29, అక్టోబర్ 2016, శనివారం

Greetings


వెలుగులు చిందే ఈ దీపావళి అందరికీ శుభాలు చేకూర్చాలని, సుఖ శాంతులు అందించాలని, జీవితాలలో సరికొత్త కాంతులు నింపాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. 

14, అక్టోబర్ 2016, శుక్రవారం

Sri Manakula Vinayaka Temple, Puducherry

                           శ్రీ మనకూల వినాయక ఆలయం 

తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది.


ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు  చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట  హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.
 శ్రీ మనకూల వినాయక కోవెల వీధిగా పిలవబడుతున్న వీధిని అప్పట్లో ఒర్లేన్ స్ట్రీట్ అని పిలిచేవారు. శ్రీ అరోబిందో ఆశ్రమానికి సమీపంలో ఉన్న ఆలయ వీధిలో పెద్ద మండపం భక్తులకు స్వాగతం పలుకుతుంది.
ఈ మండప పై భాగాన సిద్ది మరియు బుద్ది దేవేరులతో వినాయక వివాహ వేడుక వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడినది. ఉత్తర దక్షిణాలలో ఉండే ఈ మండపం గుండా తూర్పు దిశలో ఉన్న ప్రధాన ద్వారం గుండా మహా మండపం లోనికి ప్రవేశించవచ్చును. ద్వారం పైన గణేశుని వివిధ రూపాలు, ప్రియ పుత్రునితో ఉపస్థిస్థులైన శివ పార్వతులు, శ్రీ కుమార స్వామి ఆదిగా గల మూర్తులను సుందరంగా మలిచారు .
మహా మండపంలో దక్షిణ గోడకు హేరంభుని ముప్పై రెండు రూపాలను,వివిధ దేశాలలో నెలకొన్న మూషిక వాహనుని ఆలయాల వివరాలు చక్కగా చిత్రించి ఉంచారు.
స్వర్ణ శోభిత విమాన గోపురంతో ఉన్న గర్భాలయంలో గణేశుడు చతుర్భుజాలతో ఉపస్థితః భంగిమలో స్వర్ణ కవచ, ఆభరణ, పుష్పాలంకృతులై దర్శనమిస్తారు.గణేశునికి ఉన్న పదహారు రూపాలలో సాగరతీరాన తూర్పు ముఖంగా కొలువైన స్వామిని "భువనేశ్వర గణపతి"అంటారు.కానీ మనల అంటే ఇసుక,కులం అంటే కోనేరు అని తమిళంలో అర్ధం.ఒకప్పుడు ఇసుకతో నిండిన పుష్కరణి పక్కన కొలువైనందున ఈశపుత్రుని "మనకూల వినాయకుడు" అని పిలుస్తారు.గర్భాలయం వెనుక ఉపాలయాలలో శ్రీ బాలగణపతి, శ్రీ బాల సుబ్రహ్మణ్యం ఉంటారు.మండప ఉత్తరం వైపున ఉత్సవ మూర్తుల మండపంలో వివిధ రూపాల ఏకదంతుడు,పక్కనే వెండి మరియు బంగారు రధాలతో పాటు మిగిలిన వాహనాలు ఉంటాయి. ఆలయంలో కనిపించే స్వర్ణ, రజత విమానాలు, రథాలు, ఇతర మూర్తులు అన్నీ భక్తులు తమ మనోభీష్టాలు నెరవేరడం  వలన మనస్ఫూర్తిగా సమర్పించుకున్నవి కావడం విశేషం.
ఉత్తరం పక్కనే విశాల ఉత్సవ మండపం నిర్మించారు. పర్వ దినాలలో ముఖ్య కార్యక్రమాలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ మండపం వైపున గోడల పైన సుందర  చిత్రాలను చిత్రించారు.
ప్రతి నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరిచి ఉంటుంది.  

స్థానిక భక్తులు తన శిశువులను తొలిసారి ఈ ఆలయానికి తీసుకొని వచ్చిన తరువాతే మరెక్కడికన్నా తీసుకొని వెళతారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం లాంటి వాటికి శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రసిద్ధి.  గణపతి నవరాత్రులు, తమిళ ఉగాది, మహా శివరాత్రి మరియు ఇతర హిందూ పర్వదినాలలో భక్తుల\తాకిడి అధికంగా ఉంటుంది. 
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ మనకూల వినాయకుడు !!!

4, అక్టోబర్ 2016, మంగళవారం

Updates 4

కృతజ్ఞతలు. 

శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు మరో  స్పందన  వచ్చినది. 
చికాగో (USA),నుండి  అజ్ఞాత మిత్రులు  ఒకరు Rs.6626.00 ($.100 dollars)  పంపారు. 
ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను
ఇప్పటిదాకా వచ్చిన ధనంతో 500 పుస్తకాలు ముద్రించి కార్తీక మాసంలో మొదట తిరువణ్ణామలై లో పంచాలని భావిస్తున్నాను. కావలసిని సమాచారం అంతా సిద్ధంగా ఉన్నది. ఈ నెల 8న తిరువణ్ణామలై   వెళ్లి మరొక్కమారు శ్రీ అన్నామలై స్వామిని దర్శించుకొని కార్యక్రమం ప్రారంభించాలన్నది సంకల్పం. 
దసరా తరువాత పుస్తకం యొక్క ప్రతిని ఈ బ్లాగ్ లో ఉంచాలని ఆశ పడుతున్నాను. 
ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం. 
నమస్కారాలతో, ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 

Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...