శ్రీ పూర్ణత్రేయేశ ఆలయం, త్రిపునిత్తూర
సహజంగా ఆలయం అంటేనే ఎన్నో ఆచార వ్యహరాలతో మరెన్నోనిత్య పూజలతో ఘనంగా జరిగే ఉత్సవాలతో భక్తుల సందడితో కోలాహలంగా ఉంటాయి.
మరి మహారాజుల కులదైవం ఆలయం అంటే ఇంకెన్ని ఉండాలి ?
ఈ ఊహకు తగినట్లుగా ఉండేదే " శ్రీ పూర్ణత్రేయేశ స్వామి" కొలువుతీరిన ఆలయం.
సుమారు ఆరు వందల సంవత్సరాలు అంటే పదో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు కేరళలోని అత్యధిక భూభాగాన్ని పాలించిన వారు కొచ్చిన్ రాజ వంశీకులు."పెరుం పాడు స్వరూపం " అని స్థానికంగా పిలిచే ఈ వంశీకుల చివరి రాజధాని పురాణ కాలంలో "పూర్ణ వేద పురి" గా పిలవబడిన నేటి "త్రిపునిత్తూర ".
శ్రీ పూర్ణ త్రేయేశ స్వామి వీరి కులదైవం.
కేరళ రాష్ట్రంలోని అనేక ఆలయాలు పంచపాండవులు వారి ఆరాధ్య దైవం అయిన శ్రీ కృష్ణునితో ముడిపడి ఉన్నాయి.
ఈ ఆలయ పురాణ గాధ కూడా ద్వాపర యుగం నాటిదే !
వాసుదేవుని దర్శనార్ధం ద్వారకా నగరానికి చేరిన పాండవ మధ్యమునికి నగర శివార్లలో ఒక విప్రుడు శ్రీ కృష్ణుని నిందిస్తూ కనపడ్డాడట.
రధం నుండి దిగి నల్లనయ్యను నిందిస్తానికి కారణం అడిగారట అర్జనుడు.
దానికా బ్రాహ్మణుడు తన దీన గాధ తెలిపాడట.
అతని భార్య ప్రసవించిన ప్రతిసారీ పుట్టిన బిడ్డ పుట్టినట్లే మాయమవుతోందట. ఇలా చాలాసార్లు జరిగిందట. నందనందనుని రాజ్యంలో ఉన్నాతప్పని ఈ దురవస్థకు తప్పని తెలిసినా ఆయనను ఆడిపోసుకోవడం తప్ప మరేమీ చేయలేని అసహాయ పరిస్థితులలో ఉన్నానని తెలిపాడట.
దానికి పార్ధుడు అప్పుడే ప్రసవవేదన పడుతున్న విప్రుని భార్యకి తగిన రక్షణ ఇస్తానని పలికి ఆమె చుట్టూ శరాలతో దుర్భేద్యమైన రక్షణ వలయాన్ని నిర్మించారట.
ఆశ్చర్యం పుట్టిన పాపడు మాయం.
తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన విజయుడు నేరుగా గోపాలుని వద్దకు వెళ్లి విషయం అంతా తెలిపాడట.
అతనిని ఓదార్చి తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్లారట.
పాలకడలిలో శేషతల్పం పైన తీరికగా కూర్చొని పసి బాలులతో ఆడుకొంటున్న శ్రీ మన్నారాయణుడు వీరిని సాదరంగా ఆహ్వానించారట.
బ్రాహ్మణుని బిడ్డల అదృశ్యం గురించి అడుగగా, తానే వీరిరువురునీ ఇక్కడకు రప్పించి రాబోయే కలికాలంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ప్రజలు పాటించవలసిన జీవన విధానం గురించి తెలపాలని ఇలా చేసానని చెప్పి, కలియుగంలో ప్రజలకు దైవారాధన అన్నిటి నుండి విముక్తి లభిస్తుంది అని, వారొచ్చినప్పుడు తానూ కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఇచ్చి తగిన స్థలంలో ప్రతిష్టించమని ఉపదేశించారట.
స్వామి వారి రూపంతో పాటు విప్రుని బిడ్డలను తీసుకొని వచ్చిన నర నారాయణులు పాపాలను బ్రాహ్మణునికి అప్పగించారట. అతని వంశం వారే ఈ ఆలయంలో పూజారులుగా వ్యవ్హరిస్తున్నారట.
విగ్రహ ప్రతిష్టకు తగిన స్థలాన్వేషణకు వినాయకుని సహాయం కోరి ఆయనతో కలిసి బయలు దేరారట అర్జనుడు.
తిరిగి తిరిగి వేద విద్యకు కేంద్రమైన ఈ క్షేత్రం అనువైనదిగా భావించి, కార్యక్రమానికి శుచి కోసం విజయుడు నదికి వెళ్ళగా పరిసరాలు అమితంగా ఆకర్షించడంతో పార్వతీ నందనుడు తానే అక్కడ స్థిరపడాలన్న కోరికతో శిలా రూపంగా మారిపోయారట.
తిరిగి వచ్చిన అర్జనుడు ఇది చూసి ఆగ్రహించి కాలితో గానేషుని దక్షిణం వైపుకు నెట్టి స్వామిని ప్రతిష్టించారట.
సమస్త కోరికలను పరిపూర్ణంగా నెరవేర్చే వానిగా, పూర్ణ వేద పురిలో కొలువు తీరినందున శ్రీ పూర్ణత్రేయేశ స్వామిగా పిలవబడుతున్నా పసివారిని కాపాడే వాడు కనుక " శ్రీ సంతాన గోపాల స్వామి"గా పేరొందారు.
ఈ గాధ మొత్తం బొమ్మల రూపంలో ఆలయ మండప పైభాగాన ఉంచారు.
ప్రతిష్టానంతరం అర్జనుని ఆదేశం మేరకు దేవ శిల్పి విశ్వకర్మ ఆలయం నిర్మించారు.
కలియుగారంభం నుండి అనేక మంది పాలకులు ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసారు.
కొచ్చిన్ రాజ వంశీకులు స్వామిని తమ కులదైవంగా ఆరాదించారు.
ఆలయానికి ఎదురుగా రెండు అంతస్తుల "మణి మల్క" త్రిపునిత్తూర ఆకర్షణలలో ఒకటి.
1870లో ఇంగ్లండు కు చెందిన "జే కుక్ " అనే గడియారాల కంపెనీ తయారు చేసిన ఈ గడియారం నాటి నుండి నేటి వరకు స్థానికులకు కాలాన్ని చూపిస్తోంది. అసలు మణి మల్క అంటే గడియార స్థంభం అని అర్ధం.
రెండో అంతస్తులోని గడియారం గంట కొట్టినప్పుడల్లా మొదటి అంతస్తు కిటికీ లోని సైనికుని బొమ్మ సెల్యూట్ చేయడం ఇందులోని ప్రత్యేకత.
1920 లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో ఆలయం పూర్తిగా కాలిపోయింది.
మూల విరాట్టును సమీపంలోని రాజ భవన్ ( హిల్ వ్యూ ప్యాలస్ )కు తరలించి, ఆ రోజులలో ప్రసిద్ది చెందినా నిర్మాణ శిల్పి అయిన " ఎచ్చేర్ వారియర్ " చేత పాత నిర్మాణానికి సరిపోయేలా కొత్త ఆలయాన్ని నిర్మించారు.
తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం రాతి స్తంభాల మీద చెక్కతో నిర్మించబడినది.
ఎన్నో దేవతా శిల్పాలను స్తంభాల మీద సుందరంగా మలచారు.
గౌర భాగం మీద చెక్క మీద సునిశిత సూక్ష్మ చెక్కడాల సోయగం అద్భుతంగా ఉంటుంది.
ఆలయంలో మరో ఆకర్షణ పడమర గోపురం.
పురాతన నిర్మాణాలన్నీ అగ్ని ప్రమాదంలో కాలి పోయినా ఈ పడమర ద్వారం ఏ మాత్రం దెబ్బ తినకుండా నిలిచిందట.
పరిశోధకులు దేని వయస్సు అయిదు వేల సంవత్సరాలుగా నిర్ణయించారని అంటారు.
చక్కని చెక్కడాలు నేటికీ చెక్కు చెదరక సుందరంగా ఉండటం విశేషం.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని లోపలి వెళితే నమస్కార మండపంతో కలిసి వర్తులాకార శ్రీ కోవెల రధం ఆకారంలో ఉంటుంది.
శ్రీ కోవెల వెలుపలి గోడల పైన నిలువెత్తు శ్రీ గణేశ, శ్రీ ధర్మ శాస్త, శ్రీ ఆంజనేయ తో పాటు వివిధ శ్రీ అవతారాలు, సీతా అగ్ని ప్రవేశం, గంగావతరణం, మహిషాసుర మర్దనం లాంటి శిల్పాలను అద్భుతంగా జీవం ఉట్టిపడేలా మలచారు.
శ్రీ పూర్ణత్రేయేశ స్వామి అరుదైన భంగిమలో సువర్ణ పుష్ప ఆభరణాలతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.
పక్కనే ఉన్న చిన్న ద్వారం గుండా శ్రీ వినాయకుణ్ణి దర్శించుకొనవచ్చును.
మూలవిరాట్టు ముందు ఉన్న "వల్లియ విలక్కు " దీపాన్ని అర్జనుడు ప్రతిష్టా సమయంలో వెలిగించారట.
మూల విరాట్టు వెనక ఉన్న "కేదియ విలక్కు" దీపాన్ని కూడా ఆయనే వెలిగించారట. దీన్ని మాత్రం సన్నని రంధ్రం గుండా మాత్రమే చూడగలం.
ఈ దీప దర్శనం సకల పాప నాశనంగా చెబుతారు.
రాజుల కులదైవం కావడాన సంవత్సరం పొడుగునా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి.
కేరళీయుల ప్రధాన పర్వమైన "ఓనం " ఆరంభ ఉత్సవాలైన "ఆతచమయం" సంబరాలు ఇక్కడే ప్రారంభమై సమీపం లోని వామన మూర్తి ఆలయం ఉన్న "త్రికక్కర" దాక సాగుతాయి.
గజ సేవ ప్రతి నిత్యం ఉదయం తప్పని సరిగా జరిగేది. ఆలయం ఉదయం మూడు గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరిచి ఉంటుంది.
త్రిపునిత్తూర చుట్టుపక్కల ఎన్నో ఆలయాలున్నాయి. అన్ని దర్శించతగినవే !
తిరుక్కోవెల( శివాలయం), పిషారీ కోవెల ( లక్ష్మీ దేవి ఆలయం), తామర కులంగర శ్రీ ధర్మ శాస్త ఆలయం ముఖ్యమైనవి.
ఇక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిల్ వ్యూ ప్యాలస్ కూడా తప్పక చూడ వలసినదే !
ఎన్నో రకాల వృక్ష జాతులకు నిలయం ఈ మహల్.
ఇక్కడి ఆభరణాల విభాగంలో అప్పటి కొచ్చిన్ రాజుకు పోర్చుగ్రీసు నావికుడు " వాస్కోడగామా " బహుకరించిన సుమారు రెండు కిలోల బంగారు కిరీటం అద్భుతంగా ఉంటుంది.
త్రిపినిత్తూర కొచ్చిన్ నగరానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఎర్నాకుళం సౌత్ లేదా నార్త్ స్టేషన్ ల నుండి సులభంగా చేరుకొనవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి