8, డిసెంబర్ 2014, సోమవారం

Navaneetha Sri Balakrishna Swamy, Temple, Changeezkhan peta

                శ్రీ నవనీత బాలకృష్ణ దేవాలయము, చెంఘీస్ ఖాన్ పేట 

దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర మరియు తమిళనాడు రాష్ట్రాల లోని అనేకానేక చిన్నా పెద్ద ఆలయాలు విజయనగర సామ్రజ్యాధీశుదు శ్రీ కృష్ణ దేవ రాయలుతో ముడిపడి ఉండటం ఆ క్షేత్ర చరిత్రలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది.
అనేక ఆలయాలను స్వయంగా సందర్శించి సేవించుకొని, కానుకలు, కైకర్యాలు సమర్పించుకొన్నారు.
ఆయన స్థాపించిన కొన్ని అపురూప మరియు వాటికి అవే సాటి అనే విధంగా ఉన్న ఆలయాలు నాకు తెలిసి రెండు ఉన్నాయి.
మన రాష్ట్రంలోని నెల్లూరు సమీపంలోని తుమ్మ గుంట లోని తొలి శ్రీ ధర్మశాస్త ( శ్రీ అయ్యప్ప ) ఆలయం మొదటిది.
ఇక్కడ అయ్యప్పను వృక్షరూపంలో కొలుస్తారు. (వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి).
రెండవది గుంటూరు జిల్లా లోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం "కొండవీడు" సమీపంలోని "శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయం". 





ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా "ఇస్కాన్ " వారు ఇక్కడొక శ్రీ కృష్ణ మందిరం సుమారు అయిదు వందల కోట్లతో నిర్మించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. 
సుమారు రెండు వందల సంవత్సరాలు కొండవీటి రెడ్డి రాజుల పాలనలో ఉన్న కొండవీడును బహుమనీ సుల్తానులు ఆక్రమించుకొన్నారు.
వారి నుండి తిరిగి కోటను  తమ స్వాధీనం చేసుకోడానికి శ్రీ కృష్ణ దేవరాయలు ససైన్యంగా దండెత్తారు.
ఎంతో దుర్భేద్యం మరియు పటిష్టమైన కోటను స్వాధీనం చేసుకోవడం ఎన్ని రోజులకు సాధ్యం కాలేదు.
భగవద్భక్తుడు అందులో శ్రీ కృష్ణుని ఆరాధించే శ్రీ కృష్ణ దేవరాయలు "నేను ఈ కోటను జయిస్తే ఇక్కడ నీ ఆలయం నిర్మిస్తాను" అని తన మనస్సులో తన ఆరాధ్య దైవానికి విన్నవించుకొన్నారు.
కొద్ది రోజుల లోనే కోడవీడు కోట విజయనగర సైనికుల స్వాధీనం అయ్యుంది.
మొక్కుకొన్న ప్రకారం తన రాజధాని హంపిలో ఉన్న ఏనాడో చెక్కిన తన కిష్టమైన వెన్న ముద్ద ( నవనీతం) బాలకృష్ణ స్వామి విగ్రహాన్నితెప్పించి కొండ దిగువన "కత్తుల బావి" ప్రతిష్టించి ఒక చక్కని ఆలయాన్ని నిర్మించారు.
కాల గమనంలో కోటను గోల్కొండ నవాబులు వారి నుండి ఫ్రెంచ్ వారు స్వాధీనం చేసుకొన్నారు.
నిరాదరణకు గురైన అనేకానేక ఇతర ఆలయాల మాదిరి శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయం కూడా శిధిలావస్థకు చేరుకొన్నది.
1712వ సంవత్సర కాలంలో ఈ ప్రాంతాన్ని చిలకలూరిపేట జమిందారు శ్రీ మానూరి వెంకట హనుమంత రావు ఆధీనంలో ఉండేది.
ఒక నాడు ఆయన కొండవీడు వచ్చి పూర్తిగా కుప్పకూలిన కత్తులబావి ఆలయాన్ని తవ్వించి దొరికిన దేవతా శిల్పాలను, మూలవిరాట్టు శ్రీ బాల కృష్ణ సమేతంగా తీసుకొని, చిలకలూరిపేట లోని తమ భవంతిలో పెట్టుకొందామని ఆలోచన చేసారు.
బయలుదేరేటప్పటికి చీకటి పడిపోవటంతో "సింగణ సాని పేట"(ప్రస్తుతం చెంఘీజ్ ఖాన్ పేట గా పిలవబడుతోంది ) లో బస చేసారు. నాటి రాత్రి స్వప్నంలో శ్రీ కృష్ణుడు కనపడి "నాకు ఈ ప్రదేశం నచ్చినది. ఇక్కడే ఉండదలచాను. నీకు నేను లక్ష్మి నరసింహునిగా పసుమర్తి లోని పున్నాగ చెట్టు క్రింద కనపడతాను. ఆ విగ్రహాన్నినీ భవంతిలో ప్రతిష్టించుకో !"అని తెలిపారట.
తెల్లవారిన తరువాత కలే కదా అనుకున్న జమిందారుకి బండి చక్రాలు భూమిలోనికి దిగి పోవడంతో భగవంతుని సందేశం అర్ధమైనది. మనుషులను పసుమర్తి పంపి పున్నాగ చెట్టు క్రింద తవ్వించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం దర్శనమిచ్చినది.
దేవదేవుని కృపకు పొంగిపోయిన జమిందారు చక్కని ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ని ప్రతిష్టించారు.
నాటి శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ వద్ద సేవించుకొనవచ్చును.
అలా మూడువందల సంవత్సరాల క్రిందట శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి చెంఘీజ్ ఖాన్ పేట లోని ఈ ఆలయంలో కొలువుతీరారు.
తూర్పు ముఖంగా కొండవీటి కొండలకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయం సాదాసేదాగా ఉంటుంది. 
లోపలి ప్రవేశించగానే ఎడమ పక్కన ఆలయ వృక్షం "జమ్మి చెట్టు", ఎదురుగా మండపం ధ్వజస్థంభము కనపడతాయి. 









ప్రదక్షిణ ప్రారంభంలో శ్రీ ఆంజనేయుని ఉపాలయం మరో మండపంలో ఉంటుంది. అక్కడ నాగ శిలలను, రాతి మీద రేఖా మాత్రంగా చెక్కిన హనుమంతుని సందర్శించుకోనవచ్చును. ప్రాంగణం లోను గుడిలోనే ఉన్న ప్రతి ఒక్క శిల్పం కత్తుల బావి వద్ద లభించినవే !







విఘ్ననాయకుడు ఆలయ గోడ వద్ద ఉపస్థితులై ఉంటారు. మరోపక్కన  సీతా, లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. శ్రీ రామ మూర్తి లభించనందున ప్రతిష్టించలేదు. 
ఆలోటును పూర్తి చేస్తూ ఇక్కడ గోడ మీద సీతా రామ లక్ష్మణ రూపాలను చెక్కారు. 
మరో పక్క నాగ రూపాలు ఉంటాయి. 






ఆలయ ఈశాన్యంలో గోడకు శివలింగం చెక్కబడి ఉంటుంది. ఎదురుగా లింగం నంది ఉంటాయి. 





ప్రాంగణంలో నుండి సాయంసంధ్యా సమయంలో రమణీయంగా కనపడతాయి కొండవీటి కొండలు. 





ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో భక్తాంజనేయ స్వామి దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. 

ప్రధాన ఆలయ అంతర్భాగంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు ఎదురు బొదురుగా ఉంటారు. 



నిలువెత్తు జయ విజయుల విగ్రహాలు ఆకట్టుకొంటాయి. 


గర్భాలయ ద్వారం పైన శ్రీ గజ లక్ష్మి అమ్మవారి రూపాన్ని చెక్కించారు.
పక్కనే చిన్న గట్టు మీద పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారు లలో ఒకరైన "తిరుమంగై ఆళ్వార్" విగ్రహం ఉన్నది. మిగిలిన పదకొండు మంది విగ్రహాలు లభించలేదని అంటారు.

గర్భాలయంలో వెన్న ముద్ద చేతిలో పట్టుకొని పాకుతూ నల్లనయ్య ఇట్టే మన చూపును మనసును లాగేస్తాడు.
ముద్దులొలికె పసి పాపను చూడగానే చేతుల్లోకి తీసుకోవాలని, తనివితీరా ముద్దాడాలి అన్న ఆప్యాయతా భావం ఎలా అసంకల్పితంగా మదిలో మెదులుతుందో అచ్చు అలాంటి సుందర తలంపే మూల విరాట్టును చూడగానే కలుగుతుంది.
ఇలా వెన్న ముద్ద ధరించిన శ్రీ బాలకృష్ణుని విగ్రహాలు "మెల్కోటే" ( కర్నాటక), "తిరుపాల్కడల్" కాంచీపురం దగ్గర, తమిళనాడు)తో పాటు మరికొన్ని చోట్ల ఉన్నా ఇలాంటి విగ్రహం మాత్రం ప్రపంచంలో మరెక్కాడా లేదు.
నాలుగు అడుగుల ఎత్తులో సాలగ్రామ మాల తో పాటు ఇతర నగలు ధరించిన చిన్ని కృష్ణయ్య మురిపెంగా ఉంటారు.




ఈ ఆలయంలో అతి ముఖ్యమైన పండగ శ్రీ కృష్ణాష్టమి. 
వైకుంఠ ఏకాదశి, ఇతర హిందూ పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. 



ఇస్కాన్ వారు ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో గోశాలను నిర్మించారు.

ఇదే మార్గంలో కొద్దిగా పక్కకు వెళితే కొండవీటి కొండల మీద స్వయంభూగా వెలసిన శ్రీ బోల్లుమోర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది.
ఈ ఆలయ ప్రస్తావన పదమూడో శతాబ్దపు శ్రీ రామ చంపు కావ్యంలో ఉన్నది  అంటారు.
త్వరలో ఈ ఆలయాన్ని గురించిన సమాచారం, విశేషాలు మీ అందరితో పంచుకోడానికి ప్రయత్నిస్తాను.



చంఘీజ్ ఖాన్ పేట గుంటూరు నుండి నరసరావు పేట వెళ్ళే దారిలో వచ్చే ఫిరంగి పురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
బస్సులు లభిస్తాయి. కానీ  సొంత వాహనంలో వెళ్ళడం మంచిది. 
ఎప్పుడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే, సమయం ఉంటే తప్పక సందర్శించవలసినది " శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయము".




కృష్ణం వందే జగద్గురుం !!!!

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...