శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం, తిరువన్నామలై
తిరువన్నామలై గంగాధరుడు గిరి రూపంలో కొలువైన దివ్య క్షేత్రం. పరమేశ్వర పాద స్పర్శతో ఇక్కడి ప్రతి అణువు పవిత్రత ఆపాదించుకొన్నది. అందుకే ఇక్కడ అడుగడుగునా కనిపించే దేవాలయాలకు ఎంతో పౌరాణిక నేపద్యం మరింత చరిత్ర కలిగి ఉంటాయి.
ఆలయ ప్రవేశ ద్వారం
అలాంటి వాటిల్లో గిరివలయంలో శతాబ్దానికి పూర్వం భగత్సేవకులైన మొదలియార్ కుటుంబంచే నెలకొల్పబడిన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటి.
దేవీ భాగవతం ప్రకారం ప్రధమంగా ఉద్భవించిన దేవీ రూపం శ్రీ రాజరాజేశ్వరి. తరువాతే మిగిలిన దేవీ దేవతలు.
మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతం లో ఎన్నో అమ్మవారి ఆలయాలున్నాయి.
కానీ తిరువన్నమలై లో ఉన్న ఈ ఆలయం కొన్ని ప్రత్యేకతలకు నిలయం.
పార్వతీ పర్వతం
పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణా మార్గంలో వచ్చే శ్రీ పళని ఆండవర్ (శ్రీ కుమార స్వామి)ఆలయం దాటిన వెంటనే ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి ఆలయం.
గిరివాలయం చేసే క్రమంలో తరుచూ అరుణాచలాన్ని చూస్తుండాలని అంటారు.
కానీ చిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం దగ్గర నుండి అర కిలోమీటరు దూరంలో ఉన్న సూర్య లింగం వరకూ అరుణగిరీశ్వరుడు కనపడడు.
కారణమేమిటంటే అడ్డుగా పార్వతీ దేవి పర్వతం ఉండటమే! శ్రీ అన్నామలేశ్వర స్వామి అర్ధనారీశ్వరుడు కదా అందుకే! అని పెద్దలు తెలిపారు.
సరిగ్గా పార్వతీ పర్వతం మొదలయ్యే చోట ఈ ఆలయం ఉండటం చిత్రమే!
ఆలయాన్ని నిర్మించినప్పుడు ఒక్క గర్భాలయం మాత్రమే ఉండేదట. కాలక్రమంగా ఆలయము అభివృద్ధి చెంది ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.
మూలవిరాట్టు పాదాల చెంత త్రిమూర్తి స్వరూపులైన శ్రీ శ్రీ శ్రీ దతాత్రేయ స్వామి రూపొందించిన "కూర్మ
మేరు యంత్రం" ఉంటుంది. పూజించిన వారి సమస్త మనోభీష్టాలను నెరవేర్చిదిగా, సకల ఆటంకాలను తొలగించేదిగా కూర్మ మేరు యంత్రం ప్రసిద్ది. ఆలయం ముఖ మండపంలో నిల్పిన "దశ మహావిద్యా మూర్తులు" అయిన శ్రీ కాళీ, శ్రీ తార, శ్రీ త్రిపురసుందరి, శ్రీ భువనేశ్వరి, శ్రీ బాల భైరవి, శ్రీ చిన్న మస్తా దేవి, శ్రీ దూమవతి, శ్రీ భాగలా ముఖి, శ్రీ మాతంగి మరియూ శ్రీ కమలాత్మిక దర్శమిస్తారు. సమస్త విద్యలకు అధిదేవతలైన ఈ పది రూపాలు మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించేవిగా ప్రసిద్ది. విద్యతో పాటు జ్ఞానం కూడా సమపాళ్ళలో ఉంటేనే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకొని, శాశ్విత కీర్తికి అర్హుడు కాగలడు.
కాళీ
కాళీ, దుష్టులను సంహరించి, లోకాలను కాపాడటం. ఉగ్ర రూపం. తాంత్రిక పూజలకు ప్రతి రూపం. నల్లటి రూపంలో ఉండే ఈమె కాలానికి మరియు నలుపుకూ ప్రతి రూపం. బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. ఈమె సర్వ విద్యలకు అధిదేవత గా కీర్తించబడినది.
తార
దశ మహా విద్యలలో రెండో రూపం తార. కొద్దిగా కాళీ రూపవిన్యాసాలు దోక్యమవుతాయి. దుర్గ, మహాదేవిగా పిలబడే తార భక్తులు సమస్యలను ఎదుర్కొనేందుకు కావలిసిన సమయాస్పూర్తిని, బుద్దిబలాన్ని అనుగ్రహించేదిగా ప్రసిద్ది. తార అంటే రక్షించేది అన్న అర్ధం కూడా కలదు. కొలిచిన వారిని కాపాడే కారుణ్యమూర్తి.
త్రిపుర సుందరి
పేరుకు తగిన రూపం. శాంత సుందరం గా దర్శనమిచ్చే ఈమెను లలిత, శ్రీ రాజ రాజేశ్వరి అని కూడా పిలుస్తారు. ముల్లోకాలను పాలించే ఆది పరాశక్తి. స్థూల, సూక్ష్మ, పర రూపాలలో పూజలందుకొనే దేవి సృష్టి,స్థితి, లయలకు మూలం. జ్ఞాన శక్తిని అనుగ్రహిస్తుంది.
భువనేశ్వరి
ముల్లోకాలను పాలించేది శ్రీ భువనేశ్వరి. భక్తులకు అండగా నిలిచే ఈ త్రిభువన పాలిని సకలసుగుణాలను అనుగ్రహిస్తుంది.
బాల భైరవి
భైరవి అంటే శక్తివంతమైనది లేక తన తేజస్సుతో ఎంతటి వారినైనా అదుపులో పెట్టగల సమర్ధురాలు. అందుకే యుద్దసమయాలలో విజయం గురించి ఈమెనే ఆర్ధించేవారు.తన తేజస్సుతో అహం అనే శత్రువును దహించే తేజస్విని. ఆత్మ జ్ఞానం ప్రసాదిస్తుంది.
చిన్న మస్తాదేవి
శరీర భాగం మాత్రమే కనిపిస్తుంది. శిరస్సు ఆమె చేతిలోనే ఉంటుంది. రూపం భయం గొలిపే విధంగా ఉన్న ముఖములో చిరునవ్వు దోక్యమవుతుంది. ఆత్మ సమర్పణకు ప్రతిరూపం. సంపూర్ణ శరణాగతి తో పరమాత్మను చేరుకోవచ్చును అని తన రూపంతో తెలియజేస్తుంది
దూమవతి
దశ విద్యారూపాలకు మార్గదర్శి. జీవన్మరణాల మీద ఆధిపత్యం గల దేవత. గ్రహ భాధలను తొలగించేది. సిద్దులను ప్రసాదించేది. స్వానుభవాల నుండి పాఠాలను నేర్చుకొనే శక్తిని అనుగ్రహిస్తుంది. చివరకి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళిస్తుంది.
బాగలా ముఖి
వాక్కుకు అది దేవత భాగలా ముఖి . భక్తుల అజ్ఞానాన్ని తొలగించి, సందేహ నివృత్తి చేసేది ఈ దేవీ. సమయానుకూలంగా మాట్లాడగల వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. మనం మాట్లాడే మాటలే కదా మన మానసిక పరిస్థితిని, పరిపక్వతను తెలిపేది !
మనస్సును, ఆలోచనలను నియంత్రించేది. అన్ని విద్యలను ఆకళింపు చేసుకోడానికి స్థిర చిత్తం ప్రధానం కదా !
సంపూర్ణ చిత్తం తో అభ్యసించే విద్య వలన జీవితంలో ఉన్నతిని, ఖ్యాతిని పొందవచ్చును.
కమలాత్మిక
కమలాసని. సకల సంపదలకు అది నాయకురాలైన సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మి. నమ్మి కొలిచిన వారికి ఈమె అనుగ్రహించనిది లేదు. ఐశ్వర్యం, అభివృద్ధి, అందం, ఆనందం, ప్రేమ ఇలా ఎన్నో.
గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరీ
చిన్న లింగ రూపంలో కనిపించే అరుణాచలేశ్వరుడు
మరో విశేషమేమిటంటే తిరువన్నామలై కి పది కిలోమీటర్ల దూరం వరకూ కనిపించే "కార్తీక దీపం" ఈ ఆలయం వద్ద నుండి కనిపించదు. పరమేశ్వర ఛాయ పడకపోవడంతో అమ్మవారు మరింత శక్తితో భక్తులను అనుగ్రహిస్తారన్నది స్థానిక విశ్వాసం. ప్రతి పౌర్ణమి రాత్రి విశేష పూజలు, భజనలను నిర్వహిస్తారు.
సూర్య లింగం దాటిన తరువాత అరుణాచల దర్శనం
గర్భాలయంలో శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారు స్థానక భంగిమలో రజత కవచ దారినిగా దర్శనమిస్తారు. ప్రతినిత్యం ఎన్నో పూజలు, అలంకరణలు జరుపుతారు. సాయం సంధ్యా సమయంలో హారతి తరువాత ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గిరివాలంలో ఎదురయ్యే ప్రతి ఆలయాన్ని సందర్శించాల్సినదే ! కానీ శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం లోనికి పరిపూర్ణ భక్తి బావనతో ప్రవేశించాలి. సమస్త మనోభిష్టాలను సిద్ధించుకో వచ్చును.
శ్రీ మాత్రే నమః !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి