9, జూన్ 2018, శనివారం

Techhikottukavu Ramachandran

          నిజమైన గజరాజు తెచ్చికొట్టుకావు రామచంద్రన్ 



రాష్ట్రమంతటా లక్షల అభిమానులు. ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతాలు. అపూర్వ ఆదరణ. తమ ఊరికి విచ్చేస్తున్నాడంటే కిలోమీటర్ల దూరం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. పేస్ బుక్ లో ఫోటో కనపడితే చాలు వేలాదిగా లైకులు. అయినా ఎవరూ దగ్గరకు రారు. వచ్చినా ఒక రకమైన భయం తొంగి చూస్తుంది చూపరుల వదనాలలో. ఎంత ఠీవిగా, రాజసంతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు హత్యా నేరాలను ఎదుర్కోవడమే దానికి కారణం.
 ఈ ఉపోద్ఘాతం అంతా కరుడు కట్టిన రౌడీ గురించో, విధ్వంసం సృష్టించే తీవ్ర వాది గురించో కాదు. తనకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకోలేని ఒక మూగ జీవి గురించి. అర్ధం కాని  బాష తో ఇబ్బందులు పడుతున్న వేళ అనుకోకుండా సంక్రమించిన  అంగవైకల్యం మరికొన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఎంతటి పేరుప్రఖ్యాతులు ఉంటే మాత్రం ఏమి గౌరవం.?చుట్టూ మూగిన వారి చూపులలో కుతూహలంతో పాటు ఒక విధమైన బెదురూ కనపడుతుంటే ! ఇలాంటి ఒక చిత్రమైన పరిస్థితులలో ఉన్న తెచ్చికొట్టుక్కావు రామచంద్రన్ అనే దేవస్థానపు గజ రాజు గురించే ఈ వివరణ అంతా.  
త్రిసూర్ దగ్గరలోని పేరమంగళం గ్రామం సమీపం లోని తెచ్చికొట్టుకావు శ్రీ భగవతీ అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి. ఆ దేవస్థానం యొక్క గజరాజే  రామచంద్రన్ !
కేరళ ప్రజలకు ఏనుగులతో శతాబ్దాలుగా ఒక అవినాభావ సంబంధం ఏర్పడినది. ఏనుగు వారి సంస్కృతి సంబరాలలో ఒక భాగం. ఏనుగు లేని ఆలయ ఉత్సవాన్ని వారు ఆదరించరు. అందుకే ప్రముఖ ఆలయాలలో ఏనుగు తప్పని సరిగా ఉంటుంది. అదే విధంగా ఎందరో పెంపకందారులు ఏనుగులను ఆలయాల వారికి అద్దెకు ఇస్తుంటారు. ఒక్క ఏనుగుకు ఉన్న పేరుప్రతిష్టలు, ఆకార విశేషాలను ఆధారంగా చేసుకొని రోజు అద్దె ఉంటుంది. అది లక్ష నుండి రెండున్నర లక్షల దాకా ఉంటుంది అని అంటారు. కేరళ రాష్ట్రంలో సుమారు మూడు వందల పైచిలుకు ఏనుగులు పెంపకందారుల వద్ద ఉన్నాయి అంటే ఎంత డిమాండ్ ఉన్నదో ఊహించవచ్చును. రాష్ట్రంలోని ఆలయాలలో రెండువందల దాక ఏనుగులుంటాయి. వాటిల్లో అగ్రస్థానం గురువాయూరు దేవస్థానానిదే ! ఆ దేవస్థానానికి అరవై ఏనుగులున్నాయి. అవన్నీ కూడా భక్తులు తమ ఆరాధ్య దైవం శ్రీ గురువాయూరప్పన్ కి కానుకగా సమర్పించుకొన్నవే కావడం విశేషం ! వీటిని ప్రత్యేకంగా పునత్తూరు కోట అనే పది ఎకరాల స్థలంలో ఉంచుతారు. వీటిల్లో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత, ప్రముఖ నటుడు సురేష్ గోపి మరెందరో ప్రముఖ రాజకీయ నాయకులు ఇచ్చిన ఏనుగులు కూడా ఉన్నాయి. 
   




దేవదాసు (ఆలయ రెండో ఏనుగు)








మలయాళీలకు గజాల పట్ల గల అభిమానం ఇంతని చెప్పడానికి లేదు. ఏనుగులంటే అవ్యాజమైన అవధులులేని ఎల్లలు లేని ప్రేమ వారికి. ఇక మన కధానాయకుడు రామచంద్రన్ విషయానికి వద్దాము. కేరళలో అత్యధిక ప్రజాదరణ కలిగిన రెండో గజరాజుగా ప్రసిద్ధికెక్కిన రామచంద్రన్  1964లో బీహారులో జన్మించాడు. యజమాని పెట్టిన పేరు "మోతీ ప్రసాద్". 1982వ సంవత్సరంలో కేరళకు చెందిన వేంకటాద్రి అనే ఆయన మోతీ ప్రసాదును కొని తీసుకొని వచ్చాడు. ఆయన తన ఇష్టదైవమైన వినాయకుని మీద భక్తితో  " గణేష్" అని కొత్త పేరు పెట్టాడు. కొత్త ప్రాంతం, కొత్త పేరు, అర్ధం కాని భాష. ఇవన్నీ మోతీ ప్రసాద్ ను అయోమయానికి గురి చేసాయి. అతను లొంగక పోవడంతో వెంకటాద్రి అమ్మకానికి పెట్టాడు. ఆలయ ఏనుగుకు ఉండవలసిన లక్షణాలు ( ఎత్తు, వెడల్పాటి నుదురు, చక్కని నడక, నేలను తాకే తొండము, పొడవాటి కుచ్చు గల తోక, కోసుగా పెరిగిన దంతాలు) సంపూర్ణంగా కలిగి ఉండటంతో తెచ్చికొట్టుకావు శ్రీ భగవతీ అమ్మవారి దేవస్థానం వారు ఖరీదు చేశారు.
ఇది మోతీ ప్రసాద్ జీవితాన్ని అనేక మలుపులు తిప్పింది.  దేవస్థానం వారు "రామచంద్రన్" అని కొత్త పేరు పెట్టారు. పద్దెనిమిది సంవత్సరాలుగా పిలుస్తున్న పేరుతొ కాకుండా రకరకాల పేర్లతో పిలవడం ఇబ్బంది పెట్టసాగింది. అంతే కాకుండా హిందీ మరియు భోజపురి తప్ప మరో భాష అర్ధం కాని మోతీ ప్రసాదు కు మలయాళము మరింత గందరగోళ పరచింది. ఇదంతా కలిసి రామచంద్రన్ దురుసుగా ప్రవర్తించడానికి కారణమైనది. మలయాళం తప్ప మరో బాష రాని మావటి ఒక నాడు ఉచితానుచితాలు మరిచిపోయి కొట్టాడు. ఒక దెబ్బ ఎడమ కంటికి తగలడంతో దృష్టిని కోల్పోయింది. అలా మావటి దౌర్జన్యానికి గురి కావడం ద్వారా తొలిసారి రామచంద్రన్ ప్రజలకు పరిచయమయ్యాడు.













తరువాత ఎన్నోసార్లు వార్తల లో ప్రముఖంగా నిలిచాడు రామచంద్రన్. నెమ్మదిగా భాష అర్ధం చేసుకోవడం, మావటి సూచనలను పాటించడం లాంటివి తెలుసుకొన్నా, చూపులకు శాంత గంభీర మూర్తిలా కనిపించినా  రామచంద్రన్ ఒక ప్రమాదకర ఏనుగు అన్నముద్ర మాత్రం తొలగించుకోలేక పోగా దాన్ని నిరూపించే పనులను చేసాడు. ఎడమ కంటిని కోల్పోవడంతో  అటు పక్క చూడలేక పోయేవాడు రామచంద్రన్ ! దానితో అటు పక్కన చిన్న అలికిడి, చప్పుడు లేదా కదలిక ఏర్పడినా బెదిరిపోయేవాడు. అదుపు తప్పేవాడు. అలా తొలిసారి ఎడమ పక్కన ఆకతాయిలు కాల్చిన టపాకాయల శబ్దానికి బెదరి ఒక బాలుని మరణానికి కారణమయ్యాడు. ఇది జరిగింది పాలక్కాడ్ ఆలయ ఉత్సవ సందర్భంలో ! తరువాత ఎర్నాకుళంలోని శ్రీ సుబ్రమణ్య ఆలయ ఉత్సవం సమయంలో ఇలానే అదుపుతప్పి ముగ్గురు మహిళల మరణానికి కారణమయ్యాడు. ఇవే కాదు తనను అదుపుచేసే ఇద్దరు మావటీల చావుకు కారణమయ్యాడు రామచంద్రన్ ! వీటన్నిటి కన్నా ముందు సాటి గజరాజును చంపాడు.కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం త్రిసూర్ పూరం. లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. ఆ రోజున రాష్ట్రంలోని ప్రముఖ గజాలు రెండు జట్లుగా విడిపోయి చేసే విన్యాసాలు చూడవలసినదే! ఆ పూరంలో పాల్గొన్న రామచంద్రన్ శబ్దాలకు బెదిరి మరో ప్రముఖ గజరాజైన తిరువంబాడి చంద్రశేఖర్ను తన దంతాలతో పొడవడం జరిగింది. దీనివలన కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధికెక్కిన త్రిసూర్ పురంలో పాల్గొనే అర్హతను కొన్ని సంవత్సరాలు కోల్పోయాడు రామచంద్రన్. ప్రమాదకరమైన ప్రవర్తన కలిగిన జంతువుగా బహిరంగప్రదేశాలలో తిరగడానికి వీలు లేదని కేరళ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికి ఆరుసార్లు రామచంద్రన్ ని ఆలయ ఉత్సవాలలో పాల్గొనకుండా నిషేదించింది. చివరిసారిగా 2016వ సంవత్సరంలో నిషేధం విధించడం జరిగింది. ఆలయ పాలక మండలి వారు న్యాయ మార్గాలలో తిరిగి రామచంద్రన్ ని ఆలయ ఉత్సవాల ద్వారా  ప్రజల ముందుకు తెచ్చారు. ఇప్పటిదాకా రామచంద్రన్ పదకొండు మంది మరియు ఒక ఏనుగు మరణానికి కారణం అని చెబుతారు. 






దేవదాసు 






ఈ కేసుల  మూలాన తొలిసారిగా పోలీసుల చేత అదుపులోనికి తీసుకోబడి, జామీను పొందిన ఏనుగుగా రామచంద్రన్ పేరొందాడు. అయినా ఇవేవీ ప్రజలలో అతని పట్ల గల అభిమానాన్ని తగ్గించలేకపోయాయి. 
ఆసియాలో ఎత్తైన ( పది  అడుగుల నాలుగు అంగుళాలు ) రెండవ పెంపుడు గజరాజుగా, చూడగానే ఆకర్షించే ఆకారంతో రామచంద్రన్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకొంటాడు. స్థానికులు రామచంద్రన్ ని ఎంతగా ప్రేమిస్తారు అన్నదానికి నిదర్శనం 2018 త్రిసూర్ పూరంలో  కనపడింది. దక్షిణ ద్వారం గుండా శ్రీ వడక్కునాథర్ ని తీసుకొని వెలుపలికి వచ్చిన సందర్బంగా అక్కడికి విచ్చేసిన వేలాది మంది ప్రజలు చేసిన హర్షధ్వానాలతో దిక్కులు పిక్కటిల్లాయి. తన ఆనందాన్ని సంతృప్తిని  తెలుపుతూ సగర్వంగా తొండాన్ని ఎత్తి అభివాదం చేసాడు రామచంద్రన్. 
చోటు చేసుకున్నమరణాలలో రామచంద్రన్ తప్పు ఏమున్నది ? అని ప్రశ్నిస్తారు జంతు ప్రేమికులు. మావటి క్రూరత్వానికి బలైన మూగ జీవిలో సహజంగానే చోటుచేసుకొనే భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేయకుండా మరింత భయపెట్టిన పరిస్థితులను కల్పించడమే అసలు కారణం అని వారంటారు. 
ప్రస్తుతం రామచంద్రన్ ఏ ఆలయ ఉత్సవంలో పాల్గొన్నా లక్షలాదిగా ప్రజలుతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు మరియు మత్తు మందు నింపిన తుపాకీలను పట్టుకొని అటవీ శాఖ అధికారులు హాజరవుతారు. ఎందుకంటె రామచంద్రన్ ఎప్పుడు బెదిరి అదుపు తప్పుతాడో తెలీదు కనుక ! 
ప్రస్తుతం యాభై నాలుగు సంవత్సరాల వయస్సులో కూడా అదే ఠీవీతో దర్పంతో సంవత్సరానికి డెబ్భై నుండి ఎనభై ఆలయ ఉత్సవాలలో పాల్గొంటున్నాడు రామచంద్రన్. జనవరి నుండి జూన్ వరకు తన ప్రయాణాల కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో ఒక ఆలయం నుండి మరో ఆలయానికి ప్రయాణిస్తూనే ఉంటాడు రామచంద్రన్.  
నేను మొదటి సారి రామచంద్రన్ గురించి విన్నది 2012లో ! చూసింది 2014లో ! రామచంద్రన్ మీద రాసిన నా వ్యాసం ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ప్రచురించబడింది. తిరిగి ఈ సంవత్సరం మే 31న మరో సారి రామచంద్రన్ ను చూసే అవకాశం లభించినది. వృధాప్యం తాలూకు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయి. (ఏనుగుల జీవన కాలం 70 సంవత్సరాలు అని అంటారు ) క్రిందటి సారి చూసినప్పుడు కనిపించిన పొగరు(?) ఈ సారి కనిపించ లేదు. నిదానంగా ఉన్నాడు. కంటి ముందు మనుషులు తిరగాడుతున్నా(రెండో కంటిలో శుక్లాలు వచ్చాయని మావటి  మణి చెప్పారు ) పెద్దగా ప్రతిస్పందన లేదు. తనమానాన తాను నెమరువేస్తూ కనిపించాడు. మణి సహకారంతో ఒక సెల్ఫీ తీసుకోగలిగాను. 
ఆలయాల తరువాత పక్షులు, ఏనుగులు అంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టమే రెండు సార్లు రామచంద్రన్ వద్దకు వెళ్లేట్టు చేసింది. అదే రోజు గురువాయూర్ ఆలయ గజశాల అయిన పునత్తూరు కోట మూడో సారి దర్శించుకొన్నాను. 
లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్న రామచంద్రన్ కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ !!!!!!!!!!
  






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...