23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Aranmula - Sri Pardha Saradhi Temple

                           ఆరన్మూల - శ్రీ పార్ధ సారధి ఆలయం 



కేరళలోని, చెంగనూర్ చుట్టుపక్కల ఉన్న పంచ పాండవ ఆలయాలలో ముఖ్యమైనదిగా పేర్కొనవలసినది ఆరన్మూల శ్రీ పార్ధ సారధి ఆలయం. 
పంబా నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రం పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా, ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలలో కూడా తనదైన ప్రత్యేకతలు కలిగి ఉన్నది. 

పౌరాణిక విశేషాలు :

స్థానికంగా వినిపించే గాధల ఆధారంగా సృష్ట్యాదిలో గాఢ నిద్రలో ఉన్న విధాత నుండి సోమకాసురుడు వేదాలను సంగ్రహించుకొని పోయాడు. మేల్కొన్న బ్రహ్మ దేవుడు వేదాలు లేకపోవడంతో సృష్టి ఆరంభించలేని పరిస్థితులలో భూలోకానికి వచ్చి పవిత్ర పంబా నది వడ్డున శ్రీ మన్నారాయణ అనుగ్రహం కోసం తపస్సు చేసారు. ఆయన దీక్షకు సంతసించిన శ్రీహరి దర్శనం అనుగ్రహించి, ఇక్కడే స్తిర నివాసము ఏర్పరచుకొన్నారు. 
తమ వాన ప్రస్థ సమయంలో ఇక్కడికి వచ్చిన పాండవ మధ్యముడు, మహా భారత యుద్దంలో రధము క్రుంగిపోయి ఉన్న కర్ణుని తన అగ్రజున్ని అధర్మంగా సంహరించిన పాపం తొలగించేవాడు ఇక్కడ కొలువైన " తిరు క్కూరలప్పన్" అని భావించి శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడు. ఆ యుద్దంలో  స్వామి అర్జనుని రధ సారధి గా వ్యహరించినందున "పార్ధ సారధి" గా పిలవబడుతున్నారు. కాల గమనంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా ప్రధాన ఆలయం మూడు వేల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది అని అంటారు. 

ఆలయ విశేషాలు :

ఎన్నో విశేషాల సమాహరమీ ఆలయం. చెంగనూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో శబరిమల వెళ్ళే దారిలో కొద్దిగా ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. పైకి చేరుకోడానికి పద్దెనిమిది మెట్లు ఉండటం  విశేషం. హిందూ సంస్కృతిలో పద్దెనిమిదికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. 
మరో సంగతి ఏమిటంటే మకర జ్యోతి నాడు శ్రీ ధర్మ శాస్తా కు అలంకరించే "తిరువాభరణాలు"  సమీపంలోని పందళ రాజ భవనం నుండి ఇక్కడికి వచ్చిన తరువాతనే శబరిమలకు  బయలుదేరుతాయి. తూర్పున కేరళ శైలిలో నిర్మించిన ప్రవేశ ద్వారం ఉంటుంది. మిగిలిన మూడు దిక్కులలోనూ అలాంటివే కొంచెం చిన్న గోపురాలుంటాయి. వీటిని కలుపుతూ బలమైన రాతి ప్రహరి గోడ నిర్మించబడినది. విశాల ప్రాంగణంలో మండపం దాటిన తరువాత బలి పీఠము, ధ్వజస్థంభము ఉంటాయి. ప్రదక్షణ పధంలో భగవతి, గణేష, ధర్మశాస్త ఉప ఆలయాలుంటాయి. ప్రాంగణంలోని ఉత్తర భాగంలో శ్రీ కృష్ణ భగవానుని అగ్రజుడైన శ్రీ బలరాముని ఆలయం కొద్దిగా దిగువకు ఉండి చుట్టూ గోడలు కలిగి ప్రత్యేకంగా కనిపిస్తుంది. 
ఈ ఆలయానికి ఎదురుగా పంబా నదికి చేరుకోడానికి యాభై ఏడు మెట్ల దారి ఉంటుంది.
సంవత్సరానికి ఒకసారి స్వామివారి జల విహారం ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవాలలో శ్రీ పార్ధ సారధికి పవిత్ర స్నానం కూడా ఇక్కడే జరుగుతుంది.

 క్షేత్ర నామము విశిష్టత :

ఈ ఊరి పేరు వెనుక ఒక కదనం స్థానికంగా వినపడుతుంది. 
బ్రహ్మ దేవునికి సాక్షాత్కారం ప్రసాదించి శ్రీ వారు ఇక్కడ కొలువుతీరారని కదా మూల కధనం. 
కానీ అర్జనుడు నిర్మించడం వలన విగ్రహ ప్రతిష్టాపన కూడా ఆయనే చేసారని అంటుంటారు. 
కొందరి పరిశోధనల ఆధారంగా ఈ కధనం వ్యాప్తి లోనికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 
పార్ధుడు తాను ఆజన్మాంతం పూజించిన ద్వారకా పతి విగ్రహాన్ని పంబా నదికి ఆవలి తీరంలో ఉన్న "నిలక్కాల్ నారాయణ పురం" అన్న చోట ప్రతిష్టించారట. 
కొంత కాలానికి స్వామి ఆరన్మూల శ్రీ పార్ధ సారధితో  కలిసి పోవాలని నిర్ణయించుకొన్నారట. 
ఆయన ఒక బ్రాహ్మణ బాలుని రూపంలో నదీ తీరానికి వచ్చి అక్కడ పడవ నడిపేవారు ఏర్పాటు చేసిన ఆరు వెదురు ముక్కల తెప్పమీద ఆరన్మూల చేరుకోన్నారట. దివ్య తేజస్సుతో ఉన్న బాలుని అవతార పురుషునిగా భావించి స్థానిక ప్రజలు సకలోపచారాలు చేశారట.రాత్రికి అక్కడే బస చేసిన అతను ఉదయానికి కనిపించలేదుట.కానీ పల్లపు ప్రాంతంలో ఉండే ఆలయం రాత్రికి రాత్రి ఎత్తైన ప్రదేశంగా మారడం భగవంతుని మహిమగా గుర్తించిన స్థానికులు, జోతిష్యుల మార్గదర్శకత్వంతో నిలక్కాల్ నారాయణ పురంలో ఉన్న శ్రీ గోపాల కృష్ణ విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చారని చెబుతారు.స్వామి ప్రయాణించిన వెదురు ముక్కలే నేడు నది కిరుపక్కలా కనిపించే వెదురు పొదలు అని కూడా స్థానిక నమ్మకం. ఆరు ముక్కల వాహనం ( ఆరు+మూల) మీద ప్రయాణించిన దేవాది దేవుడు కొలువు తీరిన క్షేత్రంగా నాటి నుండి పేరుగాంచినది.
మరో కధనం ప్రకారం "ఆరిన్ విలంబు" అంటే నదీ తీరంలోని గ్రామం కనుక ఈ పేరువచ్చినది అంటారు.ఏది ఏమైనా సకల లోక పాలకుడైన శ్రీ మహా విష్ణువు కోరి కొలువైన క్షేత్రం ఆరన్మూల.









శ్రీ పార్ధ సారధి స్వామి ఆలయం ఎన్నో విశేషాల నిలయం .

ఆరన్మూల పడవ పందాలు :

కేరళలో ప్రతినెలా ఎక్కడోక్కడ ఉప్పుటేరులలో ( బ్యాక్ వాటర్స్ ), నదులలో పడవ పందాలు జరుగుతుంటాయి. 
దేశ విదేశీ పర్యాటకులకు అవి ఒక పెద్ద ఆకర్షణ. 
కాని ఆరన్మూలలో జరిగే పందాలు మాత్రం భగవంతుని సేవ కోసం ప్రారంభమైనవి. 
చాలా కాలం క్రిందట దగ్గరలోని గ్రామంలో ధనవంతుడైన నంబూద్రి ఒకరుండేవారు. 
శ్రీ మన్నారాయణ మూర్తిని అశేష భక్తి భావాలతో పూజించేవాడు. 
ప్రతి నిత్యం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టిగాని తాను తినే వాడు కాదు. 
లేక పొతే ఆ రోజుకి అభోజనంగా ఉండేవాడు. 
ఒక సారి ఓనం సమయంలో ఆయనకీ అతిధి లభించలేదు. 
కుటుంబం మొత్తం పండగ పూట అభోజనంగా ఉండిపోతారని భాధ పడుతూ పెరుమాళ్ ని ప్రార్ధించాడు. 
ఎవరో పంపినట్లుగా ఒక బ్రాహ్మణ బాలకుడు వచ్చాడు. 
దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న అతనిని సాక్షాత్ పార్ధ సారదే తమ ఇంటికి విచ్చేసారని అత్యంత భక్తి భావంతో అతిధి మర్యాదలు చేసారు. 
నాటి రాత్రి ఆయనకి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి ఉదయం వచ్చిన అతిధిని తానె అని తెలిపి ఓనం సమయంలో ఆరన్మూలలో సహా పంక్తి భోజనాలను ఏర్పాటు చేయమని తెలిపారు. 
అప్పటి నుండి ఓనం సద్ది ఆరంభమైనది. 
ప్రతి సంవత్సరం నంబూద్రి తన గ్రామం నుండి పడవలో సద్దికి కావలసిన సమస్త సంబరాలను తరలించెవాదు. 
ఒక సంవత్సరం దాపులలొని అడవులలో ఉండే దొంగల ముఠా ఎన్నో వేల మందికి సరి పోయే ఆ సరుకులను దొంగిలిస్తే తమకు ఆహార సమస్యలు ఉండవని భావించి అందుకు ప్రణాళిక సిద్దం చేసారు. 
ఈ విషయం తెలుసుకొన్న గ్రామాల ప్రజలు ఆహార పదార్ధాలను తెస్తున్న పడవకు కాపలాగా గ్రామానికి ఒక తెప్ప చొప్పున పంపించారు. 
కొంత కాలానికి అది ఒక ఆచారంగా మారి చివరికి చెగనచెర్రి రాజు  నౌకా దళం లో ఉండే సర్ప ఆకారంలో ఉండే ఆకారంలోనికి రూపుదిద్దుకొన్నాయి. 
"పళ్ళి ఓడం" గా పిలవబడే ఈ పడవలు పంబా నదీ తీర గ్రామాల నుండి పాల్గొంటాయి. 
సుమారుగా నలభై నుండి యాభై పడవలు, వాటిని నడపటానికి, నడిపే వారిని ప్రోత్సహించడానికి వివిధ వాయిద్య కారులు,గాయకులు అంతా పడవలో ఎక్కుతారు.  తమ గ్రామ తరుపున పాల్గొంటున్న వారిని తీరంలో ఉండి ఉత్సాహ పరచడానికి గ్రామస్తులంతా తరలి వస్తారు. 
ఓనం సంబరాలలో ఘనంగా ఈ పడవల పోటి నిర్వహించి అరవై ఎనిమిది పదార్ధాలతో అక్కడికి వచ్చిన అందరికి సద్ది చేస్తారు. 
యాభై వేలమంది దాకా భక్తులు ఈ సద్దిలొ పాల్గొంటున్నారని లెక్కలు తెలుపుతున్నాయి.







ఆరన్మూల కొట్టారం :


శబరిమలలో కొలువైన శ్రీ ధర్మ శాస్తకు మకర సంక్రాంతి నాడు అలంకరించే "తిరువాభరణాలు" కొద్దిసేపు ఆరన్మూల లో ఆగుతాయి. ఆ సమయంలో పవిత్ర ఆభరణాలకు పూజలు చేయడానికి రెండు వందల సంవత్సరాల క్రిందట కేరళ వాస్తు, నిర్మాణ విధానాలను పాటిస్తూ నిర్మించబడిన "ఆరన్మూల కొట్టారం" శ్రీ పార్ధ సారధి స్వామి కోవెలకు ఎదురుగా ఉంటుంది.

ఖాండవ దహనం :

ఆరన్మూల ఆలయంలో జరిగే మరో ముఖ్య ఉత్సవం " ఖాండవ దహనం". 
అగ్నిదెవునకు పట్టుకొన్న అజీర్తి వ్యాధినివారణ నిమిత్తం కృష్ణార్జనులు అతనికి ఇంద్రుని నుండి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖాండవ అనే అడవిని దహించడానికి తగిన అభయం ఇచ్చి,రక్షణగా నిలిచినది ఇక్కడే అనే నమ్మకంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. 
ఎండు కొమ్మలు, ఆకులను అడవి మాదిరి అమర్ఛి మేళ తాళాల మధ్య వాటికి నిప్పు పెడతారు. 

ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు :

డిసెంబర్ నెలలో పది రోజుల పాటు జరిగే ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు మరో విశేష పండుగ వాతావరణాన్ని ఆరన్మూలలో నెలకొల్పుతాయి. ఆరంభం రోజున ఆలయ గజ రాజులు చూడ చక్కగా అలంకరించబడతాయి. ఆరన్మూలకు కొద్ది దూరంలో ఉన్న "ఇదయ ఆరన్మూల" ( మధ్య ఆరన్మూల. ఇక్కడికే  ఆరు వెదురు బొంగుల తెప్ప మీద శ్రీకృష్ణ భగవానుడు చేరుకొన్నది అని భావిస్తారు)  
అన్ని ఏనుగులు ఇక్కడికి చేరుకొన్న తరువాత వివిధ వాయుద్యాలను లయబద్దంగా మోగిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొంటారు. స్వామి వారిని సాంప్రదాయ విధానంలో ఆహ్వానించి ఆలయ పతాకాన్ని ఎగర వేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 
ఆఖరి రోజున పవిత్ర పంబా నదిలో జరిగే "ఆరట్టు "( పవిత్ర స్నానం)తో ఉత్సవాలు ముగుస్తాయి. 
కేరళ ఆలయాలతో విడదీయలేని అనుబంధం గజ రాజులది. ఆరన్మూల ఆలయానికి కూడా ఎన్నో ఏనుగులు ఉన్నాయి. 

నిత్య పూజలు :

ఉదయం నాలుగు గంటల నుండి మధ్యహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా ఆరు పూజలు, వివిధ ఆర్జిత సేవలు జరుగుతాయి. 
వైకుంఠ ఏకాదశి, జన్మాష్టమి, కార్తీక, ధనుర్మాస పూజలు, మండల, మకర విలక్కు రోజులు, ఘనంగా నిర్వహించబడతాయి. 
స్థానిక ముఖ్య పర్వ దినాలైన "విషు మరియు ఓనం" సమయంలో, కేరళ రామాయణ మాసం (ఆగస్టు ) వేలాది భక్తులు శ్రీ పార్ధ సారధి స్వామిని దర్శించుకొంటారు. 

లోహ దర్పణం - శుభ ప్రదం ( ఆరన్మూల కన్నాడి ) :





 ఆరన్మూలకు మరో ప్రత్యేకత ఉన్నది.
అదే "ఆరన్మూల కన్నాడి".ఆరన్మూల ఆలయ నగల మర్మత్తు నిమిత్తం వచ్చిన తమిళ స్వర్ణ కారులు అనేక ఆభరణాలు స్వామి వారి కోసం తయారు చేసారు.వారి నేర్పరితనానికి, వృత్తి పట్ల వారికి ఉన్న నిబద్దతకు నిదర్శనం అన్నట్లు ఒక నాటి రాత్రి వారి నాయకునకు దేవి స్వప్న దర్శనమిచ్చి అరుదైన విద్య అయిన ఈ అద్దం తయారీ విధానాన్ని తెలిపినట్లుగా చెబుతారు.
అందుకే కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఈ అద్దాన్ని తయారు చేస్తారు.






రాగి, ఇత్తడి, తగరం, వెండి లాంటి లోహాలను ప్రత్యేక నిష్పత్తిలో కలిపి, ఆ మిశ్రమాన్ని ఒక పద్దతిలో రుద్డటంతో అది దర్పణం మాదిరి మారుతుంది.
ఎంతో నైపుణ్యం మరియు శ్రమతో కూడిన విధానంలో తయారయ్యే ఈ అద్దాన్ని మలయాళీలు శుభ ప్రదమైనదిగా భావిస్తారు.ప్రతి ఇంట్లోనూ ఉంటుంది.అత్తారింటికి వెళ్ళే నవ వధువుకు ఇచ్చే సారేలో ఇది తప్పని సరిగా ఉంటుంది.రకరకాల రూపాలలో లభిస్తుంది ఆరన్మూల కన్నాడి.
బ్రిటిష్ మ్యుజియం లో యాభై అడుగుల ఆరన్మూల లోహ దర్పణం ఉన్నదని తెలుస్తోంది.

దివ్య దేశం :

శ్రీ నమ్మాళ్వార్ గానం చేసిన పది పాశురాల కారణంగా ఆరన్మూల ఆలయం శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా కీర్తించబడుతున్నది. 

ఇన్ని ప్రత్యేకతల ఆరన్మూల గలగలా పారే నది ఒడ్డున  పచ్చని పరిసరాలతో ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. 

జై శ్రీ మన్నారాయణ !!!!











00000000000000000000000000000000-

-
'







////////////

\
*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...