అరుణాచల ముఖ దర్శనం
"అరుణాచల ..... అరుణాచల......" అని ధ్యానిస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయన్నది శాస్త్ర వాక్యం.
మరి సందర్శిస్తే ! జన్మ జన్మల కర్మ ఫలం తొలగి, ప్రస్తుత జన్మతో సహా రాబోయే జన్మలలో కూడా సంతృప్తికరమైన జీవితం లభ్యమవుతుంది అంటారు మహనీయులు.
తిరువన్నామలై లో శైలమే శివుడు.
అందుకే ఇక్కడ గిరి ప్రదక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు భక్తులు.
పరిపూర్ణ విశ్వాసంతో అచంచల భక్తితో చేసే ఈ గిరి వలయంలో ఉన్న అష్ట దిక్పాలక లింగాలతో పాటు ఇతర పురాతన ఆలయాల సందర్శన ఎంతటి ముఖ్యమో, నడిచే క్రమంలో తరచు అరుణ గిరిని చూడటం కూడా అంతే ఆవశ్యకం.
ఒక్కో చోట ఒక్కో విధంగా దర్శమిస్తుంది ఈ అపర పరమేశ్వర స్వరూపము.వీటినే ముఖ దర్శనాలు అంటారు. సర్వేశ్వరుడు స్వయంగా పార్వతీ దేవితో ఈ ముఖ దర్శనాల వలన భక్తులకు ఒనగూడే ప్రయోజనాలను తెలిపారు.
ఏక మునిక్కాల్ కూంబ దర్శనం
గిరి వలయాన్ని శ్రీ అన్నామలై ఆలయం లోని దక్షిణ గోపురమైన తిరుమంజన గోపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం నుండి చేయాలని భగవాన్ శ్రీ రమణ మహర్షి మార్గనిర్దేశం చేసారు.
గిరి వలయాన్ని శ్రీ అన్నామలై ఆలయం లోని దక్షిణ గోపురమైన తిరుమంజన గోపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం నుండి చేయాలని భగవాన్ శ్రీ రమణ మహర్షి మార్గనిర్దేశం చేసారు.
ఇక్కడ నుండి చూస్తే లభించే దాన్ని "ఏక మునిక్కాల్ కూంబ దర్శనం అన్నారు. తెలిసో తెలియకో ఇచ్చిన మాట తప్పినా, అసత్యమాడినా సంక్రమించే దోషం ఈ దర్శనంతో తొలగి పోతుంది.
శ్రీ రమణ ఆశ్రమం లోని ఏక ముఖ దర్శనం
గిరి ప్రదక్షణలో ముఖ్యమైన దర్శనీయ స్థలాలలో శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం ఒకటి. అరుణాచల పాదాల వద్ద ఉన్న ఈ ఆశ్రమం నుండి లభ్యమయ్యే "తేజో ముఖ దర్శనం" నిరంతరం భవిష్యత్తు గురించి వ్యాకులపడుతూ అశాంతితో జీవనం సాగించే వారికి అపార శాంతిని ప్రసాదిస్తుంది.
తిరువన్నామలై కి పర్యాయ పదం భగవాన్ శ్రీ రమణ మహర్షి. శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం పక్కనే ఉంటుంది రమణుల ఆశ్రమం. వెలుపలి నుండి వీక్షిస్తే పరిస్థితుల ప్రభావం కారణంగా ధర్మ విరుద్దంగా చేసిన కర్మల వలన సంక్రమించిన ఫలాన్ని తొలగించే "ఎరు పంచ ముఖ దర్శన" భాగ్యం కలుగుతుంది.
ఆశ్రమం లోపలి నుండి అరుణగిరి సర్వ పాపాలను హరించే ఒకే శిఖర రూపంలో "ఏక ముఖ దర్శనం"ప్రసాదిస్తుంది.
ధిడ ముఖ దర్శనం
రమణ మహర్షి ఆశ్రమం దాటిన తరువాత మనకు కుడి వైపున "మేల్మరువత్తూర్ శ్రీ ఆది పరాశక్తి ఆలయం" వస్తుంది. జీవితంలో ఎత్తు పల్లాలు, ఆర్ధిక మానసిక ఇబ్బందులు అత్యంత సహజం. వరసగా ఎదురవుతున్న ఎదురు దెబ్బల కారణంగా బెదరిపోయి కొత్తగా ఏ పని చేపట్టాలన్నా ధైర్యం చాలక ఊగిసలాడే వ్యక్తులకు కాలసిన మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఈ ఆలయం పక్కనే చిన్న సందు లో నుండి చూస్తే లభించే "ధిడ ముఖ దర్శనం". మానసిక దృడత్వంతో ధైర్యంగా తీసుకొనే నిర్ణయాలు జీవితంలో ఉన్నత స్థానాము చేరడానికి సోపానాలుగా మారుతాయి.
శ్రీ ద్రౌపది అమ్మన్ ఆలయం
అరుణాచల ప్రదక్షిణా పర్వంలో సప్త నందులు దర్శనమిస్తాయి. అన్నీ మనకు ఎడమ వైపున గిరికి అభిముఖంగా ఉంటాయి. ప్రధాన రహదారి నుండి గిరివాలం మార్గం లోనికి మరలదానికి కొద్దిగా ముందు వస్తుంది "మహా నంది లేదా పృధ్వీ నంది". నందీశ్వరునికి మొక్కి, దీపం వెలిగించి గిరి వైపు చూస్తే ఉదయ భానుని నును లేత కిరణాలు సోకి మెరిసిపోతూ అష్ట దరిద్రాలను హరించే "పృధ్వీ బంగారు ముఖ దర్శనం " సంప్రాప్తమవుతుంది.
పృధ్వీ బంగారు ముఖ దర్శనం
మిత్ర చారు దర్శనం
గిరి వలయ మార్గంలో వచ్చే రెండొవది "అప్పు నంది". ఈ నంది కొమ్ముల గుండా గిరిని వీక్షిస్తే "మిత్ర చారు దర్శనం" లబిస్తుంది. వివిధ కారణాల మూలంగా పోగొట్టుకొన్న ఆస్థులు, విలువైన వస్తువులు, ధనం తిరిగి పొందగలుగుతారు.
అంతే కాదు జీవిత గమనంలో సహజంగా ఏర్పడిన దూరం వలన మిత్రులతో తగ్గిన స్నేహ బంధాలు తిరిగి వెల్లివిరుస్తాయి. అలానే అపోహలు, కలహాల కారణంగా బంధువులతో దూరమైన సంబంధాలు తొలగిపోయి దగ్గరవుతారు. మానవ సంబంధాలను వృద్ది చేసే అద్భుత దర్శనమిది.
ఇక్కడ నుండి పర్వత వాలు వైపు చూస్తే అనేక రాళ్ళు కలిసి దూరానికి నంది ముఖంలా ప్రకృతి చెక్కిన "నంది ముఖ దర్శనం లభ్యమవుతుంది. సకల శుభాలు కలుగుతాయి ఈ దర్శనం వలన.
నంది ముఖ దర్శనం
పదునాలుగు కిలోమీటర్ల గిరివాలయం లో అయిదో కిలోమీటరు దాటిన తరువాత చిన్న మండపంలో ఉంటుంది మూడవది అయిన "తేయు నంది". బ్రహ్మ దేవుడు తను గిరివాలయం చేసిన సమయంలో ఇక్కడ ధ్యానం చేసి జీవుల సృష్టికి కావలసిన జ్ఞానం మరియు శక్తి పొందారట. అందువలన చెడు ఆలోచనలు చేరకుండా ఉండేలా కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించేదిగా ఈ "చతుర్ముఖ దర్శనం" ప్రసిద్ది.
తేయు నంది
చతుర్ముఖ దర్శనం
నైరుతీ లింగం దాటిన తరువాత వస్తుంది "తిరునేర్ అన్నామలై ఆలయం". గిరివలయంలో తప్పక సందర్శించవలసిన శివ సన్నిధి. ఈ ఆలయంతో బాటు శ్రీ ఉన్నమలై అమ్మన్ మరియు శ్రీ గాయత్రీ దేవి ఆలయం ఉంటాయిక్కడ.
ఈ ఆలయాలకు ఎదురుగా శ్రీ ఆంజనేయ మందిరం మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంటాయి.
ఈ ఆలయాల సముదాయం వద్ద నుండి గిరి వైపు చూస్తే రెండు పర్వతాలు ఒక దాని వెనుక ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి. దీనిని "శక్తి శివ ముఖ దర్శనం"అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య నెలకొన్న విబేధాలు శాశ్వతంగా తొలగిపోతాయి.
శక్తి శివ ముఖ దర్శనం
సోమస్కంద ముఖ దర్శనం
ఆది దంపతులు పుత్ర సమేతంగా కొలువుతీరినట్లుగా మూడు శిఖరాలతో అరుణగిరి దర్శనమిచ్చే స్థలం వరుణ లింగం దాటిన తరువాత కుడి వైపున రహదారికి అటు పక్క ఉండే పురాతన శిధిల మండపం. పార్వతీ దేవి సదాశివుని దర్శనం అభిలషిస్తూ ఇక్కడ తపమాచరించారట. సకల అభీష్టాలను నెరవేర్చి అభివృద్దిని ప్రసాదించేది ఈ "సోమస్కంద ముఖ దర్శనం".
శివ యోగ ముఖ దర్శనం
గిరి ప్రదక్షణలో తప్పక సందర్శించవలసినది బ్రహ్మ ప్రతిష్టిత "శ్రీ ఆది అన్నామలై స్వామి ఆలయం" ఆ దివ్య ధామం వద్ద నుండి లభించే "శివ యోగ ముఖ దర్శనం" ఆధ్యాత్మిక లేక విద్య నేర్పే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది.
జన్మ సాఫల్య ముఖ దర్శనం
అష్ట దిక్పాలక లింగాలలో ఒకటైన వాయు లింగం వద్ద అరుణ గిరి తన "కండ నీరు జన్మ సాఫల్య ముఖ దర్శనం"తో భక్తులకు ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో బాధ పడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అరుణాచలం ఎన్నో అరుదైన వన మూలికలకు నిలయం.
శక్తి శివ ఐక్య ముఖ దర్శనం
ఎక్కడా లేని విధంగా గిరి ప్రదక్షణలో మనం ముగ్గురు మహర్షుల సన్నిధులను దర్శించుకోవచ్చును. వారే శ్రీ దుర్వాస, శ్రీ గౌతమ మరియు శ్రీ అగస్థ్య మహర్షులు. చంద్ర లింగం దాటినా తరువాత వస్తుంది శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్థ్య సభ. అర్ధనారీశ్వరతత్వానికి తిరువన్నమలై ప్రసిద్ది. దానికి తగినట్లుగా పార్వతీ మరియు శ్రీ అన్నామలై పర్వతాలు కనపడతాయి. ఈ "శక్తి శివ ఐక్య ముఖ దర్శనం "వలన అవివాహితులకు వివాహం ఘడియలు రావడం, సంతానం లేని దంపతులకు సంతానం కలగడం జరుగుతాయి.
కుబేర లింగ వద్ద అరుణ గిరి
కుబేర లింగం దాటిన తరువాత కుడి పక్కన ఉంటుంది "పంచ ముఖ దర్శన మండపం". వలయంలో ఇక్కడొక్క చోటే పర్వత పంచ శిఖరాలను చూడ వచ్చును. ఈ అపురూప పంచ ముఖ దర్శనం వలన చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను చేరుకొనే మార్గం సుగమనం అవుతుంది.
పంచ ముఖ దర్శనం
వివిధ రూపాలలో అరుణాచలం
సర్వేశ్వరునికి ప్రతి రూపమైన తిరువన్నామలై ప్రదక్షణ పరమ పవిత్రమైనది. సంపూర్ణ విశ్వాసంతో చేస్తూ మార్గంలో ఎదురయ్యే ఆలయాలను సందర్శిస్తూ, గిరి ముఖ దర్శనాలు చేసుకొంటూ చివరికి శ్రీ అన్నామలై స్వామి దర్శనంతో ఇహపర సుఖాలను పొందవచ్చును.
పూర్ణిమ నాడు చంద్ర కిరణాల వెలుగులో.....
స్కాంద గుహ వద్ద నుండి శ్రీ అన్నామలై స్వామి ఆలయం
ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!
అరుణాచల గిరిప్రదక్షిణ గురించి ఫోటోలతో సహా మంచి వివరణ ఇచ్చారు, అందరికీ ఉపయుక్తంగా ఉన్నది, సదా కృతజ్ఞతలు
రిప్లయితొలగించండి