7, డిసెంబర్ 2014, ఆదివారం

Sri Ramana Maharshi Ashramam - Thriruvannamalai

      భగవాన్ శ్రీ  రమణ మహర్షి 

అరుణాచలం లేదా తిరువణ్ణామలై  అనగానే ఎవరికైనా స్ఫురించేది భగవాన్ శ్రీ రమణ మహర్షి. 
ఆది దేవుని అనుగ్రహం,ఆశీర్వాదం ఆశిస్తూ, ముక్తిని కోరుకొనే ముముక్షువుల, సత్యాన్వేషుల  అంతిమ గమ్యం తిరువణ్ణామలై. 
ఎందరో ఇక్కడికి చేరుకొని అరుణాచలేశ్వరుని సేవిస్తూ తమ జీవితాలను, తమను అనుసరించే వారి జీవితాలను ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే విధంగా తీర్సిదిద్దుకొన్నారు.  
అలాంటి మహానుభావులలో శ్రీ రమణ మహర్షి అగ్రగణ్యులు. తిరుచుళి లో స్వామి జన్మించిన గది 


1879వ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీకున పుణ్య దంపతులైన సుందరం అయ్యర్ , అలగమ్మాల్ కు జన్మించారు వెంకట రమణ. 
మదురై కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న "తిరుచుళి ' గ్రామం ఆయన జన్మస్థలం. బాల్యంలో అందరి పిల్లల మాదిరిగా ఆడుతూ పాడుతూ స్నేహితులతో సరదాగా తిరుగుతుండేవాడు వెంకట రమణ. అతనికి అన్నిటికన్నా ఇష్టమైన పని నిద్ర పోవడం. నిద్ర పోతున్న బాల రమణను లేపడం అసాధ్యంగా ఉండేది. సుమారు పదమూడు  ఏళ్ళ వయస్సులో ఒక బంధువు నోటి  నుండి విన్న "అరుణాచలం" అన్న మాట బాలునిలో అమిత సంచలనం రేకెత్తించినది. 
ఆ అనుభవం గురించి ఆయన చాలా కాలం తరువాత ఒక కవితలో సవివరంగా తెలిపారు.  
మరికొంత కాలం తరువాత  అరవై మూడు మంది గాయక శివ భక్తులైన"నయన్మారుల "ల జీవిత గాధల గురించి తెలిపే "పెరియ పురాణం" చదివాడు. 
సదా శివుని మీద వారి అచంచల భక్తి అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. అనన్య సామాన్యమైన నయన్మారుల భక్తివిశ్వాసాలు సర్వేశ్వరుని పట్ల వారికున్న అమిత ప్రేమ, వాత్సల్యం ఎలా సాధ్యం ? వాటిని ఎలా సొంతం చేసుకోగలం ? అన్న ఆలోచనలు రానున్న కాలంలో ఆయన రూపొందించిన ఆధ్యాత్మిక మార్గానికి దోహదం చేసింది. 
ఒక సారి అతనిలో మరణ భయం తలెత్తినది. ఆ వయస్సులో రాకూడని ఆ భయం ఎన్నో ప్రశ్నలకు దారి తీసింది. మరణం అంటే ఏమిటి ? శరీరానికా? అత్మకా? శాశ్వితము కాని దేహం నశించినా శాశ్వితమైన ఆత్మ నిలిచి ఉంటుంది. అంటే నేను అన్నది మరణం లేని ఆత్మ.
ఈ ఆలోచనలు ఆయనలో ఎన్నో మార్పులను తెచ్చినాయి. వాటిల్లో ఒకటి దైవ దర్శనం.
ప్రతి సాయంత్రం మధుర మీనాక్షి ఆలయానికి వెళ్లి అమ్మవారి ముందు, సోమసుందర స్వామి ముందో ఇది అని తెలియని తాదాప్యంతో నిలబడి పోయేవారు. 
ఒక రోజున అకస్మాత్తుగా చదువుతున్న పుస్తకాలను వదిలి ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరారు. అన్న ఇచ్చిన మూడు రూపాయలతో విల్లుపురం మీదగా తిరువణ్ణామలై కి  కొద్ది దూరంలో ఉన్న "మాంబలపట్టు "అనే చోటికి చేరి అక్కడ నుండి కాలినడకన  1896 సెప్టెంబర్ ఒకటో తారీకు ఉదయం  గమ్యం చేరుకొన్నారు.


తిరువన్నామలై చేరినప్పుడు స్వామి రూపం 

అరుణాచలంలో ఎన్నో ప్రదేశాలలో తిరుగాడుతుండే వారు. ముఖ్యంగా ఆలయం లోని వెయ్యి స్తంభాల మండపంలో, పక్కనే ఉన్న పాతాళ లింగం వద్ద ఎక్కువగా ధ్యానంలో గడిపేవారు. 
ఆయన తిరువణ్ణామలై చేరిన సమయానికి ఆలయం చాలా నిర్లక్ష్యానికి గురై కొన్ని భాగాలు శిధిలావస్థలో ఉండినవి.


 ఆలయ గోపురం, స్వామి చాలాకాలం ధ్యానం చేసిన పాతాళ లింగం నాడు / నేడు ఈ బాల సన్యాసి పట్ల ఆకర్షితులైన కొందరు ఆకలి,నిద్ర లాంటి వాటి గురించి మర్చిపోయి నిరంతరం ధ్యానంలో ఉండే ఆయనకు బలవంతంగా ఆహరం పెట్టడం చేసేవారు.సమయం అలా గడుస్తున్నప్పుడు రమణుని మేనమామ అక్కడికి వచ్చారు. మేనల్లుడిని చూసి ఆనందపడి శతవిధాల ప్రయత్నించారు ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. అన్నిటికీ మౌనమే సమాధానం!చేసేదిలేక ఆయన గ్రామానికి వెళ్లి చెల్లెలికి తెలియచేప్పాడు.అళగమ్మాల్ తన చిన్న కుమారుని తీసుకొని తిరువన్నామలై చేరుకొని, కుమారుని ఇంటికి రమ్మని పరిపరివిధాలుగా బ్రతిమలాడింది.జవాబు లేదు.చివరకి ఒక రోజున కాగితం మీద " ప్రస్తుత జన్మ గత జన్మ తాలూకు కర్మ మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం రాసిన నుదిటి రాతను తప్పించడం ఎవరి తరం కాదు. అనవసర ప్రయత్నాలు చేయక మౌనంగా ఉండటమే మంచిది." ఐ రాసి చూపారు.నిరాశతో ఆమె తిరిగి వెళ్లి పోయినది.అక్కడ నుండి రమణులు తన తపస్సును తీవ్రం చేసారు.కొండ పైన ఉన్న "విరూపాక్ష గుహ:లో సుమారు పదిహేడేళ్ళు తపస్సు చేసారు. నేడు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వెనుక నుండి గుహకు చేరుకోడానికి మార్గం కలదు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం. స్వచమైన గాలి.  శబ్ద కాలుష్యం ఉండదు. పచ్చని ప్రశాంత వాతావరణం మనస్సులకు ఎనలేని శాంతిని ప్రసాదిస్తుంది. 
దారంతా పర్యావరణాన్ని కాపాడమనే విజ్ఞప్తులు, అడవి గురించిన సందేశాలు కనిపిస్తాయి. 
నీటి సీసాలు, అరటిపళ్ళు అమ్మేవారు, అలానే రాతి మీద రకరకాల బొమ్మలు చెక్కి విక్రయించేవారు ఉంటారు. శ్రీ రమణుల ఉద్భోధనలతో సర్వం త్యజించి అరుణాచలంలో తిరుగాడే సాధువులు ఎందరో కనపడతారు. 
పర్వతం పైనుండి తిరువణ్ణామలై  ఊరు. మధ్యలో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షించడం ఒక జీవితకాలపు మధురానుభూతి. 
విరూపాక్ష గుహ తరువాత స్వామి పైనున్న "స్కంద ఆశ్రమం" లో ఏడు సంవత్సరాలు తపస్సు చేసారు. అప్పుడు స్వామి తల్లి సోదరుడు కూడా ఉండే వారు. దర్శనానికి వచ్చే వారికి ఆమె స్వయంగా వండి వడ్డించేవారు. నేటికీ ఈ రెండు గుహలలో ఎందరో దేశ విదేశాల వారు ప్రతినిత్యం వచ్చి ధ్యానంలో కూర్చుంటారు. 


రమణ ఆశ్రమం స్థాపించిన దాక భగవాన్ ఒక ప్రత్యేక స్థలం అంటూ లేకుండా ఉండేవారు.
చిన్న పాక లా ఉండే ఆశ్రమం నేడొక సంస్థానంగా రూపుదిద్దుకొన్నది.

భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏప్రిల్ పదునాలుగు 1950వ సంవత్సరంలో సిద్దిపొందారు.
ఆశ్రమంలోనే స్వామి వారి సమాధి మందిరం ఉన్నది.ఆయన శివైక్యం చెందిన గదిలోని ఆసనం మీద స్వామి చిత్రపటం, వాడిన వస్తువులను ఉంచారు.ప్రాంగణంలో రమణులు ఆరంభించిన ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో  కృషి చేసిన మహానుభావుల సమాధి మందిరాలు నెలకొల్పబడ్డాయి. విశాల మందిరంలో భగవాన్ సమాధి కలదు. గోడల పైన స్వామి చిత్ర పటాలు వివిధ వయస్సులలో తీసినవి ఉంచబడ్డాయి. 
ప్రతి రోజు దేశం నలుమూలల నుండి వేలాది భక్తులు తరలి వస్తుంటారు. సెలవ, పర్వ  మరియు పౌర్ణమి, అమావాస్య దినాలలో వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది. ఎందరో ఈ మందిరంలో ధ్యానం చేస్తుంటారు.


సందర్శకులు ఉండటానికి వసతి సౌకర్యాలు ఉన్నాయి. కానీ నెల ముందు ఈ మెయిల్ పంపినచొ మన పేరు మీద ఆ రోజుకి ఉంచుతారు. ఆశ్రమంలో అందరికీ ఉదయం 11 గంటలకు నారాయణ సేవ అందిస్తారు. భగవాన్ భోధనల గ్రంధాలు అమ్ముతారు.  గ్రంధాలయం కూడా కలదు. పశువులకు, పక్షులకు, జంతువులకు కూడా ఇక్కడ తగిన ఆశ్రయం లభిస్తుంది. 
ఈ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు ఒకప్పుడు మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించడానికి భగవంతుడు పంపిన ఒక మహా యోగి సంచరించిన స్థలం అని అనుకుంటే లభ్యమయ్యే మానసిక ప్రశాంతత అనిర్వచనీయం 
ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!!వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...