8, డిసెంబర్ 2014, సోమవారం

Sri Mulankeshwari Temple, Ameenabad

              శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయం


కొండవీటిని రాజధానిగా చేసుకొని 1328 తో 1428 వరకు వంద సంవత్సరాలు పాలించిన రెడ్డి రాజుల ఆరాధ్య దైవం శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారు (మూలగూరమ్మ). 
ప్రోలయ వేమా రెడ్డి ఇక్కడ కోట నిర్మించడానికి ముందు నుండే ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు.



  




రెడ్డి రాజుల వీరుల ప్రతిభ వలన ఒడిషా లోని కటక్ వరకూ వీరి రాజ్యం విస్తరించినది. అదే సమయంలో వీరి పాలనా కాలమంతా బహమనీ సుల్తానులతో, రేచెర్ల వెలమ రాజులతో, విజయనగర పాలకులతో నిరంతర యుద్దాలతో సాగింది. 








ప్రతి యుద్దానికి ముందు సర్వ సేనాని శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం, విజయం తరువాత అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరిపించడం, ఆభరణాలు సమర్పించుకోవడం జరిగేది. అలాంటి ఒక శాసనం "అనవేమా రెడ్డి " (1377)రాజమహేంద్ర వరం తదితర ప్రాంతాలను జయించి వచ్చి వేయించినది కొండ ఎక్కేటప్పుడు కనపడుతుంది. 
చాలా వరకు శిధిలమైన దానిని  ఆకతాయిలు తమ పేర్లను రాసి మరింతగా పాడు చేయడం జరుగుతోంది. 



చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయానికి సోపాన మార్గం ఉన్నది. 
కొండ పైనున్న నిర్మాణాలన్నీ రెడ్డి రాజుల కాలం జరిగినవి కాగా క్రింద కొన్ని నూతన నిర్మాణాలు చోటుచేసుకొన్నాయి. 













పర్వత పాదాల వద్ద స్వాగత ద్వారము. పక్కనే గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ ఆలయం. 
మెట్ల మార్గంలో పైకి వెళుతుంటే మొదట దర్శనమిచ్చేది విఘ్నేశ్వరుడు. 
మొక్కి ముందుకు వెళితే నూతనంగా నిర్మించిన గణపతి, సుబ్రహ్మణ్య, హరిహర సుత అయ్యప్ప ఆలయాలు వస్తాయి. 





















సుబ్రహ్మణ్య స్వామి అష్ట పడగల నాగలింగ రూపంలో ఉండటం, ఎదురుగా మూషికం లేదా మయూరం కాకుండా నందీశ్వరుడు కొలువుతీరి ఉండటం విశేషం. 
అదే విధంగా శ్రీ ధర్మశాస్త ఆలయానికి ముందు పడునేట్టాం పడి ఉంటుంది. 



























పర్వతాగ్రాన తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో రాతి మండపం, పక్కనే ఆలయ వృక్షం.
ఆ పక్కనే శ్రీ ఆంజనేయ మరియు నవగ్రహ మండపం.
















తూర్పు వైపున ధ్వజస్తంభం, రాతి దీప స్థంభం ఉంటాయి. 
దీప స్థంభం పైన కొన్ని శాసనాలు లిఖించబడి ఉన్నాయి. 











తూర్పు వాకిలి కాక దక్షిణాన మరో వాకిలి. సాదాసీదాగా  బంగారపు రంగులో ఉండే విమానం. 













శిఖరం పైనుండి చూస్తే దూరంగా పచ్చని పొలాలు, బొమ్మల కొలువులా గ్రామం లోని ఇల్లు, మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.














ముఖ మండపంలో ఉన్న చిన్న మండపంలో శ్రీచక్ర సహిత అమ్మవారు. నిత్య కుంకుమార్చన జరుపుతారు. 
ఈ మండపం వెనక గద్దె మీద శ్రీ మహా విష్ణు, సదాశివ లింగం.  మరికొన్ని దేవతా రూపాలు. 










గర్భాలయంలో అమ్మవారు కుడి చేతిలో ఖడ్గం ధరించి, ఎడమ చేతిని వరద హస్తంగా చూపుతో ఉపస్థిత భంగిమలో శాంత గంభీర వదనంతో భక్తుల పూజలను స్వీకరిస్తుంటారు. 







గత రెండు దశాబ్దాలుగా జన బాహుళ్యంలో తిరిగి గుర్తింపు ఆదరణ పొందుతున్న శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. 
అన్ని హిందూ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు. నవ రాత్రులలో విశేష అలంకరణలు. 

జై అంబే మాతకీ జై !!!






























































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...