21, సెప్టెంబర్ 2015, సోమవారం

Kapilatheertham, Tirupati

                                         కపిల తీర్ధం, తిరుపతి 


కలియుగ వైకుంఠము తిరుమల తిరుపతి !

ఎన్నో పవిత్ర తీర్దాలు, ఆలయాలు నెలకొని ఉన్న దివ్య క్షేత్రం !

కలియుగంలో మానవులకు ఆధ్యాత్మిక అనుభూతులను అందించే విశిష్ట క్షేత్రం !







సప్త గిరులలో అనేకానేక తీర్దాలు ప్రవహిస్తున్నాయి. భక్తుల కర్మ ఫలాలను హరించే ఈ జలాలు పరమ శివుని
జటాజూటాల నుండి జాలువారిన గంగ దారలే !





ఏడుకొండల మీద ఉన్న జలధారలు కాకుండా శిఖరుం నుండి నేలకు వాలే మరో సుందర జలపాతమే "కపిల 

తీర్ధం". 

ఈ తీర్ధ మహత్యం మాటలతో చెప్పలేనిది. 

మిగిలిన తీర్దాలు ఆకాశ గంగ ప్రతిరూపలైతే ఈ కపిల తీర్ధం పాతాళ గంగ మరో రూపమైన "భోగవతి"గా పురాతన 

పురాణ గ్రంధాలలో పేర్కొనబడినది.  






పురాణ యుగంలో "కపిలుడు" అనే మహర్షి పాతాళ లోకంలో పరమేశ్వర అనుగ్రహం అభిలషిస్తూ లింగాన్ని

ప్రతిష్టించి నియమంగా ఆరాధించేవారు.

మహాముని భక్తి శ్రద్దలకు సంతుష్టుడైన భక్తవశంకరుడు  పాతాళం నుండి పెరుగుతూ భూమి పొరలను చీల్చుకొని

చివరకు వేంకటాచల పర్వత పాదాల వద్ద ఉన్న గుహలో ఉద్భవించినది.







ఆద్యంతాలు లేకుండా పెరిగిపోతున్న ఈ లింగాన్నిఎలాగైనా ఇక్కడ ఆపాలని నిర్ణయించుకొన్నదేవతలు  శ్రీ హరి శరణు కోరారు. భక్తవత్సలుడు గోపాలునిగా మారి విదాతను కపిల గోవుగా మార్చి వేంకటాచల పాదాల వద్దకు

చేరుకొని గోక్షీరంతో నిరంతరంగా అభిషేకం జరిపారు.







అంతటితో లింగం పెరగడం ఆగి పోయినది. 
కపిల మహర్షి ప్రతిష్టిత లింగం, కపిల గోవు పాలతో అభిషేకించబడిన లింగం కావడంతో "శ్రీ కపిలేశ్వర స్వామి"గా 

పిలబడుతున్నారు. 






మూడు పక్కలా కోట గోడలాగా ఉన్న వేంకటాచల పర్వత పాదాల వద్ద పైనుండి  పాతాళ గంగ భోగవతి ఆకాశ

గంగగా మారి అభిషేక ప్రియునికి నెచ్చెలిగా రూపు దిద్దుకోన్నది. ఈ జలదారాలలో స్నానమాచరిస్తే జన్మజన్మల

పాపాలు హరించుకు పోతాయని యుగయుగాలుగా భక్తుల  విశ్వాసం.





ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా అంజనా సుతుడు "శ్రీ అభయ హస్త  ఆంజనేయ స్వామి"గా ప్రత్యేక

సన్నిధిలో కొలువై ఉంటారు.

 పక్కనే కొండ వాలును సుందర ఉద్యాన వనంగా తీర్చిదిద్దారు. అక్కడక్కడ క్షేత్ర గాధను తెలిపే రూపాలను

ఉంచారు.

పక్కనే శ్రీ రామకృష్ణ వివేకానంద పుస్తక విక్రయశాల ఏర్పాటు చేసారు.








కపి వీరునికి మొక్కి ముందుకు కదిలితే పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖుడైన "శ్రీ నమ్మాళ్వార్" ఆలయం 

వస్తుంది. 

తనతో పాటు మిగిలిన ఆళ్వారులు గానం చేసిన నాలుగువేల పాశురాలను మనకు "నాదముని"ద్వారా 
అందించినది ఈ ఆళ్వారే !

గర్భాలయంలో ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ నమ్మాళ్వార్ కు ప్రతినిత్యం నియమంగా పూజాదికాలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయం వద్దనే కొత్తగా ఆలయ పురాణ గాధను తెలిపే పది బోర్డు లను ఏర్పాటుచేశారు. 
























సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు భగవతి పైనుండి పొంగి పొరలి క్రింద పుష్కరణి లోనికి చేరి  గంగాధరుని

అభిషేకాలకు సిద్దంగా ఉంటుంది. ఈ జలపాత సోయగాలను జూన్, జూలై మాసాలలో వీక్షించే అవకాశం లభిస్తుంది.

కోనేటి వడ్డున శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలుంటాయి.

ఒక తెలుగు శాసనం కూడా కనపడుతుంది.

పుష్కరణికి రెండు పక్కలా రాతి మండపాలను నిర్మించారు.





నూతనంగా నిర్మించబడిన మండపంలో శ్రీ గణపతి ఉపాలయం, లోపలి భాగంలో శ్రీ దక్షిణామూర్తి, శ్రీ కాల భైరవ, శ్రీ

మహాగణపతి , శ్రీ మహా శాస్త, శ్రీ శివ సూర్య, శ్రీ నటరాజ విగ్రహాలు, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ

కోటిలింగేశ్వర స్వామి, శ్రీ అగస్తేశ్వర స్వామి ఉపాలయాలు, పెక్కు నాగ ప్రతిష్టలు కనపడతాయి. 




 చిన్న కొండ గుహలో పానవట్టం మీద లింగ రూపంలో కొలువై ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి సుందర పుష్పాలంక్రుతులై
మనోహరంగా దర్శనమిస్తారు. పక్కనే ఉన్న మరో ఆలయంలో శ్రీ కామాక్షీ అమ్మవారు స్థానక భంగిమలో వరద, 

అభయ హస్తాలతో భక్తులకు సమస్త సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు.  












నిత్యం పలురకాల అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, నివేదనలు శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వర స్వామికి

నియమంగా నిర్వహిస్తారు.

ఏడుకొండల వాడికి జరిపించే అన్ని ఉత్సవాల సందర్భంగా కపిల తీర్ధం లో కూడా ప్రత్యేక సేవలు జరుపుతారు.
అసలు విషయం ఏమిటంటే మొదట శ్రీ కపిలేశ్వర స్వామికి మొక్కిన తరువాతనే ఏడు కొండలు ఎక్కాలట !
ఆ పైన శ్రీ వారాహ స్వామిని దర్శించుకొన్న తరువాత శ్రీ వారి మంగళ రూపం వీక్షించాలని అంటారు. 





మాస శివరాత్రి,  త్రయోదశి నాటి ప్రదోష పూజలు, కార్తీక మాస పూజలు, మహా శివరాత్రి, ఆరుద్ర ఉత్సవాలు ఇలా 

ఎన్నోపండగల వలన కపిల తీర్ధం ప్రతి నిత్యం వేలాది భక్తులతో సందడిగా ఉంటుంది.   







కపిల తీర్ధం పక్కన "జంగిల్ బుక్"అన్న పేరుతో ఒక ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేసారు.

పిల్లలకు పెద్దలకు ఇదొక ఆట విడుపు.
అరుదైన వృక్షాల నీడన స్వచమైన గాలిని పచ్చని ప్రకృతిని ఆస్వాదించడం చక్కని అవకాశం.
కొద్దిగా లోపలి వెళితే ఈ కొండలు  రాతి యుగం నాటి మానవులకు ఆవాసం అని తెలిపే చిహ్నాలు కనిపిస్తాయి. 




ఇలా ప్రకృతి సోయగాలను, ఆధ్యాత్మిక అనుభూతులను సమంగా అందించే కపిల తీర్ధం తిరుపతి బస్సు మరియు 

రైల్ స్టేషన్ లకు సమదూరంలో ఉన్నది. సులభంగా చేరుకోవచ్చును. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...