7, సెప్టెంబర్ 2015, సోమవారం

Sangam Jagarlamudi Temples

    శ్రీ గంగా బాలా త్రిపుర సుందరీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం 

                                    సంగం జాగర్లమూడి 

               



వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం 
వందే పన్నగ భూషణం శశి ధరం వందే పశూనాం పతిం 
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం 
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం !!!!




పుడమిలో  పన్నగ భూషణుడు పలు ప్రదేశాలలో పానవట్టం మీద స్వయంభూ లింగ రూపంలో వెలసి భక్తుల సేవలందుకొంటూ కాపాడుతున్నారు. వాటిల్లో నదీతీర సంగమ ప్రాంతాలలో వెలిసిన స్వామిని శ్రీ సంగమేశ్వరుడు అని కీర్తిస్తారు భక్తులు. 
మనరాష్ట్రంలో చాలా సంగమేశ్వర ఆలయాలు ఉన్నాయి. అన్నీ కూడా విశేష భక్తాదరణ పొందుతున్నవి కావడం విశేషం. 
అలాంటి దివ్య క్షేత్రాలలో ఎన్నదగినది "శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారు" కోరి వెలసిన క్షేత్రం "సంగం జాగర్లమూడి"






క్షేత్ర గాథ 

బాల కృష్ణమ్మ గా పిలవబడే బకింగ్హమ్ కాలవ తూర్పున కైలాస నాధుడు కాశీ క్షేత్రం నుండి ఒక భక్తునికి సహాయపడటానికి తరలి వచ్చికొలువు తీరారని క్షేత్ర గాధ తెలుపుతోంది. 
చాలా శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతాలలో నివసించే బ్రాహ్మణ దంపతులకు గోవిందుడు అనే కుమారుడు జన్మించాడు. 
పుట్టుకతోనే అతను కురూపి. అతనిని అందరూ గూని గోవిందుడు అని పిలిచేవారు. 
శారీరక వైకల్యం గత జన్మ కర్మ ఫలం కాగా, శివభక్తి పూర్వ జన్మ సుకృతంగా అతనికి లభించినది. 
చిన్నతనం  నుండే భక్తి శ్రద్దలతో సర్వేశ్వరుని ఆరాధించేవాడు. 
  








కొంత కాలానికి గ్రామస్తులు తన ఆకారం గురించి చేస్తున్న విమర్శలు, వెటకారాలు మరియు  వెక్కిరింతలు  తట్టుకోలేక తల్లి తండ్రుల అనుమతితో కాశీ క్షేత్రం వెళ్లి విశ్వనాధుని నియమంగా సేవించుకొనసాగాడు. 
కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి. 
అతనికి మామ వరసయ్యే ఒకాయన భార్యతో కలిసి సంతానాభిలాషతో తీర్ధ యాత్రలు చేస్తూ వారణాశి చేరి మేనల్లుడిని కలిసాడు. 
గోవిందుడు ఆయనతో ఇక్కడ ఉన్న పండితులను సంప్రదించి సంతానం కలగడానికి కావలసిన పూజలు, హోమాలు మరియు అభిషేకాలు జరిపిస్తాను అని తెలిపాడు. కాకపోతే అతను ఒక షరతు పెట్టాడు. శ్రీ విశ్వనాధుని కృపతో సంతానం అదీ పుత్రిక కలిగితే అతని కిచ్చివివాహం చేయాలన్నదే అది. 
ముందూ వెనకా ఆలోచించకుండా ఆయన విశ్వేశ్వరుని మరియు  శ్రీ భావనారాయణ సన్నిధిలో మేనల్లుడికి వాగ్దానం చేసాడు. 
దైవ కృపతో ఆయన కొంతకాలానికి ఆడ పిల్లకు తండ్రి అయ్యాడు. అపరిమిత ఆనందంతో ఆయన బ్రాహ్మణులకు భారీగా సంభావనలు సమర్పించుకొన్నాడు. మేనల్లునితో "నా తీర్ధ యాత్రలకు ఫలితం లభించినది. నేను మన స్వగ్రామానికి తరలి వెళతాను. బాలికకు యుక్త వయస్సు వచ్చిన తరువాత కబురు పంపుతాను. పెళ్ళాడటానికి తరలిరా !" అని తెలిపి కాశీ నుండి గ్రామానికి వెళ్ళిపోయాడు.   








సంవత్సరాలు గడిచిపోయాయి. మేన మామ వద్ద నుండి ఎలాంటి సమాచారము రాక పోవడంతో గోవిందుడు తానే స్వస్థలానికి బయలుదేరాడు. 
అసలు విషయం ఏమిటంటే చక్కని చుక్కగా అందాల రాశిగా ఉన్న కుమార్తెను వికలాంగుడు, వయస్సు మీద పడిన వాడికి ఇచ్చి వివాహము చేయ మనస్సు రాక మేన మామ మిన్నకున్నాడు. తలవని తలంపుగా తరలి వచ్చిన మేనల్లుడిని చూసి కంగారు పడ్డ తమాయించుకొని తాను  ఎలాంటి మాటా ఇవ్వలేదని అబద్దం చెప్పాడు. 
ఆగ్రహం చెందిన గోవిందుడు గ్రామం లోని పెద్దలను సంప్రదించాడు. వారు కూడా తాము ఏమి చేయలేమని ఏదైనా సాక్ష్యం తెస్తే ఏదన్నా సహాయం చేయగలమని తెలిపారు. 







సాక్ష్యం ఎవరున్నారు ? సర్వేశ్వరుడు మరియు  వైకుంఠ వాసుడు తప్ప !!
వారినే తేవడానికి వారణాశి వెళ్ళాడు. ఇరువురు దేవతలను సాక్ష్యం చెప్పడానికి వస్తారా ? రాకపోతే తానిక్కడే బలవన్మరణం పాడడానికి సిద్దం అని ప్రార్ధించాడు. 
ప్రియ భక్తునికి సహాయ పడటానికి నిర్ణయించుకొన్న లోక పాలకులు దర్శనమిచ్చి అతనిని స్వగ్రామానికి బయలుదేరమని తాము వెనకే వస్తామని తెలిపారు. కానీ అతను మార్గమధ్యలో వెనుకకు తిరిగి చూస్తే తామక్కడే నిలిచిపోతామని షరతు విధించారు. 
ఆది దేవతల 






ఆది దేవతల అనుగ్రహం పొందడంతో ఆనందభరితుడైన గోవిందుడు తన ప్రయాణం ఆరంభించాడు. నేటి ఆలయమున్న ప్రాంతానికి చేరుకొనేటప్పటికి వెనక నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఏమవుతోంది అన్న కుతూహలంతో గోవిందుడు వెనక్కు చూసాడు. అంతే సర్వేశ్వరుడు అక్కడే లింగరూపం దాల్చగా, నారాయణుడు కొద్ది దూరంలో శిలా రూపం ధరించారు.   
ఇచ్చిన మాట మరచి కంగారులో చేసిన పనికి ఇంతటి శిక్షా ? అని విలపించిన గోవిందుని ఓదార్చి వారు పంచాయితి  ఇక్కడే పెట్టుకొంటే తాము సాక్ష్యం చెబుతామని తెలిపారు.  
విశ్వసించక పోయినా ఏమి జరుగుతుందో అన్న కుతూహలంతో గ్రామం అంతా తరలివచ్చారు. 
ఈ లోపల తండ్రి మాట తప్పాడు  అన్న విషయం తెలుసుకొన్న బాలిక దేవతలు సాక్ష్యమిచ్చినా ఇవ్వక పోయినా  తాను గోవిందుని వివాహమాడేదనని తెలిపింది. 
పంచాయితీలో అందరినీ అబ్బురపరుస్తూ లింగం నుండి, నారాయణ మూర్తి నుండి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని మా ముందు వాగ్దానం చేసాడు అన్న మాటలు వినిపించాయి.  
పెద్దలంతా కలిసి గోవిందునికి ఆ కన్యతో వివాహం జరిపించారు. 









అలా భక్తునికి మద్దతు తెలపడానికి కాశీ నుండి తరలి వచ్చి ఇక్కడ కొలువు తీరిన కైలాస నాధునికి గ్రామస్తులంతా కలిసి అత్రి మహర్షి అధ్వర్యంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది. అనంతర కాలంలో స్థానిక పాలకులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లు శాసనాధారాలు తెలియచేస్తున్నాయి.  
ఈ గాధ  శ్రీ వ్యాస భగవానులు తమ కుమారుడైన శుక మహర్షికి తెలిపినట్లుగా పురాతన గ్రంధాలు 
పేర్కొంటున్నాయి. 
తుంగభద్రా నదిని తనలో కలుపుకొని ప్రవహిస్తున్న బాల కృష్ణమ్మలో గంగాదేవి కూడా అంతర్వాహినిగా ప్రవహించడం వలన సంగమ తీరంలో కొలువు తీరిన స్వామిని శ్రీ సంగమేశ్వరుడు అని భక్తితో పిలుచుకోసాగారు.
ఈ కారణం వలన ఈ గ్రామానికి సంగం జాగర్లమూడి అన్న పేరు వచ్చినది. 
మరో సాక్షి అయిన  శ్రీ  భావ నారాయణ స్వామి సమీపంలోని నేటి పొన్నూరు లో సాక్షి భావ నారాయణ స్వామిగా స్థిర నివాసమేర్పరచుకొన్నారు. 








సువిశాల ప్రాంగణానికి  తూర్పు, పడమర, దక్షిణ దిశలలో గోపురాలుంటాయి. ప్రాంగణంలో ఎన్నో ఆలయాలుంటాయి. పడమర ద్వారానికి వెలుపల శ్రీ గంగా దేవి ఆలయం ఉంటుంది.
బాల కృష్ణ పాయ పారుతున్న పడమర దిక్కుగా ఉన్న గోపుర ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే ఆలయ వృక్షం జమ్మిచెట్టు మొదలు వద్ద ఉన్న ఎన్నో పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. పక్కనే కాలభైరవ ఉపాలయం , పక్కనే నవగ్రహమండపం, గోశాల కానవస్తాయి.
తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయంలో లింగ రూపంలో శ్రీ సంగమేశ్వర స్వామి భక్తుల సేవలను'స్వీకరిస్తుంటారు. పక్కనే అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి కొలువై ఉంటారు.
గమనించవలసి అంశం ఏమిటంటే ఆలయ విమానం మీద మరెక్కడా కనిపించని విధంగా దిక్పాలకుల విగ్రహాలను వాహనాలతో సహా మలచి నిలిపారు.

 



















ప్రాంగణంలో కళ్యాణ మండపం, శ్రీ ఆంజనేయ, శ్రీ వీరభద్ర స్వామి ఉపాలయాలను దర్శించుకొన్న తరువాత దక్షిణ దిశగా వెళితే అక్కడ శ్రీ పార్వతీ దేవి సమేత శ్రీ పాపవినాశేశ్వర స్వామి వారి ఆలయం కనపడుతుంది. చాలా అరుదుగా ఒకే ప్రాంగణంలో సర్వేశ్వరుడు రెండు నామాలతో కొలువుతీరి  దర్శనమివ్వడం జరుగుతుంది. 
శ్రీ పాపవినాశేశ్వర స్వామి భక్తుల జన్మ జన్మల పాపాలను హరించి ఇహ పర సుఖాలను ప్రసాదిస్తారన్నది స్థానిక భక్తుల విశ్వాసం. మరో విశేషం వీరభద్ర స్వామి కి విడిగా ధ్వజస్థంభము ఉండటం. 

















ప్రాంగణంలో వంటశాల, వాహన శాల, భక్తులు శుభ కార్యాలు జరుపుకోడానికి కావలసిన ఏర్పాట్లతో పాటు భోజన శాల కూడా నిర్మించబడినాయి.
కాలవకు ఆవలి పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పురాతన ఆలయం కలదు. ఈ విధంగా సంగం జాగర్లమూడి హరిహర క్షేత్రంగా పేరొందినది.
పురాణ కాలం నుండి భక్తులకు కొంగు బంగారంగా పెర్కొనబడుతున్న ఈ క్షేత్రాన్ని ఎందరో మహర్షులు, మహనీయులు సందర్శించి శ్రీ సంగమేశ్వర స్వామిని సేవించుకొన్నారని ప్రచారంలో ఉన్న గాధలు తెలుపుతున్నాయి.







శ్రీ సంగమేశ్వర స్వామికీ ఇతర దేవీ దేవతలకు నిత్య పూజలు నియమంగా నిర్వహిస్తారు. 
అన్ని పర్వదినాలలో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శివరాత్రి, నవరాత్రులు, కార్తీక మాసంలో, పౌర్ణమి, అమావాస్య రోజులలో  విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, ఆరగింపులు జరుపుతారు.ఆలయ ఉత్సవాల సందర్భంగా స్వామి వారి కల్యాణం,రధోత్సవం ఘనంగా జరుపుతారు. జిల్లా నుండే కాక రాష్ట్రం మంతటి నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

  








గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ వినాయక, శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి, శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ షిరిడీ సాయి మందిరాలు నెలకొల్ప బడ్డాయి. అన్ని హిందూ పర్వదినాలలో అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం సంగం జాగర్ల మూడిలో నెలకొని ఉంటుంది. 












ఎంతో విశేష పౌరాణిక నేపద్యం గల సంగం జాగర్లమూడి గుంటూరు మరియు తెనాలి పట్టణాల మధ్యలో నెలకొని ఉన్నది. 
గుంటూరు నుండి గానీ తెనాలి నుండి గానీ సులభంగా ఇక్కడికి చేరుకొనవచ్చును. వసతి సౌకర్యాలు గుంటూరు, తెనాలి పట్టణాలలో లభిస్థాయి. తప్పక సందర్శించవలసిన క్షేత్రాలలో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, సంగం జాగర్లమూడి ఒకటి.

నమః శివాయః !!!







1 కామెంట్‌:

  1. చాలా ప్రశాంత వాతావరణంతో భక్తిభావం పెల్లుబికేలా ఉన్న ఈ క్షేత్రాన్ని నిన్ననే దర్శించి చాలా ఆనందించాము .
    DR.YVS.PRABHAKAR, GUNTUR

    రిప్లయితొలగించండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...