17, జూన్ 2018, ఆదివారం

Mattapalli


 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి 




కృష్ణానదీ తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలు  మంగళగిరి, వేదాద్రి, కేతవరం, వాడపల్లి మరియు మట్టపల్లి. ఇవన్నీ భక్తజనుల అభిమాన దర్శనీయ క్షేత్రాలు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రంలో భాగమైన మట్టపల్లి అనాది కాలం నుండి పూజ్యనీయ తీర్ధపుణ్య క్షేత్రం.  
ఇక్కడ స్వామి స్వయంవ్యక్త మూర్తి. వేదకాలంలో సప్త మహర్షులు స్వామిని సేవించుకొన్నారని తెలుస్తోంది. ఇప్పటికీ గర్భ గుహలో ఉన్న సొరంగ మార్గం ద్వారా మహర్షులు బ్రాహ్మి ముహూర్తంలో నదిలో స్నానమాచరించి స్వామిని సేవించుకోడానికి వస్తారని చెబుతారు. ఇలా ఋషి పుంగవుల పూజలు అందుకొన్న నారసింహుని దర్శనం మనం పొందడానికి సంబంధించిన కధ ఇలా ఉన్నది. 















వెయ్యి సంవత్సరాల క్రిందట కృష్ణా నదికి ఆవలి ఒడ్డున ఉన్న తంగెడ గ్రామానికి చెందిన మాచిరెడ్డి మోతుబరి రైతు. ఆధ్యాత్మిక భావాలు, భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు కలిగినవాడు. సాధుసన్యాసుల పట్ల గౌరవభావాలు కలిగినవాడు. దాత. 
ఒకనాడు పొలంలో మినిములు నాటడానికి కోడలిని విత్తనాలను తీసుకొని రమ్మని తాను  కుమారులతో కలిసి వెళ్ళిపోయాడట.మామగారి ఆనతి ప్రకారం కోడలు భవనాశనీ దేవి విత్తనాలతో  పొలం బాట పట్టగా శివనామస్మరణ చేసుకొంటూ గుంపుగా వెళుతున్నజంగమ దేవరలు ఎదురయ్యారు. వారికి ప్రణామాలు చేసి చెంతన ఉన్న మినుములు దానంగా వారికి  సమర్పించుకొన్నదట ఆమె ! 












శివ నామస్మరణ చేసుకొంటూ కొంత దూరం వెళ్లిన తరువాత ఆమెకు పొలంలో  విత్తనాల కొరకు ఎదురు చూస్తున్న మామ భర్త గుర్తుకొచ్చారు.  ఏమి చెయ్యాలో తెలియక కృష్ణా నదిలోని ఇసుకను ఒడిలో నింపుకొని వెళ్ళింది. శివ ధ్యానం చేస్తూ దానినే పొలంలో జల్లింది. చిత్రంగా మొలకలు మొలిచాయి. అంతే  కాలేదు సకాలంలో కాయలు కాసాయి. చివరకు పంటను కోసి కాయలను వలిచి చూడగా అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవన్నీ బంగారు మినుప గింజలు. మాచిరెడ్డి కోడలిని పిలిచి వివరం అడిగాడు. ఆమె జరిగింది మామగారికి చెప్పింది. భవనాశని భక్తికి సంతసించిన మాచిరెడ్డి ఆమెను ఆశీర్వదించి,బంగారు మినుములలో సగం పేదసాదలకు, సాటివారికి పంచి, నదికి అవతలి ఒడ్డున తంగెడ గ్రామం వద్ద కోటను నిర్మించి పాలన చేపట్టాడు. నది ఒడ్డున ఉన్నా గ్రామంలో తవ్విన బావిలో నీరు పడలేదు. కారణం తెలీక దిగులు పడుతున్న మాచిరెడ్డికి గంగాదేవి స్వప్న దర్శనమిచ్చి "నీ ఇంటి కోడలు బావి లోనికి దిగి పూజలు నిర్వహిస్తే నేను ఉప్పొంగుతాను. కానీ నీ కోడలు నాలో లీనమైపోతుంది" అని తెలిపారు. మాచిరెడ్డి బాధ మరింత పెరిగింది. నీరు లభిస్తుంది కానీ కోడలిని కోల్పోతాను అన్న విషయం మరింత భాధ పెట్టసాగింది. 










విషయం తెలుసుకొన్న భవనాశనీ దేవి "గంగా దేవిలో ఐక్యమయ్యే అదృష్టం కలగడం ఎందరికి లభిస్తుంది ?" అని మామగారిని, ఇతర కుటుంబ సభ్యులను ఒప్పించి బావి లోనికి దిగి పూజలు చేసి ఉప్పొంగిన గంగలో కలిసిపోయింది. మట్టపల్లి వెళ్ళినవారు అక్కడ కనుక్కొంటే భవనాశనీ దేవి ప్రజల కొరకు ఆత్మత్యాగం చేసిన బావి, ఆమె ఇసక చల్లి సర్వేశ్వరుని కృపతో పండించిన బంగారు మినుములు మాచిరెడ్డి వారసుల దగ్గర చూడవచ్చు అని తెలుస్తోంది.
కొంతకాలానికి మాచిరెడ్డికి శ్రీ ప్రసన్న నారసింహ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, "పావన కృష్ణా తీరంలో ఉన్న అటవీ ప్రాంతంలోని కొండ గుహలో కొలువై, ఇంతకాలం మహర్షుల పూజలు అందుకొంటున్నాను. సామాన్య ప్రజలకు కూడా దర్శనము అనుగ్రహించవలసిన సమయం ఆసన్నమైనది. అందుకని నాకొక ఆలయాన్ని నిర్మించ"మని తెలిపారట. మరునాడు మాచిరెడ్డి అనుచరులను తీసుకొని వెళ్లి అరణ్యమంతా వెదికినా స్వామి ఉన్న గుహను కనుగొనలేక పోయాడు. అంతర్యామి ఆదేశించిన కార్యాన్ని అమలు పరచలేకపోయాను అన్నదిగులుతో పడుకున్న అతనికి భక్తసులభుడు మరోమారు దర్శనమిచ్చి"రేపు అడవిలో ఒక గ్రద్ద వాలిన ఆరె చెట్టుకు ఎదురుగా ఉండే గుహలో చూడు నేను కనపడతాను"అని తెలిపారట. ఆ ప్రకారం నారసింహుని దర్శించుకొని ఆలయం నిర్మించాడు మాచిరెడ్డి. ఆరె చెట్టు ద్వారా స్వామి కొలువైన స్థానానికి మార్గం లభించడం వలన ఆరె పత్రాలతో స్వామివారికి అర్చన చేస్తారు.












అలా ప్రకటనమైన శ్రీ నరసింహస్వామిని శాంతింప చేయడానికి గర్భగుహలో శ్రీ రాజ్యలక్ష్మీ మరియు శ్రీ చెంచు లక్ష్మీ అమ్మవార్లను ప్రతిష్టించారు.
ప్రధాన అర్చనామూర్తి స్వయంభూ. ఆది శేషువు పడగల క్రింద ఉపస్థిత భంగిమలో శంఖు, చక్ర, గద, అభయ ముద్రలతో పాదాల వద్ద ప్రహ్లాదునితో దర్శనమిస్తారు. స్వామి వెనక పక్క ఒక గుహ ఉంటుంది. ఆ మార్గం గుండా బ్రహ్మీ ముహూర్తంలో మహర్షులు వచ్చి స్వామిని సేవించుకొని వెళతారు అని చెబుతారు.
గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయంలో అంజనాసుతుడు కొలువుతీరి కనపడతారు. ఆరోగ్య, ఆర్ధిక, గ్రహ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారు కృష్ణా నదిలో స్నానమాచరించి తడి బట్టలతో ధ్వజస్థంభం వద్ద నుండి ఆరంభించి ఆలయానికి 32 ప్రదక్షణలు చేస్తుంటారు. పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ప్రదక్షణలను చేసేవారి బాధలను తీరుస్తారని స్వామి స్వయంగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రతి నిత్యం వందలాదిగా భక్తులు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నారసింహుని దర్శనార్ధం తరలి వస్తుంటారు. ఉదయం అయిదు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా ఆలయం తెరచి ఉంటుంది. ఎన్నో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నియమంగా జరుగుతాయి.























అన్ని పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. శ్రీ నృసింహ జయంతి రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాస పూజలు ఘనంగా జరుపుతారు.
మట్టపల్లిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ జరిగే అన్నదానం. అన్ని కులాల సత్రాలలో ప్రతి రోజు భక్తులకు అన్న ప్రసాదం లభిస్తుంది. ఉండటానికి గదులు కూడా లభిస్తాయి.  విశేష క్షేత్రం అయిన మట్టపల్లికి కోదాడ పట్టణం నుండి హుజూర్ నగర్ మీదగా రోడ్డు మార్గంలో చేరుకో వచ్చును. నడికూడి నుండి నది దాటి రావాలి. నీటిప్రవాహం అధికంగా ఉంటే పడవ నడవదు. ఈ మార్గం వేసవిలో ఉపయోగపడుతుంది.  

 నమో నారాయణాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...