19, ఏప్రిల్ 2014, శనివారం

Sri Bhaktha Vatsala Perumal Temple, Tiruninravuru

                              శ్రీ భక్త వత్సల పెరుమాళ్ ఆలయం

చెన్నై మహా నగరానికి చేరువలో ఉన్నా చక్కని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఊరు "తిరు నిన్రవూరు ". 
పురాణాలలోను చరిత్రలోను సుస్థిర స్థానం సంపాదించుకొన్న ఈ ఊరు వాటికి సాక్ష్యాలుగా ఇక్కడి ఆలయాలను చూపుతుంది. 
ఇక్కడ ప్రసిద్ది చెందిన శివాలయం మరియు విష్ణాలయం ఉన్నాయి. 
ఈ కారణంగా తిరునిన్రవూరు శైవులకు, వైష్ణవులకు సమానమైన ప్రాధాన్యత కలిగిన దర్శనీయ క్షేత్రం. 
పడాల్ పెట్ర స్థలాలలో, శ్రీ వైష్ణ దివ్య దేశాలలో సుస్థిర స్థానం దక్కించుకొన్న ఘనత తిరునిన్ర వూరుది. 
మరో గమనించ దగ్గ అంశెం ఏమిటంటే రెండు ఆలయాల పురాణ గాధలు  నిజ భక్తుని దైవం ఎంతగా అభిమానిస్థారో  తెలుపుతాయి. తిరునిన్ర వూరు ముఖ్యంగా శ్రీ భక్త వత్సల పెరుమాళ్ ఆలయానికి ప్రసిద్ది. 
స్వామి ఎప్పుడు వెలిసారనే దానికి సంబంధించి సరి అయిన ఆధారాలు లేవు. 
సముద్ర రాజు శ్రీ మహా విష్ణువు దర్శనాన్ని అపేక్షించుతూ ఇక్కడ తపమాచారించినట్లుగా, సంతుష్టుడైన  శ్రీ హరి దర్శన మిచ్చి ఇక్కడే కొలువైనట్లుగా ఒక కధనం స్థానికంగా వినపడుతుంది. 
ఆళ్వార్ లలో ఒకరు, దాదాపుగా అన్ని దివ్య దేశాలలో మంగళ శాసనాలు చేసిన వాడు "తిరుమంగై ఆళ్వార్". 
తన దేశ పర్యటనలో ఈ క్షేత్రానికి వచ్చిన ఆయన దర్శనం మాత్రం చేసుకొని ఎలాంటి పాశుర గానం చేయకుండా వెళ్ళిపోయారుట. 
అది శ్రీ భక్త వత్సల పెరుమాళ్, అమ్మవారు శ్రీ ఎన్నై పెట్ర తాయారు లకు కష్తం కలిగించినదేమో ఆళ్వార్ అక్కడి నుండి మహాబలిపురం చేరుకొని శ్రీ స్థల శయన పెరుమాళ్ దర్శనానికి వెళ్ళగా ఆయనికి శ్రీ భక్త వత్సల పెరుమాళ్ రూపం కనిపించి ఆయన మీద పాశుర గానం చేసారట. 
ఒక పాశురంతో సంతృప్తి చెందలేదేమో లక్ష్మి నారాయణులు, ఆళ్వార్ తిరుకన్నాపురం చేరుకొని ఆలయానికి వెళ్ళగా అక్కడా ఆయనకు తిరునిన్రవూరు పెరుమాళ్ కనపడటంతో మరో మంగళ శాసనం అక్కడ చేసారట. 
చిత్రమైన విషయం ఏమిటంటే తిరుకన్నాపురంలో కొలువైన స్వామి పేరు కూడా శ్రీ భక్తవత్సలపెరుమాళ్ కావడం !
ఆళ్వార్లు క్షేత్ర సందర్శన సమయంలో గానం చేయక వేరే చోట చేసిన మంగళ శాసనాల ఆధారంగా దివ్య దేశం హోదా పొందిన ఏకైక క్షేత్రం తిరునిన్రవూరే!
విశాల ప్రాంగణానికి తూర్పున అయిదు అంతస్తుల రాజగోపురం సుందర విష్ణు పురాణ శిల్పాలతో నిండి భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది.
















ప్రాంగణం లోనికి ప్రవేశించిన తరువాత కుడివైపున ఉంజల్ మండపం, కుడివైపున చిన్న శ్రీ నారసింహ సన్నిధి ,ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠము కనపడతాయి.



















దక్షిణ దిశన నిర్మించిన శిల్పాలతో కూడిన రాతి స్తంభాల మండపం యాత్రికులు విశ్రాంతి తీసుకొనే నిమిత్తం నిర్మించబడినది. 
దానికి ఆనుకొని శ్రీ ఎన్ని పెట్ర తాయారు సన్నిధి, పక్కనే శ్రీ చక్రత్తి ఆళ్వార్ సన్నిది, ఉండగా ఉత్తరం పక్కన శ్రీ ఆండాళ్  సన్నిధి ఉంటుంది.





                                    అమ్మవారి ఆలయం. పక్కన శ్రీ చక్రత్తి ఆళ్వార్ ఉపాలయం


                                                             శ్రీ ఆండాళ్ సన్నిధి


                                                               ఉత్తర ద్వారం 

                                                              శ్రీ విష్వక్సేన సన్నిధి 




                                                     ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం 



ఆగ్నేయంలో శ్రీ వారి సేనానాయకుడైన శ్రీ విష్వక్సేనుని సన్నిది కనపడుతుంది. 
ప్రదక్షిణా క్రమంలో వీరందరినీ దర్శించుకొని ముఖ మండపం, నమస్కార మండపం దాటి అర్ధ మండపం చేరుకొంటే గర్భాలయంలో స్థానక భంగిమలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ భక్త వత్సల పెరుమాళ్ నిలువెత్తు రూపంలో దర్శనమిస్తారు
చతుర్భుజాలలో చక్రం, శంఖం, గద అభయ హస్తాలతో స్వామి నిండైన పట్టు వస్త్ర, బంగారు ఆభరణాల మరియు వివిధ వర్ణ పుష్ప అలంకరణతో నయనమనోహరంగా కనపడుతూ భక్తుల ప్రార్ధనలను, పూజలను స్వీకరిస్తుంటారు.
ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర శ్రీ గరుత్మంతుడు కొలువై స్వామి సేవకు సిద్దంగా ఉంటారు
లభించిన ఆధారాల ప్రకారం ఎమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని, తరువాత అంటే తొమ్మిది,పదిశతాబ్దాల కాలంలో చోళ రాజులు అభివ్రుద్దిపరచారని తెలియవస్తోంది.తదనంతర కాలంలో ప్రాంతాన్ని పాలించిన రాజులందరూ ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి
నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచివుండే ఆలయంలో ఎన్నో పూజలు జరుగుతాయి
ఏకాదశి. ద్వాదశి తిధులలో ప్రత్యేక పూజలు భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసారు
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, హనుమత్జయంతి, శ్రీ నారసింహ ఇతర అవతారాల జయంతి రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి
ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ ఆలయం ఉంటుంది.





పూర్తిగా ఆధ్యాత్మిక  ప్రశాంతతో కూడిన వాతావరణం శ్రీ భక్త వత్సల పెరుమాళ్ ఆలయంలో నెలకొని వుంటుంది.  
తిరునిన్ర వూరులో దర్శించుకోవాలసిన మూడు ముఖ్య ఆలయాలలో మరొకటి వరుణ పుష్కరణి ఒడ్డున ఉన్న శ్రీ రామచంద్ర మూర్తి ఆలయం.  
బహు పురాతనమైన ఆలయంలో  సీత, లక్ష్మణ సమెత శ్రీ రామ నిలువెత్తు విగ్రహాలు భక్తులను భక్తి భావంలో ముంచెత్తుతాయి.










ఇక్కడ రెండు అరుదైన దేవతా మూర్తులు కనపడతాయి. ఒకటి సుందర శ్రీ కృష్ణ విగ్రహం కాగా, రెండవది శ్రీ ఆంజనేయ విగ్రహం
హనుమంతుని విగ్రహం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి
రామ రావణ సంగ్రామ సమయంలో దశరధ నందనులకు  సమరానికి సరియిన వాహనం లేకపోవడంతో వారిని  తన భుజాలమీద ఎత్తుకొని, తానూ యుద్దానికి సిద్దం అంటూ ఖడ్గం, డాలు ధరించి, పాదాలతో రాక్షసులను మర్దిస్తున్న శ్రీ వాయునదనుని రూపాన్నిమరెక్కడా చూడలేము. తప్పక దర్శించవలిసినదీ శ్రీ రాముని  ఆలయం
మరో ఆలయం శ్రీ హృదయాలేశ్వర స్వామి కొలువైనది. అరవై మూడు మంది నయనారులలో ఒకరైన పూసలార్ నయనార్ తో ముడిపడి ఉన్న ఆలయం ఇది. 
సరిగ్గా శ్రీ భక్త వత్సల పెరుమాళ్ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. 
నూటఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలోఒకటైన తిరునిన్రవూరు చెన్నైఅరక్కోణం దారిలో ఉన్నది
అరక్కోణం వెళ్ళే అన్ని లోకల్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి
ఆలయం స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది
చేరుకోడానికి ఆటోలు లభిస్తాయి. కానీ వసతి సదుపాయాలు లభించవు
చెన్నై, తిరువళ్లూర్, అరక్కోణంలో అన్ని సదుపాయాలూ ఉంటాయి


జై శ్రీ మన్నారాయణ !!! 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...