1, ఏప్రిల్ 2020, బుధవారం

Tiruvetakalam

                పార్దుడు పాశుపతం పొందినది ఇక్కడే 




వనవాస కాలంలో సమయం వృథా చేయకుండా రాబోయే యుద్ధంలో ఉపయోగపడే పాశుపతాస్ర్తము పొందమని పాండవ మధ్యమునికి సలహ ఇచ్చారు శ్రీ కృష్ణ భగవాన్.  ఆ ప్రకారం అరణ్యంలో పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేయసాగాడు అర్జునుడు.  
ఒకనాడు అడవి పంది ఒకటి దాడి చేయడానికి రాగా ఫల్గుణుడు దాని మీదకు శరం వేశాడు.  ఇంతలో మరోవైపు నుంచి మరో బాణం పందిని తాకింది.  సూకరం మృతి చెందింది.  
" నేను వేసిన బాణం వలన నే చచ్చింది కనుక వేట నాది" అంటూ ప్రవేశించాడొక వేటగాడు. అతని పాటు భార్య ఇతర అనుచరులు ఉన్నారు. 
" పందిని కావాలంటే తీసుకో!  కాని దాని చావుకు కారణం నేను సంధించిన శరం " అన్నాడు విజయుడు. 
వాదం పెరిగి చివరకు ఇరువురి మధ్య యుద్దానికి దారి తీసింది. భీకరమైన పోరు జరిగింది. అర్జనుని శరాఘాతానికి అంతర్యామి గాయపడ్డారు. అప్పుడు ఆయన తన నిజస్వరూపం ధరించారు. తెలియకుండా చేసిన తప్పు క్షమించమని ప్రార్దించాడట పార్దుడు.  
ఆశీర్వదించి పాశుపతం అనుగ్రహించారట. గాయపరచిన వానిని దగ్గరకు తీయడంతో అమ్మవారు ఆగ్రహించగా అర్దనారీశ్వరుడు ఆమెను బుజ్జగించారట. ఈ ఉదంతం " కిరాతకార్జునీయం" పేరిట ప్రసిద్ధి చెందింది.  ఈ సంఘటనలను ఆలయ మండపంలో చక్కని శిల్పాలు గా మలచారు. రమణీయంగా ఉంటాయి.  
ఈ పోరు జరిగింది చిదంబరం సమీపంలో అని చెబుతారు. వేట యుద్దానికి దారి తీసిన స్ధలంగా "తిరువేటక్కాళం " అని పిలుస్తారు.
అమ్మల గన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి పాదాల వద్ద ఉన్న "శ్రీ విజయాలేశ్వర స్వామి"  వారి ఆలయ గాధ కూడా దీనిని పోలి ఉండటం విశేషం. ఈ ఆలయంలో అర్జునుడు పొందిన అస్ర్తానికి ప్రత్యేక సన్నిధి కలదు. శ్రీ విజయాలేశ్వర లింగాన్ని విజయుడే ప్రతిష్టించాడని అంటారు. 
తిరిగి తిరువేటక్కాళం విషయానికి వస్తే అర్జనుని కోరిక మేరకు కొలువైన స్వామి ని " శ్రీ పాశుపతేశ్వరుడు లేదా శ్రీ పశుపతేశ్వరుడు" అని పిలుస్తారు. 
ఆలయ పౌరాణిక గాధ తెలిపే స్ధంభాలు కలిగిన మండపంలో అమ్మవారు శ్రీ సద్గుణాంబాల్ లేదా నల్ల నాయకి" ఉపస్థిత భంగిమలో వెనుక హస్తాలతో పుష్పాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. 
చందన కుంకుమ విభూతి లేపనాలతో పుష్ప మాలాలంకృతులై శ్రీ పశుపతేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉంటారు. లింగం మీద బాణం తాకడం వలన ఏర్పడిన గాయం తాలూకు మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. 
తొలి ఆలయాన్ని పదో శతాబ్దంలో చోళులు నిర్మించారని శాసనాధారాలు తెలుపుతున్నాయి. . కానీ ఇరవయ్యో శతాబ్దానికి శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాన్ని పునః నిర్మించారట.
రెండు ఎకరాల స్థలంలో తూర్పున మూడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది.  దానికి అనుబంధంగా ప్రాంగణం నికి నలువైపులా ఎత్తయిన గోడ నిర్మించారు. ఎన్నో పరివార దేవతల సన్నిధులుంటాయి. నర్తన, సిద్ధి, ఉచ్ఛ గణపతులు,  దక్షిణామూర్తి, వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ చండికేశ్వరుడు, శివగామి సమేత నటరాజు, మహలక్ష్మీ, భైరవుడు, సూర్య చంద్రులు వాటిల్లో దర్శనమిస్తారు. విడిగా నవగ్రహ మండపం కలదు.
గ్రహణ సమయాల్లో సూర్య చంద్రులకు చేసే పూజల వలన అన్ని గ్రహ దోషాలు తొలగి పోతాయి అని విశ్వసిస్తారు. 
శ్రీ పాశుపతేశ్వరుడు వైద్యులు కూడా!  ముఖ్యంగా నత్తి ఉన్నవారు నిర్ణయించిన పూజ చేయించుకొని ప్రసాదంగా ఇచ్చే చిన్న చిన్న ఇసుక గుళ్ళను తీసుకొంటే గుణం ఉంటుంది అని అంటారు. 
అవివాహితులు అమవాస్య నాడు ఇక్కడ ఆది దంపతులను దర్శించుకొంటే వివాహ అడ్డంకులు తొలిగి పోతాయి. 
పడాల్ పేట్రస్ధలాల వరుసలో చిదంబరం తరువాత స్ధానం తిరువేటక్కాళం దే!  నయనారులలో అగ్రగణ్యులు అయిన సంబంధార్. అప్పారు శ్రీ పాశుపతేశ్వరుని కీర్తిస్తూ తేవరగానం చేసారు. అరుణగిరి నాధర్ కూడా ఈ క్షేత్రంలో గానం చేశారు. 
నియమంగా రోజుకి మూడు పూజలు జరుపుతారు. సోమవారాలు పౌర్ణమి, అమవాస్య ఆరుద్ర నక్షత్ర, త్రయోదశి పూజలు ఘనంగా చేస్తారు.  అన్ని హిందూ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుపుతారు. 
అర్జునుడు పాశుపతాస్ర్తము పొందిన ఫాల్గుణ మాసంలో విశేష ఉత్సవం నిర్వహిస్తారు. 
ఇన్ని విశేషాలు కలిగిన తిరువేటక్కాళం ఆలయం చిదంబరం నికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అన్నామలై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నది. ఆటో లో సులభంగా చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!




Chidambaram Padal Petra sthalams


                            చిదంబర పడాల్ పేట్రస్ధలాలు 

తమ తమ ఆరాధ్యదైవాలను కీర్తిస్తూ ఆళ్వారులు మరియు నయనారులు గానం చేసిన పాశురాలు, పాటికాల కారణంగా అనేక మహిమాన్విత క్షేత్రాలు వెలుగు చూసాయి. అవి అంతకు ముందు నుంచే ఉన్నా వీరి గానం వలన దివ్య దేశాలు మరియు  పడాల్ పేట్రస్ధలాలు గా అపురూప గౌరవాన్ని సొంతం చేసుకొన్నాయి. మనకు దర్శించుకొనే అవకాశం లభించింది.
పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులు పాడిన పాశురగానం వలన నూట ఎనిమిది శ్రీ వైష్ణవ ఆలయాలు దివ్య దేశ హోదా పొంది ప్రసిద్ధి చెందాయివీటిలో అధిక భాగం తమిళనాడు లోనే ఉన్నాయి. ఒకటి పొరుగు దేశం అయిన నేపాల్ లో ఉన్నది. మిగిలినవి కేరళ, ఉత్తర ప్రదేశ్ మరియు మన రాష్ట్రంలో కలవు. చివరి రెండు అయిన తిరుప్పాలకడల్ మరియు పరమ పదం శ్రీ మహవిష్ణువు నివసించే పాలకడలి , శ్రీ వైకుంఠం. నిజ భక్తుల కోరిక ఇష్ట దైవ సన్నిధే కదా!  
మన రాష్ట్రంలో ఉన్న దివ్య దేశాలు కలియుగ వైకుంఠం తిరుమల మరియు శ్రీ నరసింహ స్వామి నవ రూపాలలో కొలువు తీరిన అహోబిలం
ఇక అరవై రెండు మంది శైవ నయనారులు గానం చేసిన తేవరాల ద్వారా రెండు వందలు డెభ్బై ఆరు శివ క్షేత్రాలు " పడాల్ పేట్రస్ధలాలు " గా గుర్తింపు పొందాయి. నయనారులు తమ తేవరాలలో ఉదహరించిన (దర్శించలేదు) మరో రెండు వందల ముప్పయి ఆరు దేవాలయాలను"తేవర వైప్పు స్ధలాలు " గా పేర్కొన్నారు. ఇవన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. కానీ పడాల్ పేట్రస్ధలాలు తమిళ నాడు లో ఎక్కువ సంఖ్యలో ఉండగా కొన్ని రాష్ట్రంతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలలో కనపడతాయి . మిగిలినవి  పొరుగు దేశాలైన నేపాల్ మరియు శ్రీ లంక లో ఉన్నాయి.
దివ్య దేశాలలో అగ్ర స్ధానం శ్రీ రంగానిది కాగా పడాల్ పేట్రస్ధలాలలో ప్రధమ స్ధలం చిదంబరం. శైవులకు కోవెల అంటే చిదంబరమే! చిత్రమైన విషయం ఏమిటంటే చిదంబర నటరాజస్వామి కి ఎదురుగా కొలువైన శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి ఒక దివ్య దేశం. ఇలాంటి విశేషాలను దరిదాపు అన్ని దివ్య దేశాలు మరియు పడాల్ పేట్రస్ధలాలలో గమనించవచ్చునుఇవి నాటి పాలకుల సహయ సహకారాలతో ఆధ్యాత్మిక గురువులు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అన్న సమానత్వ భావాన్ని పాదు కొల్పడానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చును
కైలాసనాథుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒకే ఒక్క క్షేత్రం చిదంబరం. ఎన్నో విశేషాల సమాహారంకానీ చాలా మందికి అవగాహన లేని విషయం ఏమిటంటే మరో మూడు పడాల్ పేట్రస్ధలాలు చిదంబరం సమీపంలో ఉండటం. మూడూ గొప్ప స్ధలాలే! తమవైన ప్రత్యేకతలు కలిగి ఉన్నవే! వాటిల్లో రెండింటి గురించి తెలుసుకొందాము.
శివ పురి 
పచ్చని పొలాలు కలిగిన ఊరు అనే అర్ధం వచ్చే " తిరునల్ వోయిల్" అని గతంలో పిలిచేవారట. కానీ ఇక్కడి శివాలయం కారణంగా "శివపురి" అన్న పేరు స్ధిరపడిపోయింది క్షేత్ర మరియు ఊరి ప్రత్యేకత నయనారు లలో అగ్రగణ్యుడైన "తిరుజ్ఞాన సంబంధార్" తో ముడిపడి ఉంది.సంబంధార్ స్వస్థలం "సిర్కాళి ". కానీ ఆయన తిరువేటక్కాళం అనే మరో పడాల్ పేట్రస్ధలంలో నివాసం ఉంటూ చుట్టు పక్కల ఉన్న శైవ క్షేత్రాల సందర్శన చేస్తుండేవారటఅలా ఒక రోజు మధ్యహన్న సమయానికి తిరునల్ వోయిల్ కి చేరుకొన్నారట. క్షుద్భాధ వేధించడంతో భిక్షాటనకు బయలుదేరారట. సమయంలో ఆలయ పూజారి ఆయన వద్ద కు వచ్చి తన ఇంట భిక్ష స్వీకరించమని ఆహ్వనించారట. అంగీకరంచారట సంబంధార్. భోజనానంతరం విశ్రాంతి తీసుకుని లేచిన సంబంధార్ తన వద్దకు వచ్చిన పూజారి కి కృతజ్ఞతలు తెలిపారట














దానికి అర్చకులు తాను నిన్నటి నుండి ఊరిలో లేనని విన్నవించుకొన్నారట . నయనారుకు అప్పుడు సత్యం అవగతమైనది. భక్థవత్సలుడు స్వయంగా పూజారి రూపంలో వచ్చి తనకు భోజనం పెట్టారని. భోళాశంకరుని అప్యాయత అనురాగాలకు పరవశుడైన నయనారు ఆలయం లోని స్వామి ని" శ్రీ ఉఛ్ఛనాధేశ్వరుడు" అని సంభోధిస్తూ తేవరగానం చేసారట. అనంతరకాలంలో తగిన తమిళ పదం అయిన  శ్రీ మధ్యాన్నేశ్వరస్వామి అని పిలవసాగారుశ్రీ కనకాంబిక అమ్మవారు విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.  
చోళరాజుల నిర్మితమీ ఆలయం . రెండు ఎకరాల స్థలంలో తూర్పున అయిదు అంతస్తుల రాజగోపురం కలిగి ఉన్న చిన్న ఆలయంలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉండవు. ఆలయానికి ఎదురుగా " కృపాసముద్ర పుష్కరిణి" ఉంటుంది
ముఖమండపంలో నందీశ్వరుడు, నవగ్రహ మండపం, అమ్మవారి సన్నిధి ఉంటాయి. మండప స్ధంభాల మీద గణపతి, నృసింహ, స్కాంద, రామ, కృష్ణ ఆదిగా గల దేవతా మూర్తులను చక్కగా మలిచారు. గర్భాలయానికి దారి తీసే అర్ద మండపానికి ఇరుపక్కలా ప్రధమ పూజ్యుడు వినాయకుడు, శ్రీ సుబ్రమణ్య స్వామి కొలువై ఉంటారు. ప్రముఖ సుబ్రమణ్యస్వామి భక్తుడైన అరుణగిరి నాధర్ ఇక్కడ కొలువైన తన ఆరాధ్యదైవం మీద కీర్తనలను గానం చేశారు.  
గర్భాలయ వెలుపల గోడలలో గణేషుడు, దక్షిణామూర్తి, లింగోధ్భవుడు, బ్రహ్మ, దుర్గ దర్శనం ఇస్తారు. లోపల చందన కుంకుమ విభూతి లేపనాలతో పుష్ప మాలాలంకృతులై శ్రీ ఉఛ్ఛనాధేశ్వరుడు నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. మహేశ్వరుడు భక్తునికి భోజనం అందించిన క్షేత్రం గా ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో అన్నప్రాసనలు విశేషంగా జరుగుతాయి. అలా చేయడం వలన తమ బిడ్డలకు జీవితంలో అన్నపాదులకు లోటు ఉండదు అని విశ్వసిస్తారుకొన్ని ప్రత్యేక దినాలలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది
శ్రీ పాలవన్ననాధర్  - పాలాభిషేక ప్రియుడు 
తిరుక్కుళిపాలై, శివపురి కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పడాల్ పేట్ర స్ధలం. రెండు క్షేత్రాల మధ్య కొన్ని విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. ఆలయ విశేషాలు తెలుసుకొనే ముందు అవేమిటో చూద్దాము
సప్త మహర్షులలో ఒకరు అగస్త్య మహర్షి. అన్ని పురాణాలలో ఈయన ప్రస్తావన ఉన్నది. గొప్ప శివ భక్తులుశివ కళ్యాణ సందర్భంగా ఉత్తర దిశన పెరిగిన భూభారం తగ్గించడానికి శివాజ్ఞ మేరకు శిష్యప్రశిష్య సమేతంగా దక్షిణ భారత దేశానికి వచ్చారు. అనేక ప్రాంతాలు సందర్శించారు. అక్కడ శివ లింగాలను ప్రతిష్టించారు. కారణంగానే దక్షిణాదిన పెక్కు చోట్ల శివుని శ్రీ అగస్ధేశ్వరుడు అని పిలుస్తారుమహముని తరలి వెళ్లే సమయంలో కైలాసనాథుడు ఆయనకు దక్షిణ దేశం నుండి కోరిన ప్రదేశం నుంచి తమ కళ్యాణం వీక్షించే వరం అనుగ్రహించారట. వర ప్రభావం వలన కావేరి తీరంలో సంచరిస్తున్న సమయంలో ఏడు ప్రదేశాల నుండి ఆది దంపతుల వివాహ వేడుకలను వీక్షించారట. వాటిల్లో శివపురి మరియు తిరుక్కుళి పాలై కూడా ఉన్నాయి అని అంటారు. మహర్షి పొందిన దివ్య దర్శనానికి గుర్తుగా గర్భాలయ లలో లింగం వెనుక పక్క గోడ మీద శివపార్వతులు వివాహ వేషధారణ లో కనిపిస్తారు.అరుదైన దర్శనమిది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధకుడైన అరుణగిరి నాధర్ రెండు క్షేత్రాల లో తన ఆరాధ్యదైవం మీద కీర్తనలను గానం చేశారు. అలాగే రెండు క్షేత్రాలకు పడాల్ పేట్రస్ధలాలలో స్ధానం సంబంధార్ చేసిన తేవరాల కారణంగా లభించింది. పౌరాణిక అంశాలలోనే కాదు చారిత్రక అంశాల్లో మరియు నిర్మాణాలలో కూడా పోలిక ఉన్నదిరెండూ చోళ నిర్మాణాలే ! బలిపీఠాలు , ధ్వజస్ధంభాలు ఉండవు. చోళరాజుల నిర్మించిన ఆలయాల్లో సహజంగా కనిపించే ఆకర్షణీయ శిల్పాలు ఇక్కడ కనపడవు. పోలికలను తర్వాత ఆలయ విశేషాలు తెలుసుకొందాము
పురాణ గాధ 
పెక్కు పురాణాలలో పేర్కొన్న కపిల మహర్షి శివ భక్తులు. దేశమంతటా పర్యటిస్తూ ఎన్నో శివలింగాలను ప్రతిష్టించారు. కలియుగ వైకుంఠం తిరుమల పర్వత పాదాల వద్ద ఉన్న కపిల తీర్థం వద్ద పూజలు అందుకొంటున్న లింగాన్ని కూడా కపిల మహర్షి ప్రతిష్ట గా చెబుతారు.అలా తన పర్యటనలో భాగంగా ఆయన కావేరి తీరానికి చేరుకొన్నారట. నిరంతరంగా ప్రవహించే జీవనది, మరో వైపు భవానీ శంకరునికి ప్రియమైన బిల్వవనం తో శోభాయమైన ప్రశాంత పరిసరాలు ఆయనను ప్రభావితం చేసాయి. ఆధ్యాత్మిక భావాలు ప్రకాశవంతమైనాయి. దానితో ఆయన అక్కడ కొంతకాలం శివారాధనలో గడుపుదామని నిర్ణయించుకొన్నారు. నిత్య పూజ నిమిత్తం నదీతీరం లోని తెల్లని ఇసుక తో లింగాన్ని చేసి ఆరాధించసాగారు
ఒక నాడు స్థానిక పాలకుడు సైన్యం తో శత్రువులను తరుముతూ వెళుతున్న సమయంలో గుర్రం తాలూకు కాలి గిట్టలు తాకి సైకతలింగం నిలువుగా చీలిపోయిందట. ఖిన్నుడైన మహర్షి మరో లింగాన్ని తయారు చేయడానికి సిద్దపడ్డారట. సరిగ్గా సమయంలో పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు నంది వాహనం మీద దర్శనమిచ్చి మరో లింగాన్ని చేయవలసిన అవసరం లేదని చేప్పారట. చీలిన లింగానికి పాలతో మాత్రమే అభిషేకం చేయమని అదేశించారట. అంతే కాకుండా స్యయంగా కామధేనువు క్షీరాన్ని అందించారట.  


















నాటి నుండి నేటి వరకు స్వామి వారికి పాలతోనే అభిషేకం చేస్తారు. మిగిలిన అభిషేకద్రవ్యాలను పానవట్టం వద్ద ఉంచి చూపిస్తారు తప్ప అభిషేకం జరపరు. అలా పాలతోనే అభిషేకం జరిపించుకొనే స్వామిని శ్రీ పాలవన్ననాధర్ అని పిలుస్తారుతెల్లగా మెరుస్తూ ఉండే లింగానికి మధ్యలో ఉన్న చీలికను స్పష్టంగా కనపడుతుంది. అభిషేకక్షీరాన్ని స్వీకరిస్థే సంతానం కలుగుతుంది అన్నది స్థానిక నమ్మకంఅసలు తిరుక్కుళిపాలై అనగా ఉప్పుటేరు సమీప ప్రాంతం అని అర్దం. గతంలో ఆలయం నదీసంగమ ప్రదేశం లో ఉండేదట. పదే పదే వరదల తాకిడికి గురైతుండేదట. అందువలన ఆలయాన్ని ప్రాంతానికి అంటే నదికి దూరంగా పునః నిర్మించారట. ఆలయం ఇక్కడి కి మార్చిన తరువాత రామాయణ మహ కావ్యాన్ని మనకందించిన వాల్మీకి మహర్షి కొంతకాలం శివారాధనలో గడిపి శివ సాక్షాత్కారాన్ని పొందారని చెబుతారు
అమ్మవారు శ్రీ వేదనాయకి ముఖమండపం లో దక్షిణ ముఖంగా కొలువుతీరి దర్శనమిస్తారు.తూర్పున మూడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది. ఆలయానికి వెళ్లే దారి మధ్యలో    నందీశ్వరుడు ఉపస్ధితుడై ఉంటాడు. ఆలయం చిన్నదైనా ఎన్నో ఉపాలయాలను కలిగి ఉంటుంది. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు, గణపతి, శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ చండికేశ్వరుడు, బాల గణపతి, నయనారులు ఉంటారుగర్భాలయ వెలుపల గోడలలో గణేషుడు, దక్షిణామూర్తి, లింగోధ్భవుడు, బ్రహ్మ చతురదుర్గా కొలువై ఉంటారు. ఆలయం లో మరో ప్రత్యేక విశేషం ఉన్నది
వారణాసిలో అడుగు పెట్టిన వారు ముందుగా కాలభైరవ దర్శనం చేసుకొని శ్రీ విశ్శనాధస్వామి దర్శనానికికాశీ లో ఉండటానికి అనుమతి కోరుకొంటారు. అక్కడి కాలభైరవ మూర్తి ప్రత్యేకంగా కనిపిస్తారు. తిరుక్కుళి పాలై లో కూడా కాలభైరవ సన్నిధి కలదుఅర్చనామూర్తి కాశీ లోని మూర్తిని పోలి ఉంటుంది. దక్షిణ భారత ఆలయాల్లో భైరవుని పక్కన ఉండే ఆయన వాహనం శునకం కాశీ తో పాటు ఇక్కడ కూడా కనపడదు. రెండు విగ్రహాలను చెక్కిన శిల్పి ఒకరే అని విశ్వసిస్తారుమనోభిష్టాలను నెరవేర్చేవానిగా భైరవుడు ప్రసిద్ధి. ముఖ్యంగా అష్టమి తిధినాడు విశేష పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు
శివ పురి, తిరుక్కుళిపాలై ఆలయాల్లో నియమంగా రోజుకి మూడు పూజలు జరుపుతారు. సోమవారాలు   పౌర్ణమి, అమవాస్యత్రయోదశి పూజలు ఘనంగా చేస్తారుశివరాత్రిగణపతి, దుర్గా నవరాత్రులను, సుబ్రమణ్య షష్టి, ఇతర హిందూ మరియు స్థానిక పర్వదినాల లో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు
నమః శివాయ!!!!

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...