గవ రాముడు భూమండలం అంతా ప్రయాణించారు. 
ఆ సమయంలో ఎక్కడ నీటి వసతి ఉంటుందో ఎక్కడ తన నిత్య అనుష్టానానికి అనువుగా ఉంటుందో అక్కడ తన గురువైన మహేశ్వరుని లింగాలను ప్రతిష్టించారు అని తెలుస్తోంది. 
అలా ప్రతిష్టించిన వాటిల్లో ఒకటి కాల్వ బుగ్గ ఆలయంలోని లింగం.
అందుకే ఆయన పేరున శ్రీ రామలింగేశ్వరునిగా స్వామి పిలవబడుతున్నారు. ఆలయానికి వెలుపల వాయువ్యం లో ఒక సహజసిద్ధ జల ఉన్నది. ఈ కోనేరు మధ్యలో ఉన్న శివలింగం పై భాగం నుండి అన్ని కాలాలలో నీరు వస్తుంది. ఆ జల కోరు నుండి కాల్వల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలోని పంట పొలాలను సస్యశ్యామలంగా మారుస్తుంది. 
అందువలన ఈ ఊరికి కాల్వ బుగ్గ అని స్వామిని బుగ్గ రామలింగడు అని పిలుస్తారు. 
కానీ ప్రస్తుతం నీరు లేకపోవడం విచారకరం. 








ఆలయ విశేషాలు 

ఆలయాలు సహజంగా తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ కాల్వబుగ్గ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. చాలా అరుదైన విశేషం. 
ఇలా పడమర ముఖంగా కొలువైన స్వామి అత్యంత భక్త సులభుడు అని విశ్వసిస్తారు. 
ప్రధార రహదారి వైపుకి అంటే తూర్పు వైపున మూడు అంతస్థుల చిన్న రాజగోపురం నూతనంగా నిర్మించారు. గోపురానికి ఎదురుగా ఉన్న  మండపంలో శ్రీ ఉమామహేశ్వరులు కొలువై ఉంటారు.  
సువిశాల ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వరునితో పాటు శ్రీ భవానీ మాత,శ్రీ గణపతి దర్శనమిస్తారు. . శ్రీ రామలింగేశ్వరస్వామి లింగం పైన బ్రహ్మ సూత్రం ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. బ్రహ్మ సూత్రం కలిగిన లింగాలు ఉన్న ఆలయాలు కర్నూలు చుట్టుపక్కల చాలా కనిపిస్తాయి. 
ఉపాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ పంచ ముఖ లింగేశ్వర స్వామి కొలువై ఉంటారు. 
ప్రస్తుత ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించారని తెలుస్తోంది. 
ప్రాంగణం లోని ఆలయాలు అన్ని వర్ణమయ అలంకరణతో నేత్రపర్వంగా కనిపిస్తాయి. 

ఆలయ పూజలు మరియు పర్వదినాలు 

ప్రతి నిత్యం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వారు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉండే నియమంగా  నిర్ణయించిన ప్రకారం 
అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు మరియు ఆరగింపులు జరుగుతాయి. 
శ్రీ వినాయక చవితి, ఉగాది, దసరా నవరాత్రులు ఇతర హిందూ పర్వదినాలను ఘనంగా జరుపుతారు. 
రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మరియు కార్తీక మాసాలలో అధిక సంఖ్యలో భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి కర్ణాటక నుండి కూడా వస్తుంటారు. 
మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిభావాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు. 
స్థానిక భక్తులు తమ పిల్లల నామకరణం, బారసాల, అక్షరాభ్యాసం ఇక్కడే జరుపుకొంటారు. 
ప్రశాంత ప్రకృతిలో చక్కని ఆహ్లాదకరవాతావరణంలో ఉన్న బుగ్గ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం మరిచిపోలేని అనుభూతి. 
సమీపంలోని కొమ్ము శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా విశేష క్షేత్రంగా ప్రసిద్ధి. 
కాల్వ బుగ్గ కర్నూలుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో నంద్యాల వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి మీద  ఉన్నది. ఆలయంలో అన్నప్రసాద వితరణ కలదు. వసతి సౌకర్యాలకు కర్నూలు లేదా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల మీద ఆధారపడాలి. 
నంద్యాల చుట్టుపక్కల నవ నంది క్షేత్రాలు మరియు ఓంకారం తప్పక సందర్శించవలసిన క్షేత్రాలు. నంద్యాల నుండి అహోబిలం కూడా దగ్గరే !










నమః శివాయ !!!!

 


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...