28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

My word

నా బ్లాగ్ ని చదువుతున్న అందరికి వందనం.

చిన్న తనం నుండి నాకు దైవ భక్తిని నా పితా మహులు స్వర్గీయ ఇలపావులూరి వెంకట
రమణయ్య గారు, మాతా మహులు  స్వర్గీయ దరిశి వీర రాఘవ స్వామి గారు పురాణ గాధలు
చెబుతూ పరిచయం చేసారు.
నా మాతా మహులతొ ఎన్నో పుణ్య క్షేత్రాలను సన్దర్శించుకొన్నాను.
మా తండ్రి కీర్తి శేషులు ఇలపావులూరి గోపాల కృష్ణ మూర్తి గారు కూడా
ఎన్నో ప్రదేశాలకు తీసుకొని వెళ్ళారు.
చిన్నతనంలో నాకొక ఆలోచన ఉండేది.
ఎన్నో దేవి దేవతా చిత్రాలు చిత్రించాలని.
కొంత వరకు కృషిచేసినా లక్ష్య సాధన మీద స్థిరమైన ద్రుష్టిలేక మధ్యలోనే
వదిలివేశాను.
స్వంత మరియు ఉద్యోగ సంబంధిత కారణాల వలన చాలా కొద్దిగా రచించాను.
అదికూడా స్థిరంగా కొనసాగించలేక పోయాను.
తిరిగి 2007 నుండి వరసగా ఆలయ దర్శనం గురించి, వివిధ హిందూ క్షేత్ర విశేషాల గురించి
రాయడం చేస్తున్నాను. 
గత కొద్ది రోజులుగా నేను అన్నీ విష్ణు ఆలయాల గురించే రాస్తున్నాను.
ఈ విషయాన్ని కొందరు మిత్రులు నా బ్లాగ్ చదివిన తరువాత అడిగారు.
2007 నుండి పూర్తి స్థాయిలో రాయడానికి, ఎక్కువగా విష్ణు ఆలయాల గురించి
ప్రస్తావించడానికి కొన్ని విశేష అనుభవాలే కారణం
వాటిని మీముందుకు సవినయంగా తెస్తున్నాను.
స్వతహాగా నేను అన్ని ఆలయాలకు ఎలాంటి భేద భావం లేకుండా సందర్శించు కోడానికి
వెళుతుంటాను.
ఈ నా రచనలకు మార్గం చూపిన తొలి గురువు శ్రీ ధర్మ శాస్త.
1979 నుండి శబరి యాత్ర చేస్తున్నాను.
2006లో నా కుటుంబం, చిన్ననాటి స్నేహితుడైన ఏక ప్రసాద్ కుటుంబం కలిసి కేరళ మరియు తమిళనాడు యాత్రకు వెళ్ళాము.
ఎన్నో క్షేత్రాలను దర్శించుకొన్నము.
నా కేరళా స్నేహితుడు శ్రీ సజ్జి శ్రీధరన్ ఏర్పాటు చేసిన కారు డ్రైవర్ శ్రీ ప్రమోద్ నా కుతూహలాన్ని గ్రహించి మమ్ములను గురువాయూరుకు చేరువలో ఉన్న ప్రముఖ శ్రీ రామ ఆలయం అయిన "త్రిప్రయార్" కు తీసుకొని వెళ్ళాడు.
పెరియార్ నది వడ్డున ఉన్న ఈ ఆలయంలో ఒక చిత్రమైన ( క్షమించాలి. ఆనాటి నా భావన ఇదే) ఆచారం ఉన్నది.
తడి బియ్యాన్ని నదిలో చేపలకు వేస్తున్నారు చాలా మంది భక్తులు.
నేను, నా భార్య అందరి మాదిరే చేసాము.
శ్రీ రాముని దర్శించుకొని త్రిచూర్ మీదగా తిరువనంతపురం రాత్రికి చేరుకొని లాడ్జిలో పడుకొన్నాము.
తెల్ల వారు ఝామున నాకొక కల.
అందులో ఒక ఛాయా మాత్ర రూపం కనిపించింది.
" అందరూ వేస్తున్నారని నువ్వూ బియ్యం వేసావు. కారణం ఏమిటో తెలుసుకోవా?" అన్న మాటలు వినిపించాయి.
అప్పటికి నాకు కంప్యూటరుతో ఎలాంటి పరిచయము లేదు.
తెలిసినదల్లా పుస్తకాలు చదవడం లేదా తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం.
నా అన్వేషణ ఆరంభించాను.
విశాఖ పట్టణం యెన్ ఏ డి కొత్త రోడ్ సెంటర్లో ఉన్న ప్రభా హోటల్ యజమాని ( మలయాళీ) తనకున్నపరిచయాల ద్వారా తెలుసుకొన్న విషయం నాకు తెలిపాడు.
అలా బియ్యం చేపలకు పెడితే ఉబ్బస వ్యాధి తగ్గుతుందని స్థానికులు విశ్వశిస్తారన్నది ఆ సమాచారం.
తెలుసుకొన్న విషయాన్ని నా భార్యకు చెప్పాను.
మీరు నమ్మక పోవచ్చును, నా కుమారుడు చిన్నతనం నుండి ఉబ్బసం తో భాధ పడేవాడు.
మేము త్రిప్రయార్ వెళ్ళినది డిసెంబర్ నెలలో!
జనవరి, ఫిబ్రవరి నేలలు గడచిపొయినాయి.
అతను ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు.
త్రి ప్రయార్ వెళ్ళిన తరువాత అతఃని వ్యాధి తొలగిపొయినది.
అది మేము గ్రహించలేదు.
విషయం విన్న నా భార్య ఈ సంగతి నాకు చెప్పినది.
దొరికిన ఆదరంతో మరింత సమాచారం కొరకు ప్రయత్నించాను.
ఆ అన్వేషణలో శ్రీ వైష్ణవ దివ్య దేశాల గురించిన సమాచారం తెలుసుకొన్నాను.
వాటిని సందర్శించాలన్న అభిలాష మొదలయ్యింది.
2008లో నా చిన్ననాటి కల అయిన కుర్తాళం దర్శించుకోవడం జరిగింది..
కుర్తాళం వెళ్ళినప్పుడు క్షేత్ర విశేషాల గురించి ఎందరో స్థానికులను ప్రశ్నించాను.
సరైన సమాధానం లభించలేదు.
అప్పుడు నాకు ప్రతి ఒక్కరు తమ జీవన కాలంలో ఎన్నో ఆలయాలను, ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
కాని ఎందరు ఆయా క్షేత్ర విశేషాలు తెలుసుకొంటున్నారు? అన్న ఆలోచన తలెత్తినది.
క్షేత్ర ప్రాముఖ్యతను అందరికి తెలపాలన్న శ్రద్ధతో రాసిన వ్యాసాన్ని "ఆంధ్ర జ్యోతి" దిన పత్రిక తన ఆదివారం అనుభందం లో ప్రచురించి రచయితగా నాకు జన్మనిచ్చినది.
వారికెంతో కృతజ్ఞుడను.
అప్పటిదాకా ఏదో రాయాలనిపించినప్పుదు రాయటం తప్ప మరో ఉద్దేశ్యం లేదు
 నాటి నుండి దర్శించిన ప్రతి ఆలయ విశేషాలను రాస్తున్నాను.
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక నా వ్యాసాలను "ట్రావెలొగ్" శీర్షికన ప్రచురించినది.
ఆంధ్ర భూమి వార/మాస, చిత్ర, భక్తిసుధ'లాంటి పత్రికలు వాటిని ప్రచురిస్తున్నాయి.
అందరికి నా నమస్కారాలు.
అలా మొదలైన ఆలయ దర్శనం నా ఆభిలాష అయిన 108 శ్రీ వైష్ణవ దివ్య దేశ సందర్శనం
వైపు సాగింది.
 ఆసక్తి నాచేత ఇప్పటికి అరవై దివ్య దేశ సందర్శనా భాగ్యం కలిగించినది.
ప్రతి ఒక్క క్షేత్ర సందర్శనం ఒక  అపురూప అనుభూతిని ప్రసాదించినది.
అహోబిలం సందర్శన నా జీవితంలో ఒక మరుపురాని అనుభవం.
ఒక్క రోజులో నవ నారశింహ క్షేత్రాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రతిష్టిత శ్రీ ప్రహ్లాద వరద
నారసింహ ఆలయంతో మొత్తం పది దర్శించుకొనే భాగ్యం లభించినది. 
ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన వ్యాసానికి నేటికి  ఫోన్
కాల్స్ రావడమే అందుకు నిదర్శనం. ( 2010లో ప్రచురించబడినది, ఈ బ్లాగ్ లో ఉన్నది )
అదే విధంగా గిద్దలూరు (ప్రకాశం జిల్లా) సమీపంలోని నెమలి గుండ్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయ సందర్శనం ఒక అద్భుతం.
శబరి దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్లాను.
వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.
కనక సురభెశ్వర కోన చూసుకొని రంగనాయక క్షేత్రాన్ని చేరుకొన్నాము.
మనసులను మైమరపించే వాతావరణం.
కొండ మీదకి చేరుకొని నా కెమేరాతో పరిసరాలను చిత్రీకరిస్తున్నాను.
ఒక మెరుపులా ఆలయానికి ఎదురుగా ఉన్న కొండల మీద శంఖు చక్రాలతో తిరునామం సందర్శనం కలిగినది.
పక్కనే ఉన్న నా మిత్రుడు ప్రసాదుకు ఏమి కనిపించలేదు.
అతను నన్ను పదేపదే అడిగాడు "నిజంగా కనిపించినదా ? అని.
నా సమాధానం ఒక్కటే "నిజం !".
దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి శ్రీ శైల శిఖర దర్శనంలా ఇక్కడ శంఖు చక్రాలతో తిరునామం సందర్శనం
అర్హులైన భక్తులకు లభిస్తుంది అని తెలిపినప్పుడు చకితుడనైనాను.
ఈ అల్పునికి ఇంతటి అదృష్టమా అనిపించినది.
 చిత్రించిన వీడియో "ijv291963 channel" you tubeలో చూడవచ్చును.
ఈ అనుభవాలు నాకు నిత్య జీవన విషయాలలో, ఆధ్యాత్మిక భావనలలో ఎన్నో విధాలుగా
మార్గదర్శనం చేశాయి.
మీ అందరి ఆశీర్వాదంతో సందర్శించుకొన్న దివ్య దేశాలతో పాటు శ్రీ మహా విష్ణువు గురించి తెలుసుకొన్న విశేషాలను తొందరలో  మీముందుకు తీసుకురావాలన్న ప్రయత్నం లో భాగమే నాయీ\వరుస శ్రీ మహా విష్ణు ఆలయాల పరిచయం.
హిందూ ధర్మ గొప్పదనాన్ని, ఆలయ స్థాపనా ప్రాధాన్యతను గురించి అవగతం అయిన ( అనుకొంటున్నాను)
వాటిని నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయమే ఈ రచనల వెనక ఉన్న ఉద్దేశ్యము.
నిరంతరం మీ ఆదరాభిమానాలను కోరుకొంటూ
భవదీయుడు,
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
09052944448
విజయవాడ


   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...