14, డిసెంబర్ 2014, ఆదివారం

Sri Ranganayaka swamy Temple, Solasa

                        శ్రీ రంగనాయక స్వామి ఆలయం, సొలస 





వైకుంఠ వాసుడు ఆదిశేషువు మీద శయన భంగిమలో కొలువైన క్షేత్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి.దాదాపుగా అన్నీ ఎంతో పురాతనమైనవి. స్వయంవ్యక్త క్షేత్రాలుగా ప్రసిద్ది. నిరంతర      హరి నామ జపం చేస్తూ, కనుల ముందు స్వామివారి రూపం సదా కనిపించాలని ప్రతిష్టించుకొన్న మహాభక్తులు  ఎందరో చరిత్రలో కనపడతారు. 











అలాంటివారే పదిహేడో శతాబ్దంలో (1616)కొండవీటి ప్రాంతానికి జమిందారులుగా ఉన్న  కీర్తి శేషులు జూపల్లి రంగపతి రావు.  అచంచల హరి భక్తులు. 
శ్రీ రంగనాధుని అనునిత్యం సేవించుకోవాలన్న సంకల్పంతో తమిళనాడు నుండి నిపుణులైన శిల్పులను పిలిపించి కొండవీడు గ్రామానికి చేరువలో "శ్రీ రంగ పురం" పేరుతో ఒక గ్రామాన్ని నిర్మించి అందులో అనంత శయనుని ఆలయాన్ని నిర్మించారట. 
కొంతకాలం తరువాత ఈ ప్రాంతం బహుమనీ సుల్తానుల పాలన లోనికి వెళ్ళగా, వారు కనిపించిన హిందూ ఆలయాలను కూల్చేసి, విగ్రహాలను ధ్వంసం చేయసాగారట. 
ఈ సంగతి తెలుసుకొన్న స్థానికులు శ్రీ రంగనాధ స్వామి మూలవిరాట్టును భూమిలో దాచారట. 
గ్రామం మాత్రం కాల గర్భంలో కలిసిపోయిందిట. 
కాల గమనంలో విగ్రహాన్ని దాచిన విషయం కూడా మరుగున పడిపోయింది. 
1860 సంవత్సర కాలంలో నిర్మాణానికి పునాదులు త్రవ్వుతుండగా రెండు శతాబ్దాల క్రిందటి విగ్రహాలు బయల్పడినాయి. 











వ్యాపారస్తులైన అర్వపల్లి వారు తమ గ్రామం సొలస లో లభించిన విగ్రహానికి ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చారు. 
పదునాలుగు జూన్ 1885వ సంవత్సరంలో ప్రతిష్ట జరిగినట్లుగా ఆలయంలో ఉన్న శిలాఫలకం తెలియచెప్తుంది. 










చిన్న ప్రాంగణంలో ఉన్న ఆలయానికి పడమర పక్కన నాలుగు అంతస్తుల గోపురం, ఉత్తరాన మరో ప్రవేశ ద్వారం ఉంటాయి. ఉత్తర ద్వారానికి ఎదురుగా చక్కని మండపం నిర్మించారు.
గణేష సన్నిధి, ద్వజస్థంభం, బలి పీఠం శ్రీ దాసాంజనేయ సన్నిధి ఉంటాయి.














గణపతి ఒక ప్రత్యేక భంగిమలో కూర్చొని కనపడతారు. 
ఆస్థాన మండపంలో గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలుంటాయి. 







భక్తులు అర్ధమండపం దాకా వెళ్లి మూల విరాట్టును చూసే అవకాశం ఉన్నది.




సహజంగా శ్రీ రంగనాయక లేదా అనంత శయనుడు వెల్లికిలా పడుకొన్న భంగిమలో కనపడతారు.
ఇక్కడ మాత్రం స్వామి కుడి చేతిని తల క్రింద పెట్టుకొని పూర్తిగా పక్కకు తిరిగి శయనించిన భంగిమలో దర్శనమిస్తారు.  స్వామి ద్వి భుజాలతో శంఖు చక్రాలు లేకుండా ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఆదిశేషుడు తన అయిదు తలలను చత్రంలాగా పట్టి ఉంచాడు.
శిరస్సు వద్ద శ్రీ దేవి, పాదాల వద్ద భూదేవి ఉపస్థిత భంగిమలో కనపడతారు.











ఆండాళ్, ఆళ్వార్, శ్రీ చక్రత్తి ఆళ్వార్ ఉత్స విగ్రహాలు గర్భాలయంలో ఉంటాయి.
అభిషేకాలు, ఊరేగింపులు ఉత్స విగ్రహలకే !











పక్కనే నూతనంగా శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. 










అన్ని హిందూ పర్వదినాలను వైభవంగా జరుపుతారు.
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం, శ్రీ కృష్ణాష్టమి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు.









ప్రశాంత పల్లె వాతావరణంలో అశేష ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుందీ సొలస శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో.
ఆలయ పూజారి శ్రీ ఆచార్యులు గారు గుడి పక్కనే నివసిస్తుంటారు.









వెళ్ళే మార్గంలో కనిపించే ఎన్నో శిధిల పురాతన కట్టడాలు గత చరిత్రకు గుర్తులుగా కనపడతాయి. 
గ్రామం మధ్యలో "బొడ్డు రాయి"గా పిలిచే శ్రీ శీతలాంబ అమ్మవారి నాభి శిల ప్రతిష్టించబడినది. 














 చారిత్రాత్మక సొలస గ్రామం  గుంటూరు జిల్లా  చిలకలూరిపేట దగ్గరి బోయపాలెం నుండి గానీ నరసరావు పేట మార్గంలో వచ్చే ఫిరంగి పురం నుండి గాని చేరుకొనవచ్చును.
ఫిరంగిపురం మార్గంలో అయితే ఎన్నో పురాతన ఆలయాలను, కొండవీటి కోటను  సందర్శించుకోవచ్చును.
వసతులు ఏమీ లభించవు.  గుంటూరు నుండి వెళ్లి రావడం ఉత్తమం.

జై శ్రీ మన్నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...