5, డిసెంబర్ 2014, శుక్రవారం

Sri Mulasthaneswara Swamy Temple, Nellore

        శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు 

మన దేశంలో ఒక ప్రాంతానికి వ్యవ్హరించే లేదా వాడుకగా పిలేచే పేరు రావడానికి అనేక కారణాలుంటాయి. 
ఆ ప్రాంత పౌరాణిక నేపద్యం, చరిత్ర, స్థానిక పాలకుడు లేదా నాయకుడు ఇలా రకరకాలు. 
మన రాష్ట్రానికి దిగువన ఉన్న మిగిలిన మూడు దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా,   మరెన్నో విలక్షణ,  విశేష పౌరాణిక మరియు చారిత్రిక నేపద్యం గల "నెల్లూరు "కు చరిత్రలో ఉదహరించిన నామం "విక్రమ సింహపురి ". 
రెండవ నామం చరిత్రలో కలిసిపోయి తిరిగి గత రెండు దశాబ్దాలుగా తిరిగి ప్రాముఖ్యం సంతరించుకొంటున్నది. 
అసలు ఈ పేరు రావడానికి కారణం "సింహ విష్ణు" అనే మహా పరాక్రమంతుడైన పల్లవరాజు ఈ ప్రాంతాన్ని పాలించడం. 
కానీ అసలు పేరు "నెల్లూరు" రావడానికి కారణం మాత్రం "నీలకంఠ స్వామి" ఇక్కడ స్వయంభూగా వెలవడం వల్లే అని అందుబాటులో ఉన్న ఆధారాలు తెలుపుతున్నాయి. 





సుమారు అయిదవ శతాబ్దానికి ముందు :ముక్కంటి" అనే పల్లవ రాజు పెన్నా నదీ తీరంలో ఉన్న అడవిని నరికించి నగరాన్ని నిర్మించే క్రమంలో ఒక ఉసిరిక వృక్షం క్రింద సదాశివుడు లింగ రూపంలో ప్రకటితమైనట్లుగా తెలుస్తోంది. 
ముక్కంటి రాజు తన అదృష్టానికి అమిత ఆనందపడి సర్వేశ్వరుడు ఉసిరి ( తమిళం లో నెల్లి అంటారు) చెట్టు వద్ద లభించినందున తానూ నిర్మింప తలపెట్టిన పట్టణానికి నెల్లూరు అని నామకరణం చేసాడు. 
మరో గాధ కూడా ప్రచారంలో ఉన్నది. 
తమిళంలో నెల్ అంటే ధాన్యం. అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు మొలకోలకలు. 
నెల్లూరు అన్న పేరు ఇక్కడి రుచికరమైన ధాన్యం వలన వచ్చినది అని కొందరి చరిత్రకారుల అభిప్రాయం. 
ఆ రోజుల్లో పెన్నా నది పట్టణానికి రెండుపక్కలా పారుతూ వుండేదట. 
నదీ పాయల మధ్య ఉన్న భూమిలో  వెలసిన స్వామి కనుక   "మూలస్థానేశ్వరుడు " అన్న పేరుతొ పిలవసాగారు.  
అలా పదునాలుగు వందల సంవత్సరాల క్రిందట కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ప్రభావం పదమూడో శతాబ్దం నాటికి దక్షిణా పధం అంతటా వ్యాపించినది. 





పల్లవ, చోళ, వేంగి, చాళుక్య, శాతవాహన, విజయనగర ఇలా ఎన్నో రాజ వంశాల పాలకులు స్వామిని సేవించుకొని ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆధారాలు తెలియచేస్తున్నాయి. 
తిక్కన సోమయాజి మహా భారతాన్ని తెలుగులో రచించిన కవిత్రయంలో ఒకరు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూల పురుషుడు. 
వీరి జన్మ స్థానం నెల్లూరు !
ఎందరో మహనీయులు జన్మించిన భూమి. 
ఈ పట్టణంలో ఎన్నో విశేష ఆలయాలున్నాయి. 
శ్రీ రంగ నాద స్వామి ఆలయం ప్రజలలో ఏంతో ఆదరణ సంపాదించుకొన్నది. 
కానీ దాని కన్నా ముందు నుండి ఉండిన ఆలయం మాత్రం శ్రీ మూలస్థానేశ్వర స్వామి దే !  





అనేక రాజ వంశాల ఆదరణతో అభివృద్ధి చెందిన ఆలయం గత శతాబ్ద కాలంలో భక్తులు, నగర ప్రముఖులు, అధికారుల సమిష్టి కృషి వలన నేడు ఒక సుందర రూపు సంతరించుకొని అన్ని ప్రాంతాలనుండి భక్తులను ఆకర్షిస్తోంది. 





పట్టణ నది బొడ్డున రైల్వే స్టేషన్ కు, బస్సు స్టాండ్ కు సమ దూరంలో విశాల ప్రాంగణంలోని ఆలయ సముదాయానికి ఒక స్వాగత ద్వారం ఏర్పరచారు,
నలువైపులా శ్రీ కృష్ణ, శ్రీ ఇరుకళల అమ్మవారు, శ్రీ కృష్ణ ధర్మరాజ ఆలయం, శ్రీ నీలకంఠ స్వామి ఆలయం సరిహద్దులుగా ఉంటాయి. 
నూతనంగా పునరుద్దబడిన రాజ గోపురానికి ఎదురుగా దేశంలోనే అత్యంత పెద్దదైన (?) వినాయక రూపం ప్రత్యేక మందిరంలో కనపడుతుంది.  







రాజగోపురం దానికి ముందు నిర్మించిన మండపం పైన సుందర శివ లీలా విన్యాసాలకు రూపం కల్పించి ఉంచారు. 
ఆలయ వెలుపలి గోడలపైన నటరాజ తాండవ భంగిమలను అమర్చారు. 
మండప పై భాగాన నవగ్రహ నాయకుని చిత్రాలు చిత్రించారు. 
పై భాగాన కైలాస వాసుని రమణీయ రూపాన్ని ఏర్పరచారు. 



















ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరుపక్కలా గణేష మరియు కుమార స్వామి కొలువై ఉంటారు. 






నడవాలో ఒక పక్కన నంది వాహనుడు మరో పక్క సింహ వాహని భక్తులకు అక్కడి నుండే అభయం ప్రసాదిస్తారు.  




ధ్వజస్తంభం, నంది మండపం ప్రధాన ఆలయ ద్వారం. 
ఈ ద్వారానికి రెండు పక్కలా విఘ్ననాయకుడు, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వేంచేసి వుంటారు. 








అక్కడే ఆలయ నిర్వహాణా అధికారి కార్యాలయము, పక్కనే ఉత్తరాభి ముఖంగా శ్రీ వీరభద్ర స్వామి ఉపాలము. 
ఆలయ ప్రాంగణం, ద్వారాలు, మండపాలు, స్తంభాలు, ప్రహరీ గోడ అన్ని చోట్లా మనోహర రూపాలలో సర్వేశ్వరుడు, ఏకదంతుడు, నెమలి వాహనుడు దర్శనమిస్తారు. 























వీరభద్ర స్వామికి మొక్కి ముందుకు వెళితే చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి కొలువై ఉంటారు. 











ప్రాంగణ దక్షిణ భాగంలో  అగస్త్య ప్రతిష్టగా పేర్కొనే శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. 
భక్తి శ్రధలతో ఈ లింగాన్ని అభిషేకిస్తే సకల మనో భీష్టాలు నెరవేరతాయి అన్నది భక్తుల విశ్వాసం. 











ప్రదక్షిణ పదంలో గోడలలో ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టా దశ పీఠ పాలికలను, నవ దుర్గా రూపాలు ఉంచారు. 
ఉత్తర దిశలో ఉన్న ద్వారం చిన్న ఉద్యానవనం లోనికి దారి తీస్తుంది. 



























అందులో వట వృక్షం క్రింద హరిహర సుత శ్రీ ధర్మ శాస్త కొలువై ఉంటారు. 
పుష్ప మొక్కల మధ్య ధ్యానేశ్వరుడు ఉంటారు. 








తిరిగి లోపలికి వెళితే అమ్మవారు శ్రీ భువనేశ్వరీ దేవి సన్నిధి. 
చక్కని పుష్ప ఆభరణ అలంకరణతో అమ్మవారు చల్లని చూపులతో ఆశ్రితులకు ఊరట కలిగిస్తుంది. 
పక్కనే నటరాజ మండపము. 
ఎదురుగా శ్రీ సత్యా సమేత శ్రీ కృష్ణ సన్నిధి. 
సత్యా దేవి ధనుర్భానాలను ధరించి దర్శనమిస్తారు. 
పక్కనే లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధి. 





















ప్రదక్షిణ పూర్తి చేసుకొని అంతరాలయం లోనికి చేరితే చందన వీభూతి లేపానాలతో పుష్ప మాలాలంక్రుతులైన లింగ రాజు  భక్తులకు అభయం ప్రసాదిస్తారు. 
ఇందరు దేవీ దేవతల నిలయం గనుక ఈ ఆలయంలో ప్రతి రోజు పండగ మరియు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. 
వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్టి, రధ సప్తమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవ రాత్రులు, కార్తీక మాసం ఇలా అన్ని పర్వదినాలలో జిల్లా నుండే కాక సమీప జిల్లాల నుండి కూడా భక్తులు  పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రీ మూలస్థానేశ్వర స్వామిని  సేవించుకొంటారు. 





పక్కనే శ్రీ అన్నపూర్ణా సమేత నీలకంఠ స్వామి ఆలయం ఉంటుంది.











నలుమూలలా సుందర మూర్తుల తో అలంకరించబడి ఎందరో దేవీ దేవతల నివాసమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం సందర్శకుల హృదయాలలో ఒక అపురూప అనుభవంగా జీవితాంతం నిలిచిపోతుంది.
నమః శివాయ !!!!









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...