30, జులై 2013, మంగళవారం

Singarakonda sri Prasannajaneya swamy Temple.

             సింగరకొండ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 

\


ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిచెందిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో సింగర కొండ లో ఉన్న శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఒకటి .
సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం సింగర కొండ.





పదునాలుగవ శతాబ్దంలో  ప్రక్కనే ఉన్న గ్రామానికి చెందిన సింగన్న అనే స్వామి భక్తుడు తన కుమార్తెతో కలసి ఆవులను మేపడానికి ఈ కొండ వద్దకు వచ్చేవాడు. 
మందలోని ఒక గోవు పాలు ఇవ్వక పోవడాన్ని గమనించిన సింగన్న దానిని అనుసరించి పోగా ఆ ఆవు కొండ మీద ఒక చోట ఆగగా అక్కడి గుహ నుండి బాలుడు ఒకరు బయటికి వచ్చి పాలు తాగడం చూశాడు. 
అది తన ఆరాధ్య దైవమైన శ్రీ నరసింహ స్వామి వారే నని తెలుసుకొన్న సింగన్న అక్కడ శ్రీ స్వామి వారి ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్మించాడు. 








తదనంతర కాలంలో దేవ రాయలు అనే స్థానిక పాలకుడు పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. కాల గమనంలో  భక్తుల సహకారంతో అనేక మార్పులు చోటు చేసుకొని ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 
ప్రశాంత ప్రకృతికి చిరునామా అయిన చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం ఉత్తర దిశగా ఉంటుంది. 
పర్వత పై భాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలున్నాయి. 
గర్భాలయంలో ప్రతిష్టా మూర్తి అయిన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి తన ఎడమ భాగాన అమ్మవారిని కూర్చోపెట్టుకొని రమణీయ పుష్పాలంకరణ తో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. ముఖ మండపంలో గాయక భక్తులైన పన్నెండు మంది ఆళ్వారుల విగ్రహాలనుంచారు. వైకుంట ఏకాదశి, నృసింహ జయంతి, ధనుర్మాస పూజలు, ప్రతి ఏడాది హోలీ పండుగ నాడు పెద్ద ఎత్తున జరిపే  తిరునాళ్ళు ఇక్కడి ముఖ్య ఉత్సవాలు. 
రెండు శతాబ్దాల క్రిందట కొండ మీద ధ్వజస్థంభ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వేలాది భక్తులు చూస్తుండగా కొండ క్రింద ఒక యోగీశ్వరుడు వచ్చి దక్షిణా ముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భవనాశి సరోవర తీరంలో ఉంచి అదృశ్య మైనాడట. 





అలా యోగి స్వామిని ఇక్కడే ఉంచడానికి సంభందించి స్థానికంగా ఒక కధ ప్రచారంలో ఉన్నది. 
సీతాన్వేషణకు బయలుదేరిన వానరుల బృందాలలో దక్షిణ దిశగా వెడలిన దానిలో ఆంజనేయుడు ఉన్నాడు.ఈ విధంగా చూస్తే రావణ లంక ఉన్నది ఆ దిశ లోనే కదా! ఆయన మాత్రమే శత యోజన సముద్రాన్ని దాటి లంకను చేరుకొన్నది. లంఖిణి ఓడించి లంకా నగరంలో ప్రవేశించారు. అశోక వనంలో ఉన్న జానకీ మాతను చూసి ముద్రికను ఇచ్చి ధైర్యం చెప్పారు. రావణ కుమారుని హతమార్చారు. రావణునికి శ్రీ రామ సందేశాన్ని తెలిపారు. లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశారు. 
దక్షిణ దిశను చూసే హనుమంతుడు మానవ జీవితాలలో జాతక రీత్యా నెలకొనే దుష్ట గ్రహ ప్రభావాన్ని తొలగిస్తారు అంటారు.  
  శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన శ్రీ నృసింహ స్వామి కొలువైన పవిత్ర క్షేత్రంలో స్వామి వారు ఆ విధంగా కొలువు తీరారు. నారసింహుడు భక్తుల సకల కష్టాలను ఎదుర్కొనే మానసిక నిబ్బరాన్ని, గెలిచే శక్తిని ప్రసాదిస్తారు అన్నది భక్తుల నమ్మకం. ఆయనతో కలిసి దక్షిణా ముఖ హనుమంతుడు అపమృత్యువును నివారిస్తాడు అన్నది భక్తుల విశ్వాసం. 
కొండ మీద ఉత్తర దిశగా కొలువైన శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి సేవ నిమిత్తం భ్రుత్యుడు సిద్ధంగా ఉంటూ ఇలా వెలిశారని, కూడా అనుకొంటారు.







ఏది ఏమైనా తొలుత నృసింహ క్షేత్రమైన సింగర కొండ తదనంతర పరిణామాలలో మారుతి నిలయంగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ అంజనేయ దర్శనార్ధం వస్తారంటే అతిశయోక్తి లేదు. 
ప్రధాన ఆలయం దక్షిణ దిశలో ఉండగా ప్రాంగణంలో మరో వాయునందనుని సన్నిధి పడమర దిశలో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. 





భవనాశి సరోవర తీరాన కొలువైన అంజనాసుతునికి ప్రతినిత్యం పర్వదినమే !
ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడుగంటల దాకా తెరిచిఉండే ఆలయంలో అభిషేకం నుండి ప్రదోషకాల పూజ దాకా ఎన్నో సేవలు నిత్యం స్వామి వారికి జరుపుతారు. అన్ని పండుగలు ఘనంగా, సమిస్థిగా జరుపుకొంటారు. 
శ్రీరామ నవమి, హనుమత్ జయంతి, శ్రీ నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, ఇతర వైష్ణవ పర్వదినాలను, స్థానిక పండుగలను అట్టహాసంగా నిర్వహిస్తారు. 
ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తిరునాళ్ళలో జిల్లానుండే కాదు రాష్ట్ర మంతటినుండి భక్తులు వచ్చి పాల్గొంటారు. 
గ్రామంలో శ్రీ రామాలయం, శివాలయం, షిర్డీ సాయి మందిరము ఉన్నాయి. 
సింగరకొండ గ్రామం ప్రకాశం జిల్లా అద్దంకి కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒంగోలు నుండి సులభంగా చేరుకోవచ్చును. 




ప్రశాంత ప్రకృతికి, ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరైన సింగరకొండ దేవతల నిలయంగా పేర్కొనదగ్గది. 




జై శ్రీ లక్ష్మి నరసింహ !
జై శ్రీ రామ్!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...