4, అక్టోబర్ 2014, శనివారం

Narasimha konda, Nellore

     శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం , నరసింహకొండ





మన రాష్ట్ర దక్షిణ భాగాన పెన్నా నది తీరంలో ఉన్న నెల్లూరు జిల్లా సుందర సముద్రతీర ప్రాంతం తోనూ, పచ్చని పొలాలు, తోటలతో పాటు ఎన్నో పౌరాణిక, చారిత్రిక విశేష ఆలయాలకు పేరొందినది. 
అలాంటి వాటిల్లో నగరానికి చేరువలోని నరసింహ కొండ మీద ఉన్న శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి దేవస్థానం ఒకటి.  
ఈ క్షేత్ర మహత్యం గురించి స్కాంద పురాణంలో సవివరంగా పేర్కొనబడినది. 
ఈ కల్పంలోని తోలి యుగంలో కశ్యప మహర్షి మిగిలిన ఋషులతో కలిసి ఈ పర్వతం పైన లోక సంరక్షణార్ధం ఒక యాగాన్ని నిర్వహించారట. 
ఆ హోమగుండం నుండి ఉద్భవించిన జ్యోతి శిఖర భాగం లో ఉన్న గుహలోనికి వెళ్లి అక్కడ ఉగ్ర  నారసింహునిగా దర్శనమిచ్చినదట. 
సప్త ఋషులు స్వామిని కీర్తించి శాంతింప చేయడానికి అక్కడే ప్రసన్నరూపంలో శ్రీ లక్ష్మి సమేత నారసింహ స్వామిని ప్రతిష్టించారు.  
ఆ నాటి రాతి గుహే నేటికీ గర్భాలయంగా ఉన్నది. 
లోపల స్వయంభూ మూర్తిని ప్రతిష్టిత ప్రసన్న మూర్తిని సందర్శించుకోనవచ్చును. 











ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్దానంతరం అదుపుతప్పిన ఆగ్రహంతో మరణం అంచున ఉన్న రారాజుకి ఇచ్చిన ఆఖరి మాట నిలబెట్టుకోడానికి అశ్వద్దామ పొరపాటున ఉప పాండవులను హతమార్చాడు. 
బాల హత్యా దోషం పోగొట్టుకోడానికి ఈ క్షేత్రంలో సుదీర్ఘ కాలం తమమాచారించాడట. 
అశ్వద్దామ గుహలను, కశ్యప మహర్షి యాగం కొరకు నిర్మించిన గుండాలను ఆలయానికి ముందు వచ్చే లోయలో ఉంటాయి. 









చాళుక్యులను ఓడించిన పల్లవ రాజు తమ కులదైవమైన శ్రీ కామాక్షి అమ్మవారికి ఒక ఆలయం పెన్నా నదీ తీరంలో నిర్మించాదలచారు. 
అప్పుడు స్థానిక పెద్దలు కొండ మీద ఉన్న శ్రీ స్వామి వారి గురించి తెలుపగా దర్శించుకొని కొన్ని నిర్మాణాలను నిర్మించారట. 
నాడు ఆయన నిర్మించిన అమ్మవారి ఆలయమే సమీపంలోని జొన్నవాడ శ్రీ కామాక్షీ తాయి ఆలయం. 
తదనంతర కాలంలో స్థానిక పాలకులు, విజయనగర రాజులు ఎన్నో నిర్మాణాలను చేపట్టారు. 
ఏడు అంతస్తుల రాజ గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఆస్థాన మడపం తరువాత ధ్వజస్తంభం, గరుదాల్వర్ సన్నిధి వస్తాయి. 
మెట్ల మార్గంలో ప్రధానాలయం'చేరుకొంటే లోపల శ్రీ అనంత పద్మనాభ స్వామి, కాలియ మర్దన శ్రీ కృష్ణ, విష్వక్సేన, ఆళ్వారుల, శ్రీ రామానుజ ప్రతిష్టిత మూర్తులుంటాయి. 
శ్రీ గోదా దేవికి ప్రత్యేక సన్నిధి కూడా ఉన్నది. 











పర్వత గోడలపైన ఆంజనేయ, గరుడ, శ్రీ మహాలక్ష్మి, దీపకన్య, శ్రీ రుక్మిణి సత్య భామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి రూపాలను పెద్దవిగానే కాకుండా సుందరంగా మలచారు. 








శ్రీ ఆది లక్ష్మి అమ్మవారి సన్నిధి పర్వత అగ్ర భాగాన ఉంటుంది. ఇక్కడి "కొండి కాసుల హుండీ" లో కానుకలు సమర్పించుకొని ప్రార్ధిస్తే మనోభిష్టాలు  నెరవేరతాయని స్థానిక నమ్మకం.












సంతాన వృక్షానికి ఊయల కడితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
ఇక్కడ ఉండే సొరంగ మార్గం ద్వార మహర్షులు రాత్రి పూట స్వామి వారిని సేవించుకోడానికి వస్తారని అంటారు.
ప్రస్తుతం ఆ సొరంగ మార్గం మూసుకొని పోయింది.



















శిఖర భాగం నుండి చల్లని స్వచమైన గాలిని పీలుస్తూ పరిసరాలను వీక్షించడం ఒక అద్భుత అనుభవం. 









శ్రీ వేదగిరి వరదునికి ప్రతి నిత్యం సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ దాక ఎన్నో కైంకర్యాలు జరుపుతారు.
శని వారాలు, స్వాతి నక్షత్రం రోజున, ఏకా దశినాడు భక్తులు వేలాదిగా వస్తారు.
ప్రతి నెల ఒక ప్రత్యేక ఉత్సవం, ధనుర్మాస పూజలు, నారసింహ జయంతి, అన్ని హిందూ పర్వదినాలలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందీ పుణ్య క్షేత్రానికి.
వైశాఖ మాసంలో అయిదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవములు ఘనంగా నిర్వహిస్తారు.
నెల్లూరు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహ కొండ ( వేదగిరి)కి రోడ్ మార్గంలో సులభంగా చేరుకోన వచ్చును.
నమో నారసింహ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...