12, ఫిబ్రవరి 2014, బుధవారం

Tirunavaya


                              తిరునవయ - కేరళ గయ 




దేవతల స్వస్థలం గా పేరొందిన కేరళ మనోహర ప్రకృతి అందాలతో పాటు భక్తి భావాలను కలిగించే దివ్య ఆలయాలతో ఇటు ప్రకృతి ప్రేమికులను అటు ఆధ్యాత్మిక వాదులను సమానంగా ఆకర్షిస్తోంది. 
మిగిలిన రాష్ట్రాలకు కొద్దిగా భిన్నంగా ప్రత్యేక ఆలయాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. 
అన్ని ఎంతో పౌరాణిక మరియు చారిత్రిక నేపద్యం కలిగినవి కావడం విశేషం. 
అలాంటి వాటిల్లో తిరునవయ మరింత విశేషం. 
కేరళను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. 
పాడిపంటలతో, సిరిసందలతో తులతూగడమే కాకుండా రాజకీయంగా కీలక ప్రదేశంలో ఉండటం వలన తిరునవయ మీద ఆధిపత్యం కరకు ఆయా రాజ వంశాల మధ్య జరిగిన పోరాటాల్లో ఎన్నో మార్లు రక్తసిక్తంగా మారిందని లభించిన ఆధారల వలన తెలుస్తోంది. 
అయిదు శతాబ్దాల క్రిందట పుష్కరానికొకసారి జరిగే " మామంగం " ఉత్సవాలకు వేదిక తిరునవయ. 
"మహా మాఘ మాసం" అన్నదే "మామంగం " మారింది. 
ఆ ఉత్సవాలలో కేరళ లోని వివిధ ప్రాంతాలను పాలించే రాజ వంశీకులు పాల్గొని ఇక్కడి భగవతి అమ్మవారికి ఘనంగా పూజలు చేసి తమ చక్రవర్తిని ఎన్నుకోవడానికి బలప్రదర్శన చేసేవారు. 
ఒక్కో రాజుకి ఒక్కో "చవేర" గా పిలవబడే ఒక దళం ఉండేది. 
ఆ చవేరాల మధ్య పోరాటం జరిగేది. 
ఏ రాజు యొక్క చవేరా గెలిస్తే అతడే చక్రవర్తి. 
అలా తమ పాలకుల కోసం వీర మరణం పొందిన చవేరాల దేహాలతో ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్న "నిలపాడు తార "లోని బావి నిండిపోయేది. 
చక్రవర్తి ఎన్నికే కాకుండా మామంగం ఒక పెద్ద వ్యాపార సంత గా అప్పట్లో పేరు పొందినది. 
భారత దేశం నుండే కాక విదేశాల నుండి కూడా వ్యాపారులు వచ్చి ఈ ఎనిమిది రోజుల ఉత్సవంలో పాల్గొనేవారు. 
అంతే కాదు తిరునవయ ఒక పేరొందిన విద్యా కేంద్రం. 
ఇక్కడి "ఒతాన్ మార్ " అనే వేదాధ్యయన కేంద్రంలో ఎందరో విద్యార్ధులు విద్య నేర్చుకొనేవారు. 
ఈ వైభవమంతా పదిహేడు వందల యాభై అయిదో సంవత్సరంతో గతంగా మారిపోయింది. 
మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్ కేరళలోని అధిక భాగాన్ని తన వశం చేసుకొని అనేక స్థానిక సంబరాలకు, ఉత్సవాలకు ముగింపు పలికే వాతావరణాన్ని సృష్టించాడు. 
చరిత్ర ప్రసిద్ది చెందినవి కాల గర్భంలో కలిసిపోయినా కొత్తగా మొదలైన స్థానిక గాంధేయ వాదుల సారధ్యంలో సర్వోదయ సమ్మేళనం, "కాలరి పట్టు" గా పిలవబడే యుద్ద విద్యల ప్రదర్శన  ప్రతి వేసవిలో ఇక్కడ జరుగుతున్నాయి.

శ్రీ నవ ముకుంద ఆలయం :

కలియుగంలో రక్తసిక్త చరిత్ర గల తిరునవయ పౌరాణికంగా ఎంతో ఘనమైన పవిత్రతను కలిగి ఉండటం చెప్పుకోవలసిన విషయం. 
కేరళ గంగ గా పిలవబడే "భరత్ పుళ" నది ఒడ్డున ఉన్న ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి ఇక్కడి శ్రీ నవ ముకుంద స్వామి ఆలయమే కారణం.











కొన్ని యుగాల క్రిందట తొమ్మిది (నవ) యోగులు ఈ  నదీతీరంలో తొమ్మిది విష్ణు రూపాలను రూపొందించుకొని నిష్టగా సేవిస్తూ ఒకరి తరువాత ఒకరుగా వైకుంఠ వాసునిలో ఐక్యం అయ్యారు. 
వారు సేవించిన తొమ్మిది శ్రీ హరి అర్ఛా రూపాలు కలిసిపోయి ఒకటిగా మారింది. 
ఈ కారణంగా స్వామిని "నవ ముకుందుడు" అని గ్రామాన్ని "తిరునవయ" అని పిలవసాగారు. 
సాదా సీదా కేరళ నిర్మాణ శైలిలో రాజ గోపురం, విశేష శిల్పాలు లేని ఈ ఆలయంలో తూర్పు ముఖ ద్వారం, ధ్వజస్తంభం, ముఖమండపం, నమస్కార మండపం ఉంటాయి. 
వర్తులాకార శ్రీ కోవెలలో స్థానక భంగిమలో చతుర్భుజాలలో శంఖు, చక్ర,గదా పుష్పాలను ధరించి చందన,పుష్ప అలంకారంతో శ్రీ నవ ముకుంద స్వామి దివ్య మంగళం గా దర్శనమిస్తారు. 
మూల విరాట్టుకు వెనకన ఉన్న గుహా మార్గం ద్వారా నేటికి రాత్రి సమయాలలో నవ యోగులు వచ్చి స్వామిని సేవించుకొంటారని అంటారు. 
మరో విశేషమేమిటంటే నవ ముకుందుని మోకాళ్ళ క్రింది భాగం భూమిలోనే ఉండి పాద దర్శనం లభించదు. 
భక్తులు గౌరవ సూచికంగా మోకాళ్ళ మీద కూర్చొని స్వామిని ప్రార్ధిస్తారు. 
అరుదైన ఈ విషయం గురించి ఎన్నో గాధలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. 
ఈ విగ్రహం కొద్ది కొద్దిగా భూమిలోనికి వెళుతోందని, కలియుగాంతానికి  పూర్తిగా కనుమరుగై పోతుంది అన్నది బాగా ప్రచారంలో ఉన్న గాధ. 
ఆరో శతాబ్దానికి చెందిన శ్రీ వైష్ణవ గాయక భక్తులైన పన్నిద్దరు ఆళ్వారుల లోని శ్రీ నమ్మాళ్వార్, శ్రీ తిరుమంగై ఆళ్వార్ నవ ముకుంద స్వామిని పదమూడు పాశురాలతో కీర్తించడం వలన తిరునవయ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా గుర్తించబడినది. 
కేరళలో మొత్తం పదకొండు దివ్య (దేశాలు)తిరుపతులున్నాయి.


  









పడమర వైపున ఉన్న ఈ ద్వారం నిరంతరం మూసివేసి ఉంటుంది. దీనికి కారణంగా ఒక పురాణ గాధ వినిపిస్తుంది.
అల్పాయుష్కునిగా జన్మించిన మార్కండేయుడు తండ్రి మృకుంద మహర్షి సలహా మేరకు దీర్ఘాయువు పొందటానికి నియమంగా నవ ముకుందుని సేవించేవాడు.
ఆయుర్దాయం తీరిన రోజున బాలుని ప్రాణాలను తీసుకొని పోవడానికి యమ ధర్మ రాజు తరలి వస్తున్న సమయంలో పెరుమాళ్ళు ముని కుమారునికి కొంత మట్టి ఇచ్చి నది ఆవలి తీరానికి వెళ్లి ఈశ్వర లింగాన్ని చేసి ధ్యానించమని పడమర ద్వారం గుండా పంపి తలుపులు మూసివేశారు.
అలా స్వామి స్వయంగా మూసిన తలుపులను ఏ కారణంగాను తెరువరు.
ఈ ఉదంతాన్ని తెలిపే వర్ణ చిత్రాలు గర్భాలయంలో చూడవచ్చును.









విశాల ప్రాంగణంలో గణేశ, ధర్మశాస్త, మమంగం లో పూజలందుకొన్న భగవతి, ఉప ఆలయాలున్నాయి. అమ్మవారు శ్రీ మలర్ మంగై నాంచారి విడిగా కొలువై ఉంటారు. 









అలా నదిని దాటి పెరుమాళ్ళు ఇచ్చిన మట్టితో మార్కండేయుడు తయారు చేసుకొని అర్చించి చిరంజీవిగా వరం పొందిన ఈశ్వర లింగం శ్రీ కాళ సంహార మూర్తి గా నేటికి నది ఆవలి ఒడ్డున పూజలందుకొంటున్నారు.
ఈ క్రింది ఆలయం అపమృత్యు భయాన్ని తొలగించే " ధార పూజ "కు, మృత్యుంజయ హోమాలకు ప్రసిద్ది.








సృష్టిని ఆరంభించే ముందు విధాత పవిత్ర భరత్ పుళ నదీతీరంలో తమమాచరించరని తెలుస్తోంది.
ఆయన తపస్సు చేసిన స్థలంలో ఒక ఆలయం నిర్మించారు. కాళ సంహార మూర్తి ఆలయానికి చేరువలో ఉంటుందీ ఆలయం.









సృష్టి, స్థితి లయకారకులు ముగ్గురూ కొలువైన క్షేత్రం తిరునవయ.
కేరళ లోని రెండో త్రిమూర్తి క్షేత్రం. మొదటిది తిరువనంతపురంలో ఉన్న తిరువల్లం శ్రీ పరశురామ ఆలయం.








ప్రతినిత్యం ఉదయం నాలుగు గంటల నుండి పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి వుండే ఆలయంలో నియమంగా పదహారు రకాల పూజలు శ్రీ నవ ముకుందునికి జరుగుతాయి.
అన్ని పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
కేరళ మీన మాసం ( మార్చి - ఏప్రిల్ )లో నిర్వహించే ఆలయ ప్రతిష్టా ఉత్సవాలు పది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.








భరత్ పుళ నది :

కేరళ రాష్ట్రంలో రెండో పెద్ద నదిగా గుర్తించబడిన భరత్ పుళ నది పడమటి కనుమలలోని అన్నా మలై పర్వత శ్రేణిలో జన్మించి తన ప్రయాణ మార్గంలో ఇరవై పై చిలుకు ఉప నదులను తనలో కలుపుకొంటుంది. 
కొన్ని వేల ఎకరాలను సశ్య శ్యామలం గా చేస్తూ "పొన్నాని" వద్ద సాగరంలో సంగమిస్తుంది. 
నీళా నదిగా కూడా పిలవబడే దీనిని స్థానికులు గంగా నది తో పోలుస్తారు. 
త్రిమూర్తి స్థలమైన తిరునవయ వద్ద గతించిన పెద్దలకు పిండ ప్రదానం చేయడం గయలో చెసినదానితొ సమానమని భావిస్తారు. 
ముఖ్యంగా జులై - ఆగస్టు నెలలో వచ్చే "కర్కాటక వావు " రోజున వేలాది మంది పితృ కార్యాలు జరుపుకోడానికి
ఇక్కడికి వస్తారు. 
ఇందు కోసం ప్రత్యేక మండపాలు నిర్మించారు. 
జాతి పిత మహాత్మా గాంధి, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చితా భశ్మాలను ఇక్కడ నిమజ్జనం చేశారు. 
అందుకే తిరునవయ కేరళ గయ. 
ఇంతటి విశేషాల తిరునవయ ప్రముఖ కృష్ణ క్షేత్రం గురువాయూరు కు నలభై కిలో మీటర్ల దూరంలో ఉన్నది.  స్థానికంగా ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు. గురువాయూర్ నుండి వెళ్లి రావడం ఉత్తమం.

నమో నారాయణాయ !!!!

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...