28, మే 2018, సోమవారం

Mulakaluru Temples


                                                శివాలయం 

మా అమ్మగారి కోరిక మీదకు విజయవాడ నుండి చిలకలూరి పేట మీదుగా కోటప్పకొండ చేరుకొని శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొన్నాము. తిరుగు ప్రయాణం నరసరావుపేట మీదగా వచ్చాము. నరసరావుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి మార్గంలో ఉన్న ములకలూరులో మత్శ్యవతార ఆలయం ఉందని చెప్పారు ఎవరో  చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ అలాంటి ఆలయం ఏదీ లేదని తెలిసింది. కానీ ఈ క్రమంలో ఒక పురాతన శివాలయం సందర్శించే అవకాశం లభించినది. 
ఏకాలం నాటిదో ? ఎవరు నిర్మించారో? స్వామి వారి పేరు ఏమిటో ? ఈ వివారాలేవీ తెలియ రాలేదు. ఊరికి దూరంగా మారేడు, గన్నేరు, రావి  చెట్ల మధ్య రాతితో నిర్మించబడినదీ ఆలయం. ఆలయం వెలుపల పెద్ద రాతి ధ్వజస్థంభం, నంది, శ్రీ  అష్టభుజ కాలభైరవుని విగ్రహం ఉంటాయి. గర్భాలయంలో ఎత్తైన రాతి పానువట్టం మీద ధవళవర్ణ లింగ రూపంలో పరమేశ్వరుడు భక్తుల అభిషేకాలు స్వీకరిస్తుంటారు. పక్కనే దక్షిణ ముఖంగా శ్రీ పార్వతీ అమ్మవారు కొలువై ఉంటారు. ఆనందం కలిగించిన మరో సంగతి ఏమిటంటే ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుండటం !
ఆలయ నైరుతి భాగంలో వట వృక్షం క్రింద నాగ ప్రతిష్టలు కనపడతాయి. మాంచి ఎండలో వెళ్ళామేమో కారు ఏసీ ని తలదన్నే చల్లదనం ఆ చెట్ల నీడన లభించినది. ప్రకృతి లేక పరమేశ్వరుని మహత్యమో ఉన్నది కొద్ది సమయమైనా యెనలేని ప్రశాంతతను పొందడం జరిగింది. 
నమః శివాయ !!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...