శ్రీ గాంధారీ అమ్మన్ కోవెల, తిరువనంతపురం
పేరు వినగానే ఇదేదో మహా భారతం తో ముడిపడి ఉన్న ఆలయం అనుకొంటే తొందరపడినట్లే !
కేరళ రాజధాని తిరువనంతపురంలో స్థిరపడిన తమిళులు కొందరు సుమారు అర్ధ శతాబ్దం క్రిందట నెలకొల్పిన ఆలయమిది.
పూర్తిగా తమిళ నాడు ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండే ఇందులో ఎందరో దేవి దేవతలు కొలువుతీరి ఉంటారు.
కానీ ప్రధాన అర్చనామూర్తి శ్రీ పార్వతీ దేవి.
ఉత్తర ముఖంగా ఉండే నిర్మాణానికి తూర్పు మరియు పడమరాలలో ప్రవేశ ద్వారాలుంటాయి.
లోపల శ్రీ గణపతి, శ్రీ ఆంజనేయ, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ కృష్ణ, నవగ్రహాలు, శ్రీ వీరభద్ర స్వామి నాగరాజ, మంత్ర మూర్తి కొలువు తీరి కనపడతారు.
మండప స్థంభాలకు దశావతార మూర్తులను చెక్కారు.
మూలవిరాట్టు శ్రీ గాంధారి అమ్మన్ ఉత్తరాభిముఖురాలై భక్తులకు దర్శనమిస్తారు.
ఎలాంటి బాలి పీఠాలు, ధ్వజస్థంభము కానరావు.
ఆలయ పైభాగాన, విమాన గోపురం పైన దేవీ భాగవత దృశ్యాలను సుందరంగా మలచారు. అన్ని పక్కలా అష్టా దశ రూపాలను, అనేక గ్రామ దేవతల రూపాలను కూడా నిలిపారు.
భక్తులు ముఖ్యంగా పెళ్లి కానివారు, సంతానం లేనివారు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు.
ప్రతి పౌర్ణమికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి.
చైత్ర పౌర్ణమి నాడు ఆలయ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు అన్నప్రసాదాలను ఆలయ కమిటి అధ్వర్యంలో ఏర్పాటు చేసారు.
తిరువనంతపురం రైల్వే స్టేషన్ కు సమీపం లోని గాంధారీ అమ్మన్ కోవిల్ వీధిలో ఉండే ఈ ఆలయం ఉదయం అయిదు నుండి పదకొండు వరకు, తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి