Sri Lakshmi Narasimha Swamy Temple, Guntur
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, గుంటూరు
సర్వ లోక రక్షకునిగా పేర్కొనే శ్రీ మన్నారాయణుని దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు సంకల్ప మాత్రాన అవతరించినవి.జననీజనకులు లేకుండా జన్మించిన "సద్యోజాత రూపాలు".
వీటిల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ నారసింహ అవతారం.దుష్ట సంహరునిగా, భక్త వరదునిగా, అపమృత్యు భయాన్ని తొలిగించేవానిగా, కోరిన కోర్కెలు కురిపించే కల్పతరువుగా స్వామి ప్రసిద్దుడు.
శ్రీ నరసింహునికి మన రాష్ట్రంలో పెక్కు ప్రసిద్ద ఆలయాలున్నాయి. కానీ హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఉగ్రత్వం చల్లారని స్వామి గర్జనలు చేస్తూ లోకాలను భయభ్రాంతులను చేస్తూ తిరగసాగారట. ఆ క్రమంలో స్వామి అనేక మంది రాక్షసులను సంహరించారని, ఆయా ప్రదేశాలలో కొలువైనారని గాధలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు రచించిన "శ్రీ నరసింహ ప్రాచీన గాథా లహరి" ప్రకారం శ్రీవారు ఇలా కొలువైన క్షేత్రాలు మన రాష్ట్రంలో ముప్పై రెండు. చివరకు ప్రహ్లాదుడు చేసిన విన్నపాలకు శాంతించి విశాఖపట్టణానికి సమీపంలో సముద్ర తీరాన ఉన్న భీమునిపట్నంలో పావురాలకొండ మీద సింహ రూపం విడనాడి శ్రీమన్నారాయణునిగా దర్శనమిచ్చారన్నది సారాంశం. అలాంటి క్షేత్రాలలో
చరిత్రలో సముచిత స్థానం ఉన్నా స్థానికంగా మాత్రమే గుర్తింపు ఉన్న ఒక నారసింహ ఆలయం ఒకటి గుంటూరు పట్టణంలో నెలకొని ఉన్నది.
ఆరువందల యాభై సంవత్సరాల క్రిందట స్థానిక భక్తునికి స్వప్న దర్శనమిచ్చిన స్వామి "తానొక చెట్టు తొర్రలో ఉన్నాను" అని తెలిపారట. అతడు ప్రాంత పాలకులైన కొండవీటి రెడ్డి రాజుకు విషయం విన్నవించుకొన్నారు.
రాజాదేశం మేరకు సాగిన అన్వేషణలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య మంగళ విగ్రహం ఒక వట వృక్షం తొర్రలో లభించినది. తమ అదృష్టానికి సంతసించిన రాజు ఇక్కడ చక్కని ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం అనేక భూరి విరాళాలను ఇచ్చారు. ఈ విషయం తెలిపే శాసనం ఒకటి ప్రాంగణంలోని ఉత్సవ మండప స్థంభం మీద చెక్కబడి ఉన్నది.
నాటి నుండి నేటి వరకు నిత్య పూజలు జరుగుతున్న ఈ ఆలయం అనేక మంది భక్తులు సమర్పించుకున్న కైంకర్యాలతో దినదినాభివృద్ది చెందుతోంది.
ద్వజస్థంభం వద్ద సహజంగా గరుత్మంతుడు కొలువై ఉంటాడు. కానీ ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయుడు, శ్రీ వినతా సుతుడు ఇరువురూ కొలువై కనపడటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇలాంటిది చాలా అరుదు.
తూర్పు ముఖంగా ఉండే ప్రధాన ద్వారానికి అయిదు అంతస్తుల సుందర శిల్పాలతో కూడిన రాజ గోపురం నిర్మించబడినది.దాని మీద భాగవత, రామాయణ ఘట్టాలను చక్కగా మలచారు.
ప్రాంగణలో మండపం, ఎదురుగా ద్వజస్థంభం, బలి పీఠం కనపడతాయి.
పక్కన ఎత్తైన కళ్యాణ మండపం కూడా ఉంటుంది.సుందర వర్ణమయ రూపాలతో శోభాయమానంగా కనిపిస్తుందీ ఆలయం.ముఖమండప పై భాగాన దశావతార రూపాలను నిలిపారు.శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మహా విష్ణువు, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వార్లు కూడా ఇక్కడ దర్శన మిస్తారు.
ఉదయం ఆరు నుండి మధ్యాహాన్నం పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, గుంటూరు పట్టణంలో ఆర్ అగ్రహారంగా పేరొందిన రామచంద్ర అగ్రహారంలో ఉన్నది.బస్టాండు నుండి రైల్వే స్టేషన్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.గుంటూరు పట్టణంలోని దర్శనీయ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.
జై శ్రీ మన్నారాయణ !!!!
ప్రదక్షణ పధంలో వాయువ్య మూలలో పురాణ శ్రవణానికి ఇతర వేదిక నిర్మించబడినది. గోడలపైన అనేక శ్లోకాలను చెక్కిన రాళ్ళను భక్తుల సౌలభ్యం కొరకు ఉంచారు. ఉత్తరంలో వైకుంఠ ద్వారం.
ఆస్థాన మండపం లోని ఏకశిల స్థంభాలు ఆలయ కాలాన్ని చెప్పకనే చెబుతాయి.
గర్భాలయంలో వామాంకం మీద శ్రీ లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉపస్థిత భంగిమలో రమణీయ పుష్ప అలంకారంలో శ్రీ నారసింహ స్వామి ప్రసన్న రూపంలో దర్శనమిస్తారు. పక్కనే ఉన్న ఉపాలయలలొ శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు విడిగా కొలువై ఉంటారు. వివాహ మరియు ఉద్యోగ సంబంధిత ఆటంకాలను తొలగించే దానిగా ఈ దేవి ప్రసిద్ది. మరో ఉపాలయంలో శ్రీ ఆండాళ్ ఉంటారు. ధనుర్మాసం లో విశేష పూజలు నిర్వహిస్తారు.
నియమంగా నిర్ణయించిన నిత్య పూజలను, కైంకర్యలను జరుపుతారు. చైత్ర మాసంలో బ్రహోత్సవాలు, శ్రావణం లో పవిత్రోత్సవాలు, వైశాఖ శుద్ద చతుర్ధశి నాడు స్వామి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు అలంకరణ చేస్తారు. ప్రతి శుక్రవారం మూల విరాట్టుకు పంచామృతాభిషేకం జరుగుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై గానం చేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం. భోగినాడు గోదా కల్యాణంజరుపుతారు. అన్ని పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
ఉదయం ఆరు నుండి మధ్యాహాన్నం పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, గుంటూరు పట్టణంలో ఆర్ అగ్రహారంగా పేరొందిన రామచంద్ర అగ్రహారంలో ఉన్నది.బస్టాండు నుండి రైల్వే స్టేషన్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.గుంటూరు పట్టణంలోని దర్శనీయ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.
జై శ్రీ మన్నారాయణ !!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి