Vellamassery Garudan Kavu
వినుతాసుతుని ఏకైక ఆలయం - గరుడన్ కావు
మన హిందూ దేశం అనాదిగా సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వయం నడయాడిన పుణ్యభూమి. మానవ జీవిత అర్ధం పరమార్ధం తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పుట్టిన పుణ్య భూమి.
మనకి భగవంతుని పట్ల అచంచల విశ్వాసం.
ముఖ్యంగా జీవితంలో కష్టకాలంలో, అనారోగ్య విషయంలో, ఆర్ధిక సమస్యలలో ముందుగా గుర్తుకు వచ్చేది దేవదేవుడే !
ఈ కారణంగా మనకి ఎందరెందరో దేవీదేవతలు. వారందరికీ వేరువేరు బాధ్యతలు అప్పగించబడినాయి. అవసర సమయంలో వారు అర్హులై పుణ్య కర్మ కలిగిన భక్తులను ఆడుకుంటారు అని తెలిపే దృష్టాంతాలు మనకి పురాణాలలో, క్షేత్ర గాధలలో కనిపిస్తాయి.
ఈ విశ్వాసాలకు అనుగుణంగా ఎన్నో ఆలయాలు కూడా మనదేశం నలుమూలలా కనిపిస్తాయి.
ముఖ్యంగా ప్రత్యేక, అరుదైన ఆలయాల ప్రదేశం ఈ దేవతల స్వస్థలం.
దేశంలో అతి అరుదుగా కనిపించే ఎన్నో దేవీదేవతల దేవాలయాలు కేరళలో కనిపిస్తాయి.
అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ గరుడన్ కావు".
శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి ( గద ), ఆదిశేషువు మరియు గరుత్మంతుడు ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి.
శంఖం మరియు గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ది. వీరిని "నిత్య సూరి" అని పిలుస్తారు.
స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది.
ఎన్నో ఆలయాలలో సుదర్శన సన్నిధి ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడినది.
ఇక ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడే !
సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ది గరుత్మంతుడు.
ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతా సుతుని మనందరం చూస్తూనే ఉంటాం.
కాని అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం "గరుదన్ కావు"లో కనపడుతుంది.
బహుశా భారత దేశం మొత్తం మీద పక్షి రాజుకు ఉన్న ఆలయమిదోక్కటే అని కూడా తెలుస్తోంది.
ఆలయ గాథ
ఎన్నో యుగాలకు పూర్వం ఒక మహా మునికి మానవ జీవిత అర్ధం మరియు పరమార్ధం గురించిస్వయంగా వైకుంఠ నాధుడే తెలిపే సమయంలో వాహనమైన గరుడుడు పక్కనే ఉన్న కోనేరు వద్ద వేచి ఉన్నాడట.
అలా పరమాత్మ సంచరించిన స్థలంగా ప్రసిద్ది కెక్కిన ఆ ప్రదేశంలో కొన్ని కుటుంబాలు శ్రీ జగన్నాధుని ఆలయం నిర్మించుకొని ఆరాధించుకోనేవట!
ఆ కాలంలో పేరొందిన శిల్పి "పేరున్ థాచన్" ( కేరళ లోని ప్రముఖ ఆలయాల నిర్మాణాల వెనుక ఉన్నది ఈయనే అన్న ఒక బలమైన విశ్వాసం ప్రజలలో ఉన్నది) స్థానిక "వేట్టాతు నాడు" పాలకుని వద్దకు వచ్చాడట.
మహా శిల్పిని సాదరంగా ఆహ్వానించిన రాజు ఆయన చేతిలో సహజత్వాన్ని కలిగి ఉన్న గరుడ బొమ్మను చూసి శిల్పి నేర్పరితనాన్నికొనియాడారట.
దానికి "పేరున్ థాచన్" పతివ్రత అయిన స్త్రీ గనుక తాకితే ప్రాణం పోసుకొని ఎగురుతుంది అని సమాధానమిచ్చారట. అంతః పుర స్త్రీలు కావాలంటే పరీక్షించుకోవచ్చును అని కూడా అన్నారట.
ఆ మాటకు ఆగ్రహించిన రాజు శిల్పి భార్యను రప్పించి తాకించారట.
ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చెక్క గరుడ శిల్పం ప్రాణం పోసుకొని గాలిలోనికి ఎగిరినదట. ఆశ్చర్యపోయిన రాజు శిల్పిని క్షమాపణ కోరి గరుడ పక్షి వెళ్లిన మార్గంలో వెదకడానికి భటులను పంపారట.
వెంటాడిన భటులు సమీపంలోని కోనేరులో తెల్ల తాబేళ్ల మీద వాలి ఉన్నపక్షిని కనుగొన్నారట.
తరలి వచ్చిన రాజు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం తెలుసుకొని శిల్పాచార్యుని చేతనే ఇక్కడ ఒక నూతన ఆలయం శ్రీ మహా విష్ణువుకు, గరుత్మంతునికి కట్టించారట. ఆనతి కాలం లోనే విశేష ప్రాముఖ్యత పొందిన ఆలయం గా గుర్తించబడినది.
తదనంతర కాలంలో మైసూరును పాలించిన "టిప్పు సుల్తాన్" కేరళ ప్రాంతం మీద జరిపిన దాడులలో తొలుత పేరున్ థాచన్ చేత నిర్మించబడిన ఆలయం పూర్తిగా ధ్వంసం అయినదిట.
మూల విరాట్టులు సుమారు 1800 సంవత్సరాలుగా పూజలందుకొంటున్నా ప్రస్తుత ఆలయం మాత్రం రెండువందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది.
ప్రశాంత వాతావరణంలో గుబురుగా పెరిగిన వృక్షాల మధ్య తూర్పు మరియు పడమర ద్వారాలు కలిగిన ఈ ఆలయం ఉంటుంది. పురుష భక్తులు తప్పని సరిగా పంచె ధరించాలి.
ధ్వజస్తంభం మరియు బలి పీఠాలు లేని ప్రాంగణంలో ఒక పక్క అంబల కార్యాలయము మరో పక్క ప్రసాద విక్రయ శాల ఉంటాయి.
ధ్వజస్తంభ స్థానంలో నిలువెత్తు రాతి దీప స్థంభం ఉంచబడినది.
చిన్న ద్వారం గుండా లోనికి వెళితే లోపల మూడు చతురస్రాకార శ్రీ కోవెలలు, రెండు నమస్కార మండపాలు కనపడతాయి. ఇవన్నీ కూడా నూతనంగా ఆధునిక విధానంలో పురాతన శైలిలో నిర్మించబడినాయి.
ఎదురుగా రెండంచెల గోపురాలున్నప్రధాన గర్భాలయంలో శ్రీ మహా విష్ణువు చతుర్భుజుడై స్థానక భంగిమలో దర్శనమిస్తారు.లోపల తాబేలు రూపంలో శ్రీ కూర్మనాథ స్వామి కూడా దర్శనమిస్తారు. పక్కనే చిన్న ఉపాలయంలో శ్రీ వినాయకుడు వెలసి ఉంటారు. కేరళ ఆలయాలలో అధికంగా శ్రీ గణపతి మరియు శ్రీ ధర్మశాస్త ఉపాలయాలలో దర్శనమిస్తారు.
శ్రీ మన్నారాయణుడు కొలువైన ప్రధాన శ్రీ కోవెల వెనుకే శ్రీ గరుత్మంతుని సన్నిధి.
చందన పుష్పాలంకార శోభితుడైన గరుడుడు ఎగరడానికి సిద్దంగా రెక్కలు విప్పుకొన్న భంగిమలో దర్శనమిస్తాడు.గతంలో రాజభటులకు కొలనులో అదే భంగిమలో కనపడినందున అలానే మూర్తిని ప్ప్రతిష్టించారని చెబుతారు.
గరుడునికి ఇరుపక్కలా ఉన్న సన్నిధులలో సదాశివుని మరో రూపమైన "వేట్టక్కారాన్" మరియు "కార్త వీర్యార్జున్" వెలసి ఉంటారు.
మరో ఆలయంలో శ్రీ శంకర నారాయణ స్వామి, చివర ఉన్న దానిలో కైలాస వాసుడు కొలువుతీరి ఉంటారు. ప్రాంగణంలో శ్రీకూర్మనాథ స్వామి సన్నిధి కూడా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
ప్రధాన గర్భాలయం తప్ప మిగిలినవన్నీ నూతనంగా నిర్మించబడినవి.
ముఖ్య దైవం శ్రీహరి అయినా ప్రాధాన్యత శ్రీ గరుత్మంతునికే ఉండటం ప్రత్యేకం.
గరుత్మంతుడు
కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ మరియు వినుత ల మధ్య సహజంగా సవతుల మధ్య నెలకొని ఉండే స్పర్ధ ఉండేది. కద్రువ చేసిన మోసానికి వినుత ఆమెకు దాసిగా ఉండవలసి వచ్చినది.
కద్రువ సంతానం నాగులు. వినుత సంతానంలో ఒకరు శ్రీ సూర్యనారాయణుని రధ సారధి అయిన "అనూరుడు". రెండవ అమిత పరాక్రమశాలి అయిన "గరుత్మంతుడు.
తల్లి కి తనకి దాస్య విముక్తికి సవతితల్లి కోరినట్లుగా దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చిన వాడు గరుత్మంతుడు. దేవేంద్రుని సలహా మేరకు నాగులకు అమృతం అందకుండానే దాస్యవిముక్తి పొంది శ్రీ వైకుంఠవాసుని వాహనంగా శాశ్వత వైకుంఠ నివాస స్వామి సేవా భాగ్యం అందుకొన్నాడు.
అలా గరుడుని నాగులకు ఉన్న శత్రుత్వం అంతులేనిది.
నాగసర్పదోషం, సర్ప శాపం మూలంగా వివాహం కానీ వారు, సంతానం లేనివారు, అనారోగ్య పీడితులు ముఖ్యంగా చికిత్స లేని చర్మ వ్యాధులతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.
మూల విరాట్టు రూపం
కేరళలో శ్రీ మహావిష్ణువు శ్రీ రామునిగా లేక శ్రీ కృషునిగా కొలువు తీరినా చతుర్భుజాలతో దర్శనం ఇవ్వడం విశేషం. ఒక్క తిరువనంతపురంలో మాత్రమే శ్రీ అనంతపద్మనాభుడు శయన భంగిమలో దర్శనమిస్తారు.
గరుడన్ కావులో కూడా శ్రీవారు చతుర్భుజాలతో స్థానక భంగిమలో రమణీయ పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా కనపడతారు.
మనం ఏ రాష్ట్రంలో అయిన నెలకొన్న వైష్ణవ ఆలయాలలో చూస్తే శ్రీ గరుత్మంతుడు స్థానక భంగిమలో ముకుళిత హస్తాలతో వినమ్రముద్రలో గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్థంభం వద్ద దర్శనమిస్తారు. అరుదుగా ఒక కాలు వంచి మరో కాలు నేలకు తాకించి అంజలి జోడించిన గరుత్మంతుని చూడవచ్చును.
కానీ ఇక్కడ మాత్రం విప్పార్చుకొన్న రెక్కలతో స్థానక భంగిమలో ఆ హస్తాలలో అమృత భాంఢాన్ని ఉంచుకొని కనిపిస్తారు.
వినుతాసుతుడు ప్రధాన అర్చనామూర్తిగా కొలువు తీరిన ఈ ఏకైక క్షేత్రంలో ఆయన రూపం కూడా తగినట్లుగా ఉండటం ప్రత్యేకం.
ఆలయ పూజలు - ప్రత్యేకతలు
కేరళ రాష్ట్రంలో విశేష ఆదరణ కలిగిన గరుడన్ కావు ఆలయంలో నిత్య పూజలు నియమంగా జరుగుతాయి.
ఉదయం నాలుగు నుండి పదిన్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది.
ఆదివారాలు, పర్వదినాలలో వేళలను మారుస్తారు. ముఖ్యంగా ఆదివారాలలో దూరప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు గరుడన్ కావు వస్తుంటారు.
ఆదివారాలు, పర్వదినాలలో వేళలను మారుస్తారు. ముఖ్యంగా ఆదివారాలలో దూరప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు గరుడన్ కావు వస్తుంటారు.
ఈ ఆలయంలో భక్తులకు వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించే పూజ లేదా చికిత్సా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
నిజ సర్ప బంధనం
భక్తులు ముఖ్యంగా అనారోగ్య పీడితులు, సర్ప (నాగ) దోషం లేదా కుజ దోషం కలిగి ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు. రాహు లేదా కుజ దోషం వున్నవారు ఇక్కడ నాగ ప్రతిష్ట జరిపిస్తారు.ప్రాంగణమంతా ఎన్నో నాగ శిలలు లెక్కకు మిక్కిలిగా కనపడతాయి.
నాగ దోషం ఉన్న భక్తులు కొందరు జోతిష్యుల సలహా మేరకు నాగ పంచమి లేదా నాగ చవితి లాంటి ప్రత్యేక రోజులలో బ్రతికి ఉన్న సర్పాన్ని మట్టి కుండలో బంధించి తెచ్చి మూలవిరాట్టు ముందు కుండను పగలకొడతారు.
బుసలు కొడుతూ బయటికి వచ్చిన పామును ఆలయ పూజారి గరుడ పంచాక్షరి మంత్రంతో శాంతింప చేస్తారట.శాంతించిన పాము ఆలయ బయటికి వెళ్లి పోతుందట. ఇలా చేయడం ద్వారా వంశానికి తరతరాల నుండి వస్తున్న సర్ప దోషం తొలగిపోయింది అని అంటారు. తిరిగి ఆ వంశంలో ఎవరూ నాగ దోష పీడితులు కారని నమ్ముతారు.
బుసలు కొడుతూ బయటికి వచ్చిన పామును ఆలయ పూజారి గరుడ పంచాక్షరి మంత్రంతో శాంతింప చేస్తారట.శాంతించిన పాము ఆలయ బయటికి వెళ్లి పోతుందట. ఇలా చేయడం ద్వారా వంశానికి తరతరాల నుండి వస్తున్న సర్ప దోషం తొలగిపోయింది అని అంటారు. తిరిగి ఆ వంశంలో ఎవరూ నాగ దోష పీడితులు కారని నమ్ముతారు.
కేరళ రాష్ట్రంలో మన్నార్ శాల లో ప్రముఖ నాగ రాజ స్వామి ఆలయం ఉన్నది. అక్కడ కూడా ఇలా సర్పాన్ని తెచ్చి గరుడ మంత్రంతో బంధించే ప్రక్రియ చేస్తారు.
గరుడుని మహత్యమో మరొకటో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరూ పాము కాటుకు గురికాలేదని తెలుస్తోంది.
కంద దుంప చికిత్స
చర్మవ్యాధులు ఉన్నవారు దుంప కూరలు ముఖ్యంగా కంద మరియు చేమ దుంపలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కానీ ఇక్కడ అదే కంద దుంప సమర్పణ వ్యాధిని తగ్గించడం ఒక విశేషంగా పేర్కొంటారు.
దీర్ఘకాలం చర్మ వ్యాధులతో బాధపడే వారు మూడు ఆది వారాలు వచ్చి స్వామిని ఆరాధిస్తే సమస్త చర్మ, శ్వాస కోశ వ్యాధులు తొలగిపోతాయని తరతరాల నమ్మకం.
అర్చన, పూల అలంకరణ. అభిషేకం ఇలాంటివి కాకుండా గరుడన్ కావు ఆలయంలో కంద దుంప సమర్పణ చికిత్స కనపడుతుంది.
వ్యాధి గ్రస్తులు ఒక కంద దుంపను, ఒక లోహ నాగ రూపాన్ని తీసుకొని అర్చకస్వామి సూచనల ప్రకారం తమచుట్టూ తిప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్ధిస్తారు. ఆ సమయంలో మంత్రం పఠనం చేస్తారు అర్చకులు.
మొదటిసారి వెళ్ళినవారు లేక పరాయి రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలియక తేకపోతే అక్కడ ఉన్న దుంపను ఉపయోగించుకొని దానికి బదులుగా శక్తి కొద్ది పైకాన్ని హుండిలో వెయ్య వచ్చును.
అదే విధంగా చేయడం వలన వ్యాధి గణనీయంగా తగ్గిపోతుంది అని చెబుతారు.
కొల్ల వర్షం (మలయాళీ పంచాంగం) ప్రకారం నవంబర్ - డిసెంబర్ మధ్య వచ్చే వృశ్చిక మాసంలో జరిపే మండల పూజలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
పొంగలి, పళ్ళు శ్రీ గరుత్మంతునికి సమర్పించు కొంటారు.
అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు.
ఎన్నో ఆర్జిత సేవలు భక్తుల కొరకు అందుబాటులో ఉన్నాయి.
ఆలయ వెలుపలి ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త, భద్రకాళి సన్నిదులుంటాయి.
గరుడన్ కావు కేరళ రాష్ట్రం లోని మలప్పురం జిల్లాలో ఉన్నది.
షోరనూర్ లేదా గురువాయూరు నుండి "తిరూర్" మీదగా ఇక్కడికి చేరుకొనవచ్చును.
తిరూర్ నుండి పది కిలోమీటర్లు.
ఎలాంటి వసతులు లభించవు.
కనుక ఉదయం వెళ్లి తిరిగి రావడం ఉత్తమం.
వ్యాధి గ్రస్తులు ఒక కంద దుంపను, ఒక లోహ నాగ రూపాన్ని తీసుకొని అర్చకస్వామి సూచనల ప్రకారం తమచుట్టూ తిప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్ధిస్తారు. ఆ సమయంలో మంత్రం పఠనం చేస్తారు అర్చకులు.
మొదటిసారి వెళ్ళినవారు లేక పరాయి రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలియక తేకపోతే అక్కడ ఉన్న దుంపను ఉపయోగించుకొని దానికి బదులుగా శక్తి కొద్ది పైకాన్ని హుండిలో వెయ్య వచ్చును.
అదే విధంగా చేయడం వలన వ్యాధి గణనీయంగా తగ్గిపోతుంది అని చెబుతారు.
కొల్ల వర్షం (మలయాళీ పంచాంగం) ప్రకారం నవంబర్ - డిసెంబర్ మధ్య వచ్చే వృశ్చిక మాసంలో జరిపే మండల పూజలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
పొంగలి, పళ్ళు శ్రీ గరుత్మంతునికి సమర్పించు కొంటారు.
అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు.
ఎన్నో ఆర్జిత సేవలు భక్తుల కొరకు అందుబాటులో ఉన్నాయి.
ఆలయ వెలుపలి ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త, భద్రకాళి సన్నిదులుంటాయి.
గరుడన్ కావు కేరళ రాష్ట్రం లోని మలప్పురం జిల్లాలో ఉన్నది.
షోరనూర్ లేదా గురువాయూరు నుండి "తిరూర్" మీదగా ఇక్కడికి చేరుకొనవచ్చును.
తిరూర్ నుండి పది కిలోమీటర్లు.
ఎలాంటి వసతులు లభించవు.
కనుక ఉదయం వెళ్లి తిరిగి రావడం ఉత్తమం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి