Guntur Temples
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం , గుంటూరు
మానవ జన్మ తాలూకు బంధాలు అనుబంధాల గురించి, ఆత్మ పరమాత్మల సంభంధం గురించి, సచ్చీలులను, సజ్జనులను, నిజ భక్తులను, భగవంతుడు ఎలా ఆదరిస్తారో తన చేతల, లీలల మరియు బోధనల ద్వారా తెలియ చెప్పిన పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు.
అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని కాపాడిన లీలా మానుష రూపుడు వాసుదేవుడు. సమస్త ప్రాణి కోటిని గమ్యం వైపుకు నడిపించే పార్ధసారధి. భగవద్గీత ద్వారా మానవాళికి మార్గోపదేశం చేసిన అవతార పురుషుడు పురుషోత్తముడు.
జగమంతా తానై నిండిపోయిన జగన్నాదునికి ఆలయాలకు కొదవేమున్నది. పూరి, ద్వారక, గురువాయూరు, ఉడిపి, మథుర, బృందావనం ఇలా ఎన్నో క్షేత్రాలలో శ్రీ గోపాల కృష్ణ మూర్తి కొలువై దర్శనం ప్రసాదిస్తున్నారు.
ఇవే కాకుండా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పురాతన దేవాలయాలు ఆయన స్వగృహాలే! ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిశీలనగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఒక శివాలయం మరియు ఒక విష్ణాలయం కనిపిస్తాయి. శివాలయం విషయం లో ఎక్కడ చూసినా లింగరాజే దర్శనమిస్తారు. కానీ విష్ణాలయం విషయంలో మాత్రం కొంత ప్రత్యేకత కనిపిస్తుంది. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ నరసింహుడు లేక శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉంటారు. అవతార రూపాలు వేరైనా వైకుంఠ వాసుడు ఒక్కడే కదా !
అలాంటి వాటిల్లో గుంటూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి.
నాటి గర్త పురి నేటి గుంటూరు
చరిత్రలో "గర్త పురి"గా అనేక శాసనాలలో పేర్కొన్న నేటి గుంటూరులో ఒకప్పుడు అనేక నీటి చెరువులు ఉండేవట. నీటి గుంతలు ఉన్న ఊరుగా "గర్త పురి" అని పిలవబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. కాలక్రమంలో "గుంటూరు"గా మారినట్లు తెలుస్తోంది. మహర్షులు ఈ ప్రాంతం లో మజిలీ చేసినట్లుగా వారు తమ నిత్య పూజల నిమిత్తం నిరాకారుని వివిధ రూపంలో ప్రతిష్టించుకొన్నారు అనడానికి ప్రత్యక్ష సాక్షులుగా కొన్ని పురాతన ఆలయాలు నగరంలో నేటికీ కనిపిస్తాయి.
పట్టణంలో పురాతన ఆలయాలలో మొదటిదిగా పాత గుంటూరులో ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం గుర్తింపు పొందగా, రెండవ స్థానం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానిదే అని చెప్పవచ్చును.సుమారు వెయ్యి సంవత్సరాల ఈ ఆలయం ద్వాపర యుగం నాటి విశేషాలకు, కలియుగ నిర్మాణాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
సప్త మహర్షులు
యుగాల క్రిందట మానవాళికి మార్గదర్శకత్వం చేయడానికి దేవదేవుని ఆదేశం మేరకు ఏడు మంది మహర్షులను నియమించారు. వారు వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు. భరద్వాజుడు, జమదగ్ని మరియు విశ్వమిత్రుడు. వీరంతా తమదైన శైలిలో ఆదర్ష్యప్రాయ ఆశ్రమ జీవితాన్ని గడువుతూ సామాన్య మానవులకు విజ్ఞాన, విద్య, పాలన, ఆధ్యాత్మిక విషయాలలో తగు రీతిన బోధించారు.
సప్త మహర్షులలో ఒకరైన గౌతమ మహర్షి మానవులకు మార్గ దర్శకం చేసే "మానవ ధర్మ శాస్త్రం" అందించారు. ద్వాపర యుగంలో మహర్షి భూలోకములోని తీర్థస్థలాల సందర్శనలో అనేక జలాశయాలతో నిండిన ఈ ప్రాంతం చేరుకొన్నారు.జలం జీవం. మానవజాతి మనుగడకు ముఖ్యమైన వాటిలో ఒకటి నీరు. తమ నిత్య అనుష్టానానికి అవసరమైన పవిత్ర జలం లభిస్తున్న ఈ ప్రదేశంలో కొంత కాలం నివాసముండటానికి నిర్ణయం చేసుకొన్నారట. ఆయన ఆరాధ్య దైవం శ్రీ మహావిష్ణువు. శ్రీ మన్నారాయణ మూర్తి ధరించిన అనేక అవతారాలలో ద్వాపరం నాటికి ఆఖరిదిగా పరిగణింపదగిన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ గోవర్ధన గిరిధారి మూర్తిని ప్రతిష్టించారట. శిష్యప్రశిష్యులతో ఇక్కడ ఉన్నంతకాలం నియమంగా సేవించుకొని, తాను వెళ్ళిన తరువాత ఆలయ నిర్వహణా భాద్యతలను స్థానిక పాలకునికి అప్పగించారట.
అనేక వేల సంవత్సరాలు శ్రీ వేణుగోపాల మహర్షి పూజలు అందుకొన్నారు.
ఆయనచే ప్రతిష్టించబడిన బృందావన విహారి విగ్రహం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన దేశ విభజన సమయంలో తలెత్తిన దాడులలో భిన్నం కాబడినది అని తెలుస్తోంది. ఆలయ ఉత్తర గోడ వద్ద ఉంచబడిన ఆ విగ్రహాన్నినేటికి వీక్షించవచ్చును.
ఆలయ విశేషాలు
తొట్టతొలి ఆలయాన్ని ఎవరి నిర్మించారు అన్నదాని గురించి స్పష్టత లేదు. కానీ అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పదవ శతాబ్ద కాలంలో పాలించిన చాళుక్య రాజులు నిర్మించినట్లు తెలియవస్తోంది.
తనంతర కాలంలో ఆ పంరంపర కొనసాగుతూ వచ్చి పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన "పడుగు రాజు"(పండ్రయ రాజు) ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలో లభించిన శాసనాలలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ వంశ రాజుల గురించిన సమాచారం ఆంధ్రుల చరిత్రలో లభించుట లెదు. వీరు కొండవీటి, వేంగి చాళుక్యుల దండనాదులో లేక ఈ ప్రాంత అధికారులగానో భావించ వచ్చును. ఆస్థాన మండప స్థంభాలకు ఉన్న శాసనాలు చాల వరకు వివిధ కారణాల వలన చెరిగి పోయాయి. కొన్ని జైపూర్ లోని పురావస్తు శాఖ వారి సంగ్రహ శాలకు, కొన్ని విజయవాడ ఇంద్ర కీలాద్రి పైన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నట్లుగా చెబుతారు.
విశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా నిర్మించిన ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు.
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద బలిపీఠం మరియు శ్రీ గరుడాళ్వార్ప సన్నిధి ఉంటాయి.
పక్కన ప్రత్యేక సన్నిధిలో శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు.
ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో దక్షిణ దిశగా భక్తాన్జనేయునిగా కొలువు తీరిన అంజనా సుతుడు భక్తుల మనోభీష్టాలను త్వరితగతిన నెరవేర్చేవానిగా ప్రసిద్ధి. భయ, రోగ, శత్రు పీడలను మరియు అపమృత్యుభయాన్ని తొలగిస్తారని చెబుతారు.
మన జాతి, భాష, చరిత్రలకు శతాబ్దాల సాక్షులైన వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక వేళ వీటిని వేరే రూపంలో భద్ర పరచినట్లయితే అనువదించి సదర్శకుల సమాచార నిమిత్తం ఆలయంలో ఏర్పాటు చెయ్యడం వలన ఆలయ చరిత్ర అందరికి తెలిసే అవకాశం కలుగుతుంది.
గోపుర గోడలపైన చిన్న చిన్న శిల్పాలు శిల్పులవో, భక్తులవో లేక ఆలయాన్ని నిర్మించిన పడుగు రాజులవో తెలీదు. హనుమంతుడు, శ్రీ కృష్ణ విగ్రహాలు కూడా చెక్కబడి కనపడతాయి.
ప్రదక్షిణా పధంలో ఆలయ ముఖమండప మరియు గర్భాలయ వెలుపలి గోడలలో సుందరమైన శ్రీ గణపతి, సాలభంజిక, శ్రీ గరుడ , శ్రీఆంజనేయ, శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వైఖానస మహర్షి శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ రూపాలను అద్దాలతో మూసిన అరలలో ఉంచారు.
నాగ బంధం
ముఖమండప దక్షిణ ద్వారం పక్కన గోడలో ప్రత్యేకంగా అమర్చిన "నాగ బంధం" కనపడుతుంది. నాగ బంధం సహజంగా శివాలయాలలో కనపడుతుంది. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ట్రావెన్కోర్ రాజులు నిక్షిప్తం చేసిన సంపద ఉంచిన గదుల ద్వారా ప్రపంచానికి నాగ బంధం గురించి తెలిసింది.
నాగ బంధం అన్నది కట్టడ రక్షణ నిమిత్తం వేసే ఒక తాంత్రిక విధానం. దీని వలన చోరులు ప్రవేశించడానికి భయపడతారు.
కొందరు పండితులు నాగ బంధం "కుండలినీ శక్తి"కి నిదర్శనం అని చెబుతారు. ఏది ఏమైనా ఇది ఎవరికీ తెలియని అర్ధంకాని బేధించలేని ప్రక్రియ అని చెప్పవచ్చును.
ముఖ మండప పైభాగాన శ్రీ రుక్మిణి, సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరమాత్మ వర్ణమయ శిల్పాలను ఉంచారు. మండప దక్షిణ పై భాగాన శ్రీ శేషశయనుని రూపాన్ని ఉంచారు.
ఆలయ నైరుతిలో చిన్న సభా వేదిక నిర్మించారు. పురాణ శ్రవణానికి, ఇతర గోష్టి కార్యక్రమాలకు ఉపయుక్తం ఈ వేదిక. .ఉత్తరాన గోపికా సమేత గోవిందుని నాట్య మండపం కనిపిస్తుంది. బృందావనంలో రాసక్రీడలు ఆడిన విధానంలో అనేక కృష్ణ రూపాలు గోపికలతో నృత్యం చేస్తున్న విగ్రహాలను చక్కగా తీర్చిదిద్దారు.
ఇక్కడే శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్టిత పురాతన విగ్రహాన్ని చూడవచ్చును.ప్రాంగణంలో యాగశాల కూడా కలదు.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆలయ అంతర్భాగం లోనికి ప్రవేశిస్తే స్థంభాలకు చెక్కిన శాసనాలు, వివిధ రూపాలను చూడవచ్చును.
ముఖ లేదా ఆస్థాన మండపం ఎత్తు తక్కువగా ఉండి అనేక శాసనాలతో నిండిన రాతి స్తంభాల మీద నిర్మించబడినది. మండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు ఉంటాయి.
దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో గాయక భక్తులైన పన్నెండు మంది ఆళ్వారులు కొలువై ఉంటారు. వీరు గానం చేసిన పాశురాలు ద్వారా మనం నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్య దేశాలను దర్శించుకోగలుగుతున్నాము. వీరిలో ఒక స్త్రీ మూర్తి కూడా ఉన్నారు. "ఆండాళ్" లేదా "గోదా దేవి" అని పిలవబడే ఈమె సాక్షాత్తు భూదేవి అంశ అని విశ్వసిస్తారు. ఆండాళ్ గానం చేసిన "తిరుప్పావై" కీర్తనలను ధనుర్మాసంలో అన్ని వైష్ణవ ఆలయాలలో గానం చేయడం రివాజు.
ముఖమండపం గోడలో శ్రీ రామదూత మూర్తిని నిలిపారు.
ఆస్థాన మండపం తరువాత చిన్న అర్ధ మండపం ఆ తరువాత ఉన్న గర్భాలయంలో ప్రధాన అర్చనా మూర్తి శ్రీ వేణుగోపాల స్వామి చక్కని అలంకరణతో నేత్ర పర్వంగా దర్శన మిస్తారు.
గమనించ వలసిన అంశం ఏమిటంటే శ్రీ వేణుగోపాల స్వామి చతుర్భుజునిగా ఉండటం.
వెనుక హస్తాలలో శంఖు, చక్రాలను, ముందరి చేతులతో మురళిని ధరించిన ఇలాంటి రూపాన్ని అరుదుగా చూడగలం.
ఇలాంటి మూర్తిని మన రాష్ట్రంలో సుళ్ళూర్ పేటకు సమీపం లోని మన్నారు పోలూరు గ్రామంలో ఉన్నమరో అరుదైన శ్రీ జాంబవతి సమేత శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో దర్శించుకోవచ్చును. పేరు మురళీధరుదైనా లేక శ్రీరామచంద్ర మూర్తి అయిన మూలవిరాట్టు శ్రీమన్నారాయణునిగా చతుర్భుజాలతో కొలువైన ఆలయాలు కేరళలో అధికంగా కనపడతాయి.
అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువు. ఈ వైష్ణవ ఆలయంలో చూసినా మూలవిరాట్టు మరియు పరివార దేవతలు రమ్యమైన పుష్ప, ఆభరణ మరియు పట్టు పీతాంబరాలు ధరించి నేత్రపర్వంగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో కూడా స్వామివారు నయానందకరమైన అలంకరణలో భక్తవత్సలునిగా దర్శనం ప్రసాదిస్తారు.
ఉత్తరం పక్కన ఉన్న ఉప ఆలయంలో శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు ఉపస్థిత భంగిమలో రమ్యమైన అలంకరణలో మాతృమూర్తికి మూలరూపంగా కొలువై ఉంటారు.
నిత్య పూజలతో పాటు ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, హనుమజయంతి దినాలతో పాటు ఇతర పర్వదినాలలో ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.ప్రతి నిత్యం నియమంగా పూజాదికాలు జరుగుతాయి.ఈ ఆలయం సమీపంలో శ్రీ అంకాలమ్మ తల్లి, శ్రీ గుంటి విఘ్నేశ్వర, శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయాలు కూడా ఉన్నాయి.
గుంటూరు బస్సు స్టాండ్ కు దగ్గరలో శ్రీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కు చేరువలో పాత గుంటూరు లోనికి ప్రవేశించే ముందు యెర్ర చెరువు పక్కనే ఉంటుందీ ఈ చారిత్రక ప్రసిద్ది చెందిన ఆలయం.
ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించిన బ్రహ్మ సూత్రం కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి