తామరకులంగర శ్రీ ధర్మ శాస్త ఆలయం , త్రిపునిత్తూర
శ్రీ ధర్మశాస్త అనగానే అందరి మనస్సులలో యోగముద్ర లో కొలువు తీరిన స్వామే మెదులుతారు.
కానీ శ్రీ ధర్మశాస్త నూటికి పైగా వివిధ భంగిమలలో కేరళ లోని అనేక ఆలయాలలో దర్శనమిస్తారు అని కొంత నిశితంగా పరిశీలిస్తే అవగతం అవుతుంది.
ప్రతి ఒక్క అయ్యప్ప దీక్షాదారి సందర్శించేది ఎరుమేలి.
ఎరుమేలి శ్రీ ధర్మశాస్త స్థానక భంగిమలో ధనుర్భానాలను చేత బట్టుకొని ఉంటారు.
అలా స్వామి మరొక ప్రత్యేకమైన భంగిమలో కనపడే కోవెల "తామరకులంగర "లో కలదు.
కొచ్చిన్ రాజుల ఒకప్పటి రాజధాని.
వారి కుల దేవత "శ్రీ పూర్ణత్రేయేశ స్వామి ".
ఈ ఆలయానికి సమీపంలో ఉంటుందీ "తామర కులంగర శ్రీ ధర్మ శాస్త ఆలయం ".
భగవంతుడు తన నిజ భక్తుని సేవలకు సంతుష్టుడై వెన్నంటే ఉంటాడని అని ఈ క్షేత్ర గాధ తెలుపుతుంది.
చాలా సంవత్సరాల క్రిందట మలప్పురం జిల్లా లోని "చామర వట్టం "అనే ఊరిలోని ఆలయ నంబూద్రి జీవనోపాది కొరకు స్వగ్రామాన్ని వదిలి బయలుదేరారట.
సమస్త పూజా విధానాలలో మేటి అయిన నంబూద్రి శ్రీ ధర్మశాస్త పట్ల అచంచల భక్తి భావాలు కలిగి
ఉండేవాడు.
ఆయన తరలి వెళ్ళిపోవడం నచ్చని శ్రీ ధర్మశాస్త బల్లి రూపంలో గొడుగు మీద కూర్చొని ఇక్కడికి చేరుకోన్నారట.
ఆ విషయాన్ని స్వప్న సందేశం ద్వారా తెలుసుకొన్న నంబూద్రి స్వామి ఆదేశం మేరకు ఒక ఆలయాన్ని నిర్మించారు.
స్థానిక రాజుల ఆదరణతో ఆలయం అభివృద్ధి లోనికి వచ్చినదని తెలుస్తోంది.
సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం అత్యంత ప్రశాంత వాతావరణం కలిగి వుంటుంది.
చక్కని చెక్క పనితనం అబ్బురపరుస్తుంది.
స్వామి భిన్నమైన భంగిమలో కూర్చొని కుడి చేతిలో అమృత భాండం ధరించి ఉండటం వలన ఈయనను "శ్రీ ధన్వంతరీ ధర్మశాస్త "అని పిలుస్తారు.
నియమంగా స్వామి సందర్శించి ప్రాంగణంలో ఉన్న వట వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఎంతటి అనారోగ్యం అయినా నయం అవుతుందని భక్తుల నమ్మకం.
అంటే కాదు స్వామి సిరిసంపదలు ప్రసాదించేవానిగా ప్రసిద్ది.
ఉప ఆలయాలలో శ్రీ గణపతి, శ్రీ భద్రకాళి, శ్రీ నాగరాజ, బ్రహ్మ రాక్షస కొలువై వుంటారు.
ప్రతి నిత్యం ఎన్నో పూజలు జరుగుతాయి.
ఓనం, విషు లతో పాటో గణేశ చతుర్ధి, నవరాత్రి, శివ రాత్రి, ఇతర హిందూ పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
శబరిమలలో మాదిరి ఇక్కడ కూడా మండల మరియు మకర జ్యోతి పూజలను జరుపుతారు.
ఇవే కాకుండా అనేక ఇతర స్థానిక సంప్రదాయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
త్రిపునిత్తూర కు కొచ్చిన్ సౌత్ లేదా నార్త్ రైల్వే స్టేషన్ ల నుండి బస్సులు లభిస్తాయి.
ప్రముఖ భగవతి అమ్మన్ కోవెల ఉన్న చోటానిక్కర ఇక్కడకు దగ్గరే !
సమీపంలోని కొచ్చిన్ రాజ వంశీకుల పూర్వ నివాసమైన "హిల్ ప్యాలస్ " ఒక ప్రత్యేక ఆకర్షణ.
స్వామి యే శరణం !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి