9, సెప్టెంబర్ 2015, బుధవారం

Akasha Ganga, Tirumala

                                        ఆకాశ గంగ, తిరుమల 

కలియుగ వైకుంఠము తిరుమల. స్వయం వైకుంఠ నాధుడు ఎన్నో యుగాల క్రిందట కొలువుతీరిన పవిత్ర పర్వత క్షేత్రం. 
ఇక్కడ చెట్టు, పుట్టా, నదీ, నీరు, రాయీ రప్ప, పత్రం, పుష్పం  అన్నీ శ్రీనివాస స్వరూపమే !!





అందుకే తిరుమలలో స్త్రీలను తలలో పూలు ధరించరాదని మనవి చేస్తుంటారు.
ఏడుకొండలు ఎన్నో అరుదైన వృక్షాలకు, జంతు జీవాలకు ఆవాసం.
ఈ సప్తగిరుల్లో ఎన్నో పవిత్ర తీర్దాలు ప్రవహిస్తున్నాయి. శ్రీవారి సర్వ కైంకర్యాలకు ఈ నీటినే ఉపయోగించేవారు.
అదే సమయంలో అరణ్యాలలోని వనమూలికల సారాన్ని గ్రహించి ప్రవహించే ఈ స్వచ్చమైన నీరు గతంలో తక్కువ
సంఖ్యలో వచ్చే భక్తులకు కూడా ఆరోగ్య ప్రదాయినిలుగా విరాజిల్లేవి. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడంతో దానితో

పాటు నీటి అవసరాలు పెరగడంతో ఈ ప్రవాహాలలో కొన్నింటిని నియంత్రిస్తూ జలాశయాలను నిర్మించారు.

అదే పాపనాశనం !!

ప్రస్తుతం తిరుమల గిరులలో మంచి నీటి అవసారాలను తీర్చే అతి పెద్ద వనరు.






కానీ నేటికీ స్వామివారి  కైంకర్యాలకు ఉపయోగించే ఆకాశ గంగ శ్రీవారు స్వయంగా సృష్టించినది కావడం విశేషం.
దీనికి సంబంధించిన పురాణ గాధ భగవంతుడు తన నిజ భక్తుల పట్ల ఎంతటి వాత్సల్యం కలిగి ఉంటారో తెలుపుతుంది.





గతంలో  పెరియ తిరుమలై నంబి అనే విష్ణు భక్తుడు తిరుమలలో నివసిస్తూ  సదా శ్రీవారి సేవలో తరించేవారు.
ప్రతి నిత్యం ఆలయంలో నిర్వహించే పూజాదుల మరియు స్వామి వారి అభిషేకాల నిమిత్తం కావలసిన శుద్ధ
జలాలను పాపనాశన తీర్దానికి వెళ్లి తెచ్చేవారు శ్రీ నంబి.




కాలం గడిచి పోసాగింది. నంబికి వృద్దాప్యం వచ్చినది. అయినా గోవిందుని సేవ మాత్రం ఆపకుండా చేసేవారు.
నిత్యం ఉదయాన్నే అడవులలో కొండలు దాటి ఎంతో  శ్రమకోర్చి పాపనాశన తీర్ధం నుండి నీటిని తెచ్చేవారు.
ఆ పండు ముదుసలికి తన ఆరాధ్య దైవానికి తాను చేస్తున్న సేవ ఆనందాన్ని కలిగించినా, పరమాత్మకు కష్టం కలిగించింది.
తన భక్తుడు చేపడుతున్న శారీరక శ్రమను చూడలేకపోయారు. భక్తునికి సహాయ పడాలనుకొన్నారు.





ఒకనాడు యధాప్రకారంగా నంబి పాపనాశన తీర్ధం నుండి నీరు తీసుకొని నెమ్మదిగా ఆలయం వెళ్ళసాగారు. ఒక
బాలుడు ఆయన వద్దకు వచ్చి "తాతా దాహంగా ఉన్నది.  కొద్దిగా మంచి నీళ్ళు ఇవ్వు!" అని అడిగాడు.
దానికి ఆయన "నాయన ! ఈ నీరు తాగడానికి కాదు. భగవంతుని అభిషేకానికి" అని పలికి ముందుకు కదిలారు.
ఆ బాలకుడు తన చేతి వాడిని చూపాడు. బాణంతో కుండకు రంధ్రం చేసి నీటిని తాగాడు.





ఈ సంఘటనకు ఖిన్నుడైన నంబి తుంటరి పిల్లవాడు దాహాద్రిని తట్టుకోలేక ఇలా చేసాడు అని తలచి తిరిగి పాపనాశనం వైపుకు కదిలారు నీరు తేవడానికి. 
ఆయన మార్గానికి అడ్డు తగిలిన బాలకుడు "తాతా! అనవసరంగా శ్రమ పడవద్దు. నీకు కావలసిన నీరు ఇక్కడే 

లభిస్తుంది"  అని తెలుపుతూ బాణంతో ఎదురుగా ఉన్న పర్వాతాన్ని చేదించారు. అంతే కట్టలు తెంచుకొన్న 

గంగమ్మ భువికి దూకింది. 

కాళ్ళ ముందు సంభవించిన అద్భుత దృశ్యానికి ఆశ్చర్య చకితుడైన నంబి ఆ బాలుడు సామాన్యుడు కాదు అని 

తలంచి అతనికి నమస్కరించి "స్వామి! తామేవరు ?" అని ప్రశ్నించాడు.   







మందహాసం చేస్తూ ఆ బాలుడు తన నిజరూప దర్శనం చూపాడు. 
ఆయన మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడే !!

తన అదృష్టానికి మైమరచిపోయిన పెరియ నంబి శ్రీవారి తన స్తోత్ర పాఠాలతో కీర్తించి పాదాల మీద వాలిపోయాడు. 
ప్రేమగా భక్తుని లేవనెత్తి అతనికి శాశ్విత వైకుంఠ వాసం అనుగ్రహించారు భక్త మందారుడు. 





నాటి నుండి ఆకాశ గంగ నీటి తోనే శ్రీవారి అభిషేకము ఇతర సేవలు చేయడం సంప్రదాయంగా మారింది.
నేటికీ శ్రీ పెరియ నంబి వంశీయులే ఆ నీటిని తీసుకొని వస్తారు.
కాకపోతే నేడు అడవి లోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. పంపుల ద్వారా ఆకాశ గంగ నీటిని ఆనంద నిలయం

వరకూ నేరుగా వచ్చే ఏర్పాటు చేసారు. 





మరో కధనం ప్రకారం ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి కొంత ఈ పర్వతాలలో తపమాచారించారని తెలుపుతోంది.
ఆమెకు ఇక్కడే వాయుదేవుని కృపతో ఆంజనేయుడు జన్మించారని అంటారు.
ఈ కారణం చేత ఆకాశ గంగ వద్ద శ్రీ అంజనాదేవి మరియు శ్రీ బాల ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఇక్కడ స్నానం చేసే అవకాశం లేదు.  ఈ పవిత్ర జలాలను నెత్తిన జల్లుకొని అంజనాదేవి ఆరాధించి, బ్రాహ్మణులకు

తగిన దాన ధర్మాలు చేస్తే ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని పురాతన గ్రంధాలు తెలియజేస్తున్నాయి.




తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య తీర్దానికి

చేరుకోడానికి  బస్సులు, ప్రెవేటు వాహనాలు లభిస్తాయి. భక్తులు తమ సొంత వాహనాలల్లో కూడా వెళ్ళవచ్చును.

రహదారి నుండి క్రిందకి అంటే లోయ లోనికి మెట్ల మార్గంలో సులభంగా చేరుకోవచ్చును.
సోపాన మార్గంలో ఎన్నో దుకాణాలు ఏర్పాటు చేసారు.






ప్రస్తుతం ఎంతో సందడిగా ఉన్న ఈ తీర్ధం 1982 ప్రాంతాలలో చాలా నిర్మానుష్యంగా ఉండేది. ఒకసారి మిత్రులతో

కలిసి ఉండీ లేనట్లుగా ఉన్న అడవి మార్గంలో ఆకాశ గంగ నుండి పాపనాశనం కాలినడకన చేరుకొన్న సంఘటన

గుర్తుకొస్తుంది. అంతే  కాదు అప్పుడు ఆ ప్రాంతాలలో  పులి తిరుగుతోందట. ఆ విషయం మాకు తెలియదు. పాపనాశనం చేరిన తరువాత అక్కడి దుకాణాల వారు మాకు పెట్టిన చీవాట్లు కూడా ఇప్పటికి గుర్తున్నాయి.
తిరుమలలో తప్పని సరిగా సందర్శిచవలసిన ప్రదేశాలలో ఆకాశ గంగ ఒకటి.

ఓం నమో వేంకటేశాయ !!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...